Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిన్నితెర మాణిక్యాలు – ఆరెంజ్ ఈజ్ ద న్యూ బ్లాక్

[సంచిక పాఠకుల కోసం ‘చిన్నితెర మాణిక్యాలు – ఆరెంజ్ ఈజ్ ద న్యూ బ్లాక్’ అనే రచనని అందిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

జైలు జీవితం ఎలా ఉంటుందో బయట ఉన్నవారికి ఊహించటం కష్టం. జైల్లో కూడా గ్యాంగ్‌లు ఉంటాయి. ఆధిపత్య పోరాటం ఉంటుంది. డ్రగ్స్ ఉంటాయి. సెక్స్ ఉంటుంది. అదేంటి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి వేరు జైళ్ళు ఉంటాయి కదా అంటారేమో, మగవాళ్ళు మగవాళ్ళపై అత్యాచారం చేయటం జైళ్ళలో జరిగేదే. ఆడవాళ్ళు లైంగిక వాంఛలు తీర్చుకోవటానికి వేరే ఆడవాళ్ళతో లైంగిక చర్యలు చేస్తారు. ఇలాంటి కథలు అవసరమా? అని కొట్టిపారేయవద్దు. ‘ఆరెంజ్ ఈజ్ ద న్యూ బ్లాక్’ సీరీస్‌లో జైలులో ఉండేవారి ఆవేదన, ఆక్రోశం, ఆశలు కూడా ఉంటాయి. నేరస్థులు ఉండే చోట వికృత చేష్టలు ఉంటాయి. అందరు నేరస్థులూ చెడ్డవారు కాదు. చెడ్డ నేరస్థుల కథల్లో కూడా కంటతడి పెట్టించే వెతలు ఉంటాయి. ఈ సీరీస్ పెద్దలకి మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు చూపించకండి అని మాత్రం చెప్పాల్సిందే. పెద్దవారు కూడా ఒక్కోసారి కలిసి కూర్చుని చూడటం ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని దృశ్యాలు ఇబ్బందికరంగా ఉన్నాయని మొత్తం సీరీస్ వదులుకోవద్దని నా సలహా. ఈ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. హిందీ శబ్దానువాదం అందుబాటులో ఉంది.

ఈ సీరీస్ ఒక ఆడవాళ్ళ జైలులో జరిగే కథ. తక్కువ కట్టుబాట్లు ఉండే జైలు ఇది. చిన్న నేరాలు, తెలియక నేరాలు చేసినవారు ఈ జైల్లో ఉంటారు. కటకటాలు ఉండవు. డార్మిటరీ లాగా బ్లాకులు ఉంటాయి. కంచె దృఢంగా ఉంటుంది కానీ ఆరుబయట కూడా తిరగొచ్చు. డ్రగ్ మ్యూల్స్ (డ్రగ్స్ తరలించేవారు), చిన్న చిన్న ఆర్థిక నేరాలు చేసినవారు, హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా ఒకరి మరణానికి కారణమైనవారు ఈ జైల్లో ఉంటారు. ముఖ్యంగా మూడు బృందాలలో వీరు ఉంటారు. శ్వేతజాతీయులు, నల్లజాతీయులు, ల్యాటిన్ అమెరికన్లు. రెండేళ్ళలో జరిగే కథే అయినా ఏడు సీజన్లు నడిచింది. ఒక సీజన్ అయితే కేవలం మూడు రోజుల కథ. చాలామంది నటీనటులు నటించారు. ఇంతమంది నటీనటులతో కథ(లు) నడిపించి రక్తి కట్టించటం అబ్బురం కలిగిస్తుంది. ఇంతకీ ‘ఆరంజ్ ఈజ్ ద న్యూ బ్లాక్’ అంటే అర్థమేంటి? మామూలుగా పాశ్చాత్య దేశాలలో ఆడవారు సాయంత్రం వేళల్లో పార్టీలకి నల్లరంగు (బ్లాక్) డ్రస్సులు వివిధ రూపాల్లో వేసుకుంటారు. గ్రీన్ ఈజ్ ద న్యూ బ్లాక్ అంటే ఆకుపచ్చ రంగు ప్రస్తుతం ఫ్యాషన్‌లో ఉంది అని. అలా ఫ్యాషన్లు మారిపోతూ ఉంటే రంగుని బట్టి ఈ వాక్యం కూడా మారుతుంది. జైల్లోకి కొత్తగా వచ్చినవారికి అమెరికాలో నారింజ (ఆరెంజ్) రంగు బట్టలు ఇస్తారు. ఆ నారింజ రంగు అక్కడ ఫ్యాషన్ అని వ్యంగ్యంగా పెట్టిన పేరు ఇది.

పైపర్ అనే యువతి (ముప్పై ఏళ్ళ పైనే) జైలుకి వెళ్ళటంతో కథ మొదలవుతుంది. ఆమెకి ఒక ప్రియురాలు ఉండేది. ఆమె పేరు ఆలెక్స్. డ్రగ్స్ తరలించేది. ఆమె అడిగిందని పైపర్ ఒకసారి డ్రగ్స్ వ్యాపారం కోసం అంతర్జాతీయ విమానంలో డబ్బు తీసుకెళుతుండగా పట్టుబడింది. ఆలెక్స్ అరెస్టయి జైలుకి వెళుతుంది. పదేళ్ళ వరకు పైపర్ బయటే ఉంటుంది. కానీ సుదీర్ఘమైన విచారణ తర్వాత ఆమె నేరానికి పాల్పడిందని నిర్ధారించి ఆమెకి 15 నెలల సాధారణ జైలు శిక్ష వేస్తారు. ఒక మాట మాత్రం నిజం. అమెరికాలో జైళ్ళు ఇండియాలో జైళ్ళ కన్నా చాలా నయం. కానీ మనవి ఇనప పంజరాలైతే అవి బంగారు పంజరాలు. అంతే తేడా. తాజా కూరగాయలు, తాజా మాంసం ఉండదు. ఫ్రీజ్ చేసినవే వండి పెడతారు. కొంతమంది ఖైదీలు వంట చేస్తారు. కొందరు గచ్చులు, బాత్రూములు శుభ్రం చేస్తారు. ఖైదీలకి ప్రత్యేక అకౌంట్లు ఉంటాయి. అందులో డబ్బు ఉంటే కావాల్సిన చిన్న వస్తువులు, చిరుతిళ్ళు జైల్లోనే కొనుక్కోవచ్చు. ప్రార్థన చేసుకోవటానికి చర్చి ఉంటుంది. లైబ్రరీ ఉంటుంది. వారానికోసారి సినిమా చూపిస్తారు. అప్పుడప్పుడూ కుటుంబసభ్యులు వచ్చి కలుస్తారు. ఎదురుబదురూ కూర్చుని మాట్లాడుకోవచ్చు.

ఖైదీలది ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. రెడ్ అనే ఆమె నడివయసుది. రష్యన్ మాఫియా గ్యాంగ్‌లో పనిచేయటం వల్ల శిక్ష పడింది. ఆమె జైల్లో వంటగదిని నడుపుతుంది. ఆమె కింద పని చేసేవాళ్ళని బిడ్డల్లా చూసుకుంటుంది. కానీ ఎవరైనా ఆమెని అవమానిస్తే ఊరుకోదు. మాఫియాలో పని చేసింది కాబట్టి వ్యూహరచన బాగా తెలుసు. కానీ డ్రగ్స్‌కి దూరంగా ఉండమని తన బృందంలోని వారికి చెబుతుంది. ఇంతకీ డ్రగ్స్ జైల్లోకి ఎలా వస్తాయి? డబ్బుకి ఆశపడి గార్డులు తరలిస్తారు. మామూలుగా ఒక ఖైదీ గ్యాంగ్ లీడర్‌గా ఉంటుంది. ఆ గ్యాంగ్ డ్రగ్స్ వ్యాపారం చేస్తుంది. డ్రగ్స్ వాడే ఖైదీలు తమ అకౌంట్ డబ్బులతో వస్తువులు కొని గ్యాంగ్‌కి చెల్లింపులు చేస్తారు. లేదా గ్యాంగ్ సభ్యుల అకౌంట్‌లోకి డబ్బులు బదిలీ చేయిస్తారు. కొంత డబ్బు గార్డులకి వెళుతుంది. గార్డులలో మగవారు కూడా ఉంటారు. నిబంధనలున్నా కొందరు గార్డులు ఖైదీల మీద లైంగిక చర్యలకి పాల్పడతారు. డాయా అనే ఖైదీ ఒక గార్డుని ప్రేమిస్తుంది. అతను కూడా ఆమెని ప్రేమిస్తాడు. మామూలు ప్రేమకథలకే ఎన్నో అడ్డంకులు. ఇక జైల్లో చెప్పాలా?

డాయా తల్లి కూడా ఆ జైల్లోనే ఉంటుంది! ఇద్దరూ బయట డ్రగ్స్ వ్యాపారంలో ఉండటం వల్లే జైలుకి వచ్చారు. తల్లికి నలభై ఏళ్ళ లోపే ఉంటాయి. ఆమె లాటిన్ అమెరికన్ (మెక్సికో, కొలొంబియా లాంటి దేశాలన్ని కలిపితే లాటిన్ అమెరికా). డాయా మాత్రం అమెరికాలో పుట్టింది. ఆమె ప్రేమించిన గార్డు శ్వేతజాతీయుడు. డాయా తల్లికి అతను డాయాని పెళ్ళి చేసుకుంటాడని నమ్మకం లేదు. ఆమె అనుభవం ఆమెకి నేర్పిన పాఠమది. గార్డులు ఖైదీలతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది శిక్షార్హమైన నేరం. డాయా తల్లి అతన్ని బెదిరించి డ్రగ్స్ తరలింపుకి అతన్ని వాడుకుంటుంది. ఆమెకి ఇంకా పిల్లలు ఉన్నారు. వారి కోసం డబ్బు కూడబెడుతుంది. సుజాన్ అనే నల్లజాతి స్త్రీది లోకం తీరు తెలియని మనస్తత్వం. కాస్త ఉన్మాదంతో ఉంటుంది. పట్టిన పట్టు వదలదు. పైపర్ జైల్లోకి రాగానే ఆమె “నువ్వు నా భార్యవి” అని వెంటపడుతుంది. మరో ఖైదీ పరుగుపందేల్లో రాణించింది కానీ ప్రియుడి వల్ల బ్యాంక్ దోపిడీలో పట్టుబడింది. ఒక్క తప్పు వల్ల జీవితం తలకిందులయింది. మరో ఖైదీ ఎయిర్‌పోర్ట్‌లో సామాన్లు తనిఖీ చేసేది. ప్రయాణీకులు సామాన్ల నుంచి ఐప్యాడ్‌లు, ఇతర వస్తువులు దొంగిలించటంతో శిక్ష పడింది. ఆమెకి ఓ బిడ్డ ఉంది. ఆ బిడ్డని ఆమె తల్లి పెంచుతుంది. తన తల్లే ఆ బిడ్డకి కూడా తల్లి అని చెబుతుంది. ఆ బిడ్డ తన సొంత తల్లిని అక్క అనుకుంటూ పెరుగుతుంది. పైపర్ ఎగువ మధ్యతరగతిలో పెరిగింది. కొంచెం తిరుగుబాటు మనస్తత్వం కలదే కానీ జైలు వాతావరణం ఎవరినైనా వంచేస్తుంది. పైపర్‌కి తగిలే మరో షాక్ ఏమిటంటే ఆమె మాజీ ప్రియురాలు ఆలెక్స్ కూడా అదే జైల్లో ఉంటుంది. ఆమె విచారణలో తన పేరు బయటపెట్టిందా లేదా అనేది పైపర్‌కి పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఆమెని రోజూ చూడకతప్పని పరిస్థితి.

ఖైదీలని ఒక చోటి నుంచి ఒక చోటికి తరలించటానికి, అవసరమైతే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళటానికి ఒక వ్యాన్ ఉంటుంది. ఆ వ్యాన్ నడిపేది కూడా ఒక ఖైదీయే. ఒక గార్డు కూడా ఉంటాడు. అమెరికా చట్టాల ప్రకారం పని చేసే వారందరికీ జీతాలు ఇవ్వాలి. ఖైదీలైనా సరే. కొందరు ఎలెక్ట్రికల్ పని నేర్చుకుంటారు. కొందరు తోట పని చేస్తారు. వారికి కొంత జీతం వస్తుంది. వార్డెన్ ఒక స్త్రీ. ఆమె భర్త రాజకీయ నాయకుడు. ఆమె జైలు ఖర్చుల్లో కొంత మిగుల్చుకుని ఆ డబ్బు స్వాహా చేస్తూ ఉంటుంది. గార్డులకి హెడ్డు ఒకతను ఉంటాడు. మంచివాడే కానీ హస్తప్రయోగం అలావాటు ఉంటుంది. అసలే స్త్రీల జైలు. తన గదిలో కూర్చుని అపుడప్పుడూ హస్తప్రయోగం చేసుకుంటూ ఉంటాడు. ఖైదీల మీద లైంగిక దాడి చేయట్లేదు కదా, తప్పేంటి అన్నట్టు ఉంటాడు. ఇతనే తర్వాత వార్డెన్ అవుతాడు. ఒక గార్డుకి స్త్రీలంటే చులకనభావం. నేరస్థులైన స్త్రీలంటే మరీ చులకన. ఖైదీలందరూ మగతోడు కోసం అర్రులు చాస్తున్నారు అని అతని భావన.

పైన చెప్పిన ఖైదీల కథలన్నీ ఏదో మాటల్లో దొర్లిన కథలు కాదు. ఒక్కో ఖైదీ కథని ఒక్కో ఎపిసోడ్‌లో ఫ్లాష్‌బ్యాక్‌లో చూపిస్తారు. ఆ ఫ్లాష్‌బ్యాక్‌ కూడా చిన్న చిన్న భాగాల్లో వస్తుంది. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో వారి మనస్తత్వాలు కూడా ఆవిష్కృతమౌతాయి. వ్యాన్ నడిపే ఖైదీ తనకి ఒక ప్రియుడు ఉన్నాడని, విడుదల కాగానే అతన్ని పెళ్ళి చేసుకుంటానని అంటుంది. నిజానికి ఆమె భ్రమలో ఉంది. ఆమె ప్రియుడు అనుకుంటున్నవాడు ఒకసారి ఆమెతో నవ్వుతూ మాట్లాడేసరికి ఆమె అది ప్రేమ అనుకుంది. అతని వెంటపడింది. అతని ప్రియురాలిని చంపాలని ప్రయత్నించింది. జైల్లో ఉన్నా అతనే ప్రియుడని అనుకుంటుంది. ఆమెని చూసి జాలి వేస్తుంది. మనం కొందరి గురించి కథలు విని వారు ఉన్మాదులకి తీర్మానం చేస్తాం. కానీ వారికి అది ఉన్మాదం కాదు, వారు నమ్మిన నిజం. ఆమె అలా ఎందుకు మారింది అనే దానికి సమాధానం ఆమె గతంలో ఉంది. ఇది చివరి సీజన్ లో వస్తుంది. అప్పటికి ఆమె వేరే అతన్ని పెళ్ళి చేసుకుంటుంది. కానీ అదీ విషాదంగానే ముగుస్తుంది. గతం మిగిల్చిన గాయాలు, విధి ఆడిన క్రీడల మధ్యలో ఆమె నలిగిపోతుంది. ఇంతకీ జైల్లో ఉన్న ఆమె పెళ్ళి ఎలా చేసుకుంది? ఖైదీలతో కలం స్నేహం చేసేవారు కూడా ఉంటారు. ఆమె భర్త అలా దొరికినవాడే! ఇలా ఖైదీల కథలన్నీ వివరంగా చూపించటంలో ఈ సీరీస్ సృష్టికర్తలు అమోఘమైన ప్రతిభ చూపించారు. నిజానికి పైపర్ పాత్ర నిజంగానే జైలు శిక్ష అనుభవించిన ఒక యువతికి తెర రూపం. ఆమె ఈ సీరీస్‌కి కన్సల్టెంట్ గా పని చేసింది. ఆమె పేరు కూడా పైపరే!

ఖైదీల కథలే కాదు గార్డుల కథలు కూడా ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తాయి. వాళ్ళూ మనుషులే కదా. వారిని కూడా సానుభూతితో చూసే లాగ వారి కథలు ఉంటాయి. నిజానికి గార్డులే సాధారణ పౌరులు. ఖైదీలు నేరస్థులు. కానీ మన సానుభూతి మొదట ఖైదీల మీదే ఉందంటే అది ఈ సీరీస్ సాధించిన విజయం. పైగా వీరందరూ చిన్న చిన్న నేరాలు చేసినవారు. మొదటి సీజన్‌లో పైపర్ ఆ జైలు వాతావరణానికి అలవాటు పడటం, ఆమెని కొందరు వేధించటం వంటివి ఉంటాయి. ఇందులో హాస్యం పుడుతుంది. ఖైదీల గతం ఎలా ఉన్నా జైల్లో బతకటానికి వారు పడే తంటాలు హాస్యస్ఫోరకంగా ఉంటాయి. మొదటి సీజన్ కామెడీగానే ప్రచారం చేశారు. అవార్డులు కూడా కామెడీ విభాగంలోనే వచ్చాయి. రెండవ సీజన్ నుంచి డ్రామా విభాగంలోకి మార్చారు. ఇలా మార్చి రెండు విభాగాల్లోనూ అవార్డులు పొందిన సీరీస్ ఇదొకటే. డ్రామాగా ఉన్నా హాస్యం కూడా ఉంటుంది.

ఈ సీరీస్‌లోని హాస్యానికి ఉదాహరణగా ఒక ఉదంతం – భోజనాల్లో కోషర్ భోజనాలు అని యూదులకి వేరుగా ఉంటాయి. వారి మతవిశ్వాసాలకి తగ్గట్టు తయారు చేస్తారు. ఇవి కూడా ముందే తయారు చేసి ఫ్రీజ్ చేసినవే. జైల్లో యూదులు ఎవరూ లేకపోవటంతో ఆ కోషర్ భోజనాల ట్రేలు ఫ్రీజర్లో వెనకాల ఎక్కడో ఉంటాయి. రెండో సీజన్‌లో ఒక యూదు ఖైదీ వస్తుంది. ఆమె అడగటంతో ఆ భోజనం తీసి వేడి చేసి ఇస్తారు. ఆ భోజనం మిగతా ఖైదీలు తినే భోజనం కన్నా బావుందని ప్రచారం జరుగుతుంది. కొందరు ఖైదీలు ఆ భోజనం కోసం తాము యూదులమని చెప్పుకుంటారు. ఒక ఖైదీ అయితే తాను యూదుగా మారిపోతానని మతగ్రంథాలు కూడా చదువుతుంది. చివరికి ఆమె కోరటంతో మతగురువుని తీసుకొచ్చి మతమార్పిడి కూడా చేయిస్తారు. ఇదంతా హాస్యస్ఫోరకంగా ఉంటుంది. కానీ భోజనం కోసం చేసినా చివరికి ఆ ఖైదీ ఆ మతాన్ని విశ్వసిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే మానవహక్కులని అమెరికాలో చాలావరకు చిత్తశుద్ధితో అమలు చేస్తారు. ఖైదీలకి కూడా మానవహక్కులు ఉంటాయి. వారి మతవిశ్వాసాలను గౌరవిస్తారు. మన దేశంలో మానవహక్కులు ఎంతవరకు అమలవుతున్నాయో ప్రశార్థకమే.

మూడో సీజన్‌లో జైలు ప్రవేటీకరణ జరుగుతుంది. అంటే జైలు నిర్వహణ ప్రభుత్వం నుంచి ఒక ప్రైవేటు కంపెనీకి బదిలీ అవుతుంది. వారు ఖర్చులు తగ్గించటానికి రకరకాల వ్యూహాలు పన్నుతారు. అవి ఒక్కోసారి బెడిసికొడతాయి. లాభాల కోసం కంపెనీలు జీవితాలతో ఎలా ఆడుకుంటాయో ఈ సీజన్‌లో చూపించారు. పాత గార్డులందరూ నిరసనగా రాజీనామా చేయటంతో కొత్త గార్డులని నియమిస్తారు. వారి నేపథ్యం ఏమిటో (బ్యాక్‌గ్రౌండ్ చెక్) తెలుసుకోకుండానే హడావిడిగా నియమిస్తారు. దాంతో ఒక డ్రగ్స్ మాఫియా సభ్యుడు గార్డుగా వస్తాడు. మాఫియా బాసు తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఖైదీని చంపమని పంపించిన గార్డు అతను. వ్యవస్థలో లోపాలు ఉంటే ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం తెలియజేస్తుంది.

ఐదో సీజన్‌లో జైల్లో అల్లర్లు జరుగుతాయి. మూడు రోజులు జరిగే అల్లర్లని పదమూడు ఎపిసోడ్లలో చూపించారు. ఒక్కో ఎపిసోడ్ గంట సేపు ఉంటుంది. ముందు సీజన్లలో కొన్ని నెలల పాటు జరిగే కథని ఎంత బాగా చెప్పారో ఈ మూడు రోజుల కథని కూడా అంతే రసవత్తరంగా చెప్పారు. అల్లర్లకి కారణం ఒక గార్డు చేతిలో ఒక ఖైదీ మరణం. తర్వాత జరిగిన నిరసనలో ఖైదీల చేతికి ఒక గన్ను వస్తుంది. దాంతో వారు గార్డులని బందీలుగా చేస్తారు. గన్ను ఎలా వచ్చింది? నిజానికి గార్డుల దగ్గర గన్నులు ఉండకూడదు. లాఠీలు మాత్రమే ఉండాలి. ఒక గార్డు నియమాలకి వ్యతిరేకంగా గన్ను తీసుకువస్తాడు. అది ఖైదీలకి చిక్కుతుంది. అక్కడి నుంచి ఖైదీలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. స్కూలు వదిలినపుడు పిల్లలు చేసే అల్లరిలా ఉంటుంది. కొందరు స్వేచ్ఛని ఆస్వాదించటంలో మునిగిపోతారు. కొందరు గార్డుల మీద ప్రతీకారం తీసుకుందామని ప్రయత్నిస్తారు. కొందరు జైల్లో సంస్కరణలు చేపడితేనే గార్డులను వదులుతామని తమ డిమాండ్ల జాబితా ఇస్తారు. వీళ్ళు నిజంగా మార్పు కోరుకుంటారు. ఈ అల్లర్లు ముగిశాక నమ్మకద్రోహాలు కూడా జరుగుతాయి. దాంతో కోపతాపాలు పెరుగుతాయి. పశ్చాత్తాపంతో కుమిలిపోయేవారు ఉంటారు. ప్రతీకారం కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు.

ఆరో సీజన్‌లో కథ కట్టుదిట్టమైన జైల్లోకి మారుతుంది. ఇక్కడ ముందున్న వెసులుబాట్లు ఉండవు. ఎప్పుడు పడితే అప్పుడు ఆరుబయటకి వెళ్ళటానికి ఉండదు. నిజానికి ఆరుబయట అనేదే ఉండదు. జైలు భవనం నుంచి బయటకి వస్తే చుట్టూ గోడలతో పైన ఇనప కమ్మీల కప్పు నుంచి ఆకాశం ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది అంతే. ఇలాంటి జీవితం ఎంత దుర్భరమో అనుభవించేవారికే తెలుస్తుంది. జైల్లో హింసకి పాల్పడినవారిని, డ్రగ్స్‌తో పట్టుబడినవారిని ఇరుకు గదుల్లో కొన్నాళ్ళు బంధిస్తారు. ఆ ఇరుకు గదులంటే అందరికీ హడల్. ప్రైవేటీకరణ జరిగాక ఖైదీల మధ్య ఒక గొడవని ఆపటానికి ఒక ఖైదీని ఆమె తప్పు లేకపోయినా ఇరుకు గదిలో బంధిస్తారు. చాలా రోజులు ఆమె అందులోనే ఉంటుంది. అప్పటికి పురుష వార్డెన్ వస్తాడు. అతని సాయంతో ఆమె కంపెనీ మీద కేసు వేస్తుంది (అమెరికాలోని మానవహక్కులకు ఇది మరో ఉదాహరణ). వార్డెన్.. ఉద్యోగం మానేసి మరీ ఆమె కోసం పోరాడతాడు. అతని ప్రయత్నం ఆ ప్రైవేటు కంపెనీ బండారం బయట పెట్టి వారిని జైలు నిర్వహణ నుంచి తప్పించాలని. కానీ కంపెనీ యాజమాన్యం ఆ ఖైదీతో ఒప్పందం చేసుకుంటుంది. ఆమెని త్వరగా విడుదల చేసి డబ్బు కూడా ఇస్తుంది. దాంతో ఆ ఖైదీ కేసు ఉపసంహరించుకుంటుంది. మాజీ వార్డెన్ హతాశుడవుతాడు. ప్రపంచం తీరు ఇలాగే ఉంటుంది. పెద్ద కార్పొరేట్ సంస్థలు డబ్బుతో కొందరి నోళ్ళు మూయిస్తాయి. వ్యవస్థ ఇలాగే మురిగిపోతూ ఉంటుంది. మానవహక్కుల రక్షణ ఎంత పటిష్టంగా ఉన్నా ఇలాంటి లొసుగులు కనిపెట్టే కంపెనీలు కూడా ఉంటాయి. సమాజం కోసం త్యాగాలు చేసేవారు తక్కువ. మధ్యలో మాజీ వార్డెన్ లాంటి వారు పోరాడి పోరాడి అలిసిపోతారు.

ఇంకో కోణం సెలెబ్రిటీలు జైలుకి రావటం. జూడీ అనే ఒక ప్రఖ్యాత టీవీ చెఫ్ (టీవీలో వంటల కార్యక్రమం నిర్వాహకురాలు) పన్నుల ఎగవేత కారణంగా జైలుకి వస్తుంది. జైల్లో ఆమెని ఆరాధించేవారు కొందరుంటారు. మరి కొందరు ఆమె జైల్లో ఉన్న ఫొటోలు పత్రికలకి అమ్మితే డబ్బు వస్తుందని ఆశపడతారు. ఈ ప్రహసనం కూడా హాస్యప్రధానంగా ఉంటుంది. ఇంతకీ ఫోటోలు ఎలా తీస్తారు? జైల్లోకి డ్రగ్సే రాగా లేనిది స్మార్ట్ ఫోన్లు రావా? జూడీ విషయానికి వస్తే కంపెనీ ఆమెకి ప్రత్యేకమైన గది ఇస్తుంది. ప్రత్యేకమైన భోజనం కూడా పెడుతుంది. జైల్లో కూడా ధనికులు, పేదలు అనే తేడా ఉంటుంది. ఇది సమాజంలోని డొల్లతనం. కొసమెరుపు ఏమిటంటే జూడీ తర్వాత ‘జైల్లో నా అనుభవాలు’ అని పుస్తకం కూడా రాస్తుంది. డబ్బు సంపాదనకి అదో మార్గం!

కొందరు ఖైదీలు విడుదలైన తర్వాత వారి జీవితాలు ఎలా ఉంటాయో కూడా చూపించారు ఈ సీరీస్‌లో. బయట కుటుంబం ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు. కొందరు మళ్ళీ జైలుకి వస్తారు. బయట జీవితం కంటే జైలు జీవితం నయం అనిపిస్తుంది వారికి. పైపర్ కూడా ఏడో సీజన్‌లో బయట జీవితం గడుపుతుంది. ఆమె వారానికోసారి ప్రభుత్వ ప్రతినిధి దగ్గరకి వచ్చి డ్రగ్స్ పరీక్ష చేయించుకోవాలి. స్థిరమైన జీవితం కోసం ప్రయత్నిస్తున్నాని రుజువు చేసుకోవాలి. అంటే ఇల్లు, ఉద్యోగం సమకూర్చుకోవాలి. ఆమె తండ్రి ఆమెని దూరం పెడతాడు. చివరికి తండ్రి కంపెనీలోనే ఉద్యోగం చేస్తుంది. ఎవరికీ తన గతం చెప్పకూడదు. ఇదో క్షోభ. జైలుకి వెళ్ళొచ్చినవారంటే అందరూ అనుమానంగానే చూస్తారు. తోడు కావాలని ఉంటుంది కానీ ఆమె తన పరిస్థితుల వల్ల తోడు వెతుక్కోకూడదని నిర్ణయించుకుంటుంది. ఆ పరిస్థితులు ఏమిటో చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ సీరీస్ ప్రసారమైన ఏడు సంవత్సరాలలో (2013 – 2019) అమెరికా సమాజంలో జరిగిన కొన్ని ఉద్యమాలు, ప్రభుత్వం చేపట్టిన కొత్త కార్యక్రమాలు, వాటి ప్రభావాలు కూడా ఈ సీరీస్‌లో చూపించారు. ముఖ్యంగా ఐస్ (ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్) పేరుతో ప్రభుత్వం వలసదారులపై చేసిన దాష్టీకాలు ప్రస్తావించారు. తమ దేశాల్లో జరిగే అక్రమాల నుంచి తమను, తమ పిల్లలను కాపాడుకోవటానికి అమెరికాకి దొడ్డిదారిన వచ్చే వలసదారులకి ప్రభుత్వం ఆశ్రయం కల్పించే ముందు విచారణ చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ ప్రక్రియలో మానవత్వ కోణం ఎలా లోపిస్తోందో ఏడో సీజన్‌లో ఒక కథలో చెప్పారు. విచారణ అంటే ఏంటో తెలియని పిల్లలని విచారించి వారికి ఆశ్రయం నిరాకరించటం విస్తుగొలుపుతుంది. ‘మీ టూ’ ఉద్యమం కూడా ఒక కథలో వస్తుంది. పురుష వార్డెన్ మంచివాడే, ఖైదీలకి సాయం చేసేవాడే కానీ అతని మీద ఒక మాజీ గార్డు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తుంది. మొదట అతనికి కోపం వచ్చినా చివరకు తాను చేసింది తప్పని తెలుసుకోవటం కొసమెరుపు. మంచివారు కూడా తప్పులు చేస్తారు, పర్యసానాలు ఉంటాయి అని చెప్పటం ముదావహం.

ఇక నటీనటుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యమైన పాత్రలు ముప్పై దాకా ఉంటే అన్ని పాత్రలూ కలిపి మూడు వందల పైనే ఉంటాయి! ఇంత మంది పాత్రలతో ఇంత సమర్థంగా సీరీస్ తీయటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజంగా జైలు జీవితం చూస్తున్నామా అన్నంత బాగా నటించారు నటీనటులందరూ. టాషా అనే ఖైదీ పాత్రలో నటించిన డానియెల్ బ్రుక్స్‌కి తర్వాత ‘ద కలర్ పర్పుల్’ సినిమాలో నటనకి ఆస్కార్ నామినేషన్ కూడా వచ్చింది. టాషా మొదట్లో ఉల్లాసంగా ఉంటుంది. తోటి ఖైదీలకి మంచి స్నేహితురాలిలా ఉంటుంది. తెలివైనది. అల్లర్లు జరిగినప్పుడు ఆమె జైలు సంస్కరణల కోసం ప్రయత్నిస్తుంది. తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె మనసు మొద్దుబారిపోతుంది. గంభీరంగా మారిపోతుంది. ఇన్ని కోణాలు ఉన్న పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. సీరీస్ సృష్టికర్త జెంజీ కోహన్. క్లిష్టంగా ఉండే కథని అర్థమయ్యేలా చెప్పటమే కాదు బోరు కొట్టకుండా రూపొందించింది. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లు చూపించిన తీరు అపూర్వం. ఎక్కడా గందరగోళం ఉండదు.

Spoiler warning: ఈ క్రింద మొదటి సీజన్‌లో జరిగే కొన్ని ఆసక్తికర పరిణామాలు ప్రస్తావించబడ్డాయి. కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పటమే ఇక్కడ ఉద్దేశం. ఇది తెలిస్తే కథ స్వరూపం తెలుస్తుంది. కథలో మలుపులు అసలు తెలుసుకోకూడదనుకునే వారు ఇక్కడ చదవటం ఆపేయవచ్చు.

పైపర్ జైలు శిక్ష పడే ముందు కొన్నేళ్ళు మామూలు జీవితం గడుపుతుంది. ఆమె మాజీ ప్రియురాలు ఆలెక్స్ జైల్లో ఉంటుంది. పైపర్ ల్యారీ అనే ఒకతన్ని ప్రేమిస్తుంది. ప్రేమించిందో లేక సమాజానికి ఆమోదయోగ్యంగా ఉండాలని అతన్ని తన జీవితంలోకి ఆహ్వానించిందో ఆమెకే తెలియని పరిస్థితి ఆమెది. ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోతుంది. అమెరికాలో ఎంగేజ్‌మెంట్‌కి, పెళ్ళికి మధ్య చాలా సమయం ఉండటం సాధారణమే. పెళ్ళి జరిగేలోగా ఆమె జైలుకి వెళుతుంది. ఆలెక్స్ ఆ జైల్లోనే ఉండటంతో ఆమెలో కలవరం మొదలవుతుంది. ఆమె తనకి శిక్షపడేలా సాక్ష్యం (నిజమే అయినా) చెప్పిందా లేదా అని ఆమె మథనపడుతూ ఉంటుంది. ల్యారీని ఆ విషయం కనుక్కోమని చెబుతుంది. అతని తండ్రి పలుకుబడి ఉన్నవాడు. ఆయన కనుక్కుంటాడు. పైపర్ తెలిసే సేరం చేసిందని ఆలెక్స్ సాక్ష్యం చెప్పిందని తెలుస్తుంది. కానీ ల్యారీకి పైపర్ సంగతి తెలుసు. తిరుగుబాటు మనస్తత్వం ఆమెది. పైపర్‌కి నిజం చెబితే ఆమె జైల్లో ఆలెక్స్‌ని ఏమైనా చేస్తుందేమో అని, దాని వల్ల పైపర్ శిక్ష పొడిగిస్తారేమో అని భయపడి ల్యారీ నిజం దాస్తాడు. ఆలెక్స్ విచారణలో పైపర్ పేరు చెప్పలేదని చెబుతాడు. అతను ఊహించనిది ఏమిటంటే పైపర్‌కి తిరిగి ఆలెక్స్ మీద ప్రేమ పుడుతుంది. ల్యారీకి మొదటికే మోసం వస్తుంది. ఇదెటు దారి తీస్తుందో చూస్తేనే బావుంటుంది.

మరోపక్క గార్డుతో ప్రేమలో పడిన డాయా గర్భవతి అవుతుంది. ఇంకో గార్డు ఖైదీలతో దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతనికి ఖైదీలు పెట్టిన పేరు పోర్న్‌స్టాచ్ (అసభ్యంగా ఉంటాడని, మీసం ఉంటుందని ఆ పేరు పెట్టారు). అతను తెచ్చిన డ్రగ్స్ అధిక మోతాదులో తీసుకోవటం వల్ల ఒక ఖైదీ మరణిస్తుంది. ఆ ఖైదీని తాడుకి వేలాడగట్టి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అతను చిత్రిస్తాడు. ఇతర ఖైదీలు అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని పథకం వేస్తారు. డాయా అతనితో శృంగారం చేస్తే అతని వల్లే ఆమె గర్భవతి అయిందని చెప్పి అతని ఉద్యోగం పోయేలా చేయొచ్చని వారి పథకం. డాయా తల్లి తన డ్రగ్స్ వ్యాపారానికి పోటీ లేకుండా ఉంటుందని ఈ పథకాన్ని సమర్థిస్తుంది! తన ప్రియుడిని కాపాడుకోవటానికి డాయా కూడా ఒప్పుకుంటుంది. ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు తల్లీ బిడ్డా అనుకుంటారు. డాయా పోర్న్‌స్టాచ్‌తో ప్రేమ నటిస్తుంది. అతను నిజంగానే ఆమె ప్రేమలో పడతాడు. చివరికి దొరికిపోతాడు. ఉద్యోగం పోతుంది. అయినా డాయా కడుపులో ఉన్న బిడ్డ తన బిడ్డే అని అతను అనుకుంటూ ఆమెనే తలచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఎవరు విలన్, ఎవరు మంచివారు అనేది మనమే తేల్చుకోవాలి. పోర్న్‌స్టాచ్ చేసిన మొదటి నేరం నిరూపించటం కష్టం. అందుకని అతన్ని మరో నేరంలో ఇరికించారు. అది అతని జీవితాన్ని పాడు చేసింది. అతని కర్మ ఫలం అతను అనుభవించాడని అనుకోవచ్చు. కానీ అతనికి కలిగించిన మానసిక క్షోభకి ఫలితం ఎవరిది? ఈ సీరిస్ శీర్షిక గీతం ఈ సంఘర్షణకి కవితా రూపం ఇచ్చింది:

Think of all the roads
Think of all the crossings
Taking steps is easy
Standing still is hard

అడుగులు వేసుకుంటూ పోవటమే తేలిక. ఏదో ఒకటి చేయమనే మనిషి బుద్ధి చెబుతుంది. ఏమీ చేయకుండా అన్యాయాన్ని భరిస్తూ ఉండటం చాలా కష్టం! నిజమే కదా! జైలు వాతావరణంలో ఇది పరమ సత్యం. వింత ఏమిటంటే వాళ్ళు ఏ నేరమూ చేయకూడదనే వారిని జైల్లో పెట్టారు. కానీ నేరం చేయకతప్పని పరిస్థితి కూడా జైలు వ్యవస్థే కల్పించింది.

Exit mobile version