Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పంజా విసిరిన ఛావా

[విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ అనే సినిమాని సమీక్షిస్తున్నారు కోవెల సంతోష్‍ కుమార్.]

‘వక్రీకరించారు.. మతోన్మాదం మత్తెక్కిస్తున్నారు.. ముస్లింల మీద ద్వేషాన్ని రగుల్కొల్పుతున్నారు. ఆరెస్సెస్ భావజాలాన్ని కుమ్మరించేస్తున్నారు. పిల్లల్లో సైతం ఉన్మాదాన్ని రంగరించి పోస్తున్నారు. సినిమా అనేది ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కానీ.. సినిమా ద్వారా భారత లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి ఆఘాతం కలిగిస్తున్నారు. సంస్థలు, మాధ్యమాలన్నీ కబ్జా పెట్టి మతం మత్తు, దేశభక్తి అన్న నల్లమందును బుర్రల్లోకి ఎక్కించేస్తున్నారు.. ’

ఈ మధ్య బాలీవుడ్‌లో ‘ఛావా’ అనే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా వాల్స్ బీభత్సంగా ఊగిపోతున్నాయి. సెక్యులర్‌లము అని చెప్పుకొనే ముస్లిం మతవాద హేతువాదులు, కమ్యూనిస్టులు, లిబరలిస్టులు, కొండకొచో పక్కా సెక్యులర్లమని ప్రచారం చేసుకోనే అపరిమిత మేధస్సు కలిగిన మేధావులు పూనకాలు లోడింగ్ అన్నట్టుగా ఊగిపోతున్నారు. పోతరాజుల్లాగా వీరంగాలు వేసేస్తున్నారు. ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి అంటూ పరమ నీచుడైన విలన్ని హీరోగా చరిత్రను, ఇతిహాసాన్ని వక్రీకరించి తీస్తే.. ఆహాఓహోలు అని ఇప్పటికీ నెత్తిన పెట్టుకుని ఊరేగే బృందాలివి. ‘అర్జునా.. నేను సారథిగా ఉండి.. హనుమ జయపతాకగా ఉన్నా కూడా నీ రథం రెండు అడుగులు వెనక్కి వేసిందంటే సదరు కర్ణుడు ఎంత గొప్పవాడో తెలుసుకో’ అని కృష్ణుడి చేత పలికించి అబ్బో అపూర్వం అని కల్కి సినిమాను నెత్తిన పెట్టుకున్న బృందాలే ఇవి. కర్ణుడిని, దుర్యోధనుడిని, రావణుడిని హీరోలను చేసి హారతులిచ్చే గణాలకు.. తాజాగా ఛావా సినిమా మతులు పోగొట్టింది.

నవ్వొచ్చే విషయమేమిటంటే.. రాముడిని, కృష్ణుడిని తిట్టినట్టుగా వీళ్లు శివాజీని కానీ, శంభాజీని కానీ తిట్టడానికి సాహసించలేరు. మొఘలుల అరాచకాలను అరాచకాలుగా చూపించడానికి మనసొప్పదు. ఇప్పటికే మొఘలే ఆజం,  అక్బర్ సలీం అనార్కలి, బాబర్, హలాకూ, లాల్ ఖిలా,  అనార్కలి, జోధా అక్బర్, సమ్రాట్ అశోక లాంటి సినిమాలు బోలెడు తీసుకున్నారు. ఈ క్రమంలో ఛావా సినిమాను నిందించాలి.. తిరస్కరించాలి. చిన్న చేయాలి అంటే.. ఏంచేయాలి.. వీళ్లకు ముందుగా లభించిన సోర్స్ ఈ పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ రాసిన శివాజీ రచన. ఈ రచననే శివాజీ గణేశన్ హీరోగా సినిమా తీశారు. ఈ సినిమాతోనే ఆయనకు శివాజీ అన్న పేరు సార్థకమైంది. ఆ తరువాత కామన్ గానే మార్క్సిస్టు చరిత్రకారులు రాసిన చరిత్ర పాఠాలను పట్టుకొని ఈకలు పీకడం మొదలుపెట్టారు. పాయింట్లవారీగా లెక్కలు తీయసాగారు. భారతీయత, హిందుత్వం గురించి ఏ మాటొచ్చినా స్థిమితం కోల్పోయిన మతితో రాతలు రాసే ఒక రచయిత రాకెట్ వేగంతో నిలబడిన వ్యక్తి నిలబడినట్టుగా శంభాజీ ఎవరు? శివాజీ ఎవరు? అంటూ ఒక సుదీర్ఘ వ్యాసం రాసేశారు. వీరి కోవలో అందరూ శంభాజీ మీద పడ్డారు. శివాజీ మీద పడ్డారు. వికీపీడియాలను, గూగుల్‌ను అదే పనిగా సర్వే చేసుకుంటూ వెళ్లారు. వీళ్లందరూ కలిసి కామన్‌గా తవ్వి బయటకు తీసిన పాయింట్లు..

  1. ఔరంగజేబును మంచివాడు అని అనకుండా మంచివాడని నిరూపించడం
  2. శివాజీ శూద్రుడని.. అతడిని బ్రాహ్మణులు అవమానించారని, ఆ తరువాత పీశ్వా బ్రాహ్మణులే శివాజీకి విషప్రయోగం చేసి చంపారని
  3. శంభాజీని కూడా ఔరంగజేబుకు పట్టించింది పీశ్వా బ్రాహ్మణులనీ, మనుస్మృతిలోని శిక్షలను శంభాజీ మీద అమలు చేసి చంపారని..
  4. మహారాష్ట్రలో గుడిపడ్వా పర్వదినాన్ని శంభాజీని చంపినందుకు విజయచిహ్నంగా బ్రాహ్మణ చెంబును బోర్లించి చేసుకుంటారని

ఇవీ ఛావా సినిమా వచ్చిన తరువాత సామాజిక మాధ్యమాల్లో కుప్పలుకుప్పలుగా పోగుపడిన చెత్త.

ఛావా సినిమా గురించి చర్చించుకోవడానికి ముందు.. ఈ చెత్తలోని రెండు కుప్పల గురించి మాత్రం చెప్తాను. మొదట శివాజీ శూద్రుడని.. బ్రాహ్మణులు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించారన్న మాటలు పెరియార్ రచనకు సంబంధించింది తప్ప చరిత్ర కాదు. ఇక పీశ్వా అంటే అది కులవాచకమని రాసిన వాడిని ఏం చేయాలో కూడా అర్థం కాదు. పీశ్వా అంటే మరాఠా సామ్రాజ్యంలో రెండవ అతి పెద్ద పదవి. లేదా అధికారి అని అర్థం. అంటే రాష్ట్రపతి తరువాత ప్రధానమంత్రి ఎలాగో ఆ స్థాయి అన్నమాట. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన తరువాత నాలుగు వైపులా నలుగురు పీశ్వాలను నియమించాడు. అంటే ప్రధానమంత్రులని అర్థం. పీశ్వా అంటే బ్రాహ్మణుడు అని ఒక ముద్రవేసి.. బ్రాహ్మణ్యాన్ని ఒక జాతిగా సృష్టించి దానిపై ఒక వికృతమైన విద్వేషాన్ని నింపడానికి భీకరమైన కుట్రకు ఈ కుట్రదారులకు ఛావా కూడా పనికొచ్చింది. గుడిపర్వమనేది మహరాష్ట్రీయులకు నూతన సంవత్సర పండుగ. ఏప్రిల్ 13-15 మధ్యన వస్తుంది. అలాంటప్పుడు ఫిబ్రవరిలో జరిగిన శంభాజీ హత్యకు గుర్తుగా చేసుకుంటారని రాస్తున్న వాళ్లను ఏమని అనాలి. ఇంత బరితెగింపు రాతగాళ్లను ఏమని అనాలో కూడా అర్థం కాదు.

ఇక ఛావా కథలోకి వద్దాం. చాలాకాలం తరువాత ఛావా సినిమా బాలీవుడ్‌కు కొత్త ఊపిరూలూదిందనే చెప్పాలి. చాలాకాలం తరువాత బాలీవుడ్ ఒక చెప్పుకోదగ్గ హిట్ అందుకున్నది. వారం రోజుల్లో 300 కోట్ల రూపాయల మార్కును దాటింది. ఒక మరాఠా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ భారతీయ సినిమాకు తనదైన గొప్ప కంట్రిబ్యూషన్ అందించాడు. కథ వక్రవాదులకు తప్ప భారతీయ చరిత్ర తెలిసిన వారందరికీ తెలిసిన కథే. శివాజీ చరిత్రను బ్యాక్‌డ్రాప్‌లో చెప్పి.. శివాజీ చనిపోయిన వార్తను ఔరంగజేబుకు చేర్చడం దగ్గర సినిమా మొదలవుతుంది. తనను నిద్రపోనీయకుండా చేస్తున్న మరాఠా సామ్రాజ్యం తమ వశమైందని సంతోషపడుతున్న నేపథ్యంలో బుర్హాన్‌పూర్‌ను బూడిద కుప్ప చేయడం ద్వారా శంభాజీ (విక్కీ కౌశల్) వెలుగులోకి వస్తాడు. ఇక అంతే.. ఔరంగజేబ్ స్వయంగా ఢిల్లీ వదిలి ఏకంగా మరాఠా ప్రాంతానికి రావడం బుర్హాన్‌పూర్ దగ్గర్లోనే ఉండిపోయాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా పదేండ్లపాటు అక్కడే ఉండిపోయాడు. రకరకాల కుట్రలు చేశాడు. ఔరంగజేబ్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. చివరకు శంభాజీ బాగా నమ్మిన కానోజీ ద్వారా సంగమేశ్వరం దగ్గర ఔరంగజేబ్ సైన్యానికి పట్టుబడతాడు. ఆ తరువాత అతడిని చిత్రహింసలు పెట్టి చంపేస్తాడు ఔరంగజేబ్. స్థూలంగా ఇదీ కథ.

సినిమా కోసం కొంత నాటకీయత జోడించినప్పటికీ వాస్తవ చరిత్రకు దర్శకుడు ఎంతమాత్రం దూరం జరుగలేదు. పాత్రల పేర్లు కొన్ని మారి ఉండవచ్చేమో తప్ప ఏ విధంగానూ మరాఠా సింహం బిడ్డ చరిత్రకు మచ్చ రానీయకుండా జాగ్రత్తపడ్డాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అద్భుతంగా రాసుకున్నాడు. ఎక్కడా కూడా ల్యాగ్ లేకుండా జాగ్రత్త పడ్డాడు. నటీనటులందరితో చక్కని నటనను రాబట్టడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సహజంగా మరాఠా దర్శకుడు కాబట్టి, మరాఠా చరిత్రను చదువుకున్నవాడు కాబట్టి.. మరాఠా చరిత్రను చరిత్రగా చూపించడంలో దర్శకుడు ఉటేకర్ విజయం సాధించాడనే చెప్పాలి. అయితే శంభాజీని ఔరంగజేబు పెట్టిన క్రూర హింసను దర్శకుడు పూర్తిగా చూపించలేకపోయాడు. ఎందుకంటే.. ఈనాటి పరిస్థితులకు అంతటి భయంకరమైన హింసను చూపడం సాధ్యం కాదు. అందుకే ఒక నాలుగు అంశాలను స్పృశించి వదిలేశాడు. ఆ కొంతమాత్రాన్నైనా ఒళ్లు గగుర్పొడిచేలా చిత్రించాడు.

ఇక ఛావా పాత్రలో విక్కీ కౌశల్ నటన సమున్నతంగా కనిపించింది. ఈ పాత్రతో బాలీవుడ్‌లో విక్కీ కౌశల్ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. మొదట్నుంచీ విక్కీ కౌశల్ ఎంచుకుంటున్నపాత్రలు అన్నీ కూడా అతడిని ఒక్కో మెట్టు ఎక్కిస్తూనే ఉన్నాయి. యురి, సర్దార్ ఉద్ధమ్, మేజర్ శాం బహదూర్ లాంటి పాత్రలన్నీ చరిత్రలో మిగిలిపోయేలా చేశాడు. సినిమాలో విక్కీ ఇంట్రో దగ్గరి నుంచి చివరి ఫ్రేం వరకు సినిమాను ఒక ఉద్వేగంతో ముందుకు తీసుకొని వెళ్లాడు. చివరి దాదాపు 45 నిమిషాలైతే విక్కీ నటనకు ఏం పేరు పెట్టాలో, ఏ విశేషణం వాడాలో కూడా తెలియదు. నటుడిగా తన విరాడ్రూపాన్ని ఆ 45 నిమిషాలు ప్రదర్శించాడు. జై జగదంబే, హర హర మహాదేవ, జై భవానీ నినాదాలు.. ఏ ఒక్క ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చోనివ్వలేదు. చారిత్రక పాత్రలు ఎంచుకోవడంలో విక్కీ కౌశల్ తీసుకుంటున్న జాగ్రత్తలు.. అతన్ని చరిత్రలో నిలిచిపోయే స్థాయికి చేరుస్తున్నాయనడంలో సందేహం లేదు. సర్దార్ ఉద్ధం సినిమాలో 20 ఏండ్ల పిల్లవాడిగా కనపడటానికి విక్కీ కౌశల్.. ఛావాలో ఛత్రపతి శంభాజీగా దృఢకాయుడిగా కనిపించడానికి ఎంతో కష్టపడ్డట్లు సినిమాలో చూస్తేనే కనిపిస్తుంది. శంభాజీ ఆహార్యం కోసం చాలా శ్రమ తీసుకున్నాడు.

ఇక మహారాణి యేశూభాయ్ భోన్సాలే పాత్రలో రష్మిక మందన్న లీనమైపోయింది. యానిమల్, పుష్ప లాంటి సినిమాల్లో చూసిన రష్మిక ఈమేనా అనిపించింది. ఇంకాస్త పొడుగుగా ఉంటే కచ్చితంగా బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్‌లు ఎన్నో సాధించగల సత్తా ఉన్నదని రష్మిక శంభాజీ భార్య పాత్ర ద్వారా నిరూపించింది. పాత్ర చాలా చిన్నదే అయినప్పటికీ.. భారతీయ రాణుల ఆహార్యం, శౌర్యం, గాంభీర్యం, ధైర్యాన్ని రష్మిక నుంచి దర్శకుడు తాను అనుకున్నరీతిలో రాబట్టాడు. హీరో హీరోయిన్ల మధ్యన కెమిస్ట్రీని దర్శకుడు చక్కగా పండించాడు. మన తెలుగు సినిమాల్లో మాదిరిగా దుర్యోధనుడికి డ్యూయెట్టు, రామదాసుకు, అన్నమయ్యకు డ్యూయెట్లు.. పిచ్చి పిచ్చి గెంతులు.. స్విమ్మింగ్ పూల్స్‌లో విసిరేసి పిచ్చి పిచ్చి పాటలు చిత్రీకరించే వెర్రి మొర్రి ప్రయత్నాలను దర్శకుడు ఎంత మాత్రం చేయలేదు. పాటలను కూడా సమయోచితంగా చిత్రీకరించాడు. శంభాజీ శత్రుమూకకు దొరికిన తరువాత రాజ్యాన్ని సంరక్షించే బాధ్యతను ఎత్తుకోవడంలో శంభాజీ భార్య చూపించిన తెగువను రష్మిక చక్కగా ప్రదర్శించగలిగింది.

ఔరంగజేబ్ పాత్రలో వినోద్ ఖన్నా కొడుకు అక్షయ్ ఖన్నా అద్భుతంగా నటించాడు. మేకప్ కొంత ఎక్కువైందేమో తెలియదు కానీ.. ముఖంపై ముడతలు అతికించినట్టు స్పష్టంగా కనపడ్డాయి. దీంతో అతని ముఖంలో హావభావాలు పెద్దగా కనిపించకుండా పోయాయి. అతని కూతురుగా నటించిన అమ్మాయి డయానాకు ఎక్కువ సేపు కనిపించడం తప్ప పెద్దగా భూమిక లేదు.

ఈ సినిమాలో కవి కలశ్ పాత్రలో వినీత్ కుమార్ సింగ్ నిజంగా జీవించాడు. చిత్రం క్లైమాక్స్‌లో శంభాజీతో కలిసి కవి కలశ్ ఉత్కంఠతో, ఉద్వేగంతో కవితా గానం మొత్తం సినిమాకే హైలైట్..

సినిమాను పాన్ ఇండియా సినిమాగా ఎందుకు తీసుకొని రాలేదో దర్శక నిర్మాతలు చెప్పాలి. పలు భాషల్లో విడుదల చేయకపోయినప్పటికీ.. ఛావా పాన్ ఇండియా సినిమాగా మారిపోయింది. హిందీ వెర్షన్ లోనే యావత్ దేశమంతటా ప్రేక్షకులు చూస్తున్నారు. కథతో మమేకమవుతున్నారు. శంభాజీని తమ వీరుడిగా కీర్తిస్తున్నారు. శంభాజీని హతమార్చిన తీరును చూసి ఏడుస్తున్నారు. ముఖ్యంగా యువత, పిల్లలను సైతం ఛావా సినిమా తనవైపు లాక్కున్నది.

వాస్తవిక చరిత్రలు, కాలచక్ర చరిత్రలు, చారిత్రక సినిమాల పేరుతో గిమ్మిక్కులు, చిత్ర విచిత్ర వేషాలు వేసే మన తెలుగు రచయితలు, దర్శక ధీరులు ఛావాను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

Exit mobile version