Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిగురించే కలాలు

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘చిగురించే కలాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

చిగురంటే భవిష్యత్ సతతవనం
కవిత్వమంటే ఆశావహజీవనం
నిత్యం ఎదగడమే జీవనపరమార్ధం
తరువు చెబుతోందీ పరమసత్యం

వాతావరణ ప్రతికూలతలోనూ
చెట్టుది ఒకటే తపస్సు, మంత్రం
సదా కొత్త కొమ్మలకై సమాయత్తం
కాలుష్యం కడుగుతూ పై కెదగడమే లక్ష్యం

మళ్లీమళ్లీ పూసే పూలమొక్క స్వయంసిద్ధ
మళ్ళీ మళ్ళీ రాసే కవిరాజు వాణీ స్వరూపం
ఇద్దరి దారీ పరమధర్మ పరోపకారమే!
ఇరువురిదీ నిస్వార్థ జీవనమే!

గుర్తింపు నోచుకోకున్నా
ప్రోత్సాహం తక్కువైనా
మొక్కవోని దీక్ష సుకవిది
తన అనుభవం మరొకరికి
పూలబాటగా మిగలాలని

మిషన్లతో మొదలంటా తీసేసినా
వృక్షజాతి చిన్నబుచ్చుకోదు
మనిషికి ప్రాణవాయువు నందించే పనికి
బాల్కనీ బుజ్జికుండీలో సైతం సిద్ధం

తరువులూ, కవులూ ఆరోగ్య సమాజానికి అత్యవసరం
జీవితాన్నితుంచుకుపోయే అధైర్యులకు, బేలలకు
సానుకూల దృక్పథం నేర్పి బతుకువిలువ చెప్పేదే కవనం

జీవితపాఠాలను పద్యాలుగా మలిచి
ఆలోచననిచ్చి, స్నేహ హస్తమందించి
తోటిమనిషికి చేయూతనివ్వడం పద్యకర్త గమ్యం

చెట్టు భూమికి రుణం.. కవి సమాజానికి రుణం
ఇది సృష్టి నిరంతర సృజన ప్రవాహం
కలాలు చిగురించాలి, కవితలు పుష్పించాలి
నిత్యం జగతిని పచ్చదనం పరిమళించాలి.

Exit mobile version