[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘చీకటి మాత్రమే నీ సొంతం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
అందం మీద అలిగితే
ఆదరించక ఆదమరిస్తే
అదీ ఇదీ అని చూడక
ఆదరా బాదరాగా
వయస్సు వచ్చి వెళ్ళిపోదా
దానికే బాదరబందీ లేవుగా
తొలి పొద్దు దాటాక
మలిపొద్దు ముంగిట
నిలిచి వగచినా ఏం లాభం
పోయిన రోజులు మళ్ళీ రావుగా
మకరందం చేదెక్కిన వేళ
వెనకటి అందం వెల వెల
గుండెలవిసి విలపించినా
చేరదుగా నిన్ను వసంతం
చీకటి మాత్రమే నీ సొంతం
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
