[డా. చిర్రావూరి శివరామకృష్ణశర్మ రచించిన ‘చరిత్ర ఎరుగని మహా పాపం మన దేశానికి పట్టినదే!’ అనే పుస్తక సమీక్ష అందిస్తున్నాము.]
డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణశర్మ రచించిన ఈ చిన్ని పుస్తకం భారతదేశానికి 9760 సంవత్సరాల చరిత్రకు ఆధారాలున్నాయని తెలిపే పుస్తకం. భారతదేశ చరిత్ర ఒక అనాథలాంటిది. ఎలాగయితే అనాథతో ఎవరు ఎలా వ్యవహరించినా ఎవరూ పట్టించుకోరో అలాగే భారతదేశ చరిత్ర గురించి ఎవరికేది తోస్తే అది ప్రకటించేయవచ్చు. దాన్ని సమర్థించటం వల్ల లాభాలున్నవారు అదే అసలయిన సత్యం అని గొంతు చించుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఎవరెక్కువ గొంతుతో అరిస్తే వారు చెప్పిందే సత్యం. వారికి ప్రభుత్వ మద్దతు లభిస్తే అదే సత్యమవుతుంది. తరతరాలు అదే చదువుతూ, అదే సత్యమని నమ్ముతారు. వారి పరిశోధనలు, ఆలోచనలు అన్నీ సత్యంగా చలామణీ అవుతున్నా అసత్యం ఆధారంగానే సాగుతాయి. ఇందుకు భిన్నంగా, అసలు సత్యాన్ని ఆధారాల పూర్వకంగా ప్రకటించినా వారు నిజాన్ని నమ్మలేరు. అసత్యంలో పుట్టిపెరిగినవారు అసత్యంలోనే మగ్గుతారు. సత్యాన్ని హేళన చేస్తారు. నిజం కళ్ళెదురుగా ఉన్నా చూడలేరు. అర్థం చేసుకోలేరు.
హ్రస్వ దృష్టి కల విదేశీయులు, వారు పాలకులయినందువల్ల, పాలకుల కన్నా ఘనమైన చరిత్ర పాలితులకు ఉండకూడదు కాబట్టి భారతదేశ చరిత్రతో అకాండతాండవం చేశారు. వారి ఇష్టం వచ్చినట్టు భారతదేశ చరిత్రను రచించారు. చీమ దృష్టితో ఏనుగును చూసి విశ్లేషించారు. పాలకులు కాబట్టి వారు ఏమి చెప్తే అది సత్యమయింది. పలు కారణాల వల్ల, కోకిల కాకి అవ్వాలని తపన పడేట్టు, భారతదేశీయులు కూడా వారి హ్రస్వదృష్టి తీర్మానాలనే సమర్ధించారు. కానీ, స్వదేశాభిమానులు, సంస్కృతి సాంప్రదాయాలపట్ల గౌరవం కలవారు విదేశీయులు మన చరిత్రను వారి దృష్టితో చూసి రచించటాన్ని విమర్శించారు. చరిత్రను వక్రీకరించి, కుచింపచేసి, ఇష్టం వచ్చినట్టు రాయటాన్ని నిరసించారు. భారతదేశ చరిత్రను భారతీయుల దృష్టితో, భారతీయ ఆధారాల ఆధారంగా రచించారు. విదేశీయుల పొరపాట్లను ఎత్తి చూపించారు. వారి అవగాహనా రాహిత్యాన్ని నిరూపించారు. వారి కుత్సితపు బుద్ధిని బట్టబయలు చేశారు. నిన్నమొన్న పుట్టి కళ్ళు తెరచిన వారికి ఆద్యంతాలు లేని చరిత్ర అర్థం కాదని స్పష్టం చేశారు. కానీ, పలు కారణాల వల్ల చరిత్ర ఎరుగని మహా పాతకం మనదేశానికి పట్టింది. విషం తిని బ్రతికే జాతి విషాన్నే తింటూ బ్రతుకుతుంది. దానికి అమృతం విషంతో సమానమవుతుంది. అయినా సరే, తరతరాలుగా మన అసలు చరిత్రను సమాజానికి గుర్తు చేసే ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. అలాంటి ప్రయత్నమే చిర్రావూరి రామకృష్ణగారు రచించిన ఈ చిన్న పుస్తకం.
జనమేజయుడు వేయించిన శాసనంలోని ప్రార్థనతో ఆరంభించి, శ్రీరామచంద్రునికి పూర్వం చరిత్ర వరకూ ఆధారాలు చూపించారీ గ్రంథంలో. ఈ గ్రంథంలో పురాణాలు, ఇతర ప్రాచీన వాఙ్మయం నుండి ఆధారాలు సేకరించి ప్రదర్శించారు. యుధిష్ఠిర శాసనం, వరాహమిహిరుని సాక్ష్యం, కాళిదాస మహాకవి సాక్ష్యం, రాముడు, శ్రీకృష్ణుల చరిత్రలకు సాక్ష్యాలు, హరప్పా మొహెంజాదారోలో సాక్ష్యాలు, రాజతరంగిణి సాక్ష్యం వంటి సాక్ష్యాల ఆధారంగా తన వాదనకు బలం చేకూర్చుకున్నారు.
ఈ అసలు చరిత్ర తెలుసుకోవటం వల్ల ప్రస్తుతం చలామణీలో ఉన్న చరిత్ర చదవటం వల్ల కలిగే న్యూనతాభావం తొలగుతుంది. ఆత్మగౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కల జాతి ప్రగతి పథంలో తల ఎత్తుకుని ముందుకు సాగుతుంది.
ఆత్మన్యూనత కలిగించి, ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే చరిత్ర రచనలను వదలి ప్రతి భారతీయుడు చదివి అర్థం చేసుకోవాల్సిన చక్కని పుస్తకం ఇది.
***
డా. చిర్రావూరి శివరామకృష్ణశర్మ
పేజీలు: 64
వెల: ₹ 50/-
ప్రతులకు:
డా. చిర్రావూరి శివరామకృష్ణశర్మ,
13-9-104, పాండురంగ నగర్ పార్క్ ఎదురుగా
మోతీనగర్ పోస్ట్,
హైదరాబాద్-500114
తెలంగాణ
ఫోన్: 9963455584
