Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిన్నయసూరి అచ్చతెలుగు పద ప్రయోగాలు

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘చిన్నయసూరి అచ్చతెలుగు పద ప్రయోగాలు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

“తుదముట్టఁగ నీ కబ్బము
పదిలంబుగాఁ జదివినట్టి బాలుర కోలిం
 బొదలును భాషాజ్ఞానము
కుదురుం గొదలేక నీతి కుశలత్వంబున్‌”

అనే పద్యాన్ని ‘నీతిచంద్రిక’ కృతి ప్రంశంస చేస్తూ, చిన్నయసూరి రాశారు. చివరి పుటదాకా శ్రద్ధగా, ఏకబిగువున చదివితే మానసిక వికాసం, నైతికవర్తనతో పాటు భాషాజ్ఞానం కుదుర్తుందని, కుశలత్వం అంటే నిశితంగా పరిశీలించే నేర్పు పెరుగుతుందని ఆశించి తానీ రచనకు పూనుకొంటున్నట్టు చెప్పుకున్నారు. ఇది నీతిచంద్రికకు లక్ష్యప్రస్తావన చేసిన పద్యం. కావ్యాల్లో పెద్దగా స్థానం పొందకపోయినా మరుగున పడిపోయిన తెలుగు పదాలను తెలుసుకోవటమే కదా భాషాజ్ఞానం అంటే!

చిన్నయ్య గ్రాంథికాన్ని తెచ్చి జనం మీద రుద్దాడన్న అభిప్రాయాన్ని గిడుగు, గురజాడ కూడా ఒప్పుకోలేదు. అయన వచన శైలికి ఆ ఇద్దరూ ముచ్చటపడ్డారు కూడా! 1924లో ‘చిన్నయసూరి నీతి చంద్రిక’ అనే వ్యాసంలో “వ్యావహారికభాష తల్లివలె నాకు ప్రేమపాత్రము; ప్రాచీనాంధ్ర భాష మూలపుటమ్మవలె నాకు పూజ్యురాలు” అని గిడుగువారు రాశారు. ప్రాచీనాంధ్ర భాషకు జీవం పోసిన వాడిగా చిన్నయసూరిని ఆయన గౌరవించాడు కూడా!

చిన్నయసూరి లక్ష్యం విద్యార్థులకు భాషను నేర్పించటం. అందుకని రాజకుమారులకు యానిమేషన్ పద్ధతిలో కథల ద్వారా భాష నేర్పించటం మొదలుపెట్టాడు. సాధ్యమైనన్ని చోట్ల సాధ్యమైనన్ని అచ్చ తెలుగు పదాలు ప్రయోగించాడు. తెలుగులో కలిసిపోయిన సంస్కృత పదాలతో పాటుగా కావ్యాలకెక్కకుండా మరుగున పడిపోయిన చాలా తెలుగు మాటల్ని జంతువుల నోట పలికించాడు.

అచ్చతెలుగు పదాలు గ్రాంథికం ఎలా అవుతాయి? అవి మన మాటలు. ఒకప్పుడు జన సామాన్యం వాడుకలో ఉన్న మాటలు. వాటిని మనల్ని నేర్చుకోవద్దని అనే హక్కు ఎవరికీ లేదు. చిన్నయసూరిని తిట్టటమే పనిగా పెట్టుకున్నవాళ్లు భాషకు ఆయనలా మేలు చేసినవారు మరొకరు లేరు.

మచ్చుకు కొన్ని మరుగున పడిన పదాలు ఈ నాటి అవసరాలక్కూడా ఉపయోగపడే పదాల్ని ఏరి మీ ముందుంచుతాను.

మీసరం గాసించు:

“ఆ కానన మందుఁ బింగళకమను సింహము గలదు. అది పుండరీకముల ఖండించుచు సలుగుల నలుగులం పడఁజేయుచుఁ గాసరముల మీసరముగాఁ జించుచు” అనే వాక్యాన్ని గిడుగురామమూర్తి పంతులుగారు 1920లలో అచ్చయిన మెట్రిక్యులేషన్ వారి టెక్స్ట్ పుస్తకంలో చూసి “గాసరముల మీసరముగాఁ జించుచు” అనే వాక్యానికి అర్థాన్ని అనేక మంది పండితులను అడిగారు. ఎవ్వరూ చెప్పలేకపోవటంతో ఆంధ్రభాషాలక్షణము లెస్సగా తెలిసిన శ్రీ వజ్ఝల చిన సీతారామస్వామి శాస్త్రులుగారిని కలిసి అడిగారు. ఆయన లోపలికి వెళ్లి 1909వ సంవత్సరంలో అచ్చయిన (18వ ముద్రణ) నీతిచంద్రికని తెచ్చి పరిశీలించి చూశారు. అందులో “కాసరముల మీసరము గాసించుచు” అని ఉంది. 1920 ఎడిషన్ నాటికి ఈ పదానికి అర్థం తెలియక పరిష్కర్తలు మధ్యలో అరసున్నా చేర్చి ‘గాఁ జించుచు’ అని అచ్చువేయించారని అర్థం అవుతోంది. తెనాలి రామకృష్ణుడు తిట్టినట్టు తెలియని వన్నీ దిట్ట తనాన తప్పులుగా భావించేవాళ్లు పెరిగారు.

“ఆ అడవిలో పింగళకం అనే సింహం ఉంది. అది పుండరీకములను అంటే పెద్దపులుల్ని ఖండించిందట. సలుగులు అంటే అడవిపందులు అని! పందులు పొలాల్లో పడి ముట్టితో మొక్కల్ని కుళ్లగించి దుంపల్ని తింటాయి. పొలాల్లో అధికంగా ఉండే నీళ్ళు బైటకు పోవటానికి తవ్వే పిల్లకాలువల్ని అలుగులు అంటారు. సలుగుల్ని ఈ అలుగుల్లోకి పడదోసేసిందిట పింగళకం. కాసరములు అంటే ఎనుబోతులు. వాటిని ‘మీసరము గాసించినట్టు’ చిన్నయసూరి వ్రాశారు. ఆసురవృత్తితో అంటే పరమ రాక్షసంగా కాసరాలను (అడవి దున్నల్ని) మీసరం గాసిలచేసినట్లు (హింసించి బాధించినట్లు) ఈ వర్ణన కనిపిస్తుంది.

మీసరం అంటే సమూలంగా నిర్మూలించటం అన్నంత తీక్షణమైన పదం. కానీ, మన నిఘంటువులన్నీఈ ముక్తకంఠంతో ‘శ్రేష్ఠమైనదిగా చేయు’ అనే అర్థాన్నే ఇచ్చాయి. “మీసరము [Tel.] adj. Excellent, fine, grand, శ్రేష్ఠమైన. “మీసరములౌ నీలంపు సరులమర.”అని బ్రౌణ్య నిఘంటువు చెప్తోంది.

మీసరము గాసిలచేయు అన్నప్పుడు ‘గాసిలచేయు’ అంటే బాధించటం అని! శ్రేష్ఠమైనదిగా చేయటానికి బాధించటానికి పొంతన ఎలా కుదుర్తుంది? ఈ రెండు పదాలను మన నిఘంటువులు ఎలా సమన్వయం చేస్తాయి

తీవ్రమైన లైంగికవాంఛని రిరంస అంటారు. Sweet agony (తియ్యనిబాధ) అనేది దీని సమార్థకం. తీపు అని తెలుగులో అంటాం మనం. సరిగ్గా ఇలాగే శ్రేష్ఠమైన (మీసరం), బాధ (గాసిల్లచేయు) రెండు పాదాలను కలిపితే శ్రేష్ఠమైన బాధ అనే కొత్తపదం పుడ్తుంది. శ్రేష్ఠమైన బాధ అంటే మరణమే! “మీసరం గాసించుచు” అంటే, హింసకు తాళలేక కాసరాలు శ్రేష్ఠమైన బాధని తమకు ప్రసాదించమని వేడుకునేంతగా హింసించాడన్న మాట!

Extirpation అనేది దీనికి సమానార్థకం. Forest elephants in Central Africa have experienced a 65 percent reduction in their populations, and extirpation is imminent if the poaching rate persists. ఇదే విధంగా మీసరం కొనసాగితే మధ్య ఆఫ్రికాలో అడవి ఏనుగుల సంఖ్య 65% తగ్గిపోతుందని ఈ extirpationకు నిఘంటువు లిచ్చిన వివరణ.

సమూలంగా తుడిచిపెట్టటం అంటానికి ‘మీసరం’ అనే తెలుగు పదం నిఘంటువుల్లో లేని అర్థంలో ఇలా దొరికింది. నీతి చంద్రికలో వెదికితే, ఇలాంటి పదాలు చాలా దొరుకుతాయి. అవి మన అనేక అవసరాలను తీరుస్తాయి కూడా! వాటిని ప్రచారంలోకి తేవలసిన బాధ్యత భాషోద్యమానిదీ, కవులదీ, పరిశోధకులదీ పత్రికలది కూడా!

వరువాత

“లఘుపతనకమను వాయసము మేలుకొని రెండవ యముని వలె సంచరించుచున్న కిరాతునిఁ జూచి ‘వఱువాత లేచి వీని మొగము చూచితిని. నేడేమి కీడు రాఁగలదో తెలియదు. వీడు వచ్చినచోట నిలువఁదగదు. జాగు చేయక యీచోటు విడిచిపోవలె’నని యత్నము సేయుచుండగా..” మిత్రలాభంలో మొదటి వరుసలోనే ఈ మాటలు కనిపిస్తాయి.

లఘుపతనకం అనే కాకి పొద్దున నిద్రలేస్తూనే రెండో యముడు అనదగిన ఓ కిరాతుణ్ణి ‘వరువాత’ చూసి, పొద్దున్నే వీడు కనిపించాడు, ఇవ్వాళ ఏ కీడు రానుందో త్వరగా ఇక్కణ్ణుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నించిందట. అర్థం అయ్యేలా చెప్పటం ఒక్కటే కాదు, తగిన కొత్తపదాల్ని కూడా విద్యార్థులకు పరిచయం చేయాలని పరవస్తు చిన్నయసూరి సంకల్పం. ఆ విషయాన్ని ఆయన తన లక్ష్యప్రస్తావనలో చెప్పుకున్నారు కూడా!ఈ వాక్యంలో ఆయన “వరువాత” అనే పదాన్ని పరిచయం చేశాడు.

ఈ పదం గురించి అప్పట్లో పండితుల మధ్య పెద్ద చర్చే జరిగింది. కొందరు ‘వరు(ఱు)వాత లేవటం’ అచ్చుతప్పనీ, ‘తరువాత’ అని దిద్దుకోమన్నారు.

పగటి కాలాన్ని ప్రాతః (సూర్యోదయ సమయం), సంగవ, మధ్యాహ్నం, అపరాహ్నం, సాయంత్రం అని 5 భాగాలుగా విభజించారు. సంస్కృత సాంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో పగలు మొదలౌతుంది. ప్రాతఃకాలం(the dawn, the morning) అన్నారు అందుకే! రేపు, రేపకడ, వేకువ ఇలా పిలుస్తారు. “రేపగడ మత్ప్రియశిష్యుల బంచి” లాంటి కవి ప్రయోగాలున్నాయి. ప్రొద్దున్నే పూర్తి చేసే పనిని ‘రేపకడ పని’ అంటారు. రేపకడే బయల్దేరానంటే తెల్లవారుతూనే బయల్దేరానని. ఇది గ్రాంథికం కాదు, అచ్చతెలుగు ప్రయోగం. సూర్యోదయంకన్నా ముందు “వరువాత” అనే పొద్దుతో పగటి సమయం మొదలౌతుంది. అంటే, “రేపకడ”కన్నా ముందుండేది ‘వరువాత’. తెల్లవారటానికి సిద్ధంగా ఉన్న సమయం. అదీ అసలైన బ్రాహ్మీ ముహూర్తం. వరువాత లేస్తేనే కదా సూర్యోదయాన్ని చూడగలిగేది!

వరుస+వాయి=వరువాయి. తెల్లవారుఝాముతో కాలపు వరుస మొదలౌతోంది. అనుక్రమం, ఉపక్రమం అంటారు దీన్ని. పిల్లలతో కాపీ పుస్తకం రాయించేప్పుడు పైన రాసే మొదటి పంక్తిని వరవడి, వరువడి లేదా మేలుబంతి ఇలా పిలుస్తారు. ఆయన ఒక వరవడి సృష్టించారు అంటాం. మొదటి లైను వరవడి దాన్ని బట్టిఇ తరువాతి లైన్లలో రాసి పిల్లలు కాపీ రాసి అనుకరిస్తారు. వరువాత వరు శబ్దం వరవడి లేదా వరువడిలో వరు ఆరంభం అనే అర్ధంలో తెలుగులో ప్రయోగం ఏర్పడింది. వాత అనేది తరువాత లో వాత లాంటిది. వరువాత అంటే మొదలైన తరువాత అని! వరువాత అయ్యాక సూర్యోదయం ఏర్పడుతుందని భావం

అయ్యలరాజు నారాయణామాత్యుడు రామాభ్యుదయంలో విభీషణుడు రావణాసురుని యుద్ధ చతురతను రాముడికి వివరించే సందర్భంలో “..యీ మహావాతూల వరువాత వరువాత నిను బ్రతివాసరంబుఁ, తలఁచి..” అనే పద్యంలో వరువాత అనే పదాన్ని రెండుసార్లు రెండు వేర్వేరు అర్థాల్లో ప్రయోగించాడు: ‘మహావాతూల వరువాత’ అంటే నిద్రలేచిన ఈ గొప్ప సుడిగాలి (టార్నెడో)ని నువ్వు అణచినట్టయితే “వరువాత నిను బ్రతివాసరంబు తలచి” నిద్రలేస్తూనే ప్రతీ రోజూ నిన్ను తలచుకుంటాం అని రెండు రకాలుగా వరువాత పదాన్ని ప్రయోగించటం చూడవచ్చు.

ప్రాతఃస్మరణీయత అనటానికి సమానమైన తెలుగు ప్రయోగం “వరువాత తలపు.” ఇలాంటి చక్కని ప్రయోగాల్ని మనం ఉంచుకుందామా? పారేసుకుందామా?

పరామరిక

“యూరక యీ చింత యేల? నాపుత్రులు చదువమనిరా? పరామరిక మాలి తగిన విద్యాభాసము చేయింప నయితిని. బిడ్డలకు విద్యాభ్యాసము చేయింవమి తల్లిదండ్రులదోషము. తల్లిదండ్రులచేత శిక్షితుఁడయి బాలుడు విద్వాంసుఁ డగునుగాని పుట్టఁగానే విద్వాంసుఁడు కాఁడు, పురుషకారముచేఁ గార్యములు సిద్ధించును; రిత్తకోరికలచేత సిద్ధింపవు, నిద్రించు సింహము నోరను మృగములు తమంత వచ్చి చొరవు”

తానే పరామరిక మాలి సరైన చదువు చెప్పించలేదని! పిల్లలకు చదువు అంటకపోవటం తల్లి దండ్రుల దోషమే అని గ్రహించాడు. తల్లిదండ్రులు చదువు చెప్పిస్తే, పిల్లలు విద్వాంసు లౌతారు కానీ తమంత తామే విద్వాంసులుగా పుట్టరు కదా.. అని తలపోశాడు. మానవప్రయత్నం వలన పనులు సమకూరుతాయి గాని రిత్త(శూన్యం)కోరికలవలన సిద్ధించవు. సింహం నోరు తెరుచుకుని నిద్రపోతే జంతువులు వాటంతట అవే వచ్చి నోట్లోకి దూరవు కదా.. అనే సత్యాన్ని గ్రహించాడు.

ఈ వాక్యాల్లో పరామరిక అనే పదం చాలా ముఖ్యమైంది. పరామర్శ అనే సంస్కృత పదం పరామరికగా మారింది.

పరామరిక అంటే Heed, care, attention అని నిఘంటువులు అర్థాన్నిచ్చాయి. “నీ పరామరిక లేకుంటే కార్యముకాదు” అంటే నువ్వు గట్టిగా పట్టించుకోకపోతే పనికాదని! సూపర్‌విజన్ అనే అర్థంలో ఈ పదం పనికొస్తుంది. నాయకవాడి అనేది ఒక ప్రభుత్వోద్యోగం. వ్యవసాయపు పనుల్ని పరామరిక చేయటం నాయకవాడి విధి. నాయడు లేదా నాయుడు అనే గౌరవం ఈ నాయకవాడి ఉద్యోగాన్ని బట్టే వచ్చి ఉంటుంది. నాయడుగారి పరామరిక వలన వ్యవసాయం పెరుగుతుంది!

ఎగ్గు-లగ్గు

“యిప్పటికి క్షమియించితి, ఇటమీఁద నస్మజ్జనంబులకు నెగ్గు దలంపకు, నీకది లగ్గుగాదని నుడివి యంతర్హితుడయి చనియె” “మా వాళ్లకు ఎగ్గు చేస్తే అది నీకు లగ్గు కాదు” అని దీని తాత్పర్యం. ఎగ్గంటే చెడు. లగ్గంటే శుభం. మాయాబజారు సినిమాలో ఏం గోటు ఏం తీటు లాగానే, ఎగ్గు-లగ్గుని కూడా ఏ పంచి డైలాగుల రచయితో సినిమాలో అనిపిస్తే ఇవి కూడా జనానికి చేరి ఉండేవి. మన భాషా సంపద నశించటానికి గ్రామీణులతో సంబంధాలు తగ్గిపోవటం. గ్రామీణులక్కూడా గ్రామాలతో సంబంధాలు తగ్గిపోవటం కారణాలు!

సుమతీ శతకకారుడు “బొగ్గుల కోసం కల్పవృక్షాన్ని పొడవటం కన్నా ‘ఎగ్గు’ ఇంకొకటి లే”దన్నాడు.

“చెల్లియొ చెల్లకో తమకుఁ జేసిన యెగ్గులు సైచి రందఱుం/దొల్లి, గతించె, నేడు నను దూతగఁ బంపిరి సంధి సేయ; నీ/ పిల్లలు పాపలుం బ్రజలు పెంపువహింపగఁ బొందుఁ జేసెదో!/యెల్లి రణంబుఁ గూర్చెదవొ! యేర్పడఁ జెప్పుము కౌరవేశ్వరా!” అనే రాయబారం సన్నివేశంలో కృష్ణుడి నోట పలికించిన తిరుపతి వేంకట కవులు మొదటి పాదంలోనే ‘మీ ద్వారా మీవాళ్ల ద్వారా తమకు జరిగిన ఎగ్గులన్నీ తెలిసో తెలియకో పాండవులు సహించా’రంటాడు.

ఎగ్గుకి ఖచ్చితంగా వ్యతిరేక పదం ‘లగ్గు’. లగ్గాలు పెట్టుకొన్నాం అన్నప్పుడు లగ్నం అనే సంస్కృత పదానికి తెలుగు వాడుక రూపం లగ్గంలోనూ ‘లగ్గు’ కనిపిస్తుంది. లగ్గు అనేది నిత్య బహువచనం. శుభాలు అన్నట్టు దీన్ని లగ్గులు అనకూడదు. లగ్గులంటే కర్మకాండలని! దుర్యోధన్ముడు మరణిస్తే అతనికి లగ్గులు చేయటానికి తగిన బంధువులే లేరట. చచ్చిరి బంధువులెల్లా.. కదా!

అల్ అనే మూలద్రావిడ ధాతువుకు to be fit. proper, to be desirable, desired అనే అర్థాలున్నాయని అల్‌ — ఆగు = అలగు_అరొగు-లగ్గు -శుభం అనే అర్థంలో ఏర్పడిందని కోరాడ మహదేవశాస్త్రిగారి వివరణ.

ఎగ్గు-లగ్గులు ఒకప్పుడు జనవ్యవహారంలో ఉన్న మాటలే! కాపాడుకుంటే మనకే లగ్గు! చంపుకుంటే అది మన ఎగ్గు.

‘అనారతం’

“అనారతంబు ఱేనికి లగ్గు దలఁతుంగాని యెగ్గు గలయం దయినం దలంచి యెఱుంగ” రాజుకి అనారతం అంటే ఎల్లప్పుడూ శుభమే గానీ అపకారం కలగాలని కలలో కూడా కోరుకోలేదని దీని భావం.

అనారతం అనేది అనవరతం అనే సంస్కృతపద రూపం, నిరంతరం ఉండేది కాబట్టి స్థిరమైనది అనే అర్థంలోనూ, అనుకూల (పాజిటివ్) భావాలకు మాత్రమే వాడే పదం కాబట్టి సుందరమైన, ఇంపైన, నిండైన అనే అర్థాల్లోనూ కవి ప్రయోగాలున్నాయి. వాల్మీకి రామాయణం బాలకాండలో ‘అనార్త రూపః’ అనే ప్రయోగం ఈ అర్థంలోనే కనిపిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో అనాత వరం అనే ఊరు ఈ పదాన్ని జ్ఞాపకం చేస్తుంది

చేమకూరి వెంకట కవి సారంగధర చరిత్రలోని ఓ పద్యభాగం చూడండి: “అతిమోహంబున మించుతల్లి నిట నీకాసించియున్నా; ననా/రత సౌఖ్యోన్నతి చెందఁ గోరి సుకుమారా, రాసుతా, యాత్మజా..”

ఈ గ్రంథానికి టీక విషయంలో వేదం వారికీ, దీపాల పిచ్చయ్యశాస్త్రిగారికీ మధ్య ఒకప్పుడు పెద్ద రగడే జరిగింది. ఈ పద్యభాగంలో వేదం వెంకటరాయశాస్త్రి “అనారత = స్థిరమైన” అని అర్థాన్నిచ్చారు. చేమకూర వెంకటకవి చమత్కారానికి ‘పెట్టిందిపే’రైన కవి! ఆయన ఇంత సంసారపక్షంగా ఆ పదాన్ని ప్రయోగించాడంటే దీపాలవారికి అంగీకారం కాలేదు. ఈ పద్య భాగాన్ని దీపాలవారు ఇలా వ్యాఖ్యానించారు:

సుకుమారా = కోములుడా!; రాసుతా = రాజకుమారా!; మించు తల్లిని = మెరుపు తీగకు తల్లివంటి దానను అంటే, మెరుపు తీగకన్నా మెరుగైన దాన్ని అని!; ననారతి= నన్ను ఆ రతి, సౌఖ్యోన్నతి చెందన్ కోరి = సుఖాతిశయం చెందేలా చేయమని కోరింది.

ఇక్కడ నన్+అనారత అని విడగొడితే నిరంతరం రతి సౌఖ్యం ఉండేలా చెయ్యమనే అర్థం కూడా వస్తుంది. తల్లి వరుసయ్యే స్త్రీ యువరాజుని కోరిక తీర్చమని నిర్బంధపెడుతూ ‘మించుతల్లి(మెరుపుతీగ)ని’, ‘రాసుతా (రాకుమారా)’ లాంటి పదాలు చమత్కారానికి వాడినవే. రా! సుతా! అని విడదీస్తే అసహ్యంగా ఉంటుంది. అనారతం గ్రాంథిక పదం అని వదిలేయాల్సింది కాదు. సంస్కృత పదమైనప్పటికీ సొంపైన తెలుగు పదంగానే ఇది తెలుగు కలాలలో ఓలలాడింది. అత్యాధునిక అభ్యుదయ కవులు కూడా విరివిగా వాడిన పదమే ఇది.

దిగనాడు

“ఆహా! ధనలోభము సర్వాపదలకు మూలముగదా! తద్వర్జనము కంటే లోక మందు సుఖమేదియు లేదు, ఆశ దిగనాడిన వాఁడే సత్పురుషుడు” డబ్బు కక్కుర్తి సమస్త ఆపదలకు మూలం. దాన్ని వదిలేయటాన్ని మించి లోకంలో సుఖం ఇంకేదీ లేదు. ఆశని వదిలిన వాడే సత్పురుషుడు అంటాడీ వాక్యంలో చిన్నయసూరి, దిగనాడటం అంటే వదిలేయటం. వదిలేయాల్సిన దాన్ని వదిలేసినప్పుడు అది పాజిటివ్ దృక్పథం. పట్టుకోవలసిందాన్ని వదిలేయటం నెగెటివ్ దృక్పథం. భాష విషయంలో మన ఆలోచనలు పాజిటివ్‌గా ఉన్నాయా.. లేక నెగెటివ్‌గా ఉన్నాయా అనేది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన విషయం.

దిగనాడు, తెగనాడు రెండూ మనం వదిలేసుకున్న పదాలే! ఎందుకు వదిలేసుకున్నాం? వాటిలో ఏ లోపం ఉందని పత్రికలు వాడకం లోంచి వీటిని దిగనాడాయి? చాలా వాడుకపదాలు జనం నాలుకల మీంచి తప్పుకోవటానికి పత్రికల బాధ్యత కూడా ఉంది. కొందరైతే కొన్ని పదాలకు ఛాందసవాద ముద్రవేశారు. పరిమితమైన కొన్ని నుడులకు తెలుగుభాషను పరిమితం చేయటం అనాలోచితంగా జరిగింది. విలువైన పదాల శరాలెన్నో అమ్ముల పొది లోంచి జారిపోయాయి. ఇప్పటికైనా మనం కళ్లు తెరవాల్సి ఉంది.

వైదికమతమ్ము తెగనాడు వారినాల్క/పఱియలయిపోను బౌద్ధుల దరిసెనంబు
పాతకమ్మండ్రు వారి సంభాషణమ్ము/విన్న వ్యక్తికి నరకంబు కన్నఁ గలదె?”

అని ‘వీరభారతము’ వీరుల కథాకావ్యంలో అలుగురాజు గురించి వ్రాస్తూ ఏటుకూరి వెంకట నరసయ్యగారు వైదికధర్మాలను తెగనాడే వారి నాలుక చీల్చేయాలన్నారు. ఉత్తినే తెగనాడేవారికి నోటి దురద తీరుతుందే తప్ప, వారి వలన విషయమూ, విజ్ఞానమూ బలపడవలవని నరసయ్యగారి భావన.

మనం కూడా తెగనాడేవాణ్ణి తెగనాడుతూ కూర్చోవటం వలన వివాదాల ఊబిలో దిగబడటమే తప్ప వ్యతిరేకశక్తులు దిగగారేదిగానీ, మనకు అలంకార భూషణాలు దిగవేయటం గానీ ఏమీ ఉండదు. అలాంటి వారిని దిగనాడటమే మెరుగైన దారి.

‘తగదింతటి సర్వజ్ఞత, దిగనాడుము’ అంటుంది నిరంకుశోపాఖ్యానం. యాబై యేళ్ల క్రితం వరకూ పత్రికల్లో విస్తృతంగా వాడకంలో ఉన్న పదమే ఇది. “వారు తరచుగ దిగనాడుచుండెడి విషయములలో భారత స్త్రీల పరిస్థితి ముఖ్యమైనది” అని 9-6-1944 ఆంధ్రపత్రికలో ఈ ‘దిగనాడు’ ప్రయోగం కనిపిస్తుంది. కొల్లలుగా ఆ నాటి పత్రికల్లో ఈ పదం వాడకంలో ఉండేది. ఇప్పుడేమైంది?

పదాలను పారేసుకోవటం, వాటిమీద గ్రాంథికం ముద్రలు వేయటం ఇవన్నీ ఒకనాటి వికృత చేష్టలు. కొందరు పనిగట్టుకుని ఈ హాని చేశారు. అందువలన భాష కుంచించుపోతుందని వీళ్ళకి తట్టలేదు. మనం వదిలేసిన మాటల్ని ఏరుకుని పొందికగా వాడకంలోకి తెచ్చుకోవాల్సిన అగత్యం మనదే.

తగులుకోవటం

“ఈలాగున వాఁడు తగులుకొని, ‘క్రూరజంతువును నమ్మరాదు, నమ్మి యీ గతి తెచ్చుకొంటిని. మించిన దానికి వగచి యేమి ప్రయోజనము? ఎవ్యరికైన విధి తప్పించుకో వశముగాదు’ అని చింతించుచు దానిచేత భక్షింపబడియె” మిత్రలాభంలోని ఈ చిన్ని వృత్తాంతంలో చిన్నయసూరి వాడిన తగులుకొని అనే పదం చాలా ముఖ్యమైంది. తగులు అంటే To happen, occur, turn up, appear అని! పేదరికం తగిలిన ఓ దరిద్రుడికి ప్రయాణం తగలటం, వాడు ఊబి ఉన్న సరోవరానికి రావటం, అక్కడో పులికి ఆ దరిద్రుణ్ణి చూడగానే తినాలనే కోరిక తగులుకొనటం, పసిడి కంకణం ఇస్తానంటూ అది వాణ్ణి తగులుకోవటం, అదృష్టం కాలికి తగిలిందని వాడు పేరాస పడటం, పులి మనసులోని దురాశ వాడికి తగలకపోవటం, వాడి మనసుకు పసిడి కంకణం మాత్రమే తగలటం, తాను ధనవంతుణ్ణి అయిపోతాననే ఊహలు తగులుకొనటం, పులితో చెలగాటం మంచిదికాదనే నీతిఅడ్డం తగలకపోవటం, చివరికి ఊబిలో తగులుకొనటం, పులి వాణ్ణి తగులుకుపోవటం ఇలా కథంతా తగులుకోవటం చుట్టూరా అల్లుకుంది.

తగులు అనే పదాన్ని మనం తగులుకుంటే చాలా అర్థాలు స్ఫురిస్తాయి. ఆ గుడిసె తగులుకొన్నదంటే అగ్నికి ఆహుతయ్యిందని!

నక్షత్రకుడు హరిశ్చంద్రుణ్ణి తండుకొన్నాడు అంటే తగులుకున్నాడు. పట్టుబట్టి సాధించటానికి వాడవలసిన పదాలే ఇవన్నీ! లంకెపడటం లేదా లంకించటం, పట్టుబడటం, దాపరించటం, ఐక్యమవటం, ఆలింగించటం ఇవన్నీ తగుళ్లే మనకి.

కదల్చలేని కాణాచి

“ఈ త్రావు తాతముత్తాతలు సంపాదించిన కాణాచి గాదు, భూమండలములో నింకఁ ద్రావు దొరకదా? ఇక్కడనుండ నేల! ఈ చెడగరపు బోడకఱ్ఱమోఁదులువడి ప్రాణములు కోలుపోనేల? ఇంక నెక్కడనయిన నొక్కవిజన ప్రదేశము చేరి కాలము పుచ్చుట మంచిది. శిలాంతరాళమందలి కప్పను భరించు దయామయుఁ డయినయీశ్వరుఁడు నన్నుఁ గాపాడుకుండునా?అని చింతించి మనసు గట్టి పఱచుకొని యచ్చోటు విడిచి యా నిర్జనవనము చేరితిని”

హిరణ్యకుడనే ఎలుక చెప్పిన అనుభవసారం ఈ వాక్యాలు.ఈ చోటు మా తాతముత్తాతలు సంపాదించిన కాణాచి కాదని, చెడి, బోడి అయిన మోదుగ కర్రలా ప్రాణాలు కోల్పోవలసిన అవసరం లేదని, మనుషుల్లేని అడవులకు పోతే, రాతిలో కప్పని ఈశ్వరుడు కాపాడినట్టే తననూ కాపాడతాడనుకుని మనసు రాయి చేసుకుని ఈ నిర్జన ప్రదేశానికి వచ్చానంటుంది హిరణ్యకుడనే ఎలుక.

కాణాచి చక్కని తెలుగు పదం. కాణయాచి అని కూడా అంటారు. కాణం అనే పదం తెలుగులోనూ సంస్కృతంలోనూ ఉంది. సంస్కృతంలో కాణః అంటే గుడ్డిగువ్వ. తెలుగులో కాణం అంటే గ్రాసం. కడుపు నింపేదని! Inherited right or right of possession మిరాసి అనేది అంతరార్థం. కాణాచి అంటే, ఉనికిపట్టు, ఏనాటీనుండో అలవాటుగా ఉన్నది, ఏ నాటి నుండో ఆటపట్టుగా ఉన్నదని!

చిరకాలంగా ఇక్కడే ఉన్నానంటే చాలాకాలం క్రితమే దీన్ని ఆక్రమించుకున్నానని లేదా సంపాదించుకున్నానని అనటమే! జీవనాధారాలైన డబ్బు, స్థిరాస్థులు, పొదుపు-మదుపు మనకుగా మనం సముపార్జించుకున్న సామాజిక అంశాలన్నీ మన కాణాచే!

కాణాచి అనేది ఒక గౌరవప్రదమైన పదం. “హత్యలకు, దోపిడీలకు, రేపులకు కాణాచి” అనటం వినటానిక్కూడా ఇబ్బందిగా ఉంటుంది. “కైవల్యమందు నీతో కాణాచి యాడనాకు/శ్రీవేంకటాద్రిమీంది సేవ చాలదా?” అంటాడు అన్నమయ్య. కైవల్యం అంటే నీతో ఉండిపోయే బాగ్యం పొందటమే! చిరకాలవాస స్థానం కాణాచి కాబట్టి, కైవల్యమంటారు గానీ ఆ కాణాచి అదెక్కడ? నేనెక్కడ? ఇదిగో ఈ వెంకటాద్రి మీద నీ సేవ నాకుండగా అవన్నీ నాకెందుకయ్యా?” అని ఈ పదానికి భావాన్ని అమరవాది సుబ్రహ్మణ్యశర్మగారు వివరించారు.

అచ్చతెనుగులో కాణాచిని ‘మనికి’ అంటారని ఆదిభట్లవారి వివరణ! కలల కాణాచులుగా ఉన్నవాళ్లు కూడా మెలకువల కాణాచులుగానూ కదల్చలేని కాణాచులుగానూ మారాలన్నమాట!

లాతిపలుకులు

“దారిద్ర్యము సర్వశూన్యము. దారిద్ర్యముకంటె మరణము మేలు. మరణమాపాతే యాతానావహము. దారిద్ర్యము యావజ్జీవము తీవ్ర వేదనాకరము. ఇంద్రియముల నామమున బుద్దిని వచోధోరణిని బురుషుడు తొంటివాడయ్యు ధనమును బాసిన క్షణముననే ‘లాతి’వాఁడగును, ఇది మహాచిత్రము. అని యాపరివ్రాజకుఁడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుఁడనయి యిట్లు చింతించితిని” సర్వమూ కోల్పోయిన మూషికరాజు ఆత్మకథ ఇది. డబ్బు కోల్పోయిన వాడి దురవస్థ చెప్తూ, తొంటివాడు అంటే అప్పటిదాకా తనవాడుగా గౌరవించబడినవాడు కూడా ‘లాతి’ వాడు అంటే పరాయి వాడు, దూరంగా పెట్టవలసిన ‘లాతి’ అయిపోతాడు”

‘లాతి’ అటు సంస్కృతంలో కూడా ఉంది. సంస్కృత ‘లాతి’ అంటే స్వీకరించటం. అమరకోశం ‘లా-ఆదానే’ అనే వ్యుత్పత్తి ననుసరించి ‘లాతి’ స్వీకరించేదనే అర్థంలో ఏర్పడిందని వివరించింది.

“సుర పదానికి, సు=మంచిని, రాతి (లాతి)=తీసికొన్నవారు అని అర్థం! మంచిని తీసికొనే మనోవృత్తి గలవారు సురలు. ‘లాతి’ని అలా ఉన్నత విషయాలను స్వీకరించే సందర్భాల్లో వాడతారు. కానీ, తెలుగులో ఇందుకు భిన్నమైన అర్థంలో ఈ పదం రూపొందింది.

“యొండొకం డనంగ మఱియు వేరొకడు ‘లాతి’ వాఁడు పెఱవాఁడు తక్కినవాఁడనంగ నన్యునకు నాఖ్య లగుచుఁ బెంపారు చుండు అని ఆంధ్రనామశేషము వివరించింది. అన్యుడు అనే పదానికి తెలుగులో ఒరువుడు, ఎడవాడు, పెరవాడు, ‘లాతి’ అనే పేర్లున్నాయి. ‘లాతి’ని Other, strange, foreign అనే అర్థాల్లో పరాయిది, ఇతరమైనది, అన్యమైనది అనే అర్థాల్లో ప్రయోగిస్తారు. పండితులకు మాత్రమే పరిమితమైన పదంగా ఇది ఉండిపోయింది. సామాన్యుణ్ణి కూడా చేరాల్సిన పదమే ఇది! ఆంగ్లం మనకు లాతిభాష!

కానీ, ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటువు ప్రకారం తక్కిన ద్రావిడ భాషల్లో లాతి పదం ఈ అర్థంలో లేదు. ఈ ‘లాతి’ తెలుగులోనే ఏర్పడింది. దాని మూలం తెలీదు. పరపురుషుడు పరస్త్రీ, పరదైవం, పరమతం, పరభాష, పరధనం ఇలా ‘పర’ అనటానికి తెలుగులో ‘లాతి’ ఉపయోగపడ్తుంది. కాకపోతే ‘లాతి’ అనే తెలుగు పదాన్ని స్త్రీ, పురుష, ధన లాంటి సంస్కృత పదాలతో కాకుండా ‘లాతిది’, ‘లాతివాడు’, ‘లాతిడబ్బు’ ఇలా.. తెలుగు పదాలతో కలిపి ప్రయోగించటం బావుంటుంది. లాతి చేడియలు అన్నాడు చిన్నయసూరి పరాయి స్త్రీలని!

“రిచ్చచేతులు-రిక్తహస్తాలు”

“ఎంతవారికిఁగాని దైవ మలంఘ్యము. ప్రాప్తించిన వ్యసనమునకుఁ బ్రతీకారము విచారింవవలెఁగాని ఱిచ్చపడి యుండదగదు. కాఁబట్టి యిప్పుడు కర్తవ్యము నీకుఁ దోఁచినది శీమ్రుముగఁ జెప్పుము. మంథర హిరణ్యకులు నా మార్గము సూచుచుండుదురు. పోవలెను, అనినఁ జిత్రాంగుడు విని వేటకాఁడు రాకముందు హెచ్చరిక పడి సదుపాయము చేసితిరా నన్నుఁ దప్పింపవచ్చును. లేదా నా యాశ నేఁటితో మానుండు..” అన్నాడు వలలో చిక్కిన చిత్రాంగుడు. వలను కొరికేందుకు లఘుపతనకుడు హిరణ్యకుని వీపుమీద ఎక్కించుకుని వాయువేగంలో తేవటం, చిత్రాంగుని రక్షించటం కథ అందరికీ తెలిసిందే! ఈ సందర్భంలో చిన్నయసూరి ‘రిచ్చపడు’ పదం ప్రయోగించాడు.

విరహతాపంలో ఉన్న ఓ స్త్రీ మనోభావాన్ని ఆముక్తమాల్యదలో రాయలవారు వర్ణించే సందర్భంలో, “మింటి పయినుంట గా దని యింటిపైకిఁ/ తెచ్చుకొంటి నటంచుఁ ‍బెన్ ఱిచ్చవెడలు” అంటాడు. ఆకాశం కింద ఉంటే తాపం ఎక్కువగా ఉందని చంద్రకాంత శిలల గృహంలోకి వెడితే అక్కడ తాపం మరీ పెరిగిపోయి, పెనురిచ్చవెడలడం అంటే నిశ్చేష్టురాలై వెళ్లిపోయిందట!

రిచ్చ, రిచ్చపాటు, రిచ్చపడు పదాలకు నిశ్చేష్టత, ఏం చెయ్యాలో తోచక మ్రాన్పడిపోవటం, దిగులు, వితాకు, మ్రానుపాటు అని అర్థాలు. రిచ్చగొనటంఅంటే, సంభ్రమాశ్చర్యాలతో చూడటం. ఆ ఆశ్చర్యంలో ఆనందంకన్నా ఆందోళన ఎక్కువగా ధ్వనిస్తుంది.

పోరామి

“ఇట్లు ఖరశ్వానములు ప్రశ్నోత్తరములు జరువుచుండఁగా గాడిద మిక్కి లి కోపించుకొని “యోరిదురాత్మ! వినుము, ఒక పోరామి వచ్చినప్పుడు స్వామిదోషములు దడవి యుపేక్షించి యుంట భృత్యునకు ధర్మము కాదు..” అంటూ, పెంపుడు గాడిద, పెంపుడు కుక్కా వాదులాడుకున్నాయి. గాడిదకు చాలా కోపం ఉచ్చింది. మనల్ని పోషించే యజమానికి పోరామి వచ్చినప్పుడు ఆయన తప్పులు లెక్కిస్తూ కూర్చోవటం సేవకుల ధర్మం కాదు” అని! ఈ వాక్యాలలో పోరామి అంటే ఆపద.

‘పోవు’ అనే ఒక్క పదానికి పాతిక పైగా ప్రయోగాలున్నాయి

పోనొత్తు=తీసివేయటం. పోపడు=పోవటం, పోవచ్చు=తిరిగిరావటం, పోదెంచు=పోవటం, పోదోయు=ముందుకు త్రోయటం, పోద్రొబ్బ=నెట్టేయటం, లేనిపోని=లేనిదీ పోనిదీ, లేనిపోని మాటలు=మూర్ఖపు మాటలు లేదా కల్లలు, పోనిమ్ము=వస్తే రానిమ్ము, పోతే పోనిమ్ము! పోనితప్పు=సరిచెయ్యలేని తప్పు, పోబడి= రాబడి, పోబడి అంటాం జమా ఖర్చులు అనే అర్థంలో! పోబడి అంటే, A trace. జాడ అని కూడా! పోబెట్టు=బ్రౌన్ నిఘంటువు అనురాగమువల్ల గలిగిన ధ్వని. అని అర్థం ఇచ్చింది. పోరాని= తప్పనిసరైనది. పోరామి= గాఢమైన స్నేహం, చెలిమి. “పోరే రారె ప్రియంబు గల్గినజనుల్ పోరామి పోబోవునే”; “ఆరాములలో నెప్పుడు పోరాములు చాలనెరపి పురుషోత్తముడున్.” లాంటి ప్రియమైన కవి ప్రయోగాలు కూడా పోరామి అంటే, ప్రియమైనదనే అర్థంలో ఉన్నాయి.

Exit mobile version