[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘చెప్పాలని ఉంది!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అందరికి వినిపించేలా
గట్టిగా అరిచి చెప్పాలని ఉంది
సమాజంలో జరిగే అన్యాయాలను
చూస్తుంటే గొంతు పెగలడం లేదు
మతమౌఢ్యంలో మారణ హోమాలు
ప్రేమపేరుతో మోసపోతున్న
అమాయక ఆడపిల్లల ఆక్రందనలు
టీచర్ల కీచక మనస్తత్వ కిరాతక చర్యలు
వరకట్నాలకు బలయ్యే అబలలశోకం
కార్పొరేటు నెపాన జరుగుతున్న దోపిడీలు
వైద్యంపేరుతో శవాన్ని పీక్కుతినే
రాబందు వైద్యులు
ఆస్తి కోసం మసవుతున్న అనుబంధాలు
వృధ్ధాశ్రమాలలో కడతేరుతున్న
తల్లిదండ్రుల ప్రేమలు
డాలర్ల వెతుకులాటలో బంధాలకు
దూరమవుతున్న నేటితరం
యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న పథకాలు
ఓట్ల పేరుతో దోపిడీకి గురయ్యే ప్రజాస్వామ్యం
ఆధ్యాత్మిక ముసుగులో మోసాలు
జగమంతా సమస్యల వలయం
ఒకటా రెండా ఏ సమస్య గురించి చెప్పాలి
ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి
ఎవరికి చెప్పాలో తెలియక
నా గొంతు మూగపోయింది
