[చంద్రయాన్ సాధించిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ ‘చంద్ర భారతం’ అనే పద్య కవితని అందిస్తున్నారు శ్రీ తోకల రాజేశం.]
~
సీ:
శాస్త్ర రంగమున విశ్వఖ్యాతి నార్జించి
మీసమ్ము కొనగోట మీటు నాడు
ఆకాశమున సగంబైన బాధ్యతకు ప
ల్లవిగూర్చి ఘనకీర్తి రాయు నాడు
పేరువోయిన పెద్ద వృద్ధ దేశాలు చే
తన దక్కి మనదిక్కు గనెడునాడు
కులమతమ్ములనింటి గోడకు దగిలించి
విజయగీతికలాలపించు నాడు
తే:
నాడు ఏనాడొ గాదు-ఈనాడె మూడు
వర్ణముల జెండ గుండెలోపలధరించి
మూడు రంగుల వెన్నెలల్ భూమి మీద
చల్లు చున్నాడు చంద్రుండు సంతసమున
శా:
గతకాలమ్మున నన్ని విద్యలకు నిక్కంబాద్యులై వెల్గు భా
రత పుత్రుల్ గలరెందరెందరొ! సువర్ణాధ్యాయముల్దిద్ది కీ
రితి నల్దిక్కులలోన నింపిరిపుడా రేరాజుపై గూడ భా
రత జాతీయ సుకీర్తి చంద్రికలు వర్షంబై ప్రసారించెడిన్
తే:
చందమామపై దిగుటకు సాధ్యపడని
దక్షిణ ప్రదేశంబున పక్షి వోలె
వాలిపోయిన సరళికి వాలిపోయె
దేశ దేశాల తలలు కిందికి నిజమ్ము
క:
ఓటమి కల్గెననుచు పో
రాటముసై నలుగలేదు ప్రజలెల్లరి ఆ
రాటము ఫలింప శశిపై
చాటించిరి భరత కీర్తి శాస్త్రజ్ఞులిలన్
ఆ:
ఎన్ని యేండ్లకయిన నీ క్షణంబొక్కటే
జాతి నరములందు శాశ్వతముగ
పారుచుండు గంగవలె భారతీయాత్మ
గుండె గదుల లోన కొట్టుకొనగ
