[శ్రీ మల్యాల మనోహర రావు రచించిన ‘చెమటచుక్కల వేదాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఇంకా ఏళ్ల తరబడి
పురాతన రాతి కట్టాడాలలో
నాటి నాగరికతను
వెతుకుతూనే వున్నాము
నేటి కథతో బేరీజు వేసుకుని
ఆశ్చర్యచకితులమౌతున్నాం
చెక్కిన శిల్పాల హొయలలోని
సాంకేతికతకు నోరెళ్ళబెడుతూనే ఉన్నాము…
అంతుపట్టని కళా వైచిత్రికి
విస్మయాన్ని ప్రకటిస్తున్నాము
తవ్విన గుంతలలో
మతాల ఉత్థాన పతనాలు
యుద్దాలలోని చతురంగబలాలు
రాచరికపు భోగాలు
విజయకేతనాలు
గత వైభవపు దర్పానికి
దర్పణంగా మన ఆటవిడుపుకు
ఆహ్వానం పలుకుతూనే ఉన్నవి
తరతరాలుగా మానవ వికాస
పరవశానికి వింజామరలు
విసురుతూనే ఉన్నవి
మూర్ఖుల చేతులలో ద్వంసమైనా
చరిత్రను దర్జాగా చాటుతున్నవి
రాళ్లలో నిక్షిప్తం చేసిన
శాస్త్ర పరిజ్ఞాన పునాదులపైనే
ఎదుగుదలను నిర్మించుకుంటూనే..
సాంకేతికతలో
ఎవరికి ఎవరు ముందో
తేల్చుకోలేక సతమతమౌతున్నాం
మహోన్నత శిల్పశిఖరాల నీడలలో
అనామక శ్రామిక విరాట్స్వరూప
సహస్ర దీర్ఘ బాహువులను
వెదుకుతున్నాం..
ఇవి అచేతన
శిల్పదళాలు కావు
సకల శాస్త్ర నిఘంటువులు
చెదలు పట్టని కావ్యాలు
చెమట చుక్కల వేదాలు
సర్వోన్నత ప్రతిభకు
అజరామర సాక్ష్యాలు
