[శ్రీ నవులూరి వెంకటేశ్వరరావు రచించిన ‘చారిత్రక కఠిన సత్యాలు – గురజాడ కన్యాశుల్కం’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]
సాహిత్యవేత్తల్లో కన్యాశుల్కం గురించీ అంతో ఇంతో, ఎప్పుడో అప్పుడు, ఎక్కడో అక్కడ రాయని వాడంటూ లేడు అని డా. ఏటుకూరి ప్రసాద్ వ్యాఖ్యానించారు. దానికి కారణం bandwagon effect కూడా. అందరూ చేస్తున్న పనిలో నేను ఎందుకు వెనకబడాలి [“వెనకబడితే వెనకేనోయ్”] అన్న మానసిక బలహీనత. తొలినాళ్లలో ఆ నాటకానికి తగినంత ఆదరణ కొరవడిందని గురజాడ వారి అబ్బాయి రామదాసు గారు అన్నారు. కామ్రేడ్లు శెట్టి ఈశ్వర రావు, అవసరాల సూర్యారావు, కె.వీ. రమణా రెడ్డి, బండి గోపాల రెడ్డి దాన్ని వాళ్ళ భుజాలపైన నాలుగు వైపులా మోశారు. దానర్థం సాహిత్య విలువ దానిలో మృగ్యం అని కాదు. నాకన్నా తెలివైన సాహితీవేత్తలు చారిత్రక, ఇతర కఠిన సత్యాలజోలికి అంతగా పోలేదు అనిపించి ఈ వ్యాసం రాసే సాహసం చేస్తున్నా.
క్రైస్తవ-ఆంగ్ల- ‘ద్రావిడ’ జీవావరణ వ్యవస్థ [ecosystem] లాగే హిందూ మతం, దానికి కాపలాదారులం అని భావించే పురోహిత లేక బ్రాహ్మణ వర్గంపై ఒక విషయంలో కన్ను ఎర్రజేసిన సంఘసంస్కర్తలలో Behramji Merwanji Malabari అనే పార్సి ఉన్నాడు. ఆయన హిందువుల [కేవలం బ్రాహ్మలవి కాదు] బాల్యవివాహాల, వితంతువుల సమస్యలను చేపట్టాడు. మంచిపనిని చెడ్డవాడయినా చెయ్యవచ్చు; చెడ్డపనిని చెడ్డవాడు కూడా చెయ్యరాదు. ఆంగ్లేయులతో సత్సంబంధాలున్న ఆ సంస్కర్త మూడుసార్లు ఇంగ్లాండు వెళ్ళాడు. ఇంగ్లాండ్ రాజుకు ‘పాత స్నేహితుడు’ [old friend]. లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ స్వాతంత్ర పోరాట యోధుడే కాక సంస్కారవాది కూడా. మలబారిని ముందు తన పారసీ మతంలో కూడా వున్న బాల్యవివాహ, వితంతు సమస్యలను సంస్కరించుకోమని హితవు పలికారు. ఇంట గెలవడం కష్టం, రచ్చ గెలవడం తేలిక! సంఘ సంస్కరణ పై తిలక్ భావాలు స్థూలంగా ఇవి: దేశ స్వాతంత్రం, సంఘసంస్కరణ రెండు దుర్గాల లాంటివి. రెండింటినీ ఒకేసారి ముట్టడించడం సాధ్యపడదు. స్వాతంత్రం సాధించుకున్నతరువాత సంస్కరణపై దృష్టిని పెట్టుకోవచ్చు. సామాజిక జాడ్యాలు చారిత్రకంగా వచ్చినవి. అలారావడంలో విదేశీ దాడుల, విదేశీ పాలన పాత్రలున్నాయి. నిరంతర పరిణామక్రమం వలనను, స్వచ్చందంగాను, జాతివారసత్వంగాను సామాజిక మార్పులు వస్తుంటాయి. బాల్యవివాహాలు, వితంతువుల సమస్య మీద మలబారీ ఆంగ్ల ప్రభుత్వానికి 15-8-1884న లేఖ రాశాడు. ఆ ప్రభుత్వం మదరాసు ప్రెసిడెన్సీతో సహా దేశవ్యాప్త అభిప్రాయ సేకరణ చేసి మూకుమ్మడి వ్యతిరేకత వ్యక్తం కావడంతో చట్టం తేవడం సాధ్యపడదని ఒక తీర్మానం చేసింది [No.35-616-26, dated 5th October 1886]. సిపాయిల 1857 తిరుగుబాటు అనంతరం విక్టోరియా రాణి నవంబరు 1, 1858న చేసిన ప్రకటనలో భారతీయుల మత సంబంధ విషయాలలో పరిపాలనా వ్యవస్థ జోక్యం చేసుకోదు అన్న హామీ వుంది.
II
వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా పూసపాటి ఆనందగజపతి గారు మదరాసు ప్రెసిడెన్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో 1.2.1888న ఇలా కేవలం బ్రాహ్మలకు వర్తించేట్లు బిల్లు ప్రవేశపెట్టారు: A bill to discontinue the sordid practice of selling girls in marriages under the guise of religion.. it is expedient to discourage and put down the barbarous practice of selling girls.. among Brahmins of Southern India. దానిని అభ్యుదయభావాలున్న ఎస్. సుబ్రమణ్య అయ్యర్, సి. చంచలరావు అనే ఇద్దరు నిపుణులకు పంపగా ఇద్దరూ తిరస్కరించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సుందరం శాస్త్రి అనే మదరాసు హై కోర్ట్ న్యాయవాది దక్షిణ భారతంలో అలాంటి దురాచారమె చెప్పుకోవలసినంతగా లేనప్పుడు దాని గురించీ ఒక చట్టమెందుకు అని వాదించాడు. ఆ బిల్లు చెత్తబుట్టను చేరింది. కాల్డ్వెల్, గ్రాంట్-డఫ్ లతో సహా ఆంగ్లేయులు బ్రాహ్మలను ఇతర జనాభనుంచి విడగొట్టటం గమనించిన ఆనంద గజపతి ఆ కులంపై తానూ ఏదో విధంగా ఆంగ్లేయుల మంచి దృష్టిలో కొనసాగుతుండటానికి అదొక అవకాశంగా భావించి ఉండవచ్చు. ఆంగ్లేయుల మనసెరిగి నడుచుకునే జమిందారీ మనస్తత్వానికి అది ఒక మచ్చుతునక. బ్రాహ్మలు తన సంస్థానంలో అంత సంఖ్యలో వాళ్ళ సామర్థ్య గుర్తింపుకు, పేదరికం కారణంగానో దేబిరిస్తుండటం కూడా ఆ కులంపట్ల చులకనభావం మనసులో ఏర్పడి ఉండవచ్చు.
కన్యాశుల్కం, ఇతర దురాచారాల మీద కందుకూరి వీరేశలింగం గారు సమగ్రంగా రాసిన ‘బ్రాహ్మ వివాహము’ లో శాస్త్రి ఇలా అంటాడు [పుట 11]: “కన్యాశుల్కం పుచ్చుకుంచూ ఉండడం ఇరవై ముప్ఫయి ఏళ్ళనుంచీ శిష్టాచారంగా జరుగుచూనేవున్నది. అందుకు మన పెద్దలందరూ అంగీకరించి వూరుకుంచూనేవున్నారు.” దానినిబట్టీ భావించవలసినది: బహుశా బ్రాహ్మల పేదరిక, సామాజిక కారణాలవల్ల ఎక్కడన్నా ఆ దురాచారం వున్నా అది అప్పటికి ఇరవై ముప్పై ఏళ్ళనుంచీ ఉండుంటుంది బ్రాహ్మల ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారి. ఎంతోకొంత పేదరికము, కులవ్యవస్థలో అగ్రభాగాన ఉన్నట్టు భావించే బ్రాహ్మణ కులము తోబుట్టువులు. మూడువేల సంవత్సరాలనాటి ఐతరేయబ్రాహ్మణంలో పేద బ్రాహ్మణ దంపతులు తమ రెండవ మగబిడ్డను హరిశ్చంద్రుడు అనే రాజుకు అతని కొడుక్కు బదులుగా నరబలి ఇవ్వడానికి అమ్ముకున్న కథ తెలిసినదే. డెబ్భై-వందేళ్ల క్రితం చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, ఆదిభట్ల నారాయణ దాసు లాంటి పండితులు కూడా ఉర్లామ్ జమీందారు చేసే అన్న సంతర్పణకు, ఇచ్చే సంభావనలకు అడవులలో పడి మొహం వాచినట్టు వెళ్లిన విషయాలు వాళ్ళ అక్షరరూపంలోనే వున్నాయి. ఆదిభట్లవారు ఉర్లామ్ వారి ఒక అన్నసంతర్పణలో లక్షమంది దాకా పాల్గొన్నారని వ్రాసారు. దానంచేసే గావంచలో, పంచలో వాళ్ళు కట్టుకుని వుంటారు. యాచకత్వమన్నా, మరొకరి దానాన్ని స్వీకరించడమన్నా ఆత్మగౌరవ విషయం పక్కనుంచితే పేదరిక లక్షణమే. ఆంగ్లేయుల రాకతో అగ్రహారాలు చేజారిపోయాయి. సంస్థాన ఉద్యోగాలు అంతంత మాత్రమయ్యాయి. [ఉత్తరోత్తరా పల్లెప్రాంత ఒక శాఖ బ్రాహ్మలు వంశపారంపర్య కరిణీకాలను కోల్పోయారు; రాజకీయ అధికారం నుంచీ పూర్తిగా బ్రాహ్మలు వెలుపలికి నెట్టివేయబడ్డారు.] కాయకష్టం, వొళ్ళు వంచి వ్యవసాయం చేయడం రాదు తరతరాలుగా అలవాటు చేసుకోకపోవడం వలన. దరిద్రుడు కాకపొతే బ్రాహ్మడే కాదు అనే స్థితికి క్రమంగా ఆ రోజుల్లో చేరుంటారు. ప్రతి కుచేలుడికి శ్రీకృషుడితో స్నేహాలుండవు. పదిహేనో శతాబ్దంలో తిండికి లేక శ్రీనాథుడు లాంటి వాడు ఏడ్చినంత పని చేశాడు. డెబ్భై యేళ్ళనాటి [ఒకప్పుడు నాలుగు ఊళ్లలో బంగళాలు వెలగబెట్టిన] టంగుటూరి ప్రకాశం గారు చింకి చొక్కాతో, బియ్యంబస్తా గురించీ దేహీ అనడం తెలిసిన విషయమే. ఒకప్పుడు స్థితిమంతుడయినా బులుసు సాంబమూర్తి గారు త్యాగాల ఫలితంగా వున్నది పోగొట్టుకుని దారిద్య్రంలో మరణించారు. అలాంటి వ్యథలు, కథలు కోకొల్లలు. స్వాతంత్య్రపోరాటం రామరాజ్యాన్ని కాక రాబందురాజ్యానికి రహదారైంది. సమాజంలో అంతకన్నా హీనమైన పరిస్థితులలో జీవించే వేరే కులస్థులు లేరా అంటే అది సమాధానం కాదు.
ప్రజల దురాచార ఇతర సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత, అధికారం జమిందారుది కాదు. విజయనగరం ‘మహారాజా’ రాజు కాదు. అది ఆంగ్లేయులు దయతలచి ఇచ్చిన ఒక బిరుదు, ‘గజపతి’ లాగే. వైజాగపటం జిల్లా పాలన మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన జిల్లా కలెక్టరుది. విజయనగరం ఆ జిల్లాలో వుండేది. మరో విషయం – 1797 లో జరిగిన పద్మనాభ యుద్ధం తరువాత ఆంగ్లేయులు విజయనగర స్థాయిని రాచరిక రాష్ట్ర [Princely State] స్థాయి నుంచీ జమీందారీగా తగ్గించారు, కోటను ఖాళీ చేయించలేదు గాని. విజయనగరం అప్పట్లో ఏ దుస్థితిలో ఉందో ఆదిభట్ల నారాయణ దాసు గారు అసహ్యం కలిగేలా చిత్రించారు ‘నా యెఱుక’లో: “నాచుతోను గాల్వలతోను నిండి అయ్యకోనేట్లో అన్నిజాతులవారును స్నానము చేసి బట్టలుతుకొనుచుందురు. పెద్ద మహారాజుగారు [ఆనందగజపతి తండ్రి] వీధుల వెంబడి గుర్రపు బండిపై వచ్చునప్పుడు వారి హుక్కా సువాసన తప్ప తక్కిన వేళల నన్ని వీధులయందు సహింపలేని దుర్వాసన ఉండును. దోమల బాధ జెప్పదరము కాదు, పెద్దచెర్వు నీటి మొదటి దుర్గందానుభవము స్కూలుది. బ్రాహ్మణ వీధులన్నియు కుళ్ళు కాల్వలకు, చెత్తలకు పుట్టిండ్లు. మహారాజుగారి ప్రాపున పైడబ్బు, మున్సిపాలిటీ మహిమచేత క్రింది డబ్బునూలేని పురుషుడుండడు. మూడువంతులు స్త్రీలకూ బూరగాళ్ళు, బూరచేతులు కలవు. ఇట్లు పిన్నపెద్దలు ముప్పాతికమూడు వీసములిట్టి దుష్ఠరోగములకు బాలైరి. ముఖ్యముగా బ్రాహ్మణులకే ఈ రోగములు మెండు..” ఆనందగజపతుల వారు వాటిని కళ్ళు మూసుకుని చూసి, ముక్కుమూసుకుని వాసన పీల్చి బ్రాహ్మల బాల్యవివాహాలు, వితంతు దుస్థితుల గురించె తీవ్రంగా ఆలోచించారు. ఒక బ్రాహ్మణ వితంతువుకు బాల్యవివాహం, వైధవ్యం తీవ్రమైన సమస్య; బ్రాహ్మణ పునిస్త్రీని, ముసలిదాన్ని కూడా వదలని బూర చేతులు, బూరకాళ్లు కూడా పెద్ద సమస్య. బోదకాలికి కుల, లైంగిక, వయో భేదం లేదు. అత్యంత తేలికైన పని తమకులంలోని స్త్రీల పరదాలు తొలగించే ప్రయత్నం చెయ్యవలసింది. బహుభార్యత్వం, శిశు హత్యలు, గర్భస్రావాల గురించి పట్టించుకునే తీరికే లేదు.
1862లో అప్పటి వైజగపటం జిల్లా కలెక్టర్ డి.ఎఫ్. కార్మైఖేల్ జిల్లాహెడ్ క్వార్టర్స్ వైజాగపటం నుంచీ విజయనగరానికి మార్చడానికి ఇలా విముఖత వ్యక్తం చేశాడు: “అంత అప్రధాన స్థలం నుంచీ కలెక్టర్ పనిచెయ్యడం అసాధ్యం. రేస్ కోర్సు, వేటకుక్కల గుంపులు, చిరుతపులుల వేటలు, పొట్టేళ్ల పోటీలు, విందులు [balls], భోగం స్త్రీలు, బల్లేల పోటీలు, అడ్డమైన తిళ్ళు లాంటి – ముగింపు ఉండని – కాలక్షేప ప్రదేశమది.”
విజయనగరం జేపూర్ జామీన్‌దారులకు సంబంధ బాంధవ్యాలున్నాయి యుద్ధం చేసుకున్నా. వాళ్ళ ఉత్తరసర్కారుల సైనిక జీవితం ఆ రాజుల పంచన ఆరంభమయింది. జేపూర్ జమీనుదారు గురించీ A Manual of the District of Vizagapatam in the Presidency of Madras లో [1868] ఇలా రాశారు. “శిశు హత్యలు ఇక్కడ సర్వసాధారణం.. జేపూర్ రాజు ఆ ఘాతుకం మీద ఒక పెద్ద తాలూకాలో చాలా డబ్బు చేసుకున్నాడంటారు. ఆనవాయితీ ఏమిటంటే ఒక ఆడ శిశువు పుట్టి దాన్నితల్లిదండ్రులు చంపేయ దలచుకుంటే దాసరితో సంప్రదించి, తాలూకా అమీనుకు కొంత డబ్బు చెల్లించాలి. అమీను రాజా వారికి సంవత్సరానికి మూడు వందల రూపాయలు చెల్లించి ఆ అధికారాన్ని కౌలుకు తీసుకుని రాబడిని జేబులో వేసుకుంటాడు.. ఏ కులాల వితంతువులనన్నా పెళ్లి చేసుకో దలచుకుంటే రాజుకు రుసుము చెల్లించాలి. ఆ వితంతువులను రాజు కుమార్తెలుగా భావిస్తారు..” అన్నట్టు గిడుగు రామమూర్తి గారి తండ్రి గిడుగు వీర్రాజు గారు విజయనగరం సంస్థానం రాబడి ఉద్యోగిగా [శిరస్దార్] ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో పనిచేసేవారు. ఆయన విధులలో ఒకటి జెపూర్ సంస్థానంలో ఏమి జరుగుతున్నదో నిఘా వేసి విజయనగరం సంస్థానం వారికి కూపీ ఇవ్వడం. ఆ పని చెయ్యడానికి గిడుగు వెంకట రామమూర్తి గారి తండ్రిగారికి సిగ్గనిపించలేదు.
పిలవని పేరంటానికి అప్పగారి అరువు పట్టుచీరెలో వెళ్లినట్టు మూడు శాతం ప్రజలను [బ్రాహ్మలను] మాత్రమే ఉద్ధరించే ప్రయత్నంలో చట్టం తెచ్చే విఫల యత్నం చేసిన ఆనందగజపతి గారు, వివాహం అయిన స్వల్ప కాలంలో వితంతువయ్యి పుట్టిల్లు చేరిన తన చెల్లెలుకు పునర్వివాహం చేసే ప్రయత్నం చేయలేదు. తల్లికీ వైధవ్యం ప్రాప్తించి అలాగే ఆమె జీవితం ముగిసింది, వాళ్లంతా వున్నా, కోటలోనే భోగపత్నులతో, భోగం మేళాలతో సుఖంగా జీవించారు ‘రాజులు.’
సంస్కర్త ఆనంద గజపతి గాని, వారి తండ్రి విజయరామరాజు గాని, వారి అంతకుముందువారు గాని పట్టించుకోవలసిన విషయాలు పట్టించుకోకపోవడం అంత విడ్డూరమూ కాదు ఆరుద్ర [సమగ్ర ఆంధ్ర సాహిత్యం – నాలుగవ సంపుటి] వ్రాసిన ఈ విషయం చదివితే: “జమిందారులు తమ ఉనికిని భద్రం చేసుకోడానికి పనికి వచ్చే కార్యక్రమాలను చేపట్టటం సహజం. మొదటికి మోసం రాకుండా ఉండేట్టు కొందరు జమిందారులు రాజకీయ, సాంఘిక రంగాలలో కృషి చేశారు.”
III
చట్టం వీలవకపోతే బ్రాహ్మణ్యాన్ని హాస్యానికి కనీసం వాడుకుందామన్న అభిప్రాయము జమిందారుకున్నట్టు సమస్త విషయాలు యెరిగిన, “గుర్రం ఎక్కే” నియోగి రామప్పంతులు లౌక్యం పుష్కళంగా ఉన్న గురజాడ చేత నాటకం రాయించాడు. ఆయన ‘ఆనంద’ గజపతి. గురజాడ కన్నా ముందే ‘బ్రాహ్మ వివాహం’ పేరుతో సమస్యల మీద లౌక్యం తెలియని నియోగి వీరేశలింగం గారు వ్యావహారికంలో రాశారు. అది తీర్చలేని సమస్య ‘కన్యాశుల్కం’ తీర్చేదా, స్వయంగా సంఘసంస్కర్త కూడా అయిన వీరేశలింగం కన్నా గురజాడ ఎక్కువ సమర్థుడా? వీరేశలింగం గారు 1876 లో రాసిన నాటకం తరువాత వచ్చిన కన్యాశుల్కమంత ప్రజాదరణ కన్యాశుల్కం రాకముందే పొందింది. అది 1876 లోనే “హాస్యసంజీవిని”లో ధారావాహికగా వచ్చింది, 1878 లో పుస్తక రూపం పొందింది. దాన్ని సామాన్యులు “పెద్దయ్యగారి పెళ్ళిపుస్తకం” అని పిలుచుకుంటూ గుంపులు గుంపులుగా కూర్చుని చదువుకునో, చదివిపించుకునో ఆనందించారు. ముందుపలుకులో పంతులుగారు ఆ నాటక లక్ష్యాన్ని ఇలా వివరించారు: “ఇందు వ్రాయబడిన ప్రతివాక్యమును నేదోయొక దురాచారమును వెల్లడిచేయు కొఱకు మాత్రమే చదివక దాని యుద్దేశమును గూడా శ్రద్ధతో విచారింప గోరబడుచున్నారు,” 1950వ సంవత్సరంలో ఆరవ కూర్పు ప్రచురించారు [యాభై ఏళ్లలో] జనాభా తక్కువున్న ఆ రోజులలో. కానీ జనాలు ఈ నాటకాన్ని వేడుకకొరకు మాత్రమే చదువుకోగా ఆ దురాచారాల మీద ప్రహసనాలకు ఇతర రచనలకు వీరేశలింగం గారు పూనుకోవలసి వచ్చింది బేతాళుడిని మోసిన విక్రమార్కుడి దత్తపుత్రుడిలా. గురజాడవారి కన్యాశుల్కం కేవలం చక్కిలిగిలిపెట్టి పొట్టలు పగిలేలా నవ్వించడానికి ఉపయోగపడింది. కన్యాశుల్కం, నాటకం విడుదలయ్యేనాటికే ఒక పుస్తకం రాయవలసినంత సమస్య కాదు. వీరేశలింగం గారి ఆ పుస్తకం వెలువడిన పదేళ్లదాకా ఆ విషయం తెలియనట్టు గురజాడ అమాయకంగా అన్నారు.
అతి పెద్దదయిన వైజాగపటం జిల్లా లోని బ్రాహ్మల బాల్యవివాహాల, వితంతువుల లెక్కలు తేల్చమని హిస్ హైనెస్ మహారాజా అఫ్ విజయనగరం ఆదేశించారని వారి భృత్యుడు గురజాడ తన తొలిపలుకులో చాటారు. లెక్కలు ఎలా సేకరించారో, ఎవరు సేకరించారో, ఎంతవరకు నమ్మవచ్చో వారిరువురికి తెలియాలి. ఆనంద గజపతి, గురజాడ పద్దులు మాత్రం రామప్పంతులు పద్దులలా సృష్టించబడినవి. అవి కిట్టింపులెక్కలా పవిత్రమైనవా అన్న విషయం జోలికి ఏ విమర్శకుడు వెళ్లే ప్రయత్నం చేసినట్టు కనబడదు – గురజాడ మీది ప్రేమాభిమానాలవల్ల, రాజభక్తి వల్ల. ఆ కాలంలో ఆ జమీందారు క్రింద వున్న జనాభా యెంత, అందులో బ్రాహ్మల సంఖ్య ఎంత? మదరాసు ప్రెసిడెన్సీలో అతి పెద్దదయినా వైజాగపట్నం జిల్లా అంతా తిరిగి ఆ లెక్కలు తీయడానికి ఎంత మందీమార్బలం కావాలి?
అలాంటి రామప్పంతులు పద్దులు గురజాడవారికి, విజయనగర సంస్థానానికి కొత్తవి కాదు. గురజాడ వేంకట అప్పారావు గారు నాయకత్వం వహించిన పెద్ద వ్యాజ్య ప్రహసనంలో జరిగినంత నకిలీపద్దుల బాగోతం ఆంధ్ర దేశంలో అంతకుముందు జరిగుండదేమో? వ్యాజ్యం పద్దుల గురించీ ఆరుద్ర ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’లో చదువుకోవచ్చు [నాలుగవ సంపుటం ‘సాహిత్య వ్యాళికలు – పూసపాటి పెద్ద దావా’]. పెద్ద దావాలో ఒక పక్షంవారే కాక రెండు పక్షాల వాళ్ళూ వంశ వృక్షాలను సృష్టించారు పాత వివర్శలను దిద్దిపారేసారు. తమకు ఇబ్బందికరమైన గ్రంథాలను వెలుగుచూడనియ్య లేదు. తమకు అనుకూలమైన వాటిని సేకరించో, పుట్టించో ప్రకటించారు – తిలాపాపం తలా పిడికెడు. తాళ్లపాలెం కోవా వారి తరఫున [ఆనందగజపతి] వ్యాజ్యాన్ని నడిపించినవారిలో ప్రముఖులైన గురజాడ అప్పారావు గారికి ఇది వర్తించకపోదు.. సాక్ష్యాలు మార్చారో, సమకూర్చారో గాని గురజాడ అప్పారావు గారు ఈ పెద్దదావాలో ఎంత మునిగి పోయారంటే 1905 ఏప్రిల్ 15 వ తేదీనాడు అప్పారావు గారు మద్రాసు చేరుకుంటే 24 వ తేదీనాడు అప్పారావు గారి తండ్రి గారు మరణించారు.. విజయనగరంలో పదమూడురోజులు మాత్రమే ఉండి, తండ్రికి కొడుకు చేయవలసిన కర్మచేసి మే 7వ తేదీనాడు ఊటీకి విజయనగరం నుంచీ బయలుదేరవలసి వచ్చింది.. వేసవి సీజను అయిపోయినా 1905 లో సెప్టంబరు దాకా అప్పారావుగారు ఏ దావా కార్యాల వల్లనో ఊటీలోనే ఉండిపోయారు.” ‘వేసవి సీజను అయిపోయినా’, ‘ఏ దావా కార్యాల వల్లనో’ ఏవేవో అర్థాలను స్ఫురింప చేస్తాయి.
IV
ఓపిక లేకపోతే తెచ్చుకుని సౌందర్యారాధకుడు గురజాడ వారు ఏకాంత సేవలు సేసుంటే ఆశ్చర్యపడనక్కరలేదు వారు వాటిని అంతగా దాచే ప్రయత్నం చేయకపోవడం వలన. కవులు, సంఘసంస్కర్తలు ఎవరో ఒక స్త్రీతో ఊటీలోనో, బెంగుళూరులోనో గడపడం, కనీసం వాళ్ళ వీపులన్నా నిమరడం వలన నిమిరినవాళ్లకు, నిమిరించుకున్నవాళ్లకు, సంఘానికి, సాహిత్యానికి ఉపయోగపడకపోదు. [వీరేశలింగం గారి వీగిపోయిన పరువునష్టం దావా వివరాలు ఇక్కడ ఇవ్వదలుచుకోలేదు. టంగుటూరి ప్రకాశం గారు తన “నా జీవిత యాత్ర” లో సవివరంగా ఇచ్చారు –అధ్యాయం 19, వీరేశలింగం పంతులు కేసు.] అంతేగాక గిరీశం గారితో గురజాడ వారు ఇలా అనిపించి వున్నారు స్వీయ అనుభవంతో: It is women that seduce all mankind. రెంటాల వెంకట సుబ్బారావు గారు కన్యాశుల్కాన్ని మెచ్చుకుంటూ గురజాడకు 7.7.1909 న మదరాసునుండి రాసిన ఒక లేఖలో “మీరు ప్రేమికులు, మీరు ప్రేమించడం ఎరుగుదురు” అని ఊరికే అనుండరు. ఆరుద్రగారు రాసిన దానినిబట్టీ, ఆనంద గజపతిని, తన పోషకురాలైన అప్పలకొండమాంబను [“రీవారాణీ”ని పాటలోని [నీలగిరి పాటలు] ముద్రలో పేర్కొంటూ రెండు రచనలు చేశారు మిగతా కావ్యశైలిలో. ఆ పాటలను రీవారాణీ మద్రాసులో చిన్నపుస్తకంగా ‘చక్కని నునుపైన’ కాగితాలపై ముద్రించారు, అది వ్యాజ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని గ్రాంథికంలో రాయడం జరిగింది, కన్యాశుల్కం ముందు పుటలలో ఇలా రాయడం తెలిసిన విషయమే: “శ్రీశ్రీశ్రీ హర్ హైనెస్ ది మహారాజా కుమారికా సాహెబా ఆఫ్ విజయనగరం, మహారాణీ ఆఫ్ మాధోగడ్, రీవా, సర్కార్ వారి భృత్యుడగు గురజాడ అప్పారావు చే రచించబడిన.”
ఆనందగజపతి నౌఖరీలో వుండే భోగం కాంతలను గురజాడ ‘నిశితంగా పరిశీలించారు.’ వాళ్ళ కళ్ళలోనే వాళ్ళ శీలాన్ని [వాళ్లకు శీలమేమిటి? అనొద్దు] చదవడానికి ప్రయత్నించారు. కరుణకళ్లు. లోతుకళ్లు. రామస్వామి కనుబొమలు విశాలంగా సోగగా తెలివితేటలు సూచిస్తాయి. [గజపతి ‘భోగ పత్ని’] రామస్వామి కనుబొమలు విశాలంగా సోగగా తెలివితేటలు సూచిస్తాయి. భాస్కరం కళ్ళు నిద్రమత్తుతో తూగుతుంటాయి. చంద్రవదనవి ప్రశాంతమైన చూపులు. ఆమె చెల్లెలి కళ్ళలో అన్నీ ఆలోచనలే [అవేంటో గురజాడకే తెలియాలి]. అలా తదేకంగా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆ విషయం ఇతరులకు తెలియకూడదని తాపత్రయపడినా, ఎవరికంట అది పడకూడదో ఆ కంటికి అప్పారావు గారు దొరకనే దొరికారు. ఆనందగజపతి అన్నారు: “అప్పారావుకు కన్ను రిట్టగించి చూడటం ఒక అలవాటు.” అయినా రాజు గారు రామస్వామి ‘మంచిచెడ్డలను’ చూసే భాగ్యం లేక బాధ్యతను రావు గారికి అప్పగించారు. రాజు గారి వాయుయిరిసమొ [voyeurism], రావు గారి అసమర్థత/సమర్థత మీద నమ్మకుండటం వలననేమో. “మా తల్లి గారికి, అక్కగారికి [రీవా రాణి] తనంటే పరిపూర్ణమైన విశ్వాసం వున్నది,” అని రాజు గారు రావు గారితోనే అనేశారు. మిగతా విషయాలు ఎలా వున్నా ‘రిట్ట గించి చూసే చూపు’ భోగం స్త్రీలకూ మాత్రమే పరిమితమవదు. అందానికి రాణులు భోగంస్త్రీలకు తీసిపోరు. అయినా రాజులు రాణులకు సెలవు మంజూరు చేసి భోగంస్త్రీలకు పని కల్పిస్తుంటారు. తన తల్లిని, అక్కను చూసే చూపును భరించగల సహనం, ఔదార్యమో ఆనందగజపతి గారికి లేదని ఎందుకనుకోవాలి! తన స్వీయపత్నితో లైంగిక కార్యం చేయడంలో తనకు శారీరక ఇబ్బందులున్నాయని అప్పారావు గారే వాపోయారు. చూసే కళ్ళకు ఆ బాధ లేదు.
గురజాడ శిష్యుడు/మిత్రుడు ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం గారు కన్యాశుల్కం మీద తన అభిప్రాయాలు తెలియజేస్తూ మీనాక్షియను బాల్యవితంతువును మధురవాణియును గనపడు నాటకరంగములు నైతికవిరుద్ధ ప్రయోజనములు, ఆ ప్రదర్శనము యువతీయువకులకు శ్రేయస్కరము కాదు – అనగా గురు శిష్యులమధ్య చర్చ జరిగింది, తన 21 మే, 1909 లేఖలో ఒంగోలును ఊరుకోబెట్టే పని చేశారు గురజాడ. ఈ సమస్యను సాకల్యంగా నీతో నేను చర్చించదలచుకోలేదు అన్నాడు. తన శిష్యుడు తనను ఆ విధంగా ప్రశ్నించడం కోపం తెప్పించి ఇలా అన్నారు: “నువ్వు వాస్తవిక విషయాలను యథార్థాలను కప్పిపుచ్చకు, అంతే నేను నిన్ను కోరుతున్నది.” మధురవాణి పాత్రంటే వారే ముచ్చటపడుతున్నారట. స్త్రీపురుష లైంగిక సంబంధాలకు అనవసర ప్రాముఖ్యత ఇవ్వడంలో అర్థము, ఔచిత్యము లేవని వారు వాక్రుచ్చారు. గురజాడ మరొక లేఖలో: “సమాజం నిర్ణయించిన నీతిసూత్రాలు మనకు కొన్ని వున్నాయి, వాటిని గౌరవించడం మనవిధి, అందులో స్త్రీపురుష పరస్పర సంబంధాలను విధించే ధర్మసూత్రం ఒకటి..” వారు తనను తాను ముడివేసుకున్న అయోమయం తరువాత వాక్యాలలో కొనసాగుతుంది, గురజాడ తన రసికత, సరసతల విషయంలో సంఘర్షణలకు గురయ్యారు. ఏ మనిషయినా స్వీయ ప్రవర్తనలో ఇమిడే నైతిక నియమావళికి మాత్రమే తలవూపుతాడు.
“గురజాడ అప్పారావు శతవర్థంతి ప్రత్యేక సంచిక [నవంబర్-డిసెంబర్ 2015] సిపిఎం వారి “సాహితీ ప్రస్ధానం” సంపాదకీయంలో కన్యాశుల్కం విమర్శకులను తూర్పారబట్టారు. వారు విమర్శించినవాళ్లలో ‘ప్రగతిశీల’ శ్రీశ్రీ, నార్ల కూడా వున్నారు. వారి రెండు కొలబద్దలు ప్రకారం గురజాడను విమర్శిస్తే ప్రగతినిరోధకం, ప్రశంసిస్తే ప్రగతిశీలత. ‘కామ్రేడ్’ ప్రగతిశీలతనేగా సూచిస్తుంది? గురజాడను ‘కామ్రేడ్’ అన్నారని నార్ల సంపాదకత్వంలోని ‘ఆంధ్రప్రభ’పై కన్నెందుకు ‘ఎర్ర’జెయ్యడం? ‘కామ్రేడ్’ బూతు కాదు. అసలు బూతున్నది లేనేలేదేమో కొందరి దృష్టిలో. కన్యాశుల్కంలో బూతులు లేవేమోగాని బూతుపనులున్నాయి. లంజ పెద్దల దృష్టిలో బూతు కాదు! గురజాడవారి అబ్బాయి రామదాసు గారే ఇలా అన్నారు: “ఆయన రచనలన్నీ దూరదృష్టితో సాగినవీ, సోషలిస్టు దృష్టితో సాగినవీనీ. మన దేశంలో కమ్యూనిజం ప్రవేశించినపుడు నాన్నగారి కృతులలో వారికుపయోగపడినవన్నీ వారు వినియోగించుకుని అచ్చువేశారు.” ఆయనలో ఎరుపు కనిపించకుండా ఉంటే తెలుగు సాహిత్యాన్ని శాసిస్తూ వచ్చిన పెద్దలు గగనాన్ని తాకే పీటను గురజాడకు వేసేవాళ్ళు కాదేమో!
V
గురజాడ [తన యజమాని] సమస్య కేవలం విజయనగర ప్రాంత బ్రాహ్మలదిగా కన్యాశుల్కం లో చిత్రించి, వాళ్ళను అపహాస్యం చేసి ఐదు గంటల వినోదానికి వాడుకున్నారు. ఆ ప్రాంత క్షత్రియులలో కూడా బాల్యవివాహాలు జరిగుంటాయి, వితంతువులు ఉండుంటారు. ఆ ఊసులు భృత్యులు ఎత్తరు గనుక మనకు తెలియదు. పద్మనాభ ‘యుద్ధం’ వొదిలిన క్షత్రియ వితంతువుల జీవితాలు ఎలా తెల్లవారింది చరిత్ర దాచి వుంచింది. రాజుగారి కులస్థుల జోలికి వెళ్ళకూడదు. మనువు ఏర్పరిచాడంటున్న కుల వ్యవస్థలోని బ్రాహ్మణ, వైశ్య, శూద్ర పాత్రలున్నాయి గాని క్షత్రియ పాత్ర మచ్చుకు లేదు నాటకంలో. బ్రాహ్మణ కులంతో పేచీలేదు గాని రాజుల కులం జోలికి వెళితే ఏ కత్తులు దూయడాలు, శిరస్సులు ఖండించడాలు జరుగుతాయో బొబ్బిలి, విజయనగరం జమీందార్లకు, చరిత్రకారుడు గురజాడకు ఎక్కువగా తెలుసు. అశోక గజపతి రాజుగారి [తెలుగుదేశం పార్టీ] తండ్రి PVG రాజు గారు కూడా అన్నాడు క్షత్రియులయినా తమను బొబ్బిలి వెలమ దొరలూ తమ కన్నా తక్కువ కులస్థులుగా చిన్నచూపు చూడటమే బొబ్బిలి యుద్ధానికి విత్తు వేసింది అని. దానికి ప్రత్యక్ష సాక్షి చరిత్రకారుడు రాబర్ట్ ఆర్మే [Robert Orme] అదే రాశాడు [A History of the Military Transactions of the British Nation in Indostan].
వాళ్ళను వాళ్లు కించపరచుకోడం, ద్వేషించుకోడం ఇతరులు ఆ పనులు చేస్తే ఆనందించడం బ్రాహ్మలకు తెలిసినంతగా ఇతర కులస్థులకు తెలియదు. ఆ నాటకంలో అన్ని బ్రాహ్మణ పాత్రలూ వెకిలివి లేక మూర్ఖంవి లేక మోసగొట్టువి సౌజన్యారావును మరో పావు పాత్రను మినహాయిస్తే. బ్రాహ్మణ ద్వేషం తన ప్రాంతంలో ఉందని గురజాడకు తెలుసు కావున కన్యాశుల్కంలో ఆ ప్రస్తావన వుంది. అలాంటి ద్వేషానికి ‘నేను సైతం’ అంటూ ఒక తుంగను మంటలోకి తోశాడు, అది ఆయనకు ఒక మహాకవిగా ఉపయోగపడింది. కులాలనుబట్టి గుణాలుంటాయన్న మనువు సూత్రం మీద గురజాడకు నమ్మకముంది. అంతే కాక బ్రాహ్మణ శాఖలను బట్టి గుణాలు, ప్రవర్తనలు వుంటాయని మహాకవి నమ్మకం. గురజాడ ఒక సాహిత్య వారసుడు రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారికి నియోగులంటే కాస్త ద్వేషభావం, తన వైదిక వెలనాటి శాఖ అంటే ఆయన దాచుకోని కడుప్రేమ వున్నాయి. కామ్రేడ్ మొదలి నాగభూషణ శర్మ నియోగి బ్రాహ్మణ అశాస్త్రీయ స్టీరియోటైపింగుకు రామప్పంతులు పాత్రను ప్రస్తావిస్తూ ఒక వ్యాసమే తీరుబడిగా రాశారు [“రామప్పంతులు పాత్ర, గురజాడ ధ్యేయం”]. నియోగులలో గురజాడ, గిడుగు, కందుకూరి మొదలగు మహనీయులూ ఉంటారన్న స్పృహలేదు ఏ మైకం వలననో [కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం 1999].
బ్రాహ్మలకన్నా వేశ్య నయం అన్నది గురజాడ ముక్తాయింపు. గురజాడ అప్పారావు గారికి వేశ్యల నేత్రాలు, మనస్తత్వం బాగా అధ్యయనం చేయడం వలన ఆ సత్యమో అసత్యమో బాగా తెలియడమేగాక వారి మానసిక పుత్రిక మధురవాణిని సుమధురంగా సృష్టించడానికి వీలయింది. ఆమె గురజాడవారు అన్ని సేవలు చేసిన రామస్వామేమో మనకు తెలియదు.
కన్యాశుల్కాన్ని రెండవ కూర్పు వచ్చిన నలభై ఆరేళ్లకు దాన్ని నాటకంగా గుర్తించడానికి నిరాకరిస్తూ, సర్వజనీనత సర్వకాలీనతా లేవని నిరసిస్తూ, రూపకంగా గుర్తించడానికి అంగీకరిస్తూ కేతవరపు రామకోటి శాస్త్రి గారు [భారతి: జూన్ 1955] ఇలా అగ్నిహోత్రావధాన్లయ్యారు. ఆ పిదప వ్యతిరేకిస్తూ వచ్చిన వ్యాసాలలో నీళ్లు కుమ్మరించినట్టు చల్లారారు. అన్నట్టు వారు ఒక కన్యాశుల్క ప్రదర్శనలో అగ్నిహోత్రావధాన్ల పాత్ర పోషించారు. ఆయనమీద నీళ్లు కుమ్మరించింది ఒక రెడ్డి ద్వయం.
శాస్త్రి గారి వ్యాసంపై సహేతుకమైన ప్రతివిమర్శ చేయడానికి బదులు గురజాడ గారిని అంటే తమనే అన్నట్లు బండి గోపాల రెడ్డి గారు, కె.వి. రమణా రెడ్డి గారు కువిమర్శకు పాల్పడి శాస్త్రి గారిని మూగను చేశారు. 1992 దాకా ఆ మూగదానం కొనసాగి శాస్త్రి గారు ‘కన్యాశుల్కం మరోసారి’ పేరుతో వ్యాసపరంపరను అచ్చువేస్తుండగా ప్రమాదవశాత్తు పరమపదించారు. ముప్పై ఏడేళ్ల మౌనానికి వారి వారసులు ‘ఒక మాట’లో ఇలా హాస్యాస్పదమయిన సంజాయిషీ ఇచ్చుకున్నారు: “1955లో కన్యాశుల్కం మీద విమర్శ వ్యాసం వ్రాసి ప్రచురించిన తరువాత 36 ఏళ్లకు ఈమధ్య కాలంలో ‘కన్యాశుల్కం’ గురించి తన ఆలోచనలలో వచ్చిన పరిణామాన్ని కొలిచి చూచుకోవాలన్న ఆత్మవిమర్శ దృక్పథంల్హో నాన్న ఈ పుస్తకం సిద్ధం చేశారనుకుంటాను. ఇది వారి కొత్త చూపు.” ఈ పుస్తకం వచ్చేనాటికి శాస్త్రి గారిని భయపెట్టిన రెడ్డి ద్వయం కూడా లేరు. తనది అగ్రహారీకుడి విమర్శ అని చరిత్రలో నిలిచిపోతుందేమోనన్నట్టు, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నట్టు, తాను నూటపది శాతం అభ్యుదయవాదినే రెడ్డిగార్లలాగా అని రుజువు చేసుకోడానికన్నట్లు, తన కులంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనూ, అగ్నిలో దూకి పునీతుడవుతున్నట్టు “బ్రాహ్మలు-మహాత్ములు” అన్న వ్యాసం కూడా రాశారు శాస్త్రి గారు. బ్రాహ్మలలో కూడా మహాత్ములుంటారు, వాళ్లలో ఉన్న చండాలం ఇతరులలో లేదు, జంధ్యం పోగు ఇన్నాళ్లకు ఉపయోగపడింది వగైరా వ్యాఖ్యలతో గురజాడ నడిచిన తోవలోనే నడిచారు శాస్త్రి గారు. గతంలో కొరడాతో బాదుకుని అటు పోలేరమ్మను సంతోషపరుస్తో ఇటు గృహిణులలో భావోద్వేగాన్ని కలుగచేస్తూ బిచ్చం అడుక్కునే పోతరాజులు గుర్తుండేవుంటారు. ఒంటి మీది వాతలను చూడలేక భిక్షం వేసేవారు ఇళ్లవాళ్లు. మొదటి వ్యాసం గ్రాంథికంలో రాయగా మిగతావన్నీ వ్యావహారికంలో వచ్చాయి శాస్త్రి గారిలోని పరివర్తనకు మరో సూచికగా.
“అప్పుడప్పుడు చేంజి చేస్తూంటేనేగా పొలిటీషీయను కానేరడు” అని గిరీశం అన్నట్టు విమర్శకులు కూడా ఆ పని చేస్తుండాలి ఏదో ఒక వొంకపెట్టి. పై శాస్త్రి గారిని పక్కనపెడదాము; అందాకా ఎందుకు మొదటి కన్యాశుల్కంతో సంతృప్తిపడకనే గురజాడ మరొకటి విడుదల చేశారు. రెడ్డి ద్వయం బంగోరె గారు, కె.వి రమణా రెడ్డి గారు శాస్త్రి గారు లేవదీసిన పాయింట్లకు [కొన్ని లేవదీయనక్కరలేనివి కూడా] సమాధానాలీయకుండా దబాయింపులుకు, బుకాయింపులకు దిగగా శాస్త్రిగారు మిన్నకున్నారు వాటికి తట్టుకోలేక. రెడ్డిగార్లకు శాస్త్రి గారు సమాధానం ఇవ్వడానికి 36 ఏళ్ళు ఆగవలసిన అగత్యం ఏర్పడింది. ఈ లోపల ఆ ఇద్దరు స్వర్గస్థులో, నరకస్థులో అయ్యారు. తన పుస్తకాన్ని వారసులు విడుదల చేయబోయే ముందు శాస్త్రి గారు పరమపదించారు.
శాస్త్రిగారు “కన్యాశుల్కం వీరేశలింగం రచనల మీద అభివృద్ధి రూపం” అన్న తన వ్యాసంలో ‘బ్రాహ్మ వివాహాము’కు కన్యాశుల్కంకు గల సారూప్యాలని సహేతుకంగా, కానీ మొహమాటపడుతూ వెల్లడించారు. ఆ మొహమాటం కన్యాశుల్కం మీద తన వ్యాసానికి బండి గోపాల రెడ్డి, కె వీ రమణా రెడ్డి ఇచ్చిన ఘాటు ప్రతిస్పందన ప్రభావం ఉన్నట్టుంది. తన నాటకం రాస్తున్నప్పుడు వీరేశలింగంగారి నాటకాన్ని చదవనే లేదని గురజాడ వారు అనగా ఆయన అప్పటికే చదివారని శాస్త్రి గారు ఋజువు చేసారు. ఆ సారూప్యాలను ‘సమాంతర భావార్థకాలు’ అన్నారు. శాస్త్రి గారు పండితులు.
రెండవ కూర్పు కన్యాశుల్కానికి వీరేశలింగం గారి బ్రాహ్మవివాహము, వ్యవహారాధర్మ బోధిని, వేశ్యాప్రియ ప్రహసనం, కౌతుకవర్ధిని మొదలగు రచనలు మూలం అని శాస్త్రి గారు అంటూ కన్యాశుల్కం ఆ పునాది పై సమున్నతంగా నిర్మించబడిన నాటక కళాసౌధం అని గిల్లి జోలపాడిన ధోరణి వ్యక్తం చేసుకున్నారు. ఆంగ్లంలో చెప్పుకోవాలంటే Willing to hurt, yet afraid to strike.
ప్రాంతీయ భాషలు, యాసలు ఆ రచనలలో లాగే నేడు హాస్యానికి వాడుకుంటే గొడవలవుతాయి. ఒక రాష్ట్రం ఏర్పడటానికి దాన్ని ఒక కారణంగా చూపించడం తెలిసిన విషయమే. ఆ భాష, యాస బ్రాహ్మలకు పరిమితమయినది కాబట్టి; రాసినవాళ్లు ఆ కులంవాళ్లే కనుక పేచీ లేకపోయింది. కన్యాశుల్కంలో ఉపయోగించిన భాషను మాత్రం చాలా కాలం నుంచే అక్కడి బ్రాహ్మలు మాట్లాడటం మానేశారు. బహుశా ఆ నాటకానికి ఎంతోకొంత ముందే బాల్యవివాహాలు ఆ కారణపు వైధవ్యాలు అంతరించడం జరిగింది. గురజాడవారు తన కులం caricaturing కు పాల్పడ్డారు. తద్వారా అందలం దక్కింది.
తన నాటకం “బ్రాహ్మ వివాహము” ను అనుకరించి రాసిన “కన్యాశుల్కం” తన రచనకన్నా పైమెట్టును ఆక్రమించడాన్ని గమనించిన వీరేశలింగం గారి స్పందన ఏమిటి? నాటకం చూస్తూ సంతోషించారట. ఆ విషయం వారు తెలియజేయలేదు; వేటూరి ప్రభాకర శాస్త్రి గారు గురజాడకు రాసిన ఒక లేఖలో తెలియజేసినారు తడికలా. బాండ్వెగన్ ఎఫెక్ట్ వేటూరి వారినీ వదలలేదు అనుకోవాలి. లేదూ వీరేశలింగం గారి మనోగతాన్ని వీరు ఔపోసన పట్టుండాలి. సంతోషించడమే నిజమయ్యుంటే, పంతులు గారిని మహాత్మా వీరేశలింగం అని పిలవాలి. మరి గురజాడ ఆబాల్యమిత్రుడు గిడుగు కన్యాశుల్కం గురించి ఏమనెను? ఏమీ అనలేదు. ఎందుకని? ఏటుకూరి ప్రసాద్ మాత్రం ఇలా అన్నారు: “వ్యావహారిక భాషోద్యమంలో కృషి చేస్తూన్న తనకు లక్ష్య రూపంలో సాగిన కన్యాశుల్క రచనను గురించి గిడుగు వ్యాసరూపంలో ప్రస్తావించిన దాఖలాలు ఎక్కడా కనబడ్డంలేదు. ఆశ్చర్యకరమైందీ — ఆలోచించాల్సిందే — ఈ విషయం.” అది నిజానికి అంత ఆశ్చర్యకరమైనది, ఆలోచించవలసినది కాదు. గిడుగు ఆ నాటకం చదివి ఆశ్చర్యపడి, ఆలోచించి మౌనం పాటించుంటారు. వారి వ్యావహారిక భాష కన్యాశుల్కంలో వాడినది కాదని తేల్చుకుని వుంటారు.
VI
గవర్నర్ జెనరల్ కర్జన్ 1901లో విద్యాసదస్సును జరిపి భారతీయ విద్యాస్థాయిని సమీక్షింప చేశాడు. 1903లో నిపుణుల సంఘం నియమించి దేశ భాషల ప్రగతిని పరిశీలించమన్నాడు. రెండేళ్లపాటు ఆ పని చేసి యూరపులో వృద్ధి పొందుతున్న ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని భారతీయ బాషలద్వారా సామాన్యులకు అందుబాటు చేయాలని నిపుణుల బృందం సిఫార్సు చేసింది. మతవ్యాప్తి, వున్నత విద్యను ప్రభుత్వ నియంత్రణలోకి తేవడం అసలు ఉద్దేశం. లార్డ్ నాథెనియల్ కర్జన్ ఒక క్రైస్తవ మత గురువు కుమారుడు. కల్లోలిత గిరిజనులను భయపెట్టడానికి వాయవ్య సరిహద్దు ప్రదేశ్‌ను సృష్టించాడు; బొంబాయ్ ప్రాంత కరువు కాలంలో ప్రభుత్వ బలవంతపు చర్యలను పర్యవేక్షించాడు; కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌ను “ధనిక స్థానికుల” వద్ద నుండి వసూలు చేసిన నిధులతో నిర్మించాడు; వంగదేశాన్ని రెండుగా విభజించాడు; రైతులను బెదిరించేందుకు నీటి పారుదల మీద ఒక కమిషన్ నియమించాడు; జాతీయవాదుల కదలికలను గమనించేందుకు పోలీసులను నియమించాడు; అధికారిక రహస్యాల చట్టాన్ని ఆమోదించాడు. కర్జన్ అనేక దృక్పథాల్లో మకాలేకు [Thomas Babington Macaulay (1800-1859)] సరిపోయే వారసుడిగా పరిగణించబడతాడు. ఉదాహరణకు, అతని విశ్వవిద్యాలయ విద్యపై నియమించిన సంఘాలలో యూరోపియన్ విద్యావేత్తలే ఉన్నారు మరియు అతను ఆమోదించిన చట్టం ద్వారా భారతదేశంలోని మొత్తం విద్యా వ్యవస్థను ప్రభుత్వం మరియు దేశమంతా వ్యాపించి ఉన్న క్రైస్తవ మిషనరీల ఆధీనంలోకి పంపించాడు; దీని ద్వారా మాకాలే లక్ష్యమైన – అభిరుచులు, అభిప్రాయాలు, నైతికత, మేధస్సుల లో యూరోపీయన్లలా ఉండే విద్యావంతుల భారతీయ వర్గాన్ని సృష్టించడాన్ని – కర్జన్ కచ్చితంగా సాధించాడు.
ప్రాంతీయ భాషా బడులు మిషనరీలు స్థాపిస్తున్నాయి వాళ్ళ బాధ పండితుల ఆధీనంనుంచీ భాషను విడిపించి పామరులకు దాన్ని అందించడం వలన వాడుక భాషలో వ్రాసిన తమ మతగ్రంథం ఎక్కువమందిలోకి వెళ్లి తమ మతంలోకి వాళ్ళను మార్చుకోడానికి ఉపకరిస్తుంది అని. వాడుక భాష అంటే సంస్కృతాన్ని వేరు చేసిన తెలుగు భాష అనుకుంటే పెద్ద తప్పుకాదు. సంస్కృతంపట్ల, దాన్ని పట్టుకుని వేళ్ళాడే బ్రాహ్మలు, హిందువుల పట్ల మిషనరీల వైఖరి ఏమిటో ముందే తెలుసుకున్నాము. తెలుగులో [నవ్వుపుట్టించే] వ్యావహారిక తెలుగు భాషలోకి పవిత్ర బైబిల్‌ను 1818 లో విశాఖపట్నం మిషనరీలు మతం మార్చుకున్న ఆనందరాయర్ అన్న తెలుగొచ్చిన మహారాష్ట్ర బ్రాహ్మడు సాయం చేయగా భాషాన్తరీకరణ జరుగగా మదరాసులో ముద్రితమయ్యింది. ఆ విషయాలు ఏట్స్ మనసులో లేవని ఎలా అనుకోడం? పైగా కర్జన్, మేకాలె, ఉద్దేశాలు తెలియని మూర్ఖుడు కాదు యేట్స్. తెల్లవాళ్లు మూర్ఖులు కాదు. వాళ్ళ మాటలకు గంగిరెద్దులలా తలూపేవాళ్లు మూర్ఖులు. ఎవరు ఆ బసవన్నలు అన్నది మరోసారి చెప్పడం అనవసరం.
ఆ నేపథ్యంలో వ్యావహారిక భాషా వాదం, గ్రాంథిక భాషా వాదం అంటూ తెలుగు భాషలో గొడవ తెచ్చిన కీర్తి లేక అపకీర్తి ముందుగా ఇద్దరికి దక్కుతుంది. ఒకరు అప్పుడే తమిళనాట పనిచేసి విద్యాధికారిగా విజయనగరం చేరిన J.A. Yates అన్నాయనకు, ఇక్కడ స్థరపడిన తమిళ సోదరుడు P.T. శ్రీనివాసయ్యంగార్ కి. ఇరువురూ కలిసి గురజాడను సంప్రదించి ఆయన సిఫారసు మీద గిడుగు వెంకట రామమూర్తి గారిని ముగ్గులోకి లాగారు. తెలుగు భాషకు ఏది మంచి, ఏది చెడు చేస్తాయి అన్నది తేల్చుకోవడం తెలుగు వారికి కాక మిషనరీ మనసున్న ఆంగ్లేయుడికి లేక తమిళనాట హృదయాన్ని ఒదిలి వచ్చిన తమిళుడికి బాగా తెలుసన్నమాట. ఆంధ్రులకు మదరాసులో పలు అన్యాయాలు జరుగుతుండటం, వాళ్ళు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఒకటే తమిళభస్మాసుర హస్తం నుంచీ రక్షణ కలిగించగలదు అని అప్పటికే ఆలోచిస్తుండటం శ్రీనివాస అయ్యంగారికి [ఆయన చరిత్రకారుడు కూడా] తెలియదని అనుకోనక్కరలేదు. తమిళులు, ఆంధ్రులు పోటీపడితే అయ్యంగార్ తనవాళ్లవైపే మొగ్గుతారని చెప్పడానికి సాక్ష్యం అక్కరలేదు. ప్రత్యేక రాష్ట్రం ఆలోచనలో తీవ్రంగా మునిగి వున్న ఆంధ్రులపట్ల ఎలాంటి వైఖరి [యెంత ఇక్కడ స్థిరపడ్డా] ఒక తమిళుడికి ఉంటుందో ఆలోచించవలసిన విషయం. ఆయన మాతృ భాష తమిళంలోలేని గుంజాటన ఇక్కడ తెలుగులో ఆరంభించాడు తెల్లవాడితో కలిసి. మదరాసులో పనిచేస్తున్నప్పుడు అక్కడా మాట్లాడే తమిళానికి రాసే తమిళానికి తేడా ఉండటం యేట్స్‌ను కలవరపెట్టింది కానీ తమిళులు తమిళేతరులు తమ భాషలో వేలుపెడితే ఆ చేతిని తీసి వేస్తారని తెలిసి అక్కడ మౌనం పాటించాడు. గ్రాంథికవాదుల ఉద్దేశంలో గ్రాంథిక, వ్యావహారిక భాషల తేడా ఆంగ్లంలో కూడా వుంది, జార్జ్ బెర్నార్డ్ షా పిగ్మాలియన్ అన్న నవలలో నాయిక చేత గ్రామ్యం మాట్లాడించడం గమనించవచ్చు. నాయకుడు ఆమెను తీర్చిదిద్ది శుద్ధ ఆంగ్లం ఇంగ్లీష్ నేర్పిస్తాడు, తెలుగువారు గురజాడవారి మాటలలో ‘వెధవాయిలు’ గనుక ఇక్కడ ఏమిచేసినా అది చెల్లుబడి అయింది. ఆ విషయాలు గ్రాంథికవాదులు లేవనెత్తిన దాన్ని పెద్దగా వ్యవహార భాషావాదులు పట్టించుకోలేదు. ప్రాచీనకాలం నుంచీ వ్యావహారిక భాషే రాయబడింది అది దారి తప్పడానికి వందేళ్లనాటి సాతాని వైష్ణవుడు చిన్నయసూరి గారి రెండు బూచీలు వ్యాకరణం, నీతిచంద్రికా అని తేల్చారు. సూరి గారి మార్గాన నడుస్తున్న వీరేశలింగం గారిని గిడుగు, గురజాడలాంటి పెద్దలు పరోక్షంగా బెదరగొట్టి తమ దారికి తెచ్చుకున్నారు. తాడు లాగుడు పోటీ [టగ్ అఫ్ వార్] లో ఎంతమంది బలమైన వాళ్ళను తమవైపు తెచ్చుకుంటే తాడు మొత్తాన్ని అటు లాగేసుకోవచ్చు. ఏది మంచిది, ఏది చెడ్డది అన్నది పక్కనుంచి ఏది భాషకు మేలుచేయున్నది తేల్చుకోవలసిందికి తెలుగు వాళ్ళు; అహానికి తావులేని చర్చల ద్వారా. కానీ అప్పుడే ఈ ప్రాంతానికి తమిళ నాట నుంచీ కొత్తగా విద్యాధికారిగా వచ్చిన Yates ఇక్కడ స్థిరపడిన తమిళ సోదరుడు శ్రీనివాసయ్యంగార్ కాదు. బోళా మనిషి, ఆవేశపరుడు, తన కుందేలుకు రెండున్నర కాళ్ళు అనే అరివీర భయంకరుడు గిడుగు రామమూర్తి గారిని ముగ్గులోకి లాగారు. వారు అవిశ్రాంతంగా 1940 లో మరణించేంత వరకూ పోరాడారు.
వ్యావహారిక భాషావాది శ్రీనివాస శిరోమణి మాటలలో చెప్పాలంటే “శ్రీనివాస అయ్యంగార్ బాగా పలుకుబడి కలవారు.” బడి పంతుళ్ళంతా స్కూళ్ళ ఇన్స్పెక్టర్ [పైగా తెల్లవాడు] ను ఎదిరించడం ఎందుకు అన్న ఉదాసీన వైఖరితో వున్నారు. ఆనందగజపతికి వ్యవహార తెలుగంటే మక్కువ.
శ్రీనివాస శిరోమణి ఆంధ్రపత్రిక [జనవరి 1940] వ్యాసంలో [“వ్యావహారిక భాషా వాదము”] మైలపడిపోవడము అన్న ఉపశీర్షిక క్రింద ఇలా అన్నారు: ఉపాధ్యాయవృత్తిలో ఆనాడు పనిచేస్తున్న పెద్దలు ఆ సంవత్సరము లోలోపల ఈ విధంగా ప్రచారం చేయసాగినారు: “యేట్స్ దొర తెల్లవాడు. శ్రీనివాస అయ్యంగార్ తెలుదేశములో ఉంటూ ఉన్న అరవవారు. శెట్టి మేష్టారు గారు [ఆనంద గజపతి బడిలో ఉపాధ్యాయుడు] జన్మతః విపరీతవాది. సరే [గురజాడ ఆనంద గజపతి కొలువులో ఉద్యోగస్థుడు] అప్పారావు పంతులు పైలా పచ్చీసు మనిషి. వీళ్ళు చేరి వెఱ్ఱిబ్రాహ్మణుడు వెంకటరామమూర్తిగారిని మైలపడవేసారు, వీరి సొమ్మేమిపోయింది, భాషాసాంకర్యముచేయ సంకల్పించారు. ఇదంతా దేశాంతరులూ తెలుగుభాషాజ్ఞానశూన్యులూ మన భాషకు ఉపద్రవము కలిగించబోతున్నారు.”
గిడుగు వారి మంకు పట్టుదల ఎలాంటిదంటే ముఖలింగమే కళింగపట్నం అని వాదిస్తూ తాను The Madras Journal of Literature and Science – 1894; page 68] లో రాయగా ఏవిధంగా ఆ వాదన తప్పో Prof. B.C. Bhattacharya [Journal of the Bihar and Orissa Research Society Vol.14, part III & IV., 1929 pp.623-634] వెల్లడి చేసి కళింగపట్నమే కళింగుల రాజధాని అన్నాడు. అక్కడ స్వల్పంగా తవ్వకాలు కూడా జరిపాడు. అయినా గిడుగువారు ముఖలింగమే కళింగుల ఒకప్పటి రాజధాని అని వ్యవహరిస్తుండేవారు. తన విద్యార్థి తాపీ ధర్మారావు బొట్టుపెట్టుకుని తరగతికి రాలేదని ఆగ్రహించడం, విశ్వేశ్వర రావు మీద కోపం కొలది పరీక్షకు కట్టించకపోవడం లాంటి పనులు చేసేవారు. ఆయనకు కొడుకు గిడుగు సీతాపతితోనే పడలేదు.
కన్యాశుల్కం రెండవ కూర్పు రాగా గ్రాంథికవాది కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రిగారు ‘ఆర్యమతబోధిని’లో ‘కన్యాశుల్కస్థ గ్రామ్యభాషా వాదన విమర్శనము’లో ఆ ‘రూపకం’ లేక ‘ప్రహసనం’ మీద విరుచుకుపడుతూ వ్యావాహారిక వాదాన్ని తీవ్రంగా విమర్శించారు [1911]. కేతవరపు శాస్త్రి గారికి ఇది ప్రేరకం అయుంటుంది. కన్యాశుల్కం భాషలాంటి భాషను పాఠశాలలలో బోధించాలని యేట్స్ అభిప్రాయమై ఉంటుందని వ్యంగ్యంగా అన్నారు. గ్రాంథికాన్ని పతివ్రతతోను వ్యవహార భాషను వేశ్యతోను పోల్చారు. ఆంగ్లభాషలో కూడా ఆ రెండు తేడాలున్నాయన్నారు. మూడు వంతులు రాజభాష ఆంగ్లం వ్యావహారిక తెలుగులో ఇప్పుడుందని, గతంలో తురుష్క పాలనలో వాళ్ళ భాష ఆ మేరకు తెలుగులో ఉండేదని అన్నారు. వావిలాల వాసుదేవ శాస్త్రిగారు రాసిన ఒక వ్యాసంలోని ఒక పేరాను ఉదాహరణగా ఇస్తూ దాంట్లోని తెలుగేతరపదాలు ఎన్ని వచ్చి చేరాయో చూపించారు, అందులో రమారమి ఒక తెలుగు పదానికి ఒక తెలుగేతరపదం జతకట్టింది. ఆంగ్లేయులు కూడా వాళ్ళ భాషను వ్యాకరణబద్ధంగా వాడుతుండటాన్ని ఆ భాషలో వ్యవహార, వ్యాకరణబద్ధమైన గ్రాంధిక భాషలుండటాన్ని తేటతెల్లం చేశారు. నిబద్ధతలేని వ్యవహారాన్ని విమర్శించారు. కన్యాశుల్కంలో గిరీశం వాడిన భాషను ఉటంకించి ఇలాంటి భాషనా కృష్ణదేవరాయలు దేశంలో తెలుగు లెస్స అనింది, ఇదా ది ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్? అని ప్రశ్నిస్తూ కన్యాశుల్కంలోని గిరీశం నోటివెంట ఆంగ్లపద భూయిష్టమైన భాషను ఉటంకించారు.
వీరి ఈ నాటకములో రెండువంతులకు పైగా ఇంగిలీషు వాక్యములను ఒక భాగమునకు పైగా తురకమాటలు మున్నగు నవియు గలవని శాస్త్రి గారన్నారు. అంతటితో గురజాడను వదలలేదు. 1. గురజాడ ఆంధ్ర వ్యాకరణాలు సుశబ్దములు అని బోధించిన పదముల కెచ్చటను బుద్ధిపూర్వకంగా చోటిచ్చినట్టు గాన్పించదు. 2. పదప్రయోగము కలమెట్లు పోయిన అట్లు పోయినది; యుక్తి, వరుస లేవు [ఉదాహరణలు ఇవ్వబడినాయి] 3. వ్యాకరణాలు పాటించకపోగా చదివేవాడికి చిక్కులు మాత్రం పెట్టారు అరసున్నాలు, శకటరేఫముల ద్వారా. అంటే అనవసరమైన చోటుల అవి కుప్పలుతెప్పలుగా వున్నాయి. దానినిబట్టి వారు అభిలషించే వ్యవహార భాష నుంచీ అవి తొలగిపోలేదు. 4, తెలుగు అక్షరమాలలో ఉచ్ఛారణమును తెలిపే అక్షరాలూ సరిపోలేదు అన్నారు. అంటే అవి సంస్కృతంలో యాభై, తెలుగులో ఆరు వున్నా సరిపోలేదు అనుకోవాలి. తెలుగులో ఆ ఆరు సరిపోకపోతే తురకలు, దొరలు, తెలుగు వారు తెలుగు భాషను ఉచ్చరించడానికి స్వరాలూ మొత్తం కలిపి వేనవేలగును గాన సంజ్ఞా సాగరం అవసరమవుతుంది. 5. జనసామాన్యం మాట్లాడే విధానంలో రాస్తే శబ్దశాస్త్రం నాశనమవుతుంది. నిజానికి ఆ శాస్త్రం తెలుగు భాషలో లేనేలేదని చెప్పవచ్చు, అలాంటప్పుడు ఒక ప్రామాణిక వ్యాకరణ వ్యవస్థ అంటూ లేకపోతే శబ్దశాస్త్రాన్ని తెలుగుకు ఎలా సృష్టించాలి? 6. వ్యావహారికం గ్రాంథికమయితే అది ప్రామాణికంగా ఉండక ప్రాంతాలనుబట్టి మారుతుంది. మాండలిక భాషల మధ్య అంత తేడా లేదని గురజాడ అనడం తప్పు. భేదముందని కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారే కాక, వావిలాల వాసుదేవ శాస్త్రి గారు కూడా అభిప్రాయపడ్డారు సోదాహరణంగా వివరిస్తూ. ఒక తావున దీర్ఘములు మెండు, మరొక తావున హ్రస్వములు హెచ్చు, వేరొకచోట అనునాశికాలు విశేషంగా వ్యక్తమవుతాయి. ఒక మాటకు ప్రాంతాలబట్టి అర్థం మారుతుంది 7. దేశీయాంధ్రములలో గ్రంథాలు రాస్తే సామాన్య గ్రాంథికం పుడుతుందన్న గురజాడ అభిప్రాయం తప్పు. దానివలన జరిగేది కొత్త భాష పుట్టటం 8. సామాన్యులు మాట్లాడేది గ్రాంథికమయితే కొత్తగా భాషలో నేర్చుకునేదేముంటుంది?
ఆ వ్యాసం కాశీభట్లవారు రాసినప్పుడు గురజాడవారు బ్రతికే వున్నారు కానీ దానికి సమాధానం ఇవ్వలేదు. గిడుగువారి నుంచీ కూడా సమాధానం వచ్చినట్టులేదు. గిడుగు మాత్రం ఒక సందర్భంలో ఇలా అన్నారు బ్రహ్మయ్య శాస్త్రి గారి గురించీ: “అల్పదోషమైనా కావ్యమందు సహించక విమర్శ చేసేటప్పుడు యముని కన్నా ఎక్కువ నిర్ ఘృణుడను పేరుపొందిన పండితుడు.”
A.D. Campbell తన “A Grammar of the Teloogoo Language” [1820] లో రాసిన ఈ క్రింది విషయాలు ఇక్కడ తెలుగులోకి తర్జుమాచేసి ప్రస్తావించడం అవసరం:
“తెలుగు సాహిత్యమంతా దాదాపుగా పద్య రూపంలోనే ఉంది. ఈ పద్యాలు భాషలోని ఒక ప్రత్యేకమైన, శుద్ధమైన (ఉన్నతమైన) శైలిలో రచించబడ్డాయి. అయితే, ఈ శైలి సాధారణ ప్రజల మధ్య రోజువారీగా ఉపయోగించే (సాధారణ లేదా సంభాషణాత్మక) భాషతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ కారణంగా, విద్యావంతులకే కాదు, తెలివైన పాఠకులకు కూడా, ఈ ఉత్తమ రచనలను సరైన విధంగా అర్థం చేసుకోవడానికి వ్యాఖ్యానాలు అవసరమవుతాయి. రెండు శైలుల మధ్య ఉండే ఈ భిన్నత తెలుగు భాషతో పాటు, తమిళం మరియు కన్నడ భాషలలో కూడా కనిపిస్తుంది.”
ఈ దొర రాసిన మిగతా విషయాలతోపాటు ఈ సందర్భంలో గమనించవలసిన అతి ముఖ్య విషయం తెలుగు కన్నా ప్రాచీనమైన తమిళం, కన్నడ భాషలలోనూ గ్రాంథికం, వ్యావహారికం వున్నాయి; కానీ తెలుగులోలా వ్యావహారిక ఉద్యమాలు లేవదీసి, యాగీ చేసి ‘గ్రాంథిక’ భాషను, ప్రాచీన సాహిత్యాన్నీ తరువాత తరాలవారికి దూరం చేయలేదు. ఉద్యమం అది బలవంతంగా తెచ్చిన మార్పు నష్టం చేసింది తెలుగు సాహిత్యానికి. పరిణామక్రమంలోనూ సామరస్యంగాను వచ్చిన మార్పులు తమిళ, కన్నడ భాషలకు ఎలాంటి నష్టం చేకూర్చలేదు, లాభం తప్ప. రెండు వేల సంవత్సరాలనాటి సంగం సాహిత్యాన్ని, అలనాటి భాషను నెత్తిమీద పెట్టుకుని గర్వపడతారు తమిళులు.
నేటికీ గురజాడ అందరివాడు కాలేదు. గురజాడకన్నా జాషువా నాకు దగ్గరివాడు; ఇరవై శాతం జనాభా వున్న దళితులకు ఒకమారుమూల ప్రాంత బ్రాహ్మణ జీవితాల చరిత్ర అక్కరలేదు అని ఒక మావోయిస్టు అన్నాడు. గురజాడ, కందుకూరితో మాకేమిటి సంబంధం అని సాటి తెలుగువాళ్లే అయినా తెలంగాణావాళ్ళు పన్నెండేళ్ల క్రితం అన్నారు. మీ తెలుగు వేరు, మా తెలుగు వేరు అని ఇంకా అంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యావహారిక భాషా ఉద్యమం ఎక్కడ నిలుస్తుందో!
“కన్యాశుల్కం-నూరేళ్ళ సమాలోచనం” సంపాదకత్వ బాధ్యతను చేపట్టిన ఏటుకూరి ప్రసాదు గారు అన్నారు: “ఈ సందర్భంలో; కన్యాశుల్కం మీద ఉత్తరాంధ్ర-సర్కారు ప్రాంతాలలో వచ్చినన్ని విమర్శనలు రాయలసీమలో రానట్టూ; అలాగే తెలంగాణా ప్రాంతాలలో చాలా తక్కువగా వచ్చినట్టు మా దృష్టికి వచ్చింది. కారణం బహుశా నాటకేతివృత్తమూ – సమస్యలు – భాషా కావచ్చు.” నిక్కచ్చిగా రాశారు. కమ్మూనిస్టులలో కూడా మహానుభావులుంటారు. దీని వలన అర్థం చేసుకోవలసినది కేతవరపు రామకోటి శాస్త్రిగారి తొలి వ్యాసంలో రాసినట్టు విశ్వజనీనత, సర్వకాలీనత ఈ నాటకానికి లేవు. ఏ వ్యావహారిక భాషను ఉద్ధరించే ప్రయత్నంగా భావిస్తూ వచ్చారో ఆ విషయంలో ఇది విఫలమయినట్టు.
Much Ado About Nothing!

