[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.
కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.
వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.
శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.
~
ప్రశ్నలు:
- ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘శభాష్ రాజా’ సినిమాలోని ‘ఓ షోకైన టీకైన జానీ.. వినవే’ పాటకి సలీల్ చౌదురీ స్వరాలు కూర్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాట మూలం?
- ఆర్. గోవర్ధనం స్వరాలందించిన ‘మూగనోము’ సినిమాలోని ‘ఈ వేళ నాలో ఏదో’ పాట రవి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?
- మాస్టర్ వేణు స్వరపరిచిన ‘ప్రతిజ్ఞా పాలన’ సినిమాలోని ‘అందాల రాజు వస్తాడు, మందారమాల వేస్తాను’ పాటకి ఉషాఖన్నా సంగీత దర్శకత్వం వహించిన ఏ హిందీ సినిమా లోని ఏ పాట మూలం?
- టివి రాజు సంగీత దర్శకత్వం వహించిన ‘మంగమ్మ శపథం’ సినిమాలోని ‘ఓ వయ్యారమొలికే చిన్నది’ పాట రామ్‌లాల్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?
- టివి రాజు స్వరపరిచిన ‘భలే మాస్టారు’ సినిమాలోని ‘నీవు నేనై నేను నీవే నీవే’ పాట ఎస్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాట మూలం?
- ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘శాంతినివాసం’ (అక్కినేని) సినిమాలోని ‘చక్కనిదానా చిక్కనిదానా ఇంకా అలకేనా’ పాట ఉషాఖన్నా స్వరాలు కూర్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జనవరి 27వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘చెప్పుకోండి చూద్దాం-1 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఫిబ్రవరి 01వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

