Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చారిత్రక నవలా చక్రవర్తి – ముదిగొండ శివప్రసాద్

[ఇటీవల మృతిచెందిన శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారి స్మృతిలో, ‘చారిత్రక నవలా చక్రవర్తి – ముదిగొండ శివప్రసాద్’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. యస్. జ్యోతి.]

పరిచయం

గతాన్ని, సంస్కృతిని, భావజాలాలను సంరక్షించడంలో చరిత్ర అత్యంత కీలకమైన పాత్ర వహిస్తుంది. “చరిత్రను మరచిపోతే ఆ చరిత్రే మళ్ళీ పునరావృతమవుతుంది” అనే సత్యాన్ని ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలు ఎన్నో రకాలుగా వ్యక్తపరిచారు.

జార్జ్ సంటాయానా (George Santayana):

>“గతాన్ని గుర్తుంచుకోలేని వారు, దానిని మళ్లీ పునరావృతం చేయాల్సి వస్తుంది.” (“Those who cannot remember the past are condemned to repeat it.”)

హెన్రీ సెయింట్ జాన్ (Henry St. John, Viscount Bolingbroke):

>“చరిత్ర అనేది ఉదాహరణల ద్వారా బోధించే తత్వశాస్త్రం.” (“History is philosophy teaching by examples.”)

రాబర్ట్ ఎ. హైన్లైన్ (Robert A. Heinlein):

>“చరిత్రను విస్మరించే తరానికి గతం ఉండదు; భవిష్యత్తూ ఉండదు.” (“A generation which ignores history has no past—and no future.”)

“గతాన్ని తెలుసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడం.” అని అన్నట్టుగా చరిత్రలో జరిగిన సంఘటనలకు కల్పనను జోడించి, వాటికి జీవం పోసి, పాఠకులకు ఆసక్తి కలిగించే విధంగా కథను చెప్పడం చారిత్రక నవలా రచయితకు ప్రధానమైన బాధ్యత. అటువంటి బాధ్యతను నవలా చక్రవర్తిగా పేరుగాంచిన ముదిగొండ శివప్రసాద్ గారు తీసుకున్నట్లు అనిపిస్తుంది. చరిత్రను కేవలం ఒక పాఠ్యాంశంగా కాకుండా, రసవత్తరమైన కథారూపంలో సజీవమైన సంస్కృతిగా పాఠకుల ముందుకు తీసుకురావడంలో వారు విశేషమైన ప్రావీణ్యం ప్రదర్శించారు.

నవలలో చరిత్రకు సంబంధించిన వివరాల వర్ణన కొంచెం ఉన్నప్పటికీ, అది సత్యమై ఉండాలనేది వారి ప్రాథమిక నియమం.

చారిత్రకతకు భిన్నంగా ఉండకుండా, సరైన అవగాహనతో నవల రాయడం రచయితకు ఎంతో అవసరం. ఎన్నుకున్న ఇతివృత్తం చరిత్రతో ముడిపడి ఉండాలంటే రచయితకు సంపూర్ణ చారిత్రక అవగాహన తప్పనిసరి. అటువంటి పరిపూర్ణ చారిత్రక పరిజ్ఞానం కలిగినవారు.

చరిత్ర మీద చక్కని అవగాహన, ప్రేమ, అభిమానం కలిగిన రచయిత కాబట్టే పాఠకులు మెచ్చిన, నమ్మిన చారిత్రక నవలలను శివప్రసాద్ గారు వ్రాయగలిగారు. ఆనాటి సంస్కృతిని తన నవలల్లో ప్రతిబింబించి పలువురి చేత ప్రశంసలందుకున్నారు. గత వైభవ పునరుద్ధరణ, సమకాలీన సంప్రదాయాలు, దాని స్వభావాలను తన నవలలో విశ్లేషించడానికి అనేక చారిత్రక గ్రంథాలు, శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, సిద్ధాంత వ్యాసాలు మరియు వివిధ భాషలలోని చారిత్రక విషయాలను పరిశోధించి నవలలు రాశారు.

తనలో దేశభక్తి ఉన్నప్పుడే రచయిత పాఠకులలో దేశభక్తిని, అభిమానాలను రగిలించగలడు. అందుకే ఆయన రచనల్లో మాతృదేశం పైన, సంస్కృతి సంప్రదాయాల పట్ల రచయితకు గౌరవ భావంతో ప్రతి పాత్రలోనూ దేశభక్తి, జాతీయ భావం తొణికిసలాడి పాఠకులను రంజింపజేశాయి.

అలాగే వీరి నవలలన్నింటిలోనూ విదేశీయులను ఎదుర్కొని ధర్మరక్షణకు పాటుపడినట్లుగా కనబడుతుంది. ప్రజలలో దేశభక్తి, జాతీయ సమైక్యత, సంస్కృతి తగ్గిపోయినప్పుడు దేశంలో అంతఃకలహాలు పెరిగి ఆరాచకత్వం ఏర్పడుతుంది. అలాంటి తరుణంలో విదేశీయుల దాడి జరిగి దేశం పరాధీనమవుతుంది. ప్రజలు హక్కులు, స్వాతంత్ర్యం కోల్పోయి బానిసత్వంలో కుంగిపోతున్నప్పుడు వారిలో ధైర్యోత్సాహాలను, ధర్మజాగృతిని పురికొల్పడానికి రచయిత కంకణం కట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చారిత్రక నవలలు శరపరంపరగా వెలువడ్డాయి. ఆరిపోతున్న దేశభక్తిని, జాతీయ సమైక్యతను ప్రజలలో పురికొల్పడానికి చారిత్రక నవలలు ఎంతో దోహదం చేశాయి. చారిత్రక నవలలన్నింటిలోనూ దేశభక్తి నిండివుంది. ఉద్వేగ ఆలోచనలు కలిగిన కల్పిత పాత్రలను కూడా రచయిత ప్రవేశపెట్టి, ఆనాటి వైభవాన్ని పాఠకులకు అందించడంలో కృతకృత్యులయ్యారు. రచయిత తన నవలా రచనకు అవసరమైన చారిత్రక గ్రంథాలను, శాసనాలను, వివిధ భాషల్లోని చారిత్రక పరిశోధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

అంతే కాదు చారిత్రక పరిశోధకులను సంప్రదించి, చారిత్రక ప్రదేశాలను సందర్శించి చారిత్రక వాస్తవికతతో కథాగమనం కుంటుపడకుండా రచన కొనసాగించారు. కథలోని పాత్రలు తారుమారు కాకుండా, చారిత్రక వాతావరణం చెడిపోకుండా రచయిత చక్కని జ్ఞాపక శక్తితో రచనలు చేశారు. రచయిత ప్రతి నవలలోనూ సవాలుగా నిలిచే చారిత్రక సంఘటనలను ఎన్నుకున్నారు. రచయిత స్వీకరించిన ప్రతి సంఘటన వెనుక వారి కళాత్మక హృదయం బహిర్గతమవుతుంది. మతం, మతసామరస్యం, సాంస్కృతిక పరిణామం మొదలైన విషయాలపట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించి సాంస్కృతికమైన చారిత్రక నవలలను పాఠకులకు అందించారు.

తెలుగు సాహిత్యంలో చారిత్రక నవలలకు విశిష్టమైన స్థానం ఉంది. చరిత్రను కేవలం సంఘటనల సమాహారంగా కాకుండా, ఆనాటి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ జీవనాన్ని సజీవంగా చిత్రించే ప్రక్రియ చారిత్రక నవల. ఈ ప్రక్రియను సమర్థంగా అభివృద్ధి చేసిన ఆధునిక తెలుగు రచయితల్లో ముదిగొండ శివప్రసాద్ ప్రముఖులు. ఆయన చారిత్రక నవలల్లో చరిత్ర, కల్పన, సంస్కృతి, దేశభక్తి, మానవీయ విలువలు సమన్వయమై కనిపిస్తాయి. భారతీయ చరిత్రలోని వివిధ కాలాలు, రాజవంశాలు, వీరులు, వీరనారీమణులు, సామాజిక పరిస్థితులను తన నవలలకు ఇతివృత్తాలుగా స్వీకరించారు.

ఆయన రచనల్లో ముఖ్యంగా:

వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి.

ముదిగొండ శివప్రసాద్ రచించిన చారిత్రక నవలల్లో నాగానిక, శ్రీలేఖ, ఆవాహన, శ్రీ పదార్చన, శ్రావణి, తంజావూరు విజయం, ఆషాడ గౌతమి, మాలిక్ కాఫర్, అనుభవ మంటపం, రెసిడెంట్, అశ్వమేధం వంటి రచనలు ప్రస్తావించదగినవి.

ముదిగొండ శివప్రసాద్ గారి నవలా శైలి – పాత్రల చిత్రణ మరియు వైవిధ్యం:

తెలుగు సాహిత్యంలో చారిత్రక నవలా రచయితగా డా. ముదిగొండ శివప్రసాద్ గారు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తన నవలల్లో పాత్రల ద్వారా సమాజ హితాన్ని, దేశభక్తిని, ప్రాత్యేకతల పట్ల మమకారాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. పాఠకులను ఆకట్టుకునేలా వైవిధ్యమైన శైలిలో నవలలను తీర్చిదిద్దడం వారి ప్రావీణ్యానికి నిదర్శనం.

వీరు దాదాపు 80 కి పైగా రచనలు చేశారు వాటిలో చారిత్రక నవలలు 20 వరకు ఉన్నాయి. వాటిలో కొన్ని నవలా విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముదిగొండ శివప్రసాద్ గారి చారిత్రక నవలలు – ‘నాగానిక’ మరియు ‘శ్రీలేఖ’ పరిశీలన:

డా. ముదిగొండ శివప్రసాద్ గారు తమ చారిత్రక నవలల ద్వారా భారతీయ సంస్కృతిని, వైదిక ధర్మాన్ని, ప్రాచీన భారతదేశ మరియు ఆంధ్రుల వైభవాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. చరిత్రలోని ప్రాముఖ్యత కలిగిన ఘట్టాలను, గొప్ప మహానాయకుల పాత్రలను స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దడంలో వారు సిద్ధహస్తులు.

  1. ‘నాగానీక’ నవల శ్రీముఖ శాతవాహనుని పరిపాలన, పరాక్రమం నేపథ్యంలో సాగుతుంది. భారతదేశం మీద గ్రీకుల దాడిని తిప్పికొట్టి, భారతీయ వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి, భారతదేశాన్ని రాజకీయంగా, సాంస్కృతికంగా ఒకటిగా చేసిన వీరునిగా శ్రీముఖ శాతవాహనుడు ఇందులో చిత్రించబడ్డాడు.

సమగ్ర దక్షిణాపథాన్ని శ్రీముఖ శాతవాహనుడు ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించినట్లు రచయిత ఈ నవలలో తెలిపారు. నాగానీక సహకారంతో ఉజ్జయినిలో దసరా నవరాత్రి ఉత్సవాలను జరిపించి, అక్కడి ప్రజలలో ధర్మజాగృతిని, జాతీయ సమైక్యతను పురికొల్పాడు. ఆంధ్రులు పరాధీనులు కారనే సిద్ధాంతాన్ని రచయిత ఈ శ్రీముఖ శాతకర్ణి పాత్ర ద్వారా స్పష్టంగా వ్యక్తపరిచారు.

  1. ‘శ్రీలేఖ’- నవలలో జాతీయ సమైక్యతతో పాటు గత వైభవ ప్రదర్శన, పునరుద్ధరణ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ నవలలోని ప్రధాన పాత్ర, ఆకర్షణీయమైన పాత్ర విజయదిత్యుడు. “శాంతి అనేది వేడుకల పనికి రాదు” అని ఈ పాత్ర గతంగా రచయిత నిరూపించారు. ప్రజలలోని అనైక్యతను తొలగించడం, స్వచ్ఛమైన ప్రేమతో స్వీకరించడం, ఆదర్శ జీవితం, దేశభక్తి, నిస్వార్థ సేవ, దీనజనోద్ధరణ, సమయస్ఫూర్తి, బానిసలకు విముక్తి, త్యాగోద్దీపం మొదలైన ఉదాత్త గుణాలను ఈ పాత్ర ద్వారా రచయిత వ్యక్తీకరించారు. మిగిలిన నవలలోని పాత్రలు కూడా ఈ గుణాలకు అనుబంధంగా తీర్చిదిద్దబడ్డాయి.
  2. ‘అనుభవమంటపం’ – నవలలోని లావణ్యవతి పాత్ర ద్వారా రచయిత సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించారు. కులాలకతీతంగా ఉండాలని భావించిన లావణ్యవతి, శైవ వంశస్థుడిని వివాహం చేసుకుని సామాజిక వైధవ్యానికి తొలి ఇంధనంగా మారింది. వంశం అనేది పుట్టుకకు మాత్రమే సంబంధించినది అని, మతాభిమానం దైవాభిమానంగా మారి హింసను ప్రేరేపించేవి దండగ అని చాటిచెప్పారు. లావణ్యవతి పాత్ర ద్వారా రచయిత ఈ సత్యాన్ని ఎంతో స్పష్టంగా వ్యక్తపరిచారు.
  3. ఆషాడ గౌతమి లోని శబరి మరియు ఇందుశేఖర శాస్త్రి వంటి పాత్రలను జన్మభూమి జన్మభూమిపై ఉండే ప్రేమను, ప్రాధాన్యతను ఎంతో గొప్పగా తెలియజెప్పారు. ఆండర్సన్ ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా, ఎన్ని ఆశలు చూపించినా ఏజెన్సీ ప్రాంతం వదలిరానని శబరి ఆండర్సన్తో తేల్చి చెబుతుంది. “అడవిలో పుట్టిన రామచిలుక అడవిలోనే హాయిగా ఎగురుతుంది. ఇక్కడి సింహాన్ని సర్కార్ల బస్సుకి పట్టి తీసుకెళ్ళి రోజూ మాంసం పెట్టినా అది ఏడుస్తుందే కానీ హాయిగా ఉంటుందా దొరవారూ? ఇది మా నేల, మా గాలి, మా నది. ఈ నది నీళ్ళు తాగి బతుకుతాము. ఇందులో జలగలున్నాయి, పెరప్పములున్నాయి. కొండచిలువలు కొట్టుకొస్తాయి. అయినా గోదావరి తల్లి, గోదావరి తల్లే. దొరవారూ, ఎవరి నేల వారికి గొప్పది, ఎవరి జాతి వారికి ఇష్టం.” ఈ మాటల ద్వారా స్వధర్మాన్ని, దేశభక్తిని చాటిచెప్పిన శబరి పాత్ర ద్వారా సెంటిమెంట్ కన్నా జన్మభూమి గొప్పదనే విషయాన్ని రచయిత నిరూపించారు. శబరి పాత్రలోనే కాక, నవలలోని ప్రతీ స్త్రీ పాత్రలోనూ జాతీయ సమైక్యత, దేశభక్తి తొణికిసలాడతాయి.
  4. ‘శ్రీ పదార్చన’ ప్రథమ వాగ్గేయకారుడు, అన్నమాచార్యుని జీవితం ఆధారంగా 15వ శతాబ్దపు విజయనగర రాజులు, సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రక నవల ‘శ్రీ పదార్చన’. అన్నమయ్య భక్తిరస నిరాడంబర జీవితంతో పాటు ఆతని మానవతావాదం, జీవకారుణ్యం, దసజనచర్యణ, సంఘీక సంస్కరణలు, సరళమానసభారతత్వం, ధర్మజగృతి మొదలైన అంశాలు ఈ నవలలో ముఖ్యమైనవి.

ఇందులో చారిత్రకత ఎక్కువగా ఉండి ఆ కాలంనాటి కవులు, కళాకారుల జీవిత విశేషాలను కథానుగుణంగా రచయిత చిత్రకరించినారు. ఈ నవలలోని ప్రధాన పాత్ర అన్నమాచార్యులు. విశిష్టాద్వైత సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకోనిపోయి సమాజాన్ని సక్రమమార్గంలో నడిపించిన కళాకారుడు, రామానుజ మార్గానువర్తకుడు, అన్నమాచార్యుడు. వైదికధర్మాన్ని, సాహిత్యకళా విలువలను, హైందవ సంస్కృతిని కాపాడిన విజయనగర రాజు సాళువ నరసింహరాయులు. వీరిరువురు సంగీత సాహిత్యకళారంగాలలో ఆరితేరినవారే. వీరిద్దరే కాకుండా తాళ్ళపాక తిమ్మక్క, పురందరదాసు, పెదతిరుమలాచార్యుడు, నరసింగన్న, రేవణూరి తిరుమల కొండయ్య, వీరన్న, శశిధరదీక్షితులు, వాసరాయులు, చిన్నన్న మొదలైన కవులు, కళాకారులు ఈ నవలలో సజీవ రూపాలుగా పాఠకుల కళ్ళముందు సాక్షాత్కరించి భావోద్వేగాలను, భక్తిభావాలను కలిగించి ఆ నాటి సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తారు.

  1. ‘తంజావూరు వైభవం’ – ఈ నవల పూర్తిగా చారిత్రక వాస్తవికతను విశ్లేషించింది.ఈ నవలలో ప్రధాన పాత్ర రఘునాథనరాయుడు. ఇతని విజయపరంపరలను, నాటి సంస్కృతిని తెలిపేది ఈ చారిత్రక నవల.

రచయిత ఒక్కొక్క నవలలో ఒక్కో రకమైన వైవిధ్యాన్ని ప్రదర్శించారు.

ముగింపు

సమాజ శ్రేయస్సు, సనాతన సంస్కృతి, దేశభక్తి, మరియు చారిత్రక సత్యాలను కథాంశాలుగా మలచి, పాఠకులలో జాతీయ చైతన్యాన్ని రగిలించడంలో ముదిగొండ శివప్రసాద్ గారు రాసిన నవలలు, అందులోని పాత్రలు ఎంతో కీలక పాత్ర పోషించాయి.

భారతీయ చరిత్రను, ధర్మాన్ని, సంస్కృతిని పునరుజ్జీవింపజేస్తూ పాఠకులలో జాతీయ చైతన్యాన్ని, దేశభక్తిని రగిలించడంలో ముదిగొండ శివప్రసాద్ గారిది అందె వేసిన చేయి.

మిగతా నవలలో ప్రేమను చరిత్రను రంగరించి నవరసాలను పలికించిన చారిత్రక నవలలను మరొక వ్యాసంలో పరిశీలిద్దాం.

డా. యస్. జ్యోతి

Exit mobile version