[డా. కందేపి రాణీప్రసాద్ రచించిన ‘చెట్లతో చెలిమి’ అనే పుస్తకంపై సమీక్ష అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
డా. కందేపి రాణీప్రసాద్ రచించిన సైన్స్ పుస్తకాలలో నాల్గవది ‘చెట్లతో చెలిమి’. తాను చాలా కాలంగా చెట్లతో చెలిమి కొనసాగిస్తున్నాననీ, ఆ స్నేహం అప్పుడప్పుడూ వ్యాసాల రూపంలో అనేక పత్రికలలో మెరిసిందనీ, ఆ వ్యాసాల సంపుటే ఈ పుస్తకమని రచయిత్రి తెలిపారు.
‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ అనే వ్యాసంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది, దాని ఉద్దేశమేమిటి? పర్యావరణాన్ని, భూమిని ఎలా కాపాడుకోవాలనే అంశాలను చక్కగా వివరించారు.
‘జీవ వైవిధ్యం – మానవ మనుగడ’ అనే వ్యాసంలో మనుషుల మనుగడకి వృక్ష, జంతుజాలం ఎంత అవసరమో, జీవ వైవిధ్యం ఎందుకు కీలకమైనదో తెలియజేశారు. కనుమరుగవుతున్న కొన్ని రకాల మొక్కలను, జంతువులను ఎలా కాపాడుకోవాలో తెలిపారు.
‘కర్పూరం కథ’ వ్యాసంలో కర్పూరం గురించి సమగ్రంగా వివరించారు రచయిత్రి. కర్పూరం చెట్టు 20 నుంచి 30 అడుగుల వరకు పెరుగుతుందనీ, చైనా, తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, వియాత్నాం, ఇండోనేసియా, మడగాస్కర్ వంటి దేశాలలో ఎక్కువగా పెరుగుతుందనీ తెలిపారు. దైవాలకు హారతి ఇవ్వడానికి మాత్రమే కాకుండా, పలు ఇతర అవసరాలకు కర్పూరాన్ని వినియోగిస్తారని తెలిపారు.
తాంబూలంలో వాడే వక్క చెట్టు గురించి చక్కగా తెలియజేశారు. పోక చెట్లు ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతాయనీ, ఇవి ఇరవై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయని తెలిపారు. వక్క చెక్క ఆకులతో గిన్నెలు, ఫ్లైవుడ్, టోపీలు, ఇతర కళాకృతులు తయారు చేస్తారని తెలియజేశారు.
లిప్స్టిక్ చెట్టు అని పిలవబడే ‘సిందూర చెట్టు’ గురించిన వ్యాసంలో ఆ చెట్టు గురించి, సిందూరం గురించి తెలియజేశారు. రామాయణంలో సీతా హానుమల వృత్తాంతంతో వ్యాసాన్ని ప్రారంభించి, చదువరులలో ఆసక్తిని పెంచారు.
‘యాలకుల కథ’ వ్యాసంలో యాలకుల గురించి, వాటి ప్రయోజనాల గురించి, అవి పెరిగే దేశాల గురించి తెలిపారు. వివిధ దేశాలలో యాలకులు ఏయే పేర్లతో పిలవబడతాయో తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మసాలా దినుసులలో యాలకులది మూడవ స్థానమని తెలిపారు.
‘ఖర్జూరం కథ’ వ్యాసంలో ఖర్జూరాల గురించి, వాటి ప్రయోజనాల గురించి, అవి పెరిగే దేశాల గురించి తెలిపారు. ఖర్జూరం చెట్లు 1500 ఏళ్ళకు ముందునుంచి ఉన్నట్లు కొందరు అభిప్రాయపడతారని తెలిపారు. ఖర్జూరం పళ్ళలోని వివిధ రకాలను వెల్లడించారు.
నల్లకుక్కకు నాలుగు చెవులు అనే సామతతో ప్రారంభించిన ‘లవంగాల కథ’ వ్యాసంలో లవంగాలు ఇండోనేసియా లోని మాలుకు దీవుల్లో పుట్టాయని, క్రమక్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించాయని తెలిపారు. ఈ పంట సంవత్సరమంతా అందుబాటులో ఉంటుందని వివరించారు. లవంగాల ఉపయోగాలని తెలియజేశారు.
చింతపండు గురించిన సామెతలని వివరిస్తూ ప్రారంభించిన ‘చింత చరిత్ర’ వ్యాసంలో చింత చెట్ల జాతులను, ఉపజాతులను తెలిపారు. చింతపండును ఆహారంలోకే కాకుండా, సాంప్రదాయ వైద్యంలోనూ వాడుతున్నారని తెలిపారు.
సిగ్గుపడే మొక్కగా పేరుగాంచిన అత్తిచెట్టు గురించి, శివలింగ పుష్పాల చెట్టు గురించి, రుద్రాక్ష చెట్టు చక్కని సమాచారమందించారు. ఇంగువ చెట్టు గురించి, గంధం చెట్టు గురించి, కుంకుమ పువ్వు చెట్టు, మన దేశపు జాతీయవృక్షం మర్రి చెట్టు గురించి వివరంగా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
రంగులు మార్చే పువ్వుల చెట్ల గురించి చాలా ఆసక్తిగా తెలిపారు. ఆయా చెట్ల పూలు ఒకే రోజులు సుమారు నాలుగు రంగులలోకి మారటం వెనుక ఉన్న కారణాన్ని వివరించారు.
అల్లం, గోంగూర గురించి చక్కని వివరాలు అందించారు. స్పైరులినా మానవుల ఆహారంగా, పశుగ్రాసంగా, చేపల మందుగా, ఎరువుగా ఉపయోగపడుతుందని తెలిపారు.
పక్షిముక్కు హెలికోనియా పువ్వుల గురించి తెలిపిన వ్యాసంలో ఈ చెట్లు 1.5 అడుగుల ఎత్తు ఎదుగుతాయనీ, సంవత్సరమంతా పూస్తాయని తెలిపారు. అత్యంత ఆకర్షణీయమైన పూల జాతులలో ఇది ఒకటని వివరించారు.
నేపాల్ జాతీయ పుష్పం రోడోడెండ్రాన్ గురించిన వ్యాసంలో, వీటిలో వెయ్యికి పైగా ఉపజాతులున్నాయనీ, వాటిలోని పలు రకాలను వివరించారు. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పమని తెలిపారు. ఈ పువ్వుల గురించి అనేక పుస్తకాలలో వివరించారని తెలిపారు.
స్విట్జర్లాండ్ జాతీయ పుష్పం ఎడిల్వీస్ గురించి వ్యాసంలో – ఎడిల్వీస్ అనే పదానికి అర్థం తెలిపి, ఈ పువ్వు ధైర్యానికి, బలానికీ ప్రతీక అని తెలిపారు. ప్రతి ఏటా మార్చ్ 5వ తేదీన ఎడిల్వీస్ దినోత్సవం జరుపుకుంటారని వెల్లడించారు.
పుస్తకం చివరలో చెట్లకి సంబంధించిన 37 సామెతలను అందివ్వడం విశేషం.
~
ఆయా చెట్ల కుటుంబాలను, క్రమాలను, వాటి శాస్త్రీయ నామాలను సంబంధిత వ్యాసాలలో అందించారు.
బాలబాలికలకు ఉపయుక్తమైన పుస్తకం ఇది. పాఠశాలలకు, పిల్లలకూ ఈ పుస్తకాన్ని చేర్చగలిగితే, సైన్స్ పట్ల, చెట్ల పట్ల పిల్లల అవగాహన మరింత పెరుగుతుంది. ఇటువంటి ప్రయోజనకరమైన పుస్తకం అందించినందుకు డా. కందేపి రాణీప్రసాద్ అభినందనీయులు.
***
రచన: డా. కందేపీ రాణీప్రసాద్
ప్రచురణ: స్వాప్నిక్ పబ్లికేషన్స్
పేజీలు: 104
వెల: ₹ 150/-
ప్రతులకు: డా. కందేపీ రాణీప్రసాద్,
మేనేజింగ్ డైరెక్టర్, సృజన చిల్డ్రన్స్ హాస్పటల్,
సిరిసిల్ల – 505301.
తెలంగాణ.
ఫోన్: 9866160378
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.