[వెటకకవి రచించిన ‘ఛెళ్పీక’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“ఏదో ఒకటి చేయకపోతే లాభం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మన మనుగడ మట్టిపాలై పోతుంది” అంది బొద్దింక.
మురుగ్గుంటల, చెత్త, పెంటకుప్పల, కుళ్ళిన శవాలలో పుట్టి, పెరిగి ప్రపంచమంతా అనారోగ్యాలను, అనర్ధవ్యాధులను విస్తరింపచేసే తిన్న ఇంటి వాసాలను లెక్కించే జీవులన్నీ సమావేశమయ్యాయి.
“ఎన్నోచేశాం.. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రతి ప్రయత్నం వాళ్ళని మరింత శక్తిమంతులను చేస్తున్నది”. విషాదంగా అందొక బొద్దింక.
“నేపాల్లో పాపాలపాపడ్లు వేయించుకున్నాం. బంగ్లాదేశ్లో మన బంగాళా దుంపలనుడికించాం. శ్రీలంకలో రావణకాష్టం వెలిగించాం. ఇంకా ఎన్నెన్నో చిన్న చిన్న దేశాలలో మన వన్నెచిన్నెలెన్నో విజయవంతంగా ప్రదర్శించాం. కానీ, ఇక్కడే మన చెత్త కాలటం లేదు. ఇప్పటికే మన అరణ్యాల కన్నల వెన్నులు విరిచారు. ప్రజల కళ్ళు తెరిపించారు. మన లౌకిక మాటల ఆటల కోటలను బీటల బాటలు పట్టించారు. ఇప్పుడు మన విదేశీ విధ్వంసక నిధుల, మాదక ద్రవ్య ధన రవాణా మార్గాలను మూసేయబోతున్నారు. మన మాదక ద్రవ్యాల వ్యాపారానికి తిలోదకాలిచ్చేప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇట్లా అయితే, దేశంలో మురుగు నురగ వరద బురద పొర్లకపోతే మన మనుగడ ఏమైపోతుంది? మనం ఎలా బ్రతకాలి? కులం, మతం, ప్రాంతం వంటి ద్వేషాలతో దేశాన్ని తుక్డే తుక్డేలేలా చేయాలి? ఏదో ఒకటి చేయకపోతే లాభం లేదు. మన చేతులకు తడి అంటకుండా దేశాన్ని హింస వరదలో ముంచెత్తి చేతకాని ప్రభుత్వాన్ని చెత్తలో పారేస్తే కానీ చెత్తలోనే బ్రతికే మనకు ఉన్నత పదవి దక్కదు” ఊపిరి పీల్చుకునేందుకు ఆగిందింకో బొద్దింక.
“ఎన్నికల్లో గెలవలేము. మూర్ఖప్రజలంతా అంధభక్తులైపోయారు. కాబట్టి తెలివిఎక్కువ బొద్దింకలే మనకు శరణం. బొద్దింకలే అల్లకల్లోలం సృష్టించాలి. ప్రభుత్వం పనికిరానిదని నిరూపించాలి. దేశమంతా అగ్గిపెట్టి గుగ్గిలం వేసి తగులబెట్టాలి. ఇదంతా జరగాలంటే, మనం పకడ్బందీ పథకం వేయాలి. ఈసారి పొరపాటు గ్రహాపాటు వల్ల కూడా జరగకూడదు“. హెచ్చరించిందింకో ఎర్ర బొద్దింక.
“మనకొక కారణం దొరకాలి” ఆలోచిస్తూ అందొక డబ్బురంగు బొద్దింక.
“కారణం దొరకదు. దొరకబుచ్చుకోవాలి. అంతకు ముందే మన వారినందరినీ సిద్ధంగా వుండమని చెప్పాలి.”
ఆ మాట పూర్తికాకమునుపే బొద్దింకలన్నీ బిజీ అయిపోయాయి.
ఏసీల్లో కూర్చుని అమాయకులకు ఆయుధాలిచ్చి అడవులకు పంపే పట్టణాల్లో పచ్చగా ఉండే బొద్దింకలు తమ ఆంటెన్నాతో ఆంటేన్నా కలిపే బొద్దింకల మూకలకు ఫోన్లు కలిపేయి. తుక్కుహక్కుల బొద్దింక లాయర్లు, పిక్కబలమున్న టక్కరిబొద్దింకలు, టక్కుటమార విద్యలు తెలిసిన నటి బొద్దింకలు, నట బొద్దింకలు, తుంటరి బొద్దింకలు, విప్లవ వాంతి చేసుకునే బొద్దింక కపులు, విప్లవం విసర్జించే విసర్జిత బొద్దింకలు, వాంతిని కప్పుల్లో పట్టుకుని నాట్యం చేసే మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల బొద్దింకలు, విసర్జితలే బలవర్ధకాలయిన చదువుల్లేని చదువు బొద్దింకలు, డబ్బులిస్తే బూతులుకక్కే బూతుబొద్దింకలు… ఇలా దేశం నలుమూలలా ఉన్న బొద్దింకలకు సమాచారమందింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి.
ఇంతలో ఎప్పటిలాగే చెట్టెక్కిన బేతాళుడిని చెట్టు దింపి భుజం మీద వేసుకుని మౌనంగా నడుస్తున్న విక్రమార్కుడికి దారిలో అలసట తెలియకుండా ఉండేందుకు కథ చెప్పేందుకు బేతాళుడు నోరు విప్పాడు.
అతడి నోట్లోంచి మాటల బదులు బొద్దింకలొచ్చాయి, ఎప్పటిలాగే!
అంతే, “చలో ఢిల్లీ! అబ్ ఢిల్లీ దూర్ నహీ” అని విదేశం నుంచి దేశాన్ని ఉద్ధరించేందుకు ఒక ఒంటరి బొద్దింక ఎగిరి దేశానికి వచ్చింది.
“బేతాళుడి నోట్లోంచి బొద్దింకలు రావటమేమిటి, నాన్సెన్స్.. ఇంత అన్యాయం భరించలేను. ఈ దేశపు ప్రజలంతా, ఈ ఇరవయ్యొకటవ శతాబ్దంలో కూడా ఇంకా మనుషుల్లాగా ఉండటం ఏమిటి, అంతా బొద్దింకల్లాగే అయిపోవాలి. కృణ్వంతో విశ్వం బొద్దింకమయం..” అని అరిచిందా బొద్దింక.
వెంటనే లుకలుకలాడుతూ ‘తుక్డే తుక్డే తుక్డే’ అని పాడుతూ ‘డఫ్లీ వాలే డఫ్లి బజా, యెదేశ్ కో కరేంగే తుక్డే తుక్డే” అని అరుస్తూ డఫ్లీ బొద్దింకలు వచ్చేశాయి.
“ఆజాదీ ఆజాదీ ఆఆఆఅజాఆఅదీఈఈఈ” అని అరుస్తూ, ఏం ఆజాదో, ఎందుకు ఆజాదో తెలియక అర్థం కాని సమాధానాలను వల్లెవేసే అనర్ధ అజాదీ బొద్దింకలొచ్చేశాయి.
“మేరే ఉమర్ కే నౌజవానో, ఇధర్ ఆవో వో దివానో” అని పాడుతూ, నడివయసు, ముది వయసు నగరనక్షాల నులిపురుగుల బొద్దింకలు, తమ పిల్లలను భద్రంగా పరదేశాలకు పంపి ఇక్కడి పిల్లలను బొద్దింకలుగా చేసేందుకు కంకణం కట్టుకుని వచ్చేశాయి. గతంలో అమాయకుల చేతులకు తుపాకులిచ్చి అడవులకు, తమ పిల్లల చేతులకు సూట్కేసులు ఇచ్చి అమెరికాకూ పంపిన అపారమైన అనుభవమీ నగరనక్షా బొద్దింకలది.
ఇలా, దేశం నలుమూలల నుంచి ప్రతి పనికిరాని ఉద్యమంలో పాల్గొనే ఆందోళన జీవ బొద్దింకలు పరుగు పరుగున వచ్చి చేరాయి. వస్తూ తమతో పాటూ చెత్తనూ, మురికినీ, మురుగునూ, దుర్గంధాన్నీ, వైరస్ లనూ, విష క్రిములనూ వెంటబెట్టుకుని వచ్చి విస్తరింపచేశాయి. ఇదే అదనుగా తాము సైగ చేస్తే, సగం దేశాన్ని హింసతో అల్లకల్లోలం చేయగల నేర బొద్దింకలూ రంగ ప్రవేశం చేశాయి. ఎక్కడ అల్లకల్లోలమయినా, ఆశతో బురదను కెలికి తిండిని తీసుకునే మెధావి రచయిత బొద్దింకలు ” మేమున్నామ”ని నిండుగ పలుకుతూ, బుడబుడా వచ్చేశాయి.
ఇప్పుడు వాటికి ఒక్క శవం కావాలి.
శవం దొరికితే చాలు, శవాన్ని ఊరేగిస్తూ దేశానికి నిప్పుపెట్టాలన్నది పథకం.
“నువ్వు చావు”, నువ్వు చావు” అని ఒకరినొకరు చచ్చిపొమ్మన్నాయి.
ఒక బక్రా బొద్దింకకు, రహస్యంగా తిండి పెడుతూ “నువ్వు ఛావవు, శవం దొరకదు, నిలిచిపోయే ఈ ఉద్యమం” అని ఏ రోజు కారోజు, “రాలిపోయే బొద్దింకా, నీకు తిండి ఎందుకే?” అని ఏడుస్తూ నాలుగుపూటలా ఆ ఏడ్పుతో మరింత తింటూ శవం కలలు కనసాగాయి బొద్దింకలు.
ఆ తిండి సరిపోని బక్రా బొద్దింక “నేను తినటంలే, మీరెందుకు తింటారు. నా కడుపు మండితే, మీ కడుపెందుకు నిండాలీ? నాకింకా ఉద్యమంతో పనిఏముంది? ఐ కేర్” అని పొట్ట చేత పట్టుకుని ఫోన్ చేసి మరీ పోలీసుల దగ్గరికెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకుంది.
ఇంతలో చిన్న చితకా, స్త్రీలింగ, పుల్లింగ, నోలింగ, తీవ్రవాద, శూన్యవాద, ధూర్తవాద, శుష్కవాద, శుకపికశారికసూకరభీకరవాదాల బొద్దింకలన్నీ వచ్చేశాయి.
తమ దుర్గంధాన్ని వెదజల్లటం ఆరంభించాయి. అడ్డూఅదుపూ లేకుండా, సిగ్గూఎగ్గూ లేకుండా, మర్యాదమన్నన అన్నది లేకుండా, అదురూ బెదురూ లేకుండా, పెద్దచిన్నా అన్నది లేకుండా, కన్నూమిన్నూ కానకుండా, వాళ్ళు మనుషులు కాదు పశువులే అన్న రీతిలో, పశువులు, క్రిమి కీటకాలు సైతం సిగ్గుపడే రీతిలో దుర్భాషల దుర్గంధాలను వెదజల్లుతూ, దూషణమే భూషణము, అదే నవనవయువత ఘనత, అదే నవనవలాడే నవయువతకు గుర్తింపు, అదే అభ్యుదయమభివృద్ది అదే అదే బరితెగించిన విప్లవ ప్రగతిగతి అన్నట్టు ప్రవర్తించారు.ఇంతలో ” దేదే లైక్ దే, లైక్ దే రే, ముఝే లైక్ దే, నా రీలు రీచ్ పెంచి, సబ్స్క్రయిబ్ చేసి, ధూం ధాం చేసే లైక్ దేరే” అని పాడుతూ, రీల్ బొద్దింకలొచ్చేశాయి. ” వ్యూసు కోసం ఏమైనా చేస్తాం” అని ఏది మాట్లాడితే అందరూ చప్పట్లు కొడతారో, అందిన డబ్బులకు న్యాయం చేస్తూ అలాంటి మాటలే మాట్లేడేయా లైకుల మైకం బొద్దింకలు
ప్రభుత్వం ప్రశాంతంగా చూస్తూండటం వల్ల ఇక శవం దక్కేట్టులేదనీ, తామే అల్లకల్లోలం సృష్టించి,రక్షకభటులు రక్షణ కోసం కాల్పులు జరిపి తమకు శవం అందిస్తారని ఆశ పడ్డాయి బొద్దింకలు, రాళ్ళను మిసయిళ్ళుగా విసురుతూ. కార్లను కుళ్ళబొడిచాయి బొద్దింకలు.
ఇదంతా చూస్తూ ప్రభుత్వం వారికి శవాన్ని దక్కనివ్వద్దని పట్టుదల పట్టింది కానీ, తమను నమ్మి తమకు అధికారమిచ్చిన ప్రజలీ బొద్దింకల భయంకర సర్కస్ చూస్తూ అగ్రహోదగ్రులవుతున్నారనీ, ప్రభుత్వ సంయమనం, మౌనం చేతకాని తనంగా అర్థం అవుతున్నదనీ గ్రహించలేదు.
ఇంతలో, దేశంలోని ఇతర ప్రాంతాలలో బొద్దింకలు బయటకు వచ్చి “చక్కనయ్యా చందమామా ఒక్క శవమియ్యీ, శవంలేక, ఏం తోచక, బిక్కుమంటున్నామూ” అని వికృత తాండవం ఆరంభించాయి.
ఇక తామే శవాన్ని సంపాదించాలని శవాల తయారీ స్పెషలిస్టులయిన శవాల బొద్దింకలకు సౌంజ్ఞ చేశాయి నాయక బొద్దింకలు. విచ్ఛిన్నకర శక్తులు రెట్టించిన ఉత్సాహంతో రాళ్ళు, రప్పలు, చిప్పలు, కప్పులూ, కర్రలూ, రాతి పర్రెలూ తీసుకుని రంగంలో దూకాయి.
దేశంలో బొద్దింకలతో పాటూ చేతులు కలిపిన ఇతర చేతకాని విచ్ఛిన్నకర శక్తులు విలయతాండవానికి సిధ్ధమవసాగాయి. ఎక్కడ విధ్వంసం ఉంటే, అక్కడ ముందు ప్రత్యక్షమవుతాయీ విధ్వంసకర బొద్దింకలు.
ప్రభుత్వం బొద్దింకల ముందు తలవంచింది. సింహం అనుకున్నది, గర్జించే బదులు పిల్లికూత పెట్టి చల్లగా కూర్చుంది.
బొద్దింకలు సంబరాలు ఆరంభించాయి.
ఇదంతా చూస్తున్న ప్రజల ఆగ్రహం హద్దులు దాటింది. తాము ఎన్నుకున్న ప్రభుత్వం, విదేశం నుంచి వచ్చిన బొద్దింక ముందు మోకరిల్లటం సహించకలేకపోయారు. తాము గౌరవించే ధర్మంపై, దైవంపై బొద్దింకలు వెదజల్లిన అశుద్ధ దుర్గంధాన్ని సహించలేకపోయారు. మురుగుకాల్వల్లో ముసిరిన నీడల్లో నక్కాల్సిన బొద్దింకలు రాజధానిలో రహదారిలో విచ్చలవిడిగా విర్రవీగటం జీర్ణించుకోలేకపోయారు.
దాంతో, విచ్చలవిడిగా దుర్గంధం వెదజల్లిన బొద్దింకలు ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిని ‘ఛెళ్ళు’ మని పీక సాగారు.
దైవాన్ని దూషిస్తావా? “ఛెళ్ళు ఛెళ్ళు.. పీకు పీకు”
ధర్మాన్ని దూషిస్తావా?
ఛెళ్ళు ఛెళ్ళు పీకు పీకు
దేశాన్ని ముక్కలు చేస్తావా?
ఛెళ్ళు ఛెళ్ళు, పీకు పీకు
మైకుందికదాని మైకంలో ఇష్టమొచ్చినట్టు వదరు తావా?
ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు
బూతులు మాట్లాడతావా?
ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు
పెద్దలంటే గౌరవం లేకుండా ప్రవర్తిస్తావా?
ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు
ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని బొద్దింకలా సవాలు చేసేది?
ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు
సైన్యాన్ని దూషిస్తావా?
ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు
పోలీసులను గాయ పరచి నీకు దెబ్బలు తగిలాయని ఏడుస్తావా?
ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు
నేరం చేస్తావు, శిక్ష వద్దా?
ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు
తెలివి ఉండి, మనిషయి వుండి బొద్దింక అయ్యేందుకు ఇష్టపడతావా?
ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు
అల్లర్లు, హింస ద్వారా ప్రజాస్వామ్యాన్నే బొద్దింక చెప్పినట్టు వినే బొద్దింకస్వామ్యంగా మార్చాలనుకుంటావా?
ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు
ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు, ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు, ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు
ఇప్పుడు ప్రజలే బొద్దింకలపై యుద్ధం ప్రకటించారు, ప్రభుత్వం మెతకగా కనిపించేసరికి
ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు
ఎక్కడ బొద్దింక కనిపించినా.. ఛెళ్ళు అనే శబ్దం పీకు అనే కేక వినిపించసాగింది.
బొద్దింక పేరెత్తితే…ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు
బొద్దింకలకు దెబ్బ తగిలితే అన్యాయం. ఆ బొద్దింకలు పోలీసులని గాయపరిస్తే బాగయిందంటారా? అని ప్రశ్నిస్తూ ఉర్బన్ నక్షల బొద్దింకల వెంట పడ్డారు ప్రజలు
ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు
బొద్దింకలు ఆశించిన జెన్జీ ఉద్యమం సంగతి దేవుడేరుగు, ఇప్పుడు సీపీ ఉద్యమం ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు తీవ్రమయింది.
అయినా కొన్ని పెద్ద బొద్దింకలు బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి పబ్బం గడపాలని చూశాయి.
కానీ ప్రజలు..ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు, ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు, ఛెళ్ళు చెళ్ళు పీకు పీకు మంత్రం వదలటం లేదు.
దెబ్బకు బొద్దింకలు మురికి కూపాల్లోకి పారిపోవటం ఆరంభించాయి.
అసలు నవతరానికి ప్రతినిధులు తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తుంటే, వారి ప్రతినిధులమని చెప్పుకుని, మనుషులను బొద్దింకలుగా మార్చే లక్ష్యంతో, అడ్డూ అదుపూ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించిన బొద్దింకలన్నీ ‘ఛెళ్ళు, పీకు’ అనే మంత్రానికి లొంగిపోతున్నాయి.
అందుకే, విదేశం నుంచి వచ్చిన బొద్దింక “అలసిపోయాను కమ్మని అమ్మ చేతివంట తిని కంటినుండా నిద్రపోతాను. నన్ను డిస్టర్బ్ చేయకండి” అని ఇంట్లో దూరింది. ” ప్రభుత్వం తల వంచింది. ఇక తలలన్నీ తీసేస్తాను. వంచిన తల ఎత్తనివ్వను” అని బెదిరిస్తూ, బొద్దింకల సర్కస్ లో పాల్గొన్న వారికీ తనకూ సంబంధం లేదని ప్రకటీంచేసి, చెళ్ళు పీకు మంత్రానికి అందకుండా తప్పించుకుంది జిత్తులమారి విదేశీ తొత్తు బొద్దింక.
ఆ బొద్దింకని నమ్మి నోరుపారేసుకున్న నవనవలాడే బొద్దింకలన్నీ ‘ ఛెళ్ళు పీకు’ మంత్రానికి గురయి కుళ్ళికుళ్ళి కుళ్ళులో పడి ఏడుస్తున్నాయి.
ఇదంతా విన్న విక్రమార్కుడు అప్రయత్నంగా ‘ఛెళ్ళు పీకు ఛెళ్ళు’ అన్నాడు
అనగానే భుజం మీది బేతాళుడు ‘ఛెళ్ళ్పీకు’ అని చెట్టేక్కాడు.
వెంటనే బేతాళుడి మూతికి టేప్ వేసి, చెట్టుదింపి భుజం మీద వేసుకున్నాడు విక్రమార్కుడు. అయితే, మూతి నుంచి బయటకు వచ్చేదారి మూసుకుపోయిన బొద్దింకలు శరీరంలోని ఇతర దారుల్లోంచి బయటకు రావాలన్న ప్రయత్నాలు ఆరంభించాయి. కానీ, ప్రస్తుతానికయితే, బొద్దింకలు ఛెళ్ళ్పీకు మంత్రానికి భళ్ళుభళ్ళుమని పారిపోతున్నాయి.
అప్పటి నుంచీ ‘ఛెళ్పీక’ గా ప్రసిద్ధి పొందిన ఈ గాథను విన్నవారికీ, వినిపించినవారికీ, చదివిన వారికీ, చదివించిన వారికీ, వారి దేశానికీ బొద్దింకలనుంచి విముక్తి కలుగుతుంది. దేశం సుభిక్షమై అభివృద్ధిపథంలో ప్రయాణిస్తుంది. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు.
అయినా, అప్పుడప్పుడు బొద్దింక ఎక్కడయినా కనిపిస్తే, ‘ఛెళ్పీక’ మంత్రం జపించి ‘ఛెళ్పీక యజ్ఞం’ చేస్తే బొద్దింకల బాధ పోతుంది.
ఇది బొద్దింకలను అదుపులో పెట్టే “ఛెళ్పీక” మంత్ర గాథ.
బొద్దింకల కథ అప్పుడే అయిపోలేదు. ఇప్పుడిది బొద్దింక రూపంలో, ఇంకొన్నాళ్ళకు మరో రూపంలో, మరో కారణం ఆధారం చేసుకుని, ఏదో రకంగా దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు ఈ జయద్రథ ప్రయత్నాలు సాగుతూనే వుంటాయి. కాబట్టి ప్రజలెప్పుడూ అప్రమత్తంగా ఉండి, ప్రలోభాలకు లొంగక, ప్రచారాలను నమ్మక నిజాన్ని గ్రహించి, పైకి కనబడే రూపాల వెనుక ఉన్న అసలు మోసపు రూపాలను గ్రహించి దేశాన్ని కాపాడుకోవాలి. ఛెళ్పీక మంత్రాన్ని జపిస్తూ, ఆచరిస్తూ అన్ని క్రిమికీటకబూటకనాటకాలను, కట్టుకథలనుంచి తమని తాము కాపాడుకోవాలి.
ఈ నిజాన్ని దర్శించింది, ప్రకటించింది.. వెటకకవి.
