[శ్రీ తోకల రాజేశం రచించిన ‘చెరువు’ అనే బాలగేయం అందిస్తున్నాము.]
వానలు కొడితే నిండును చెరువు
పల్లెటూరికి చెరువే పరువు
చెరువంటేనే అమ్మ కదా!
దానికుందిరా పెద్ద కథా!!
తామర పువ్వుల నవ్వులలో
బుడుబుంగల సయ్యాటలలో
చేప పిల్లల పరుగులలో
కొంగల దొంగ తపస్సులలో
కళకళలాడును చెరువు
అది ఉంటేనే ఆదరువు
మన కంచము నింపును చెరువు
దరి చేరేనా ఆ కరువు?
చందమామల ధగధగతో
నీటి ఒంపుల నిగనిగతో
కరిగిన సూర్యుని కాంతులతో
చిలిపి అలల సందోహముతో
చెరువందాన్ని చూడాలి
కన్నుల పండుగ కావాలి
చెరువే పల్లెకు ప్రాణమురా!
చెరువంటేనే అందమురా!!
