Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చందమామ రావే.. చల్లగాలి తేవే..

[శ్రీమతి యం. ధరిత్రీ దేవి రచించిన ‘చందమామ రావే.. చల్లగాలి తేవే..’ అనే బాలగేయం అందిస్తున్నాము.]

చందమామ రావే.. చల్లగాలి తేవే
వెన్నెలమ్మ రావే.. వెలుగులే తేవే
చందమామ చల్లగాలి కలిసిపోయి ఈ పూట
పాపాయికి పాడాలి కమ్మనైన లాలిపాట ॥చందమామ॥

నింగిలోన నీవుంటే చుక్కలన్ని నీ చుట్టే..
మా చెంతకు నీవొస్తే చిన్నబోవునేమో
అలకబూనునేమో.. తగవులాట లేకుండా
తరలిరావ ఓ చందమామ.. ఆ చుక్కల మించిన
చిన్ని చిన్ని పాపలిచట.. వేయి కళ్ళు తెరచి
వేచి వేచి ఉన్నారు ఓ మామ..
వచ్చిపోవా ఇటువైపు.. రాకుంటే గొంతు దిగదు
అమ్మ చేతి గోరుముద్ద.. వేగిరమే రావాలి
మా లోగిలి నడయాడగ.. చక్కనైన ఓ చందమామ ॥చందమామ॥

చక్కదనం చల్లదనం కలబోసుకున్న
ఓ కలువలరాయడా.. చీకట్లు తొలగించి
వెలుగురేఖలందించే ఓ వెన్నెలరేడా
అందనంత ఎత్తులో ఆకసాన ఉన్నావు గానీ..
అందుబాటులోనె కదా ఉన్నావు ఓ మామ
అంబరాన వెన్నెలంత మా సొంతమె అంటావే..
మా జాబిలి రావాలీ.. పాపాయికి చెప్పాలీ కబుర్లే
నిలబడి ఓ నిమిషమైన మా ముంగిట
మా ముచ్చట దీర్చవా.. చక్కనైన మా చందమామ ॥చందమామ॥

Exit mobile version