[శ్రీ తోకల రాజేశం రచించిన ‘చందమామ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఎంత చల్లనివాడో కదా చంద్రుడు
నేను ఏ ఊరికి వెళ్లినా
అక్కడికి వచ్చి చల్లటి వెలుగులతో
దారి దారంతా చలువ పందిళ్లు పరుస్తాడు
చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా
నా వేలు విడిచిపెట్టని ఆత్మబంధువాయన
కరెంటు వెలుగులు లేని అప్పటి మా వాకిట్లో
నులకమంచంలో వాలి శశాంకున్నే చూస్తూ
నిద్ర దుప్పటి కప్పుకునేవాణ్ణి
ఆశ్చర్యం! తెల్లవారేసరికి నా కలల్లో దూరిపోయి
ఎన్ని కథలు చెప్పేదో పేదరాసి పెద్దమ్మ
అచ్చం మా నానమ్మలాగే ఉండేదామె
అప్పుడప్పుడు అలసిపోయేవాడో ఏమో
రాత్రుళ్లు మా చెరువమ్మ ఒడిలో
చిన్న పిల్లవాడిలా నిద్రపోయేవాడు పాపం
అమ్మ చంకలో కూర్చొని నోటి నుంచి
వెన్నెల కారుస్తున్న రోజుల్లో
నన్ను బువ్వ తినమని బుజ్జగించింది ఈ మేనమామనే
వరికళ్ళం దగ్గర రాత్రితిండికి కూర్చుంటే
దీపం పట్టింది ఈ తారాచంద్రుడే
నాకే కాదు తరతరాలుగా
ఎంతోమంది పేదల గుడిసెల ముందు
పాలవెన్నెలను గుమ్మరించిన సుధాకరుడు
వర్ణం కులం మతం అనే విభజనలు చూపించకుండా
అందరి కళ్ళలో సమానంగా వెలుగుపూలు పూయించే
చందమామ నిజంగా ఈ లోకానికి మేనమామనే.
