Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిన్నబోయిన పెద్దరికం

[డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారు రచించిన ‘చిన్నబోయిన పెద్దరికం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

క వయసు వచ్చాక పెద్దవాళ్ళు ఎంతలో ఉండాలో అంతలోనే వుండాలనీ; పిల్లల ప్రతి విషయంలో ‘తగుదునమ్మా!’ అంటూ తలదూర్చగూడదనీ; అతిప్రేమలు, పిచ్చిప్రేమలూ పెంచుకోకూడదనీ మా ఆవిడకి రోజూ చిలక్కి చెప్పినట్టు చెబుతూనే వున్నాను. అయినా వినదే..? అందుకే పదేపదే గర్వభంగానికి గురవుతూ వుంటుంది. నా దగ్గరికి వచ్చి ‘ఆ కొడుకు అలా అన్నాడూ, కోడలు ఇలా అంది, అమ్మాయి నన్ను పూచికపుల్లలా తీసి పక్కనపడిస్తోంది’ అంటూ మొరపెట్టుకుంటుంది. మద్దెలకు రెండువైపులా మోత అయితే మా ఆవిడకు మూడువైపులా మోత; మా అమ్మాయి మైథిలి కూడా అదే అపార్టమెంట్ మూడో ప్లోర్‌లో వుంటుంది కదా మరి.. తనతో కలిపి!

తన నోరు వూరుకోక నేనేగా ఇంటి పెద్దని అనీ, అనుభవజ్ఞురాలిననీ తనకు తానే పెద్దరికాన్ని నెత్తిన వేసుకుని మరీ వాళ్ళకేదో సలహా ఇవ్వబోతుంది. వాళ్ళు వినకపోగా ఒకటికి రెండు మాటలు అంటారు. దాంతో రాజ్యాన్ని కోల్పోయిన రాజుగారి పట్టమహిషిలా ఉసూరుమని మనిషి నీరసపడిపోతుంది. ఈ రోజు మా అమ్మాయి మైథిలి “అమ్మా. నీకేం తెలియదు.. నువ్వూరుకో” అని కసురుకుందట. దాంతో “మరీ పెద్దా చిన్నా లేకుండా పోతోంది పిల్లలకు. మన కడుపున పుట్టిన పిల్లలే మనకు పాఠాలు చెబుతున్నారు” అంది తెగ ఉక్రోషపడిపోతూ. ‘మనకు’ అన్నమాటను వత్తి పలుకుతూ,

దాంతో నేను “మన పిల్లలు మనకు పాఠాలు చెప్పకపోతే పక్కింటి పెద్దవాళ్ళకు చెపుతారా? చెబితే మాత్రం వాళ్ళు ఊరుకుంటారా?” అన్నాను ప్రతి పదాన్ని సాగదీస్తూ.

దాంతో మా ఆవిడకు ఒళ్ళు మండింది.

“వెటకారాలకు, పుల్ల విరుపు మాటలకు సమయం, సందర్భం ఉండదా మీకు? మిమ్మల్ని అంటే అప్పుడు తెలుస్తుంది, ఆ బాధ ఎలా ఉంటుందో” అంది.

పిచ్చిమొహంది, తనకు వంటింట్లోనో, మధ్య హాల్లోనో చివాట్లు పడుతుంటే నాకు ముందుగదిలోనో, ఇంటి ముంగిలిలోనో ఉన్నప్పుడు కొడుకుతోనో, అల్లుడితోనో పడుతుంటాయని దానికి తెలవదు. నేను ఇంటి యజమానిని గనుక పెద్దదిక్కగా నాకు నేను భావిస్తూ, గౌరవించుకుంటూ ఉంటాను గనుక దెబ్బతిన్న పులిలా గాండ్రించకుండా ‘మ్యావ్.. మ్యావ్..’మని పిల్లిలా అంటూ తోక ముడుస్తానని దానికి తెలవదు.

పాపం ఈ ఆడవాళ్ళకి ఎవరన్నా ఏదన్నా అనగానే పుట్లకు పుట్ల సానుభూతి కావాలీ. ‘అయో ఎంత కష్టం వచ్చిందమ్మా’ అనే నాథుడి కావాలి. ‘నాథుడు’ అంటే నేను కాదు – నేనెప్పుడూ తనకు సానుభూతి చూపించను. తేలు కుట్టిన దొంగలా బాధను లోలోపల అణుచుకుంటూనే పైకి నవ్వుతూ జోకులు కాని జోకులు నాలుగు పేలుస్తాను. దాంతో అవి తుస్సుమనటమో రివర్స్ లో వచ్చి నా మొహాన్నే పేలటమో జరుగుతుంటుంది. ఇంతకు ముందు, అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ‘వాళ్ళని’ మనం కోపం చేస్తాం. వాళ్ళు పెరిగిపెద్దయ్యాక పెద్దలమైన ‘మనల్ని’ కోపం చేస్తారు. వృద్ధులు బాలలతో సమం కదా మరి.

‘భూమి గుండ్రంగా ఉంటుంది’ అన్న మాట కూడా నిజమేమరి. ‘ఆ కాలంలో ఇలా ఉండేదా?’ అంటే ఉండేది కాదు నిజమే, పెద్దవాళ్ళను చూస్తే వణికి చచ్చేవాళ్ళం. నేనయితే నడివయసు వచ్చేదాకా మా మా నాన్నతో చివాట్లు తింటూనే ఉండేవాడిని. అయినా, అదేంటో అప్పుడు కోపం వచ్చేది కాదు.

ఆ తిట్లు కూడా భలే తమాషాగా ఉండేవి. ఇప్పుడే చాలా మామూలుగా చెప్పినా కూడా కోపాలు వస్తున్నాయి.

వాళ్ళనే ఏంటి – వాళ్ళ పిల్లలు కూడా మాట పడటం లేదు. మొన్నోక రోజు మా మనవడు ఫ్రెండ్స్‌తో కలిసి ఎండలో క్రికెట్ ఆడుతుంటే “ఎండలో ఏం ఆటలురా – వడదెబ్బ కొడుతుంది. లోపలికి వెళ్ళండి” అని అన్నానని విసురుగా క్రికెట్ బాట్ అక్కడ పడేసి “ఈ గ్రాండ్‌పా కి ఎప్పుడూ నన్ను అరవటమే పనా? నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేసాడు” అని వాళ్ళ డాడీకి చెప్పుకుంటే – “మీరు కామ్‌గా ఉండలేరా నాన్నా. అందరి ముందూ అలా అరిస్తే వాడు హర్ట్ కాడా? చైల్డ్ సైకాలజీ అనేది ఒకటుంటుందని తెలుసా మీకు..? పిల్లల్ని చాలా కేర్‍ఫుల్‍గా హ్యాండిల్ చెయ్యాలి” అంటూ నాకు పాఠం చెప్పాడు. చైల్డ్ సైకాలజీ అనేది ఒకటి ఉంటుందని తెలిసిన వాడికి ఓల్డ్ ఏజ్ వాళ్ళకూ ఎడల్ట్స్ సైకాలజీ అనేది కూడా ఒకటి వుంటుందని తెలియదా? అయినా, ఎవరికి చెపుతున్నాడు వాడు – నేనేంటో ఒకప్పటి నా పొజిషన్ ఏంటో తెలిసే మాట్లాడుతున్నాడా? ఆ కాలం మనిషి అయిన వాళ్ళ అమ్మ ముందు ఈ కాలం ఈ కోడళ్ళు, కూతుళు ఎందుకు పనికొస్తారని.. కాలం మోడ్రన్ అయితే సరిపోతుందా?

మనుషుల ఆలోచనలు – అదే, వే ఆఫ్ థింకింగ్ అది మోడ్రన్‌గా ఉండొద్దా. మోడ్రన్ అంటే అర్థం ఏమిటి? అభివృద్ధి అని దేన్నంటారు?! అని దీర్ఘంగా ఆలోచిస్తుండి పోయాను నేను. అప్పుడు నాకు, మేము వయసులో ఉన్నప్పటి – మా ముగ్గరు పిల్లలూ చాలా చిన్నగా ఉన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి,

***

నా పేరు జమదగ్ని. మా ఆవిడ పేరు ఆనందమయి.

ఆ రోజుల్లోనే తను బిఏ. బి.ఎడ్ చేసి ఓ గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూలులో టీచరుగా పనిచేసింది. చాలా అందమైన, పొందిక అయిన మనిషి.

తను చాలా ఓర్పు, నేర్పు కల ఇల్లాలనీ, అతిథులను, బంధువర్గాన్ని ఆదరించటంలో తనకు తనే సాటి అనీ అనిపించుకుంది. మా అమ్మా నాన్నలకయితే పెద్ద కోడలు అంటే ఎంత ఇష్టం, అభిమానం ఉండేవో. ‘చదువుకున్న దాన్ననీ, ఉద్యోగస్థురాలిననే గర్వం ఏ మాత్రం లేదు మా పిల్లలో, నెమ్మదితనం, మాట మన్నన గల పద్ధతైన పిల్ల’ అనుకుంటూ తన మీద ప్రశంసల జల్లు కురిపిస్తుండే వాళ్ళు చుట్టపక్కాలు.

నేను ఎమ్.ఏ. ఎమ్.ఎడ్ చేసి ఓ కాలేజీలో లెక్చరర్‌గా ఇరవై ఏళ్ళు చేసి, ఆ తర్వాత ప్రొఫెసర్ ప్రమోషన్ పొందాను, డాక్టరేట్ చెయ్యటం వల్ల. మా ఇద్దరిది ‘చూడ చక్కని జంట’ అనేవాళ్ళు అంతా ఆ రోజుల్లో. ‘రామునికి సీత తోడు – సీతకు రాముడ అండ’ అని మెచ్చుకునేవారు. మేమిద్దరం మమ్మల్ని మేము అలా డెవలప్ చేసుకుంటూనే అమ్మ, నాన్నల వృద్ధాప్యంలో వాళ్ళకు ఆసరాగా ఉన్నాం. ఫైనాన్షియల్‌గా నేను, వంటావార్పు ఇల్లాలితనంతో తను – నా తమ్ముళ్ళ చెల్లెళ్ల బాధ్యతను నెత్తిన వేసుకున్నాం.

అలాంటి మమ్మల్ని, ఇప్పుడు మా పిల్లలు తీసిపడేస్తున్నారు.

కాల పరిణామం, తరాల అంతరం కొద్దో గొప్పో తప్పదేమో గానీ మరీ ఇంతగానా? ఇలానా?

నా ఆలోచనలు వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఉప్పెనలా ఇంతెత్తున ఆ ఆలోచనల అలలు ఎగిసెగిసి పడుతున్నాయి.

అన్నీ తెలిసిన నేను; అన్నీ ఉన్న నేను – ఏమి లేకపోయినా విద్య ఉందని మురిసిపోతున్న- డబ్బును చూసి గర్వపడి పోతున్న ఈ పిల్లలకు – సీమటపాకాయల్లా ఒకసారి, లక్ష్మీ బాంబుల్లా మరొకసారి మాటల విసుర్లను విసిరే వీళ్ళకు నేనెందుకు భయపడుతున్నాను.. ఎందుకు వాళ్ళను ఏమీ మందలించలేక పోతున్నాను? వాళ్ళలా నేను వాదన ఎందుకు పెట్టుకోలేకపోతున్నాను?

నా చదువు, నా తెవివి, నా ఉద్యోగం, నా సంపాదన ఇవన్నీ ఎందుకు మౌనంతో వాళ్ళకు తలలు వంచుతున్నాయి..?

ఎందుకంటే – ‘కన్నూ మనదే, వేలూ మనదే’ అన్న మానసిక బలహీనతతో.

ఎందుకంటే – ‘దేన్నయినా తెగే దాకా లాగకూడదు; ఒక్కరైనా కాస్త పట్టు సడలించాలి’ గనుక.

ఎందుకంటే – ‘ఎంత కాదనుకున్నా వాళ్ళ మీదా, వాళ్ళ పిల్లల మీదా రక్త సంబంధానికి సంబంధించిన బంధం ఒకటి మనసును పట్టిలాసతుంది’ గనుక .

‘పిల్లలకు లేకపోయినా పెద్దలకు ఉండాలి కదా బుద్ధి’ అన్న అంతర్గత భావనా; తెచ్చిపెట్టుకున్న పెద్దరికం మనసును ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటాయి గనుక. వీటన్నింటినీ మించి సంస్కారం అనేది మాట తూలకుందా ఎప్పటికప్పుడు అడ్డుపడుతుంటుంది గనుక.

మరి ఇవన్సీ ‘వాళ్ళ’కెందుకు ఉండవు..?

ఎప్పుడూ తన ఆనందను తను హెచ్చరించడమే గాని వాళ్ళకెందుకు చెప్పలేకపోతున్నాను? ఎందుకంటే, ఎదిగిన పిల్లలు భౌతికం గానే కాక, మానసికంగా కూడా తల్లిదండ్రలకు దూరమవుతారు గనక. ఎంత తేడా అప్పటికీ ఇప్పటికీ?! పాపం నా కన్నా ఎక్కవ ఆనంద స్త్రీ అయినందుకు ఎంతగా మానసిక క్షోభ అనుభవిస్తోంది నిత్యం. వాళ్ళ కోసమని ‘ఏవేవో’ సలహాలు ఇస్తుంటుంది గనుకనా?

“వంకాయ ముక్కలు ఉప్పు, పసుపు వేసిన నీళ్ళలో తరిగితే కనెరెక్కవు”

“దివ్య ఇంకా చిన్నిపిల్ల కాదు. మెచ్యూర్ కూడా అయింది. పదిమందిలోకి వెళ్ళేటప్పుడు కాస్త నిండుగా బట్టలేసుకొని వెళ్ళమని చెప్పమ్మా – కాలం అసలే బాగా లేదు.”

“రాజీవ్ ఇంకా ఇంటికి రాలేదు. మగపిల్లాడే కదా! అని అలా వదిలేయకు – కాస్త కనిపెట్టి ఉండు. ఈ రోజుల్లో సమాజంలో ఎక్కడ చూసినా గంజాయి మత్తు డ్రగ్స్, రింగ్ రోడ్డు మీద ఒళ్ళు గగుర్పుడిచే బైక్ విన్యాసాలూ అంటూ మగపిల్లలు రెచ్చిపోతున్నారు. జాగ్రత్తలు చెప్పాలి పిల్లలకు” అంటూ వంటింట్లోనో; డైనింగ్ టేబుల్ దగ్గరో చేరి ఇటు కోడలికి, అటు కూతురికి హితబోధ చేయబోతుంది. దాంతో కాసేపట్లోనే అక్కడ ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుంది.

“అబ్బబ్బ.. ఎప్పుడు చూసినా నా వెనక చేరి ఏవేవో లెక్చర్లు ఇస్తుంటారు. మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో మాకు తెలియదా? మేము ఇంకా చిన్నపిల్లలమా మీరు చెపితే వినటానికి? పిల్లలు కాలానికి తగ్గట్టు వుంటారు. మోడ్రన్ సొసైటీ, అందులోనూ మోడ్రన్ టెక్నాలజీ ట్రెండ్ నడిస్తున్నప్పుడు పిల్లలు ఎంజాయ్ చేయకుండా ఎందుకుంటారు.. మీరు పెద్దవాళ్ళు, ఆ కాలం మనుషులు – అప్పుడు మీరు ఉన్నట్టు ఇప్పుడు పిల్లలు ఉండమంటే ఎలా? పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వొద్దు అంటే ఎలా?” అని రంకెలేస్తుంది కోడలు పెద్ద గొంతుతో. అక్కడే వుండి, అన్నం తింటున్న నా పుత్రరత్నం “అమ్మా. నువ్వు ప్రతి దాంట్లో తలదూర్చకు. అంతా సుజాత చూసుకుంటుంది గానీ తనకు వదిలేయ్.” అంటాడు. అమ్మ పెద్దది, నన్ను కని పెంచిన తల్లి అన్న ఒంటి మీది స్పృహ లేని వాడిలా వాడలా నా భార్యను అగౌరవపరిచి మాట్లాడుతుంటే – లాగి చెంపమీద ఒక్కటి ఇవ్వాలని నాకనిపిస్తుంది గానీ, నలభై ఏళ్ల వయసు, 80 కేజీల బరువు, ఆరు అడుగుల పొడవు బాడీ చూసి ఆ పని చేయలేకపోయాను. తల్లిదండ్రుల ఈ ఆలోచనా విధానమే, నరనరాల్లో జీర్ణించుకొనిపోయిన ఈ సంస్కారమే పిల్లల్ని అలా రెచ్చిపోయేలా చేస్తోందా? అని ఆలోచించింది నా మనసు.

కోడలంటే పరాయి ఇంటి నుంచి వచ్చింది – ఈ కొద్దిపాటి బాధ్యతనయినా లోకం కోసం తీసుకుంటోంది గానీ మా మీది ప్రేమతో కాదు.

కాని, రక్తం పంచుకొని పుట్టిన కూతురు, తనకేమయింది! కూతురిననే చనువుతో, కోడలికన్నా మరి నాలుగు మాటలు ఎక్కవ అంటుందా? నా మొగుడు, నా పిల్లలు, నా ఇల్లు మాత్రమే అన్న స్వార్థం కన్నవాళ్ళను దూరంగా పెద్దతుందా?

మొన్నొక రోజు వాళ్ళ అమ్మతో వాదన పెట్టకుంటూ అంటుంటే విన్నాను – “అమ్మా. నీ అభిప్రాయాలు నీవి, మా అభిప్రాయాలు మావి. నీలాగా అందరూ ఆలోచించాలని – నువ్వు చెప్పినట్టే అందరూ నడుచుకోవాలని ఎందుకనుకుంటావ్. మీ కాలం మీది మా కాలం మాది. ఇప్పుడు, పిల్లల కాలం పిల్లలది. ఎవరి స్వేచ్ఛ, ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళకుంటాయి. మనం ఎవరు, వాళ్ళమీద ఏదైనా బలవంతంగా రుద్దడానికి? నువ్వు ఎవ్వరికీ అనవసరంగా ఏ సలహాలూ ఇవ్వకు. వాళ్ళ డ్రెస్సింగ్ గురించి గానీ, వాళ్ళ బిహేవియర్ గురించి గానీ – ఈ కాలం పిల్లలకు అన్నీ తెలుసు.. మనమేమీ చెప్పనవసరం లేదు” అని ఆ టీచరమ్మకు నా కూతురు క్లాసు పీకుతోంది. అది చూసి, విని అటు ఆనంద, ఇటు నేనూ ఆశ్చర్యపోయి నోరెళ్ళబెట్టి అలా చూస్తుండిపోయాం.

టీచింగ్ వృత్తిలో అన్ని సంవత్సరాలు పని చేసిన మా ఇద్దరికి కూడా ఆ క్లాస్ విన్నాక దిమ్మతిరిగిపోయింది. పైకి ఏమీ అనలేదు కాని నేనయితే నా మనసులో అనుకున్నాను – ‘అలాంటప్పుడు కుటుంబం అన్న మాటకు ఇక అర్థం ఏముంది? పేరెంటింగ్ అని దీన్ని కాక కాక మరింక దేన్ని అంటారు? ఎవరికివారే అనుకున్నప్పుడు ఎందుకు ఒక కప్పు కింద ఇలా అందరూ కలిసి జీవించడం’ అని! నా ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేరు – చెప్పగల జ్ఞానం ఉంటే అసలు అలా మాట్లాడనే మాట్లాడరు.

ఆనందమయి ఇంట్లో ఉత్తమ ఇల్లాలిగానే కాక – బయటి వృత్తి ధర్మంలోనూ, కళారంగం లోనూ అప్పట్లో, ఇప్పుడు కూడా అద్భుతంగా రాణిస్తోంది. రిటైరైన తర్వాత కూడా ఎన్నో సంస్థలు వివిధ సంధర్భాలలో ఆమెను ఎక్స్‌టెన్షన్ లెక్చర్లకు పిలుస్తుంటారు – సామాజిక అంశాలతో చక్కటి ఆర్టికల్స్ రాస్తుంది. బొమ్మలు వేస్తుంది. రకరకాల హ్యాండీక్రాఫ్ట్స్ చేస్తుంది. ఎన్నో సంస్థల్లో ఆమె మెంబరు. అనర్గళంగా మాట్లాడుతుంది ఏది మాట్లాడినా. అలాంటి తల్లి ఇప్పుడు పిల్లలకి ఏమీ రానిది, ఏమీ తెలియనిదిగా అయిపోయింది. బయట ఆమెకు బ్రహ్మరథం అయితే ఇంట్లో కనీస గుర్తింపు కూడా లేదు.

ఎవరో ఒక సైకాలజిస్ట్ ఒక దగ్గర చెబుతుంటే విన్నాడు తాను – “బయట ఎంత గొప్పవారయినా ఇంట్లో వాళ్ళకు అతి సామాన్యులే. అందులోనూ ముఖ్యంగా స్త్రీ.. ఆమె ప్రతిభకు ఇంట్లోనే ఎప్పుడూ గుర్తింపు లభించదు” అని. ఆనందమయి విషయoలో అలాగే జరుగుతోంది. తను అలా తన పిల్లలతోనే చిన్నచూపు చూడబడుతుంటే – అందరూ ఉప్నాలో కరేపాకులా ఏరిపడేస్తుంటే తన మనసు తట్టుకోలేకపోతోంది. ‘ఏదయినా చేయాలి. నేనే ఏదయినా చేయాలి. ఈ వాతావరణానికి దూరంగా ఆమెను నేను తీసుకెళ్లాలి. భర్తగా అది నా బాధ్యత’ అని ఆలోచిస్తూ పడికుండిపోయాను నేను.

***

‘పెద్దరికం అనేది ఎప్పుడూ అదొక గౌరవప్రదమైన స్థానం.

అది ఎప్పుడూ చిన్నదైపోకూడదు.

అది ఎప్పుడూ చిన్నబోకూడదు.

గురువు గురువే.. తను ఎప్పుడూ లఘువు అయిపోకూడదు.

తల్లి తొలి గురువు తన పిల్లలకు – తను చెప్పింది వినకుంటే ఎలా?’

నా ఆలోచనలు సుదీర్ఘంగా సాగిపోతున్నాయి.

అది కనిపెట్టినట్టుంది మా ఆవిడ. వచ్చి నా పక్కన కూర్చుంది.

నా ముఖం వంక దీక్షగా చూస్తూ “మీరు జమదగ్ని. తండ్రిగా మీ మనసు ఒక గురుపీఠం – దానికి అవమానం జరుగుతుంటే చూసి తట్టుకోలేక పోతున్నానండి – నన్ను అన్నా ఫరవాలేదు గానీ” అని ఇంకా ఏదో అనబోతుంటే మధ్యలో ఆపి – “ఎందుకు ఫరవాలేదు? నీకు లేదేమో గానీ నాకుంది ఫరవా! నువ్వు నా గురించి ఆలోచిస్తున్నట్లే నేను నీ గురించి ఆలోచిస్తున్నాను” అన్నాను. ఆ మాటలకు ఆనంద కళల్లో కన్నీళ్ళు. “ఆనందా, ఈ రోజు మన అబ్బాయి అడగుతున్నాడు. పెద్దవాడూ, చిన్నవాడూ మాట్లాడుకున్నట్లున్నారు. ‘మన ఊళ్లో ఉన్న ఆ పాత ఇల్లు అమ్మేద్దాం నాన్నా’ అని. నేను వద్దన్నాను.”

“ఎందుకలా అన్నారు?”

“మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఆ పాత ఇల్లు బాగు చేయించుకొని అందులో మనం ఉంటూనే అక్కడ పేదపిల్లల కోసం ఒక బడి పెట్టి, వాళ్ళకు ఉచితంగా చదువు చెబుదాం. చిన్నపిల్లలకు నువ్వు చెప్పు. యువతకు నేను చెబుతాను. ఆ ఊరి జనానికి నువ్వంటే చాలా ఇష్టం. నిన్నో దేవతగా చూసుకుంటారు. గౌరవం లేని ఇక్కడ ఉన్నదానికన్నా..” అని నేను అంటుంటే “మన పిల్లలమీద మనం అలగటం ఏంటండి? వాళ్ళు తప్పుచేస్తున్నారు నిజమే -వాళ్ళనే కాదు.. ఇప్పుడు సమాజం అంతా అలాగే వుంది. పిల్లలకు పెద్దల పొడ గిట్టడం లేదు. మంచి చెప్పబోయినా శత్రువుగా చూస్తున్నారు..” అంది.

“అందుకే నేనూ అంటన్నది. మనం ఇక్కడ ఉన్నంత కాలం వాళ్ళకు మన విలువ తెలీదు. దూరంగా వెళ్లాక అప్పుడయినా వాళ్ళు పోగొట్టకున్నదేమిటో వాళ్ళకు తెలిసివస్తుందేమో. మన మాటల్లోని నిజం, మన సలహాల్లోని మన పెద్దరికం, నీ వంటల రుచి, నీ ప్రతిభ ఇవన్సీ అప్పుడు గుర్తించగలుగుతారేమో! నువ్వన్నట్టు మన పిల్లలని మనం క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు? ఇంకా వయసు మీద పడి మన పనులు మనం చేసుకోలేని స్థితికి చేరుకున్నాక మళ్లీ వాళ్ల దగ్గరికేగా మనం చేరాలి. ఒక్కరోజుతో సడన్‌గా తెగిపోయే బంధాలా ఇవి? ఇప్పుడుంటే నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం. కాలధరాన్ని అనుసరించి ఒకరం వెళ్ళిపోతే రెండో వాళ్ళకి మళ్ళీ వాళ్ళేగా దిక్కు. ఈలోగా కొద్ది సంవత్సరాలు మన ఊల్లో వుండి కొన్ని పనులు చక్కబెట్టి, పిల్లలు, యువతకు చదువు విలువను తెలియ చెబుదాం. మన ఊరికోసం ఒక మంచి పనిని చేసినట్టూ అవుతుంది – మనకూ ఒక మంచి మార్పు లభిస్తుంది.” అని నేను అనగానే “అలాగే చేద్దాం” అంది ఆనందమయి ఆనందంగా.

Exit mobile version