Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిన్న కోడలు

[రోహిణి భైరవజోశ్యులు గారు రచించిన ‘చిన్న కోడలు’ అనే కథని అందిస్తున్నాము.]

“పల్లవీ, ఇంకా కాఫీ కాలేదా?” అంటూ హాల్‌లో నుంచి అరుంధతి పెట్టిన కేకలకు “ఇదిగో, తెస్తున్నానత్తయ్యా” అంటూ రెండు కాఫీ గ్లాసులు తెచ్చి అక్కడే పేపర్ చదువుతున్న పరంధామయ్యకు ఒక గ్లాస్ ఇచ్చి, అత్తగారికి రెండో గ్లాస్ ఇచ్చింది పల్లవి.

“ఈ రోజు ఇంత ఆలస్యమైందేం?” అడిగింది అరుంధతి.

“ఈ రోజు ఆదెమ్మ రానని ఫోన్ చేసిందత్తయ్యా. వాళ్ల అమ్మాయికి రాత్రి నుంచి జ్వరమట. ఇంకా రెండు రోజులు రాకపోవచ్చు. ఇంటి ముందు ఊడ్చి, ముగ్గు పెట్టి వచ్చి కాఫీ చేసేసరికి ఆలస్యం అయింది” సంజాయిషీగా చెప్పింది పల్లవి.

“నెలకు నాలుగు రోజులు సెలవు పెట్టడం దీనికి అలవాటేగా” అని దీర్ఘం తీసింది అరుంధతి.

పల్లవి వంటింట్లోకెళ్ళి అప్పటికి కావలసిన గిన్నెలు కడగసాగింది.

ఇంతలో “వదినా కాఫీ” అంటూ సాహితి వచ్చింది.

“ఏం వదినా! ఆదెమ్మ రాలేదా. కాఫీ నేను చేసుకుంటానులే” అంటూ కాఫీ చేసి అప్పుడే మొహం కడుక్కుని లోపలికి వస్తున్న అన్నయ్య కిషోర్‌కి ఒక గ్లాస్ ఇచ్చింది.

“నువ్వూ రా వదినా, కాఫీ తాగుదాం” అంటూ బలవంతంగా వదినకు ఒక గ్లాస్ ఇచ్చి తనూ ఇంకో గ్లాస్ తీసుకుంది.

కాఫీలు అయ్యాక ఫ్రిజ్ తెరచి అరటికాయలు తీసుకుని చెక్కు తీయసాగింది సాహితి.

“నీకెందుకు ఈ పనులన్నీ? నువ్వు కాలేజ్‌కు వెళ్ళడానికి రెడీ అవ్వు” అని అరటికాయలు లాక్కోబోయింది పల్లవి.

“వదినా! కాలేజీకి ఇంకా బోలెడు టైమ్ ఉంది. నీకు కాస్త సహాయం చేస్తే నేనేం అరగిపోనులే” అని చెక్కు తీయాసాగింది సాహితి.

ఈ లోపల పల్లవి ఉప్మా తయారు చేసింది. తరువాత కుక్కర్‌లో బియ్యం, పప్పు పెట్టి స్టవ్ ఆన్ చేసింది. మరో పక్క కంది పచ్చడికి పప్పు వేయించసాగింది. పల్లవి వద్దన్నా వినకుండా సాహితి మిగిలిన గిన్నెలు కడగసాగింది.

వంటింట్లోకి తొంగి చూసిన అరుంధతి “అదేం పనే సాహితీ! తరవాత నేను కడుగుతాను గానీ నీవు ఇవతలకు రా” అంది.

“నువ్వు వదినకు ఎంత మాత్రం సహాయం చేస్తావో నాకు తెలుసులే అమ్మా. నువ్వూ చెయ్యవు, నన్నూ చేయనివ్వవు” నవ్వుతూనే చురక అంటించింది సాహితి.

“నీకు నన్నడం తప్ప మరో పనిలేదు” అని విసవిసా బయటికి నడిచింది ఆవిడ.

సాహితి కాలేజ్‌కు, కిషోర్ ఆఫీసుకు వెళ్ళిపోయాక అరుంధతి, పరంధామయ్యలు టిఫిన్ తిన్నారు.

***

అరుంధతి, పరంధామయ్యలకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు.

పెద్ద కొడుకు పేరు రవీంద్ర. పెళ్ళై అయిదేళ్లయింది. కోడలి పేరు దీపిక. వాళ్లకు ఇద్దరు పిల్లలు. వాళ్ళు దేశ రాజధాని ఢిల్లీలో ఉంటారు.

రెండవ వాడు కిషోర్. పెళ్ళై రెండేళ్లయింది. కోడలి పేరు పల్లవి. ఇంకా పిల్లలు లేరు.

అందరికన్నా చిన్నది సాహితి. డిగ్రీ చదువుతోంది.

రవీంద్రకు పెళ్లైనప్పడు.. ఈ ఊళ్లోనే అమ్మానాన్నలు, తమ్ముడు, చెల్లెలు — అందరితో కలిసే ఉండేవారు.

రవీంద్ర భార్య దీపికకు ఇంతమందికి చాకిరీ చెయ్యాలంటే ఒళ్ళు ఒంగేది కాదు. చీటికీ మాటికి పుట్టింటికి వెళ్ళిపోయేది.

ఇక్కడున్నప్పుడు పని తప్పించుకోవడానికి ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి కూర్చునేది. లేదా ఏ గుడికో వెళ్ళిపోయేది. ఇంట్లో పనంతా అరుంధతి నెత్తిన పడేది. పనంతా అయ్యాక వచ్చి “అయ్యో నేను చేసేదాన్నిగా అత్తయ్యా! ఏమిటో పక్కింటి భాగ్యం ఏవో మాట్లాడుతూ ఉంటే టైమ్ తెలీలేదు” అనో, “నేను బయలుదేరే టైమ్‌కే గుడిలో పూజ చేయడం మొదలు పెట్టారు. పూజంతా అయ్యాక కానీ రాలేక పోయాను.” అంటూ తెగ నొచ్చుకునేది. కోడలు వచ్చినా తనకీ చాకిరీ తప్పలేదని అరుంధతి చిటపటలాడేది.

ఈ గొడవ భరించలేక రవీంద్ర ఢిల్లీలోని తన ఆఫీసుకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.

కిషోర్ పెళ్లి అయ్యాక మాత్రమే అరుంధతికి విశ్రాంతి దొరికింది.

ఇప్పుడు చిన్న కోడలికి ఇంటి పనులలో వీసమెత్తు సహాయం కూడా చెయ్యదు అరుంధతి.

“అమ్మకు పెద్ద వదిన అయితేనే గురువు” అంటూ వేళాకోళం ఆడేది సాహితి.

***

ఆ రోజు పొద్దున్నే పెద్దకొడుకు కోడలు ఢిల్లీ నుంచి దిగారు.

దీపిక వస్తూనే అరుంధతి దగ్గర కూర్చొని “అయ్యో అత్తయ్యా! ఎంత చిక్కిపోయారు” అంటూ ఆ రాత్రి ఆవిడ కాళ్లు ఒత్తసాగింది.

అరుంధతి కోడలు చేసే సేవకు మురిసిపోయేది. “ఏమోనే తల్లీ! నన్ను పట్టించుకునే వాళ్ళెవరు” అంటూ దీర్ఘాలు తీసేది.

‘పెద్ద వదిన ఇంతకు ముందు చేసిన చేష్టలన్నీ అమ్మ మర్చిపోయిందా?’ అని విస్తుపోవడం సాహితి వంతైంది.

వంటింట్లో పని చేస్తున్న పల్లవిని చూసి “అత్తయ్యా! పల్లవికి కాస్త సాయం చేస్తాను” అంటూ లోపలికి వచ్చి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుని కబుర్లు చెప్పేది కానీ ఒక్క పని కూడా ముట్టేది కాదు.

వంట అంతా అయిపోయాక అందరికీ తెలిసేలా అన్ని గిన్నెలూ తెచ్చి టేబుల్ మీద పెట్టేది.. అంత పనీ తనే చేసినట్టు “అబ్బా” చెమట తుడుచుకునేది.

“ఎందుకే అన్ని పనులూ నువ్వే చెయ్యడం. రా ఇలా కూర్చుని భోజనం చెయ్యి” అంటూ సానుభూతిగా తన పక్కనే కూర్చోబెట్టుకునేది అరుంధతి.

“ఇదిగో పల్లవీ! ఈ వేళ ఇడ్లీ వడ చేసి, సాంబారు, కొబ్బరి పచ్చడి చెయ్యి. అందరూ ఇష్టంగా తింటారు. రవీంద్రకు పనసపొట్టు కూర ఇష్టం. మధ్యాహ్నం భోజనం లోకి అది చెయ్యి.” అని అరుంధతి ఆర్డర్ చేసేది పల్లవికి.

తల్లి అలా చెప్తుంటే “ఏంటమ్మా ఇదేమన్నా హోటల్ అనుకున్నావా, అలా ఆర్డర్ పెడుతున్నావు” అని కసిరేది సాహితి. దాంతో అరుంధతి కిక్కురుమనేది కాదు.

పిల్లలకు వేరే వంట, పెద్దలందరికి ఒక్కక్కరికి ఒక్కో రకం వంట చేయాల్సి వచ్చేది పల్లవికి. సాహితి మాత్రం వదినకు సహాయం చేసేది. పెద్ద వదిన నటన చూసి అసహ్యం వేసేది సాహితికి.

ఇక పిల్లలిద్దరూ ఇల్లు పీకి పందిరేసేవారు. దీపిక అసలు పట్టించుకునేది కాదు. “పల్లవీ! వీళ్లకు స్నానం చేయించి, అన్నం పెట్టేసెయ్యి.” అంటూ ఊళ్ళో వాళ్ళను పలకరించి రావడానికి వెళ్ళిపోయేది. వాళ్ళను కంట్రోల్ చెయ్యలేక పల్లవికి తలప్రాణం తోకకు వచ్చేది.

ఆ రోజు రాత్రికే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళేది. అరుంధతిని పట్టుకుని ఏడ్చేసింది దీపిక. ఆ పై వారమే తన కొడుకు పుట్టిన రోజు పండుగ. “ఒరేయ్ మీ నానమ్మ మీకు ఏం బహుమతి ఇస్తుందో అడుగు” అంటూ అరుంధతి మెడలోని రెండు పేటల గొలుసు తీసుకునేది.

“రవీ! ఈ సారి మేము ఢిల్లీకి వస్తామురా. మధుర, బృందావనం చూడాలని కోరికగా ఉంది” అని అరుంధతి కొడుకును బతిమాలుతున్నట్టు అడిగేది.

రవీంద్ర సమాధానం చెప్పులోగానే దీపిక అందుకునేది. “మామయ్యా దూరాభారం, మీరు ప్రయాణం చేయడం కష్టం. అక్కడ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, మీరు తట్టుకోవడం కష్టం” అని ఒకసారి, “ఈ వేసవిలో మా అమ్మానాన్నలు వస్తున్నారు. మీరు కూడా వస్తే ఇల్లు చాలదు. వచ్చే సంవత్సరం వద్దురుగానీ” అని ఇంకోసారి సర్దిచెప్పేది. ఇది చాలా సార్లు జరిగింది. ఎప్పుడు వస్తామన్నా ఏదో ఒక వంక పెట్టేది. ఒకసారి వాళ్ళు ఏదో టూర్‌కు వెళ్ళుతున్నామన్నారు. ఇంకోసారి వాళ్ళే ఇక్కడికి వస్తున్నామన్నారు.

వీళ్ల సంగతి తెలిసినా ఏదో ఆశ చావక అడుగుతుంది అరుంధతి.

వాళ్ళు వెళ్ళిపోయాక “అబ్బ తుఫాను వెలసినట్టుంది” అన్నది సాహితి.

ఇంటికి అయే ఖర్చు మొత్తం కిషోరే పెట్టుకోవాల్సి వచ్చేది. పరంధామయ్యకు వచ్చే పెన్షన్ కానీ, ఊరిలోని పంట మీద వచ్చే ఆదాయం కానీ ఇవ్వనిచ్చేది కాదు అరుంధతి. కనీసం సాహితి కాలేజ్ ఫీజ్‌కు కూడా ఇచ్చేవాళ్ళు కాదు.

దీపికకు మహా అనుమానంగా ఉండేది. మామగారికి వచ్చే డబ్బు మొత్తం మరిది, తోడికోడలు కాజేస్తున్నారేమో అని. పోనీ అత్తమామలను తన దగ్గరే ఉంచుకుని ఆ డబ్బేదో తమే తీసుకుందామా అనిపించేది. కానీ చాకిరీ తల్చుకుంటే భయం వేసేది. అందుకే వీలున్నప్పుడంతా ఏవేవో మాయ మాటలు చెప్పి అత్త దగ్గర నుంచి డబ్బు, బంగారం తీసుకునేది.

***

ఒకసారి పక్కింటి పార్వతమ్మ వాళ్ళు మధుర బృందావనం వెళ్లి వచ్చి ఆ విశేషాలన్నీ చెప్తుంటే, తము కూడా అవన్నీ చూడాలని అరుంధతి మనసు లాగింది.

రవీంద్ర, దీపికలకు చెప్తే రావద్దాంటారని తెలుసు. అందుకే వాళ్లకు చెప్పకుండా కిషోర్ చేత టికెట్లు బుక్ చేయించింది. వాళ్ళు రైలు ఎక్కాక రవీంద్రకు ఫోన్ చేసి చెప్పాడు కిషోర్.. స్టేషన్‌కు వచ్చి వాళ్ళను రిసీవ్ చేసుకోమని.

***

అనుకోకుండా వచ్చిన అత్త మామలను చూసి మొహం చిట్లించింది దీపిక.

“మీరిలా చెప్పా పెట్టకుండా వస్తే ఎలా? మాకు ఇప్పుడు ఆఫీస్‌లో ఇన్‍స్పెక్షన్ జరుగుతోంది. ఎక్కడికీ తీసుకెళ్ళడానికి వీలు లేదు” అని రవీంద్ర కూడా అనేటప్పటికీ ఇద్దరూ చిన్నబుచ్చుకున్నారు.

ఇక దీపిక రోజూ విసుక్కుంటూ ఏదో ఇంత ఉడకేసేది. వంట చేసి టేబుల్ మీద పెట్టి ఏదో పని ఉన్నదానిలా బయటికి షాపింగ్ అంటూ వెళ్ళిపోయేది. “మేమూ నీతో వస్తాం” అన్నారు ఒకరోజు. అలాగే అన్నది.

ఒకరోజు వాళ్ళను బయటికి తీసుకెళ్ళి రిక్షా కూడా ఎక్కకుండా చాలా దూరం నడిపించింది. ఆ రాత్రంతా కాళ్ళు నొప్పులతో బాధ పడ్డారు. తరవాత ఏ రోజూ కోడలిని అడగలేదు.

అదే ఊరిలోనే ఉంటున్న అరుంధతి చెల్లెలి కొడుకు వీళ్ళను చూడడానికి వచ్చాడు. అతనే వీళ్ళను తీసుకెళ్ళి మధుర, బృందావనం చూపించాడు.

కొడుకు కోడలి ప్రవర్తనతో అసంతృప్తి చెంది మరో రెండు రోజులకే తమ ఊరికి వచ్చేశారు. ఇంట్లో అందరినీ చూసి ఏడుపొచ్చేసింది అరుంధతికి.

***

ఒక రోజు అరుంధతి బాత్‍రూమ్‌లో జారిపడి కాలి ఎముక విరిగింది.

మూడు నెలలు మంచానికే అంకితం అయిపోయిన తనకు పల్లవి చేస్తున్న సేవలు చూసి కడుపు చెరువైంది. దీపిక ఫోన్ చేసి బుడి బుడి దీర్ఘాలు తీస్తూ “అయ్యో అత్తయ్యా ఎంత పని జరిగింది. నేను వెంటనే రావాలనుకున్నాను కానీ పిల్లలకు స్కూల్ ఉందని ఆగిపోయాను. వీలు చూసుకుని అక్కడికి వచ్చి మీ సేవ చేసుకుంటాను. మీరు త్వరగా కోలుకోవాలని అందరు దేవుళ్ళకూ మొక్కుకున్నాను” అన్నది.

రెండు నెలలైనా ఆమె రాలేదు. రాదని కూడా వాళ్లకు తెలుసు.

ఇది చూసి ఒక నిర్ణయానికి వచ్చింది అరుంధతి.

మరో సంవత్సరానికి కిషోర్, పల్లవికి పండు లాంటి కొడుకు పుట్టాడు. అరుంధతికి వాడితో ఆడుకోవడమే పని. బాగా గారాం చేసేది వాడిని.

సాహితికి కూడా మంచి సంబంధం కుదిరింది. పెళ్లికి పెద్ద కొడుకు, కోడలు, పిల్లలూ వచ్చారు. పెళ్ళైన వెంటనే వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయారు. కనీసం ఖర్చుల సంగతి కూడా అడక్కుండా.

సాహితి అత్తగారి ఇంటికి వెళ్ళాక అరుంధతి, పల్లవిని పిలిచి కొన్ని కాయితాలు చేతిలో పెట్టింది. పొలం అమ్మగా వచ్చిన డబ్బు, బంగారం అంతా పల్లవికి చెందేటట్లు వీలునామా అది.

అది చూసి ఆశ్చర్యపడి, “ఇదేంటత్తయ్యా అక్కయ్యకు, సాహితికి ఇవ్వకుండా అంతా నాకే ఇచ్చేశారు. వాళ్లకు సమానంగా ఇవ్వండి” అన్నది.

“పిచ్చిదానా! నీ తోడికోడలు నీ అంత అమాయకురాలు కాదు. నా దగ్గర నుంచి చాలా బంగారం, డబ్బు ఇదివరకే తీసేసుకుంది. సాహితికి కూడా పెళ్ళిలో ఇచ్చేశాను. రేప్పొద్దున నాకేదైనా జరగరానిది జరిగితే ఇదంతా నీ తోడికోడలు నీకు దక్కనీయదు. తనే తీసుకుంటుంది. అందుకే ఇదంతా నీ కొడుకు పేరిట పెట్టాను. నీవు ఇది అంగీకరించాలి. నా కోరిక మన్నిస్తావు కదూ” అంటూ తడి కళ్ళతో చూసిన అత్తగారిని చూసి కాదనలేక పోయింది.

అంతలో సాహితి దగ్గరనుంచి వీడియో కాల్ వచ్చింది. “వదినా! అమ్మ చెప్పినట్టు చెయ్యి” అన్నది.

“ఓహో ఇందులో నీ హస్తం కూడా ఉందా” అన్న పల్లవి మాటలకు అంతా నవ్వేశారు.

Exit mobile version