Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చీకటి వేళ

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘చీకటి వేళ’. రచన డా. మామిడాల శైలజ.]

కాశం నల్లటి మబ్బులతో నిండిపోయింది. ఏ క్షణంలోనైనా వర్షం కురిసేలా ఉంది. రహదారి పైన ఒక్కో కారు మాత్రమే అప్పుడెప్పుడూ దూసుకెళ్తూ మళ్లీ రోడ్డు ఖాళీగా మారిపోతోంది. గాలి బలంగా వీచినప్పుడు చెట్ల కొమ్మలు ఊగుతూ రోడ్డుకు అడ్డంగా పడుతున్నాయి. అలాంటి రాత్రి పంచమి తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తోంది. కారు వైపర్ల శబ్దం హార్ట్ బీట్‌లా వినిపిస్తోంది. అకస్మాత్తుగా ఫోన్ మోగింది. పంచమి కళ్ళల్లో సందేహం. ఇంత రాత్రి ఎవరు చేస్తున్నారు? స్క్రీన్ పై ప్రైవేట్ నెంబర్ అని చూపిస్తోంది. ఉత్కంఠతో ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆ వైపు నుంచి గంభీరమైన స్వరం “కారును వెంటనే బ్యాక్ సైడ్ తిప్పు లేకపోతే బతకవు..”

పంచమి ఒక్కసారిగా షాక్ తిన్నది. అంతా అయోమయంగా అనిపించింది. ఈ రాత్రి తనకు కాల్ చేసింది ఎవరు? ఎందుకలా హెచ్చరిస్తున్నారు?  “మీరు ఎవరు?” అని అడగబోయేలోపే రియల్ వ్యూ మిర్రర్ లో ఒక కారు కళ్ళు చెదిరే లైట్లతో మెరుస్తూ వస్తూ కనిపించింది.

అది వేగంగా తనను వెంబడిస్తోంది. మృత్యువు వెంబడిస్తున్న ఫీలింగ్. అంత ఏసీ గాలిలోనూ ఆమె నుదుటికి చెమటలు పట్టాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. వెనుక కారు మరింత దగ్గరికి వస్తోంది. గ్యాస్ పెడల్ నొక్కింది ఆమె కారు వేగం పెరిగింది.

ఫోన్లో మళ్ళీ ఆ స్వరం వినిపించింది. “భయపడకు నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు ఎడమవైపు వెళ్ళు అప్పుడు వాళ్ళు డైవర్ట్ అవుతారు”

“ఎవరు మీరు? నా నెంబర్ ఎలా దొరికింది?” పంచమి గట్టిగా అరిచింది .

“ప్రశ్నలు అడగడానికి ఇది సమయం కాదు. ముందు బతుకు. తర్వాత అన్నిటికీ సమాధానం ఇస్తాను”

పంచమి స్పీకర్ ఆన్ చేసి రెండు చేతులతో స్టీరింగ్ పట్టుకొని ఎడమవైపు మలుపు తిరిగింది. నిజంగానే వెనుక కొంత దూరం తప్పిపోయింది కారు. కానీ కొన్ని క్షణాల్లో మళ్ళీ వెంబడించడం మొదలుపెట్టింది.

వర్షపు జల్లులు మొదలయ్యాయి. రోడ్డుపై లైట్ల కాంతులు మెరుస్తున్నాయి. పంచమిలో టెన్షన్.

“ఎవరు వాళ్ళు? నా వెంట ఎందుకు పడుతున్నారు? నన్ను చంపితే వాళ్లకేమొస్తుంది?”

ఫోన్లో స్వరం మళ్ళీ వినిపించింది. “నువ్వు వెంటనే కారు కుడి వైపు ఉన్న గోదాంలోకి పోనివ్వు..”

“గోదాంలోకా ఎందుకు? నో నేను వెళ్ళను అసలు మీరెవరు?” భయం వేస్తున్నా గట్టిగా అంది.

“అరవకు. నువ్వు సేఫ్‌గా లేవు. ప్రస్తుతం నీ ప్రాణం పెద్ద ప్రమాదంలో ఉంది. అక్కడ మాత్రమే నీకు రక్షణ దొరుకుతుంది. కమాన్ టైం లేదు..”

వర్షం మరింత ఉధృతం అయింది. వైపర్లు రోడ్డు కనిపించేలా చేయడం కోసం కష్టపడుతున్నాయి. కారును రోడ్డుపై ఒక్క ఉదుటన పరుగు అందుకునేలా చేసింది పంచమి.

ఫోన్లో మళ్ళీ ఆ స్వరం “కుడి వైపు చిన్నరోడ్డు ఉంది. దాని గుండా తిరుగు గోదాం కనిపిస్తుంది. నా మీద నమ్మకం పెట్టుకో..” అంది ఆ అనామక స్వరం.

కారు మరింత దగ్గరగా వచ్చింది. పంచమి ఒక్క క్షణం కూడా ఆగకుండా కుడివైపు చిన్నరోడ్డు గుండా ఉన్న గోదాములోకి  కొద్దిగా తెరిచి ఉన్న గేట్స్‌ని గుద్దుకుంటూ లోపలికి పోనిచ్చింది. వెనుక కారులో ఉన్నవారు కన్ఫ్యూజ్ అవుతున్నట్లుగా వేగం తగ్గింది.

లోపల అంతా గాఢాంధకారం. ఏం చేయాలో అర్థం కాలేదు. కార్ డోర్ తెరిచి, వణుకుతూ బయటకు వచ్చింది. కాసేపటికి ఆ చీకట్లోంచి ఒక పొడవాటి ఆకారం దూరం నుంచి వస్తూ కనిపించింది. ముఖానికి సగం స్కార్ఫ్ కప్పుకున్న ఆ వ్యక్తి యొక్క కళ్ళు మాత్రమే మెరుస్తున్నాయి.

ఒక్కసారి శ్వాస ఆగిపోయినట్లు అయింది పంచమికి. తన గుండె కొట్టుకుంటున్న శబ్దం తనకే వినిపిస్తోంది. అంత చలిలోనూ చేతులకు చెమటలు పట్టేసాగాయి. ఆ ఆకారం నెమ్మదిగా దగ్గరకు వచ్చింది.

“ఎవరు మీరు? ఎందుకు నా దగ్గరకు వస్తున్నారు?” వణుకుతున్న స్వరంతో అడిగింది. ఆ మనిషి నెమ్మదిగా ముందుకు వచ్చాడు.

“మనం ఇక్కడి నుంచి వెంటనే బయటపడాలి. నాతో పద..”

“నీతో ఎందుకు రావాలి నేను అసలు ఎవరు నువ్వు?”

“ప్రొఫెసర్.  నీ ప్రాణం ప్రమాదంలో ఉంది. నువ్వు కూర్చున్న కారు మామూలుది కాదు. దాంట్లో ఉన్న ట్రాకర్ వాళ్లకు నీ లొకేషన్ చూపిస్తోంది. వాళ్లు ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు.”

పంచమి ఒక్కసారిగా విస్మయంతో చూసింది.

“వాళ్లు అంటే.. ఎవరూ? అసలు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు?”

ఆ మనిషి సైలెంట్‌గా ఉన్నాడు. అకస్మాత్తుగా గోదాం బయట టైర్ల స్క్రీచింగ్ వినిపించింది.

“వాళ్లు వచ్చారు!” ఆ మనిషి గట్టిగా అన్నాడు. “నీకు లైఫ్ కావాలంటే.. ఇప్పుడే నాతో రావాలి!”

భయంకరంగా వీస్తున్న గాలులకు గోదాం తలుపులు ఒక్కసారిగా బలంగా కొట్టుకున్నాయి.

పంచమి క్షణం వెనక్కి చూసింది. ఎవరో లోపలికి ప్రవేశిస్తున్న దృశ్యం. అతని కళ్ళు చీకటిలో వజ్రంలా మెరిసాయి.

“నమ్ము నన్ను.. లేకపోతే ఇది నీ చివరి రాత్రి!” అని అతను చెప్పాడు.

“నో నీతో రాను”

ఆ మనిషి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని గోదాం వెనుకనున్న గుప్త ద్వారం వైపు నడిచాడు.

బయట వర్షం మరింత ఉధృతం అయింది. పంచమి గుండెల్లో నిండుకున్న భయం లాగే.

“ఏయ్ ఆగు ఎవరు నువ్వు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు..” పది నిమిషాలు అతనితో పరిగెత్తిన అనంతరం శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుండగా అతని చేతిని విదిలించుకుంటూ అడిగింది పంచమి.

ఒక్కసారి ఆ పొడవాటి వ్యక్తి వెనక్కి తిరిగి చూశాడు. ఇంతవరకు వెంబడించిన వ్యక్తుల జాడ కనిపించలేదు. అతడు ఆమె చేతిని వదిలిపెట్టి గట్టిగా నిట్టూర్చాడు.

వెంటనే జేబులోంచి మొబైల్ తీసి “పది నిమిషాలలో జీప్ ఇక్కడ ఉండాలి” అన్నాడు.

“అసలు ఎవరు నువ్వు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అసలు ఏం జరుగుతోంది” గట్టిగా అంది ఏడుస్తూ.

“ముందుగా మనం ఒక పక్కకు వెళ్లి కూర్చుందాం. నీకు అన్ని వివరాలు చెబుతాను”

ఒక పాకలాగా ఉన్న ప్రదేశం వైపు నడుస్తూ అన్నాడు. “నో నేను రాను. ముందు చెప్పు నువ్వు ఎవరు? ఆ కారులో ఇంతవరకు నన్ను ఫాలో చేసింది నీ మనుషులేనా?”

“నా మనుషులైతే నిన్ను ఎందుకు కాపాడతాను. నేను లేకపోతే నువ్వు ఎప్పుడో చచ్చి ఊరుకునే దానివి..”

“ఏ స్టుపిడ్.. నేను అడిగినదానికి సమాధానం చెప్పు. ఈ అర్ధరాత్రి వేళ ఇదంతా ఏంటి? అసలు నువ్వు ఎవరంటే చెప్పవేం?”

ఒక్కసారి ఆ  వ్యక్తి కళ్ళల్లో ఎర్ర జీరలు మెరిసాయి. దవడ ఎముకలు గట్టిగా బిగుసుకున్నాయి.

పంచమి వైపు నకశిఖ పర్యంతం సూటిగా చూశాడు. తడిసిన బట్టల్లో జుట్టు చెదిరిపోయి ముఖం మీద పడుతూ అవయవ సౌష్టవం స్పష్టంగా తెలుస్తూ ఆమె అందం దిగ్విణికృతంగా ఉంది.

 “నేనెవరో కావాలి నీకు అంతే కదా..?”

“అవునూ..” గట్టిగా అంది.

“నేను నీ మొగుణ్ణి..” సీరియస్ గా వచ్చింది మాట.

ఒక్కసారిగా చెయ్యెత్తి అతన్ని కొట్టబోతూ అంది “ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా దొంగ రాస్కెల్.. సిగ్గుందా అసలు నీకు ఒక అమ్మాయితో ఇలా మాట్లాడడానికి”  ఒడుపుగా తప్పించుకొని ఆమె చేయిని గట్టిగా పట్టుకొని “నువ్వే కదా అడిగావు ఎవరని..?”

ఇంతలో జెట్ స్పీడ్‌తో ఎర్ర కారు వచ్చి ఆగింది. పంచమి అరుస్తున్నా పట్టించుకోకుండా ఆమె చేయి పట్టి లాగి వెనక డోర్ తెరిచి అందులోకి తోసి ఆమె పక్కన కూర్చున్నాడు.

“కమాన్ కిషోర్ ఫాస్ట్” అన్నాడు డ్రైవర్ను ఉద్దేశించి.

రైట్ సైడ్ ఉన్న డోర్ ఓపెన్ చేసి దిగడానికి ప్రయత్నించింది పంచమి. ఆమె రెండు చేతులు గట్టిగా బిగించి పట్టుకున్నాడు అతను.

శాయశక్తులా  విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. “హెల్ప్.. హెల్ప్” అని అరవసాగింది!

“ఓసి దుర్మార్గురాలా..! నేను నిన్ను కాపాడి తీసుకొస్తుంటే నా నుంచే హెల్ప్ కావాలని అడుగుతున్నావా? నువ్వు మామూలు దానివి కాదే..”

కాసేపు అరిచి మరేం చేయలేక గమ్మున ఉండిపోయింది పంచమి. వేగంగా వెళుతున్న కారులో గాలి శబ్దం, గుండె మోత తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. కిషోర్ డ్రైవ్ చేస్తున్న కారు వర్షపు చుక్కలను చీల్చుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. అతడు తన చూపు పంచమిపై నుంచి తిప్పలేదు.

ఊహించని విధంగా పంచమి తన ఎడమ చేతి ఎత్తి అతని ముఖానికి ఉన్న ముసుగును తొలగించడానికి ప్రయత్నించింది.

ఆమె చేతిని తప్పించుకొని ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు.. “నీ ఎంకమ్మ.. మొగుణ్ణి చూడాలని అంత తహతహగా ఉందానే నీకు.. చూద్దువులే కాసేపాగు.. వాతావరణం రసవత్తరంగా ఉంది. కిషోర్ గాని లేకపోతే ముఖమేo కర్మ అన్ని చూపించేవాడిని” అన్నాడు నవ్వు గొంతుతో..

“యు షట్ అప్ డర్టీ రాస్కెల్” చెయ్యి విసిరింది అతని చెంప మీద.

ఆందోళన నటిస్తున్న స్వరంతో అన్నాడు “అయ్యో నీ చేతికి ఏం కాలేదు కదా డార్లింగ్.. అసలే నీది చాలా సున్నితమైన హస్తం”

కిషోర్ వింటున్నాడేమోనని ముందుకు చూస్తూ అన్నాడు కానీ ఆ హోరు గాలిలో అది అసాధ్యం అనిపించింది.

“నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదిలేయండి.. నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తా!” పంచమి గట్టిగా అంది.

నవ్వాడతను గట్టిగా..

“పోలీసులకా? వాళ్లలో సగం వాళ్లవాళ్లే ఉన్నారు. దొంగలనే రక్షించమని ప్రాధేయపడినట్టుంది నీ కథ.. కాసేపు గమ్మునుండు మాట్లాడకుండా” కసిరాడు.

పంచమి కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి.

“ప్లీజ్ చెప్పు వాళ్ళు ఎవరు? ఎందుకు నా వెంటపడుతున్నారు?”

 గట్టిగా శ్వాస పీల్చి వదిలాడు.

“అది నేను ఇప్పుడు చెప్పలేను. కానీ ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకో. నీ ప్రాణం నాకు అప్పగించు, లేదంటే ఈ రాత్రి నీ చివరి రాత్రి అవుతుంది.”

పంచమి అతన్ని కోపంగా చూసింది.

“నిన్నుఎందుకు నమ్మాలి? నువ్వు కూడా వాళ్లలో ఒక్కడై ఉంటావేమో?”

“సరే కాసేపు అలాగే అనుకో డియర్”

“నువ్వు మంచి వాడివైతే నా నుండి ఎందుకు దాక్కోవాలని ప్రయత్నిస్తున్నావు?”

సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. అతన్ని క్రీగంట గమనించింది పంచమి.

ఒక్క క్షణం అతని బాడీ లాంగ్వేజ్ చాలా హుందాగా అనిపించింది ఆమెకి. ఏదో వింత ఫీల్ కలిగింది. ఎప్పుడో దూరమైనది నెమ్మది నెమ్మదిగా దరిచేరుతున్న భావన. అతని కళ్ళలో కనిపించిన ఆ జ్వాల, ఆ నిశ్శబ్దమైన బాధ వెనుక ఏదో నిజం దాగి ఉందని అర్థమైంది.

కారు ఒక విడిగా ఉన్న ఫార్మ్‌హౌస్ ముందు ఆగింది. లోపల డీజిల్ జనరేటర్ శబ్దం. గేట్లు ఆటోమేటిక్‌గా తెరుచుకున్నాయి.

“ఇక్కడ సేఫ్ హౌస్ ఉంది. నువ్వు ఈ రాత్రి ఇక్కడే ఉంటావు.”  అన్నాడు.

“నేను ఎక్కడా ఉండను. నా ఇంటికి వెళ్తా!”

“సరే వెళ్తావా వెళ్ళు ఈ చీకట్లో, ఈ వర్షంలో శత్రువులు నిన్ను వెంటాడుతుంటే ఎలా వెళ్తావో చూద్దాం..”

ఆమెను వదిలేసి తీరిగ్గా టవల్తో తుడుచుకుంటూ అన్నాడు.

స్కార్ఫ్ తొలగిపోయి అతని ముఖం కొవ్వొత్తుల వెలుగులో రివీల్ అయింది. కొనదేలిన ముక్కు.. చక్కని మీసకట్టుతో హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. అంతలోనే అపరిచితుడులా తోస్తోంది. ఒక్కసారిగా ఏదో స్ఫురించినట్లుగా పంచమి షాక్ అయ్యింది.

“నువ్వు నువ్వు.. వి.. వి..”

“వి.. వి.. వి కాదు విక్రమ్..” ఆమె వైపు తిరిగి సూటిగా చూస్తూ అన్నాడు.

“నువ్వేంటి ఇక్కడ? పాముకు పాలు పోసినట్లు.. మా నాన్నగారు ప్రియ శిష్యుడు అని నిన్ను చేరదీసి అన్ని రహస్యాలు చెబితే ఆయనకే ద్రోహం చేశావు కదా? ఇన్నాళ్లకు మళ్లీ నా ముందుకు ఎందుకు వచ్చావు.. మా నాన్నను నువ్వే చంపేసావు కదా! నన్ను కూడా చంపేద్దామనా?” ఏడుస్తూ అంది.

విక్రమ్ నిశ్శబ్దంగా కిటికీ వైపు చూశాడు.

“మీ నాన్నగారిని నేను ఏమి చేయలేదు. అతన్ని హత్య చేసిన వారే ఇప్పుడు నిన్నూ వెంటాడుతున్నారు. ఎందుకో నాకు కూడా తెలియదు. వాళ్ల వల్ల నీకే కాదు నాకు కూడా ప్రమాదం ఉంది. అందుకే నిన్ను ఇలా తీసుకొచ్చాను”

పంచమి హృదయం గజిబిజిగా అయిపోయింది. అతని మాటలు నమ్మాలా వద్దా అర్థం కాకుండా పోయింది. ఏదో తెలియని అస్పష్ట వలయంలో చిక్కుకుపోయి దిక్కుతోచనట్లుగా అనిపించింది ఆమెకి.

విక్రమ్ ముందుకు వచ్చి, ఆమె జుట్టులో చిక్కుకున్న నీటి బిందువును తీసి నెమ్మదిగా అన్నాడు:

“నేను చెప్పేవి నమ్ము పంచమి. ఇప్పుడు నీకు అదే మంచిది”

“మా నాన్న ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయారు. అయితే అది నిజంగా మర్డరా? నాన్నగారిని వాళ్లు చంపేశారా?” ఒక్కసారిగా సోఫాలో కుప్పకూలిపోయింది.

పంచమి మెదడు షార్ట్ సర్క్యూట్ అయ్యింది.

“నాకు వాళ్లకు కావలసింది ఏమీ తెలియదు. దాని కోసం నా ప్రాణం తీస్తారా వాళ్లు?”

విక్రమ్ ఆమె చేతిని పట్టుకున్నాడు.

“నేను ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు. ఏ క్షణాన ఏ ఆపద వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాము. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో..”

ఆ స్పర్శలో ఏదో వింత నమ్మకం, భద్రత పంచమిని ఆవరించింది. మనసు కాస్త కుదుటపడింది. నిశ్చింతగా కళ్ళు మూసుకోబోతుండగా..

ఇంతలో బయట సైరన్లు మోగాయి. విక్రమ్ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు.

“వాళ్లు ఇక్కడకి కూడా వచ్చారు. మనం వెంటనే వెళ్ళిపోవాలి.”

పంచమి భయంతో అతని చేతిని పట్టుకుంది.

విక్రమ్ ఆ క్షణం ఆమె కళ్ళల్లోకి చూసి కాస్త సాఫ్ట్‌గా నవ్వాడు.

“నిన్ను వదిలే ప్రశ్నే లేదు. ఇక నుంచి నువ్వు ఎక్కడికైనా వెళ్తే నేను నీతోనే ఉంటాను.”

ఇద్దరూ మళ్లీ కారులోకి ఎక్కారు. రోడ్డుపై వర్షపు నీటిలో లైట్ల ప్రతిబింబాలు కదులుతూ, ఆ రాత్రి మరింత భయానకంగా కనిపిస్తోంది.

పంచమి హృదయం భయంతో కొట్టుకుంటున్నా, ఒక మూలలో చిన్న ఆశ, మెరుపు.  విక్రం తనను రక్షిస్తాడన్న నమ్మకం.. ఇన్నాళ్లు తన తండ్రికి ద్రోహం చేసి పారిపోయాడు అనుకున్న మనిషి ఇప్పుడు తన పక్కనే ఉన్నాడు అదీ తనకు రక్షణగా..

కారు వేగంగా వెళ్తున్నా పంచమికి సమయం ఆగిపోయినట్లనిపించింది.

వర్షపు చుక్కలు గాజు మీద జారుతూ చారలు ఏర్పరుస్తున్నాయి. లోపల ఒక్క క్షణం కూడా నిశ్శబ్దం లేదు . ఆమె గుండె చప్పుళ్లు, విక్రమ్ లోతైన శ్వాస, బయట కురుస్తున్న వాన శబ్దం అన్నీ కలిసిపోయాయి.

ఫార్మ్‌హౌస్ చేరుకున్నాక లోపలికి అడుగుపెట్టగానే, పంచమి వెనక్కి తిరిగి తలుపు మూసింది.

“ఇక్కడ సేఫ్ అన్నావు కదా.. కానీ నాకు ఇంకా నమ్మకం రావడం లేదు.”

విక్రమ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు.

“నమ్మకమంటే ఒక్క రోజులో రాదు పంచమి. కానీ నీ గుండె చెప్తున్నది విను. ఇప్పుడే ఇక్కడ నుంచి పారిపోతే వాళ్లు నిన్ను చంపేస్తారు.”

విక్రమ్ కొన్ని క్షణాలు సైలెంట్‌గా ఆమె ముఖం చూస్తూనే ఉన్నాడు.

“నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా! నాకోసం నీ ప్రాణాల మీదికి ఎందుకు తెచ్చుకుంటున్నావు?”

“ఎందుకంటే.. నేను ఎంతగానో ప్రేమించే నా గురువు గారి కూతురివి నువ్వు.. ఆయనను నేను అందరికంటే ఎక్కువ గౌరవించాను. నాతో ఆయన అన్న చివరి మాట ఏమిటో తెలుసా? నా కూతుర్ని కాపాడు”

“మా నాన్నగారు నువ్వు తనకు ద్రోహం చేశావు అనుకున్నారు కదా?”

“అనుకున్నారు నన్ను దూరం పెట్టారు విశ్వాసఘాతకుడు అన్నారు.. జన్మలో నాకు కనబడకు అన్నారు. కానీ నేను వినలేదు. తల్లిదండ్రులు లేని నన్ను చదివించిన ఆయనే నా సర్వస్వం అనుకున్నాను. ఆయన కొట్టినా, తిట్టినా చీదరించుకున్నా ఆయనే నా దైవం అనుకున్నాను. శత్రువుల నుంచి ఆయనను కాపాడాలని సర్వశక్తులా ప్రయత్నించాను. నా జీవితాన్ని ఫణంగా పెట్టడానికి సిద్ధపడ్డాను. అయితే దురదృష్టవశాత్తు ఆయన చివరి క్షణాల్లో నిజం తెలుసుకొని క్షమాపణ కోరారు. నీ బాధ్యతను నాకు అప్పగించారు”

“మరి నువ్వు ఇన్నాళ్లు ఏమైపోయావు?”

“అవన్నీ ఇప్పుడు చెప్పే సమయం లేదు. ముందు వాళ్ళు నిన్ను ఎందుకు వెంటాడుతున్నారో దాని నుంచి ఎలా కాపాడుకోవాలో  ఆలోచించాలి.”

వెలుపల మెరుపు చెలరేగింది. ఆ వెలుతురులో ఇద్దరి ముఖాలు ఒక్క క్షణం ఒకరికి ఒకరికి అతి దగ్గరగా కనిపించాయి. ఆ క్షణం పంచమి గుండె వేగంగా కొట్టుకుంది.

వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉంది. రోడ్డు చివర పొడవాటి వీధిదీపం కింద నీళ్లు జారుతూ మెరుస్తున్నాయి. విక్రమ్ లైటర్ వెలిగించి ఒక కొవ్వొత్తి వెలిగించాడు.

ఆ కాంతి క్రమంగా గోడల మీద చిమ్ముతూ పాత ఫ్రేములు, వాడిపోయిన గోడపెయింట్, పై అంతస్తు మెట్లు అన్నీ భయంకరంగా కనిపించాయి.

పంచమి తడి దుస్తులతో వణుకుతూ సోఫాలో కూర్చుంది. విక్రమ్ దగ్గరికి వచ్చి తన జాకెట్ ఆమె భుజాల మీద వేసాడు. ఒక్క క్షణం రొమాంటిక్ నిశ్శబ్దం. ఆమె శ్వాస అతనికి వినిపించింది. బయట మేఘాలు గర్జించాయి.

అకస్మాత్తుగా తలుపు దగ్గర ఒక శబ్దం. కొవ్వొత్తి మెలికలు తిరుగుతూ చీకటిలో ఆరిపోయింది. పై అంతస్తు నుంచి ఏదో కూలిపోయిoది, గాజు ముక్కలు చెల్లాచెదురయ్యాయి.

పంచమి గుండె బలంగా కొట్టుకుంది.

“విక్రమ్.. ఎవరో ఉన్నట్టుంది!” విక్రమ్ ఆమె చేతిని బిగించి పట్టుకున్నాడు.

“అది గాలి అయి ఉంటుంది..” అని అన్నాడు కానీ, అతని ముఖంలో కూడా ఏదో భయం తళుక్కుమన్నట్టు కనిపించింది.

మెట్లపై నుండి మెల్లగా చినుకుల్లా రక్తపు చుక్కలు కింద పడుతున్నాయి.. ఇద్దరూ నిలబడి చూసారు.. ఒక పాత ఫోటో ఫ్రేమ్ రక్తంతో తడిసి నేలపై ఉంది.

పంచమి మెట్లపైకి ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది. ఆమె గుండెలో గట్టిగా కొట్టుకుంటున్న శబ్దమే ఇంటి నిశ్శబ్దాన్ని చెరిపేస్తోంది. విక్రమ్ ఒక్కసారిగా ఫ్లాష్‌లైట్ ఆన్ చేసి పైకి వెళ్ళాడు.

“ఇక్కడే ఉండు పంచమి.. నేను చూసి వస్తాను.”

“లేదు నేనూ వస్తా.” ఆమె చేతి అతని చేతిలో మరింత బిగుసుకుంది.

ఇద్దరూ మెట్లపైకి నడుస్తూ పై అంతస్తులోకి వెళ్ళగానే గది తలుపు తెరిచి ఉంది. లోపల ఒక వ్యక్తి నేలపై పడివున్నాడు. అతని గొంతు కోసిన గాయం నుంచి రక్తం ఇంకా కారుతూనే ఉంది.

పంచమి వెనక్కి పడబోతూ విక్రమ్ భుజం పట్టుకుంది.

“ఓహ్ మై గాడ్.. ఇతడిని ఎవరు ఇలా చేశారు?”

విక్రమ్ కళ్ళల్లో షాక్ మరియు కోపం రెండూ తళుక్కుమన్నాయి.

“ఎవరైనా ఇక్కడ ఉన్నారు, పంచమి! మనం ఒంటరిగా లేము.”

ఒక్కసారిగా గాలి కిటికీ మూసేసింది.

గోడ పక్కన ఒక కాగితం గాలిలో ఎగిరి వారి కాళ్ల దగ్గర ఆగిపోయింది. విక్రమ్ దాన్ని తీసుకొని చదివాడు.

“ఇది ప్రారంభమే.. మిగతావారు కూడా చనిపోవాలి. రక్తానికి రక్తం.”

పంచమి వణికిపోయింది.

“మిగతావారు అంటే ఎవరు విక్రమ్? ఎవరు చనిపోవాలి?”

విక్రమ్ ముఖంలో ఒక్కసారిగా ఏదో విచిత్రమైన మార్పు వచ్చింది.

అతను నేరుగా పంచమి కళ్లలోకి చూస్తూ అన్నాడు:

“నేను అనుకున్నదే నిజమవుతోంది. ఇది ఏదో పాత ప్రతీకారం కథ.”

“మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా విక్రం నాకు చాలా భయమేస్తుంది. ఇద్దరూ వెనుతిరిగి రెండు అడుగులు వేశారో లేదో దూరం నుంచి పంచమి వైపు దూసుకొస్తున్న కత్తి లిప్తపాటులో మిస్సై విక్రమ్ భుజానికి గుచ్చుకుంది..

ఒక్కసారిగా అరిచి నిలదొక్కుకొని “పంచమి నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు కిషోర్‌ని తీసుకొని ఎటైనా వెళ్ళిపో.. లేకపోతే నీ ప్రాణాలే పోతాయి..”

“నో విక్రమ్. నేను ఒక్కదాన్నే వెళ్ళను నిన్ను ఈ స్థితిలో వదిలేసి. అయినా ఎవరు ఎవరి ఇదంతా చేస్తున్నారు ఎందుకు మా నుంచి దాక్కుంటున్నారు. దయచేసి బయటికి రండి కావాలంటే నన్ను చంపండి అంతేగాని ఇలా చీకట్లో ఉండి పిరికిపందల్లాగా దెబ్బతీయకండి..”

విక్రమ్ గుచ్చుకున్న కత్తిని బలవంతంగా బయటికి తీసి విసిరేసి  గాయాన్ని చేతితో పట్టుకున్నాడు.

“ఎవడ్రా నువ్వు? దమ్ముంటే బయటికి రా! ఎదురుగా ఉండి పోరాడు ఇలా దొంగ దెబ్బ తీయడానికి సిగ్గులేదు..”

వెంటనే కురుచగా, బలంగా ఉన్న ఒక వ్యక్తి వాళ్ల ముందు దూకి లాఘవంగా పంచమి జుట్టు పట్టుకొని ఆమె మెడకు కత్తిని ఆనించాడు.. పంచమి భయంతో, బాధతో గట్టిగా ఆర్తనాదాలు చేసింది. ఆ భవనమంతా ఆమె అరుపులతో దద్దరిల్లిపోయింది.

“ఏయ్ ఆగు.. తనని ఎందుకు చంపాలి అనుకుంటున్నావు అసలు ఏంటి నీ బాధ ఎవరు నువ్వు?”

అప్పటికే పంచమి గొంతు నుంచి రక్తపు చుక్కలు కత్తి మొనగుండా జారుతూ కింద పడుతున్నాయి.

“నిన్ను చంపే ముందు ఎందుకు చంపుతున్నానో తెలియాలి కదా! రోహిత్ గుర్తున్నాడానే నీకు.. వాడిని పదిమంది ముందు అవమానించి అందరూ అసహ్యించుకునేలా చేసి కాలేజీ నుంచి వెళ్లగొట్టావు కదా! వాడి భవిష్యత్తునే నాశనం చేశావు. ఆ బాధతో వాడు ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకుముందు చచ్చినవాడు నీకు అనుకూలంగా సాక్ష్యం ఇచ్చినవాడు.. ఇక ఇప్పుడు నీ వంతు..” కర్కశంగా నవ్వుతూ అన్నాడు.

“ఏమిటి రోహితా? నేను అతడు చనిపోతాడని అనుకోలేదు. లేకపోతే అలా చేసి ఉండే దాన్ని కాదు నన్ను వదులు.”

“చివరిగా నీ ఇష్ట దైవాన్ని స్మరించుకో. ఇవే నీ ఆఖరి క్షణాలు. కత్తి ఆమె గొంతులోకి దిగబోతుండగా..”

విక్రమ్ ఒక్కసారిగా పైకి ఎగిరి ఆ వ్యక్తి గుండెల మీద తన్నాడు. కత్తితో సహా దూరంగా ఎగిరిపడ్డాడు అతను.

వెంటనే లేచి విక్రంతో కలపడ్డాడు. విక్రమ్ అతని దాడి నుంచి తప్పించుకుంటూనే అతన్ని నిలువరించడానికి ప్రయత్నిస్తున్నాడు. చివరికి అతని రెండు చేతులను వెనక్కి విడిచి పట్టుకొని ఇప్పుడు

“చెప్పు పంచమిని ఎందుకు చంపాలి అనుకుంటున్నారు అసలు ఈ గ్యాంగ్ అంతా ఎవరు?”

“మర్యాదగా చెప్పు. లేకపోతే సాక్ష్యం కూడా లేరు ఎవరు ఇక్కడ క్షణాల్లో చేస్తావు..”

“నేను చచ్చినా పర్వాలేదు. కానీ నేను చనిపోయే ముందు నా తమ్ముడు చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. దాన్ని చంపి కానీ చావను నేను..”

“నో రోహిత్‌ని నేను చంపలేదు. అతడు నా మొబైల్ నుంచి నా పర్సనల్ మ్యాటర్ దొంగిలించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అన్ని డిలీట్ చేయమని నేను మంచిగా చెప్పాను. ప్రాదయపడ్డాను వినలేదు దాంతో డిసిప్లినరీ కమిటీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది”

“వాడి బంగారు భవిష్యత్తుతో ఆడుకున్నావు కదే! నీకు భవిష్యత్తు లేకుండా చేస్తేనే నా తమ్ముడి ఆత్మకు శాంతి.”. కిషోర్ తెచ్చిన తాడుతో అతని రెండు ఫెడరెక్కలను విరిచి కట్టాడు విక్రమ్.

తర్వాత విపరీతంగా రక్తం స్రవిస్తున్న విక్రమ్ భుజానికి కట్టు కట్టారు.

“చూడు చెప్తోంది కదా! తను కావాలని చేయలేదు అనుకోకుండా నీ తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడు. మర్యాదగా ఆమెను వదిలిపెట్టు లేకపోతే నువ్వు కూడా నీ తమ్ముడు దగ్గరికే పోవాల్సి వస్తుంది” గట్టిగా అన్నాడు విక్రమ్.

అందరూ మెట్లు దిగి వస్తుండగా.. హఠాత్తుగా కట్టేసిన చేతులను విడిపించుకొని కత్తితో పంచమిని వెనక నుండి పొడవబోయాడు అతను కానీ వెంట్రుక వాసిలో మిస్ అయ్యి ఒక్కసారిగా రెండంతస్తుల నుంచి కిందికి పడిపోయి అక్కడే ఉన్న పెద్ద రాతి బొమ్మకు తల గుద్దుకొని ఫౌంటెన్ లా రక్తం విరజిమ్ముతుండగా కింద పడిపోయి కాళ్లు చేతులు కొట్టుకోసాగాడు అతను..

“ఓ షిట్, కమాన్ కిషోర్ మనం ఇక్కడ ఉండడం వద్దు. తొందరగా కారు బయటకు తీయి” అన్నాడు.

కారు అర కిలోమీటరు నడిచిందో లేదో వెనకనుంచి బీఫ్ మంటూ సౌండ్ లతో వాహనాలు వెంబడించడం మొదలుపెట్టాయి.

“మై గాడ్.. మళ్లీ ప్రమాదంలో ఉన్నాము. అసలు రోహిత్‌కు సంబంధించిన వాళ్ళు చంపాలని చూస్తున్నారు అతని అన్న చనిపోయాడు కదా మరి వీళ్ళు ఎవరు? వీళ్ళు ఎందుకు మనల్ని అటాక్ చేయాలని చూస్తున్నారు?”

“ఏమో విక్రం నాకు ఏమీ అర్థం కావడం లేదు.. ఇప్పుడు ఏం చేద్దాం?”

వెనుక వస్తున్న రెండు కార్లలో ఒక కారు సర్రుమని వచ్చి ముందుకు ఆగింది. దాన్ని చిన్నగా గుద్దుతూ ఆగిపోయింది కిషోర్ నడుపుతున్న కారు. ముసుగులు వేసుకున్న ఇద్దరు మనుషులు ఇద్దరు పంచమిని లాక్కుపోయి తమ కారులో వేసుకొని స్టార్ట్ చేశారు.

“కిషోర్ వెంటనే ఆ కారు ఫాలో అవ్వు” అరిచాడు విక్రమ్.

తెల్లవారింది వర్షం ఆగిపోయింది.. ప్రకృతి నిశ్శబ్దంగా ఊపిరి తీసుకున్నట్టుగా అనిపించింది.

ఎదురుగా కాళ్లు చేతులు కట్టి వేయబడి ఉన్న రోహిత్‌ని చూస్తూ

“అంటే రోహిత్.. చనిపోలేదా?”

ఇన్స్పెక్టర్ దయాకర్ తల ఊపాడు.

“చనిపోలేదు కానీ చనిపోయాడు అనుకొని దర్యాప్తు చేయకముందే ఫైల్ మూసేశారు. అతను కొందరి పెద్ద తలకాయల నేరాన్ని బయటపెట్టబోతున్నాడు. అందుకే వాళ్లు అతన్ని కిడ్నాప్ చేశారు. అతనితో చివరిగా మాట్లాడిన వ్యక్తివి నువ్వు. అందుకే నిన్ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.”

“అయితే నేను చేసినదేమిటి?”

“అదే ఇప్పుడు తెలుసుకోవాల్సింది. అన్నట్లు నిన్ను కార్లో హెచ్చరిస్తూ ప్రొటెక్ట్ చేసింది ఎవరో తెలుసా?”

“అవును ఎవరు? నా పట్ల అంత కన్సర్న్ ఎవరికి ఉంది?”

“నేనే.. మీ నాన్నగారికి ఆత్మీయ నేస్తాన్ని. అతను ఎప్పుడూ నాకు చెబుతూ ఉండేవాడు. నా కూతురు పైన ఒక కన్నేసి ఉంచు ప్రమాదంలో ఉంది అని. రోహిత్ ఫైల్ ద్వారా నీకు వాళ్ల ద్వారా ప్రమాదం ఉందని తెలుసుకొని నిన్ను ట్రాక్ చేస్తూ ఉన్నాను”

“అవునా ఇంకా ఏం చెప్పారు మా నాన్నగారు?”ఉద్విగ్నంగా అడిగింది. “అవన్నీ చాలా కాన్ఫిడెన్షియల్ ఇక్కడ మాట్లాడే విషయం కాదు”.

అప్పుడే వాళ్లు ఉన్న ఫ్యాక్టరీ బయట హారన్ శబ్దం, లైట్లు. ఎస్సై దయాకర్ తుపాకీ తీసుకున్నాడు.

మరో అపరిచిత యువకుడు లోపలికి వచ్చాడు. అతనికి సూటిగా గన్ గురి పెట్టి “ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు?”

“నా పేరు సమీర్. రోహిత్‌తో కాలేజీలో చదివాను. అతడు ఆత్మహత్య ప్రయత్నం చేసిన రాత్రి నేనూ అక్కడే ఉన్నాను.”

“నా ల్యాప్‌టాప్‌లో, మెయిల్‌లో రోహిత్ చివరిసారి పంపిన మెసేజ్ ఉందని నాకు ఏదో రహస్యం తెలుసని రోహిత్తో పాటు వాళ్ళు నన్ను బంధించారు”.

“వాళ్లు అంటే ఎవరు?”

“ఏమో నాకు తెలియదు వాళ్ల గొంతు తప్ప వాళ్ళని ఎప్పుడూ చూడలేదు”

దయాకర్ పిస్టల్‌ను కొంచెం కిందకు దించాడు.” ప్రతిరోజు రోహిత్ దాచిన ఫైల్ కు సంబంధించి వివరాలు చెప్పమని నన్ను వేధిస్తున్నారు. నిజం చెప్పలేకపోయాను. మమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్న వాళ్లు చాలా శక్తివంతులు. ఇప్పుడు కూడా ఎవరో మనల్ని గమనిస్తున్నారు”

దయాకర్ అనుమానంగా చూసాడు.

“అయితే ఇప్పుడేం మారింది? ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చావు?”

సమీర్ కళ్ళలో ఒక వింత ప్రకంపన.

“ఎందుకంటే ఈ రాత్రి వాళ్లు రోహిత్‌ను చంపేస్తారు. దయచేసి మమ్మల్ని రక్షించండి..”

దయాకర్ కాసేపు ఆలోచించాడు. పంచమి మనసులో యుద్ధం నడుస్తోంది  రోహిత్‌ పట్ల తన గిల్టీ ఫీలింగ్, భయం, కోపం అన్నీ కలగాపులగంగా కలిసిపోయాయి.

“ముందు నీ వద్ద ఉన్న అన్ని ప్రూఫ్స్ చూపించు. మేము నిన్ను నమ్మగలమా లేదా తెలుసుకోవాలి.” సమీర్ తన జేబులోంచి ఒక పెన్‌డ్రైవ్ ఇచ్చాడు. “దీనిలో సీసీటీవీ ఫుటేజ్ ఉంది. రోహిత్ చనిపోలేదని దీనితో బయట ప్రపంచానికి నిరూపించవచ్చు.”

దయాకర్ పెన్‌డ్రైవ్ తీసుకొని తన ల్యాప్‌టాప్‌లో పెట్టాడు. స్క్రీన్‌పై రాత్రి 2 గంటలకు తీసిన వీడియో కనబడింది. రోహిత్ యూనివర్శిటీ హాస్టల్ రూఫ్‌పై నిలబడి ఉన్నాడు. కానీ అతడు జంప్ చేయక ముందే ఎవరో బలవంతంగా అతడ్ని లాగిపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

తుపాకి చేతిలో పట్టుకున్న దయాకర్ ప్రతి మూలను లైట్‌తో పరిశీలించాడు.

రోహిత్ ముఖం బలహీనంగా ఉన్నా కళ్ళలో భయం, ఆశ కలగలిపి ఉన్నాయి. సమీర్ అతడిని విడిపించబోతుండగా, ఫ్యాక్టరీలో ఒక్కసారిగా బలమైన లైట్లు వెలిగాయి. వెనుక తలుపులు మూసుకుపోయాయి.

ఒక గంభీరమైన నవ్వు గాల్లో మార్మోగింది. పంచమి వెనక్కి తిరిగి చూసింది

అక్కడ నిలబడి ఉన్నవాడు… దయాకర్‌ బాస్, కమిషనర్ నారాయణ్!

“వెల్డన్ మిస్టర్ దయాకర్,” అతడు చల్లగా అన్నాడు.

“మేము ఇన్నాళ్లు శ్రమించినా లభించని సమాచారాన్ని మాకు అందించారు.”

దయాకర్ షాక్ అయ్యాడు.

“సర్… మీరు? ఇక్కడ ?కానీ ఎందుకు?”

నారాయణ్ కళ్ళలో చల్లని కాంతి.

“రోహిత్ ఒక ఫైల్ దొంగిలించాడు. నాకు సంబంధించిన మరియు కొందరు మంత్రుల అవినీతి సీక్రెట్ డాక్యుమెంట్స్. అవి బయటకు వెళ్తే  అందరి గేమ్ అయిపోతుంది.”

పంచమి ఒక్క క్షణం స్థంభించింది.

“అంటే… రోహిత్ తప్పు చేయలేదు కదా? అతడు నిజం బయటపెట్టడానికి ప్రయత్నించాడు కాబట్టి మీరే అతడ్ని చంపాలని చూశారా?”

“అవును చాలా బాగా తెలుసుకున్నారే?”

“మరి పంచమిని ఎందుకు వెంటాడుతున్నారు ఎందుకు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చారు?” గట్టిగా ప్రశ్నించాడు  దయాకర్.

 “ఈ ప్రపంచాన్ని నా హస్తగతం చేసుకునే అవకాశం కల్పించే వాళ్ల నాన్నగారి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయో ఆమెకు తెలుసు కాబట్టి”

అతడు గన్ ఎత్తబోయేలోపే దయాకర్ తన గన్ అతడిపై గురి పెట్టాడు.

“సర్, ఇది న్యాయం కాదు. మీరు చట్టానికి రక్షకుడు. కానీ మీరు స్వయంగా నేరస్థుడిగా మారారు.”

సమీర్ రోహిత్‌ని పట్టుకుని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ నారాయణ్  కోపంతో రగిలిపోయాడు.

“ఇక్కడినుంచి ఎవరూ బయటకు వెళ్లరాదు!”

అప్పుడే బయట నుండి సైరన్లు వినిపించాయి. దయాకర్ ముందే సీక్రెట్‌గా రీన్ఫోర్స్‌మెంట్ పిలిచాడు. పోలీసులు ఫ్యాక్టరీలోకి చొచ్చుకువచ్చారు. నారాయణ్‌ను అరెస్ట్ చేశారు.

పంచమి దగ్గరకు వచ్చి రోహిత్ ఆమె చేతిని పట్టుకున్నాడు.

“మీరు నన్ను రక్షించారు మేడం. మీ పట్ల నేను చేసిన దానికి నన్ను క్షమించండి. ఇక మిగతావన్నీ నేను బయటపెడతాను.”

ఫైల్ మొత్తం పరిశీలించాక ఎస్సై దయాకర్ పంచమితో “మీ డాడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమైందో తెలుసా? దేశ స్థితిగతులనే మార్చగల సత్తా దానికి ఉంది. దానిని ప్రభుత్వానికి అప్పగించాలని మీ నాన్నగారు ఆశించారు. దానిని తమ సొంతం చేసుకోవడం కోసం శత్రువులు అతన్ని చంపేశారు. కానీ చివరికి వచ్చే వరకు అది వాళ్ళ చేజారింది”

పక్కనే ఉన్న సిఐ గారు అన్నారు “అవును. కానీ ఆయన కనుగొన్న ఫార్ములా.. మిలియన్ల విలువ చేస్తుంది. వాళ్లు అనుకున్నది ఇప్పుడు ఆ ఫార్ములా నీ దగ్గర ఉందని. ముందు మనం చేయాల్సింది ఆయన రీసెర్చ్ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కనుక్కోవాలి లేకపోతే..”

అప్పుడే కిషోర్‌తో సహా ఎంటర్ అయ్యాడు విక్రమ్. “సార్ ఆ వివరాలు నా దగ్గర ఉన్నాయి. అభి రహస్యంగా నాకే అర్థం కాకుండా ఆయన నాకు పరోక్షంగా అందించారు. ఆ విషయానికి సంబంధించిన ఉత్తరం నేను చాలా రోజులకు చదివాను.”

“రండి మిస్టర్ విక్రమ్. మీరు పంచమి నాన్నగారికి ప్రియ శిష్యుడని విన్నాను. కానీ ఆయనకు నమ్మకద్రోహం చేసి దేశo వదిలిపెట్టి పోయారని అంతా అనుకున్నారు. మళ్లీ మిమ్మల్ని ఇదే చూడడం”. సిఐ రామనాద్ అన్నారు.

“ఆయన ప్రాణాలను నేనే హరించానని పోలీసుల వేట మొదలుకాగానే నేను తప్పించుకోవాలని ట్రై చేశాను. ఎందుకంటే నేను నిరపరాధిని అని చెప్పడానికి నా దగ్గర ఏ సాక్షాలు లేవు. అదే సమయంలో దుబాయ్‌లో ఉన్న నా చెల్లికి ప్రాణాపాయం కలగడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి ఈ మధ్యనే ఇండియాకి వచ్చాను. అప్పుడు నాకు ఈ ఉత్తరం మా గురువుగారి పేరు మీద లభించింది.”

దానిని అందించాడు.

“ప్రియమైన విక్రం. నువ్వు ఏ నేరము చేయలేదు. అనవసరంగా అర్థం చేసుకొని నిన్ను బాధ పెట్టాను. నీ మంచితనం నిజాయితీ హుందాతనం నాకు చాలా నచ్చాయి. అలాగే పంచమి మీద నీకు మనసు ఉందని కూడా నేను గ్రహించాను. అయితే ముందుగా నా రీసెర్చ్ ప్రాజెక్టు గురించి చెప్తాను. అది ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుల చేతికి చిక్కకూడదు. దేశ అభివృద్ధికి మాత్రమే దానిని వినియోగించాలి. నేను ఇస్తున్న ఈ కోడ్ నెంబర్ ఆధారంగా ఉన్న లాకర్లో దానిని భద్రపరిచాను. దానిని దేశ ప్రయోజనాలకు ఉపయోగపడేలా చేసే బాధ్యత నీదే. అలాగే నా ఏకైక కూతురు నా చిన్నారి తల్లి పంచమిని కూడా ఆమెకు ఇష్టమైన పక్షంలో నీ జీవిత భాగస్వామిగా చేసుకోవాలని కోరుతున్నాను. ఇదే నా చివరి కోరిక అనుకో ఆశీస్సులతో..”

“వావ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ థాంక్యూ సో మచ్ మిస్టర్ విక్రమ్. సంఘవిద్రోహకశక్తులకు అందకుండా దానిని జాగ్రత్తగా మాకు అప్పగించావు వెల్డన్”

“విక్ర మ్ నువ్వు మా నాన్నగారి రీసెర్చ్ ప్రాజెక్టు ఎక్కడ ఉందో తెలియదని నాతో అన్నావు? ఎందుకని అబద్ధం చెప్పావు?”

“అప్పుడు నువ్వు నన్ను నమ్మే పరిస్థితులలో లేవు పంచమి. మీ నాన్నగారి హంతకుడిగా నా మీద నీకు మంచి అభిప్రాయం లేదు. అలాంటప్పుడు ఏది చెప్పినా నువ్వు అపార్థం చేసుకుంటావని”

రోహిత్ నారాయణ అవినీతి కుంభకోణాలను బయటపెట్టే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశాడు.

“ఇన్నాళ్లు నేను చనిపోయానని అందరూ అనుకున్నారు. కానీ నారాయణ నన్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినా నేను ఈ డాక్యుమెంట్స్‌కు సంబంధించిన వివరాలను చెప్పలేదు. ఇప్పుడు వీటిని మీ ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాను. వాళ్ళకి ఎలాగైనా శిక్ష పడేలా చేయండి.. ప్లీజ్..”

“రోహిత్ నువ్వు నా బెస్ట్ స్టూడెంట్ అనిపించుకున్నావు. మొదట్లో ఆకతాయిగా ప్రవర్తించినా బాధ్యత తెలుసుకొని అవినీతి తిమింగిలాలను చట్టానికి పట్టించావు. గుడ్ గోయింగ్” భుజం తట్టింది పంచమి.

స్టేషన్ నుంచి బయటికి వచ్చారు పంచమి, విక్రమ్. ఆమె తన ఇంటికి పోవడం కోసం టాక్సీ బుక్ చేస్తుంటే “పంచమి వేరే టాక్సీ ఎందుకు కారులో వెళ్దాం పద అవుట్ సైడ్‌లో నీ కారు భద్రంగా ఉంది. దానిని హ్యాండోవర్ చేసుకుందువు కానీ” అన్నాడు విక్రమ్ .

“పర్వాలేదు విక్రమ్ నేను వెళ్లగలను. నీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా నాన్నగారి సీక్రెట్ డాక్యుమెంట్ను జాగ్రత్తగా పోలీసులకు అప్పగించినందుకు. అంతేకాకుండా నా ప్రాణాలకు నీ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడినందుకు.”

“థాంక్యూ మేడంగారు. కానీ మీ నాన్నగారి మరొక చివరి కోరిక మిగిలిపోయింది” అన్నాడు

“చివరి కోరికా ఏంటది? “

“ఏంటా మనిద్దరం ఇలా వేరు వేరు గమ్యాలలో కాకుండా ఒకే దిశగా కలిసి పయనించాలని.. బలవంతం ఏమీ లేదు నీకు నచ్చితేనే..”

బుగ్గలు ఎర్రగా అవుతుండగా “మా నాన్నగారి ఆఖరి కోరిక అదే అయినప్పుడు దానిని నేను ఎలా కాదనగలను?”

“అంటే గురువుగారి కోరిక కోసం మాత్రమేనా నేనంటే ఇష్టం లేదా?”

“ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది. నువ్వే చెప్పావు కదా నిన్న”. తలవంచుకొని అంది.

“ఏమని?”

“నా మొగుణ్ణి అని..”

పెద్దగా నవ్వుతూ రెండు చేతులతో పంచమిని దగ్గరకు లాక్కొని గుండెకు హత్తుకున్నాడు విక్రమ్.

Exit mobile version