[యం. ధరిత్రీ దేవి గారు రచించిన ‘చీకటిలోనే చిరుదివ్వె వెలుగులు..’ అనే కవితని అందిస్తున్నాము.]
కోయిలగానం మధురం.. ఆ స్వరం ఓ అద్భుతం..!
‘కుహూ కుహూ రాగం’తో..వన్నెలొలుకు వసంతం!
వినిపిస్తే చాలు మదిని ఆహ్లాదపు చిరుజల్లే !
స్వ.. పర భేదమెంచక పంచునే గానామృతం..
గాయనీమణులు గానకోకిలలంటూ
ప్రస్తుతింపబడుదురే..!! మరి…
ఆ కోయిలమ్మ రంగేమిటి.. నలుపు..!!
కాకిని మించిన స్నేహశీలి ఇలపై గలదా..!?
మనిషిలో లేని మానవత్వం కాకికే సొంతం కాదా!
కాలజ్ఞాని.. సాక్షాత్తు శనిదేవుని వాహనం..
సర్వభక్షకి.. సమైక్యతావాది.. సులక్షణాల గని..
పరోపకారి కాకమ్మకు అంతఃసౌందర్యం అపారమే
గతించిన పూర్వికులకిది వారధి..!!
మరి.. ఆ కాకమ్మ రంగేమిటి..!? నలుపే కదా!
గుడిలో నిత్యపూజలందుకుంటూ..
వరాలిచ్చే ‘దేవుళ్ళూ’ కొందరు నల్లనివారే!!
అందవిహీనులైనా అవనిని మహోన్నతులై..
చరితార్థులై.. చరిత్రపుటలకెక్కి.. ధ్రువతారలై
కీర్తింపబడుతూ ఇల నిలిచిన కారణజన్ములు
ఎందరో.. ఎందరెందరో.. మన ఎదర..
అదిగో.. అదిగదిగో.. కనలేరా..!!
పైపై మెరుగులు పరమార్థమని భ్రమపడకు..
రూపం కాదు గుణం ప్రధానమని మరువకు..
మనసుకు అంటిన మాలిన్యం తుడిచెయ్యి..
ఉన్నత విలువలకు పీఠం వెయ్యి…
కాకమ్మ.. కోయిలమ్మ నేర్పే పాఠం వల్లెవెయ్యి..
నలుపన్న ఏహ్యభావమేలనోయి..!
చీకటి రంగు నలుపే.. అయితేనేమి…
చిరుదివ్వె వెలుగులు విరజిమ్మేది
చిమ్మచీకటిలోనే..! కాదా మరి..!!
యం. ధరిత్రీ దేవి విశ్రాంత అధ్యాపకురాలు. వీరి కవితలు, కథలు, వ్యాసాలు కొన్ని ప్రింట్ పత్రికల్లో, అంతర్జాల పత్రికల్లో ప్రచురింపబడినవి.
