Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిందరవందర జీవనం – చిక్కుల్లో ఆరోగ్యం

[కరణం నారాయణ స్వామి పిళ్లై గారు రచించిన ‘చిందరవందర జీవనం – చిక్కుల్లో ఆరోగ్యం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

‘ఆరోగ్యమే మహా భాగ్యం’ – ఈ సూక్తి వినని మనుషులు ఎవరు? ఎంతో సులభంగా అర్థమయ్యే ఈ సూక్తిని ఎంతమంది గౌరవించి ఆచరణలో పెడుతున్నారు? రోజు వినబడే అకాల మరణాలకు అస్తవ్యస్తమైన జీవనశైలి అనేది ఒక నిశ్శబ్ద శత్రువు. భారతదేశంలో ప్రస్తుతం 60% పైగా మరణాలు అస్తవ్యస్తమైన  జీవనశైలి వల్లే జరుగుతున్నాయి. ఆధునికతను, సాంకేతికతను అర్థం చేసుకోవడంలోను, ఎలా ఉపయోగించుకోవాలనుకోవడంలోనూ విఫలమవుతున్నామా?  ఆరోగ్యం, జీవనశైలి- వీటి సమతుల్యతను మనం ఎందుకు పాటించడం లేదు.? మన సన్నిహితులో లేక బంధువులు చనిపోయినప్పుడు మాత్రం భయంతో కొన్ని రోజుల వ్యాయామమో లేక ప్రాణాయమమో చేసి మరలా మన యథాస్థితినే కొనసాగిస్తున్నాం. కారణాలు ఏమిటి? ఎందుకు మనం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆవగాహనా రాహిత్యమా లేక నిర్లక్ష్యమా? మన ఆరోగ్యం బాగున్నప్పుడే మనం దానిని కాపాడుకోవాలి. అజాగ్రత్త చేశామా మనం మన వారికి మిగిల్చేది కన్నీరే.

ఈ మధ్యన రామయ్య హాస్పిటల్లో నా సతీమణి ఆపరేషన్ రీత్యా నాలుగు రోజులు అక్కడే వుండాల్సి వచ్చింది. అప్పుడు నేను వీక్షించిన కొన్ని సన్నివేశాలు నన్ను విపరీతంగా ఆలోచింపచేసింది.. మొదటిది – ఆస్పత్రికి మెడికల్ కాలేజీ కూడా అటాచ్ అవ్వడంతో విద్యార్థుల కోసం ఒక సంగీత కచేరీ కార్యక్రమం జరుగుతోంది. అందులో ఓ గొప్ప వయొలిన్ విద్వాంసుడు వయొలిన్ తీగలను మరీ వదలుగాను కాకుండా, మరీ బిగుసుగాను కాకుండా, తనకు ఎంత కావాలో అంతగా సరిచేసుకుంటున్నాడు. బిగుతుగా వుంటే తీగలు తెగిపోతాయి, వదలుగా వుంటే శబ్ధం రాదు. సరిగ్గా తీగలను సరిచేసుకుని శ్రుతిచేసి అందరి మన్ననలను పొందాడు. చాలా హుషారుగా కనిపించిన అతనిని అక్కడికి  వచ్చిన చీఫ్ గెస్ట్ అడిగిన ప్రశ్న – ఎలా ఇంత బ్రైట్ గా వున్నారు, మీ డెయిలీ రొటీన్ ఏంటి అని – అతను చెప్పిన సమాధానం – ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి, ప్రాణాయామం చేస్థానండి. ఎందుకంటే ప్రాణాయామం నా ఊపిరితిత్తులను దృఢంగా ఉంచడమే కాకుండా, సంగీత సాధనలో ఏకాగ్రతను పెంచుతుంది. నా నరాలు బాగుంటేనే నా మేధస్సు పనిచేస్తుంది అని నమ్మి, తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకుంటాను.అందుకే నాకేమీ ఆరోగ్య సమస్యలు లేవండి. ప్రదర్శనల మధ్య తగినంత విశ్రాంతి తీసుకుంటాను. ప్రకృతితో గడపడం, సంగీతంతో పాటు మౌనాన్ని కూడా ఆస్వాదించడం నాకిష్టం అని చెప్పాడు. వీలైనంత వరకు ఆధునిక గాడ్జెట్లకు, సోషల్ మీడియాకు దూరంగా వుంటానండి. కానీ కావాల్సినంత వరకూ వినియోగించుకుంటానండి అని చెప్తూ వుంటే, ఎంతమంచి జీవన శైలి అని అందరూ శ్రద్దగా వింటున్నారు. నాకు అతనిపై మరింత గౌరవం పెరిగింది. అతని మాటల్లో ఎంతో  క్రమశిక్షణ, వృత్తిపట్ల అతనికున్నశ్రద్ద, గౌరవం కొట్టొచ్చినట్లు కనబడింది.

రెండవ సన్నివేశం – అదే కచేరీలో నా ప్రక్కన దిగాలుగా కూర్చున్న వ్యకితో మాటలు కలిపినపుడు అతడు ఒక పేషెంట్ అని, ఇదే హోసపిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని తెలిసింది. వృత్తి రీత్యా అతడో ఇంజనీయరు. అతని మాటల్లో – అతను పనిలో గొప్పవాడని, జీవితాన్ని ఒక యుద్ధభూమిగా మార్చుకున్నాడని అర్థమయింది. అతని జీవన శైలి అనే గడియారం ఎప్పుడూ పరుగెడుతూనే ఉండేదని, ఆఫీసులో ప్రమోషన్ కోసం రాత్రిపూట కంటి నిండా నిద్ర లేకుండా గడిపేవాడని తెలిసింది. రాత్రి 12 గంటలకు భారీగా భోజనం చేయడం, ఉదయం కళ్ళు తెరవలేక కాఫీ మీద కాఫీ తాగడం అతని అలవాటని తెలిసింది. బ్యాంకు బ్యాలెన్స్ పెరిగింది కానీ, అతని కండరాలు బిగుసుకుపోయి ఆధునిక వైద్య పరీక్షల్లో అతనికి క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ – అంటే తీవ్రమైన అలసట వ్యాధి – ఉన్నట్లు తేలిందని చెప్పాడు. వయసులో చిన్నవాడైనా, ముఖంలో కళ తప్పింది.

ఇద్దరి జీవనశైలి పదే పదే నా మనస్సులో చక్కర్లు కొట్టింది.. వయొలిన్ విద్వాంసుడి క్రమశిక్షణ, సమతుల్యత, ఆహారపు అలవాట్లు ఒక వైపు – ఇంజనీయరు అస్తవ్యస్త జీవనశైలి, నిర్లక్ష్యం మరోవైపు కళ్ళముందు నాట్యమాడుతోంది. వృత్తిపై గౌరవమున్న ఇద్దరు వ్యక్తుల విభిన్న జీవన శైలి దృక్పథాలు వారిని ఎక్కడికి తీసుకొచ్చాయని. ఒకరు ఆహ్లాదంగా అందరి మన్ననలను అందుకుంటూ వెలిగిపోతూ వుంటే ఇంకొకరు నిరాశ, నిస్పృహలతో అసహాయంగా బిక్క చూపులతో కళా విహీనంగా వున్నారు.

“వయొలిన్ విద్వాంసుడి మాటలు విన్నారా?” అని ఇంజనీయరుని అడిగినప్పుడు అతని కళ్ళు సిగ్గుతోనూ, బాధతోను నేలకొరిగింది. అతని భుజంపై చేయి వేసినపుడు – అతను నన్ను చూసి – “నేను మారాలండి – తప్పక నా వాళ్ళ కోసం మారుతాను” అన్నప్పుడు – వయొలిన్ విద్వాంసునికి నా గౌరవ వందనాలను మనసులోనే అర్పించుకోవడం నా వంతైంది. నాలోనూ మార్పులకోసం అన్వేషణ ప్రారంభమైంది.

వయొలిన్ తీగలను మరీ బిగించినా అవి తెగిపోతాయి, మరీ వదలు చేసినా శబ్దం రాదు. సరిగ్గా శృతి చేసినప్పుడే సంగీతం పుడుతుంది. మన జీవితం కూడా అంతే, కేవలం పనిపైనే శ్రద్ధ పెట్టి శరీరాన్ని బిగిస్తే అది జబ్బుల పాలవుతుంది. కేవలం విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యంగా వున్నట్టు కాదు. ఆరోగ్యం, ఆహారం, నిద్ర, మరియు పని.. ఈ నాలుగింటినీ సమతుల్యం చేసినప్పుడే జీవితం ఒక మధురమైన మరియు ఆరోగ్యమైన పాటలా మారుతుంది.

“కండరాల కదలికలో వుంది జీవకళ, కంటినిండా నిద్రలో వుంది రేపటి కల

మితమైన ఆహారమే మన ఆయుధము,శృతి తప్పని జీవనశైలే మన ఆరోగ్య భాగ్యము”

అనే నినాదంతో – మన జీవనాన్ని, ఆధునికత, సాంకేతికతల పేరుతో చిందరవందర చేసుకొని చిక్కుల్లో పడకుండా సమతుల్యత పాటించి ఆరోగ్యంగా ఉందాం.

Exit mobile version