Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెరువు తల్లి

[శ్రీ తోకల రాజేశం రచించిన ‘చెరువు తల్లి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

చెరువు గట్టుమీద నిలబడితే
గతమంతా తరంగాలు తరంగాలుగా స్ఫురణకు వస్తుంది

అందమైన గిజిగాని గూళ్ళు వేలాడుతున్న చెరువులో
రెక్కలు పుట్టని పిట్టలకు ఎన్ని మాటలు నేర్పానో?
కార్తీక దీపాలు పెట్టినట్టు పూచిన
తామర పూలతో ఎన్ని దండలల్లేవాడినో
అప్పుడే పుట్టిన బుల్లిచేపపిల్లలను
దోసిట్లోకి తీసుకొని ఎన్ని పేర్లు పెట్టేవాడినో?
నా తొలినాటి స్నేహప్రపంచమంతా చెరువులోనే కొలువుండేది

వానాకాలం చూడాలి చెరువమ్మ సోయగాన్ని
అపురూపంగా లేలేత ప్రాణాన్ని మోస్తున్న
నిండు గర్భిణిలా దర్శనమిచ్చేది
జాలర్లం తల్లి కడుపులోనుంచి సరాసరి
చెరువు కడుపులోకి చేరుతాం బువ్వ పెడుతుందని

ఎండాకాలం మొదలవగానే
మా బెస్తోళ్ల ఇళ్లముందుకు చేపల ఋతువు దిగేది
చెరువుతల్లికి మెక్కితే
మాకు బుట్టెడు బుట్టెడు చేపలిచ్చేది
తన కడుపులో వల వేసి దేవితే
మా కడుపులు నింపిన కన్నతల్లి మా చెరువు
చెరువుతో మా పేగుబంధానికి ఎన్ని వేల ఏళ్ళో?

చెరువుకు పగలూ రాత్రీ కాపలా కాస్తూ
గట్టు మీద ముళ్ళతో బెదిరిస్తూ ఊడుగుచెట్లు

చెరువు వెనుక పొలాలకు
ప్రేమతో బిడ్డకు స్తన్యమిచ్చే తల్లిలా
నిండా నీళ్లు నింపి సంతోషపడేది
పాలువోసుకున్న వరికంకులలో దూరి
రైతుకు వినపడేలా గలగలా నవ్వేది చెరువు

తూము నుంచి పొలాల దారిపట్టి
వెండి ఒడ్డాణంలా మెరిసిపోతూ
ఒడ్లొరుసుకుంటూ పారుతున్న చెరువునీటిలో
నత్తగుళ్లలా దొర్లుతూ
తోకలేని చేపనయ్యే వాణ్ణి

నా బాల్యాన్ని బలీయంగా అల్లుకున్న
తడి జ్ఞాపకం చెరువు

అప్పటికీ, ఇప్పటికీ
చెరువంటే మా కన్నతల్లే!

Exit mobile version