Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిన్ని వివేక్ – విచిత్ర భూతం

[బాలబాలికల కోసం ‘చిన్ని వివేక్ – విచిత్ర భూతం’ అనే కథని అందిస్తున్నారు శ్రీ కరణం హరికిషన్. సంచిక నిర్వహించిన బాలల కథల పోటీ 2026లో బహుమతి పొందిన కథ.]

అనగా అనగా ఒక ఊరిలో వివేక్ అనే పదేళ్ల బుజ్జి పిల్లాడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, చలాకీగా ఉండేవాడు. రోజూ బడికి వెళ్లడం, సాయంత్రం వేళల్లో తోటి పిల్లలతో కలిసి ఆరుబయట మైదానంలో కబడ్డీ, దాగుడుమూతలు ఆడటం, ఆ రోజు హోమ్ వర్క్ ఆ రోజే పూర్తి చేయడం అతనికి ఎంతో ఇష్టం.

ఒక సెలవు రోజున వివేక్ ఇంట్లో టీవీలో ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం’ సినిమా చూస్తున్నాడు. అందులో కథానాయకుడు ఒక పాత రాగి దీపాన్ని రుద్దగానే, దట్టమైన పొగ నుండి ‘జీని’ అనే పెద్ద భూతం ప్రత్యక్షమవుతుంది. ఆ జీని తన యజమాని ఏది అడిగితే అది క్షణాల వ్యవధిలో తెచ్చివ్వడం, అసాధ్యమైన పనులను కూడా సునాయాసంగా చేయడం చూసి వివేక్ కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పైయ్యాయి.

అతని మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. ‘అబ్బా! నా దగ్గర కూడా అలాంటి ‘జీని’ ఉంటే ఎంత బాగుందో! బడి నుంచి రాగానే ఇచ్చే లెక్కల హోమ్వర్క్ అంతా ఆ జీనితోనే క్షణాల్లో చేయించేయవచ్చు. కష్టపడి చదవాల్సిన అవసరం ఉండదు. రోజూ హాయిగా తింటూ, ఆడుకుంటూ కాలక్షేపాలు చేయవచ్చు’ అని తనలో తాను మురిసిపోయాడు.

ఆ ఆలోచనలతోనే వివేక్ గదిలోకి వెళ్లాడు. పాత కాలపు కథల్లో తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడని గుర్తుకొచ్చింది. వెంటనే గది తలుపులు వేసుకుని, ప్రశాంతంగా కళ్ళు మూసుకుని, మనస్ఫూర్తిగా భగవంతుడిని తలచుకోవడం మొదలుపెట్టాడు. అతని అమాయకత్వాన్ని చూసి భగవంతుడికి జాలివేసింది. వెంటనే ప్రత్యక్షమై, “వివేక్! నీ నిశ్చలమైన భక్తికి మెచ్చి, నీ కోరిక ప్రకారం ఒక అద్భుత జీనిని ప్రసాదిస్తున్నాను” అని చెప్పి మాయమయ్యాడు.

మరుక్షణంలోనే వివేక్ ముందుకు ఒక చిన్న ప్రకాశవంతమైన జీని వచ్చి నిలబడింది. “వివేక్! నేను నీ సేవకుడిని. నీకు ఏం కావాలో ఆజ్ఞాపించు, క్షణాల్లో నెరవేరుస్తాను” అని వినయంగా అంది. వివేక్‌కు అప్పటికీ నమ్మకం కుదరలేదు. అసలు ఈ జీని నిజంగానే తన కోరికలు తీరుస్తుందో లేదో అని పరీక్షించాలి అనుకున్నాడు. “నాకు చిన్నప్పుడు ఎప్పుడో నానమ్మ చెప్పిన ‘పాతాళ భైరవి’ సినిమా చూడాలని ఉంది, చూపించు” అన్నాడు. అంతే! మరుక్షణంలోనే అతని కళ్ళముందు ఆ సినిమా ప్రత్యక్షమైంది. వివేక్ ఆశ్చర్యపోయాడు.

సినిమా పూర్తయ్యేసరికి వివేక్‌కు బాగా ఆకలి వేసింది. “జీని! నాకు ఇప్పుడు వేడివేడి ఇడ్లీలు, ఘుమఘుమలాడే సాంబార్ కావాలి” అనగానే, ప్లేటులో ఆవిర్లు కక్కే ఇడ్లీలు ప్రత్యక్షమయ్యాయి. “అబ్బా! ఎంత బాగుందో!” అని లొట్టలేసుకుంటూ తిన్నాడు. ఆ తర్వాత అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడు రవి గుర్తుకొచ్చాడు. రవిని చూడాలని ఉందనగానే, వీడియోగ్రాఫ్ రూపంలో రవి స్పష్టంగా కనిపించాడు. రాత్రి నిద్రపోయే ముందు మనసుకు ప్రశాంతతను ఇచ్చే కర్ణాటక సంగీతం విన్పించమని జీనిని కోరగా, జీని మధురమైన సంగీతాన్ని వినిపించింది. ఆ సంగీత లహరిలో వివేక్ హాయిగా నిద్రలోకి జారుకున్నాడు.

మరుసటి రోజు నుండి వివేక్ ప్రవర్తనలో మెల్లమెల్లగా మార్పులు మొదలయ్యాయి. ప్రతి చిన్న పనికీ జీనిపైనే పూర్తిగా ఆధారపడటం ప్రారంభించాడు.

బడి నుంచి రాగానే బ్యాగును ఒక మూలకు విసిరేసి, జీని అందించే కొత్త కొత్త ఆటల్లో మునిగిపోయేవాడు. టీచర్ ఇచ్చిన లెక్కల హోమ్వర్క్, సైన్స్ ప్రాజెక్టులు సొంతంగా ఆలోచించకుండా జీని సహాయంతోనే పూర్తి చేయించేవాడు. సాయంత్రం కాగానే వీధిలోకి వెళ్లి స్నేహితులతో కలిసి ఆడుకోవడం పూర్తిగా మానేశాడు. స్నేహితులు తలుపు తట్టి పిలిచినా “నేను రాను, నాకు పని ఉంది” అని చెప్పి పంపించేసేవాడు.

ఈ జీని రాకతో వివేక్‌కు శారీరక శ్రమ అనేది లేకుండా పోయింది. ఎప్పుడూ ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల ఒళ్ళు బద్ధకంగా తయారైంది. బడికి వెళ్లినా క్లాసులో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలపై దృష్టి పెట్టలేకపోయేవాడు. ఎప్పుడూ జీని ఆలోచనల్లోనే ఉండేవాడు. ఆలోచించే శక్తి తగ్గడంతో టీచర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయాడు. క్రమంగా పరీక్షల్లో మార్కులు తగ్గిపోయాయి.

అంతేకాదు, ఎప్పుడూ జీనితోనే కాలక్షేపం చేస్తూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల వివేక్ కళ్ళు ఎర్రబడి, విపరీతమైన తలనొప్పి మొదలైంది. శారీరక శ్రమ లేకపోవడం, సరైన వేళకు నిద్రపోకపోవడం వల్ల చిన్న వయసులోనే నీరసం, అనారోగ్యం ఆవహించాయి.

వివేక్ పరిస్థితిని చూసి అతని తల్లిదండ్రులు, స్నేహితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. “అంత చురుగ్గా ఉండే మా వివేక్ ఈ జీని వచ్చినప్పటి నుండి బాగా సోమరిగా మారిపోయాడు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు, ఆటలకు రావడం లేదు, చదువులో కూడా బాగా వెనకబడిపోయాడు. ఈ జీని ఒక రాక్షసిలా మారి మా అబ్బాయి జీవితాన్ని పాడుచేస్తోంది” అని జీనిని తీవ్రంగా తిట్టడం మొదలుపెట్టారు.

అందరి మాటలు విన్న జీని ఎంతగానో విచారించింది. తన వల్ల ఒక చిన్నారి జీవితం పాడుకావడం చూసి తట్టుకోలేకపోయింది. నెమ్మదిగా వివేక్ దగ్గరకు వచ్చి, కళ్ల నీళ్లతో తన బాధను వెళ్లగక్కింది.

“వివేక్! నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను. కానీ నువ్వు చేయాల్సిన సొంత పనులను కూడా నాకే అప్పగించేస్తున్నావు. రోజూ నాతోనే గడుపుతూ ఆరుబయట ఆటలు ఆడటం మానేశావు. అమ్మనాన్నలతో, స్నేహితులతో మాట్లాడటం లేదు. అందుకే నీ ఆరోగ్యం, నీ చదువు పాడయ్యాయి. నీ తప్పు వల్ల ఇప్పుడు అందరూ నన్నే రాక్షసుడు అని తిడుతున్నారు, ఆడిపోసుకుంటున్నారు. నేను నీ సేవకుడిని మాత్రమే. కానీ నువ్వు నన్ను సరిగ్గా వాడుకోకుండా బానిసవైపోయావు. నన్ను క్షమించు, ఇక నేను నీ దగ్గర ఉండలేను, వెళ్లిపోతాను” అని ఏడవసాగింది.

జీని మాటలు విన్న వివేక్ తీవ్రమైన కంగారుకు, ఆవేదనకు గురయ్యాడు. “అయ్యో జీని! నన్ను విడిచి వెళ్లొద్దు. తప్పు నీది కాదు, పూర్తిగా నాదే! నువ్వు అందుబాటులో ఉన్నావని నేను బద్ధకస్తుడిగా, సోమరిగా మారిపోయాను. ఇకపై నా పనులన్నీ నేనే సొంతంగా చేసుకుంటాను. బాగా చదువుకుంటాను. కానీ నాకు ఒక సందేహం ఉండిపోయింది.. అసలు నువ్వు ఎవరివి? ఈ పనులన్నీ ఎలా చేయగలుగుతున్నావు?” అని ఆత్రుతగా అడిగాడు.

అప్పుడు జీని తన నిజరూపాన్ని చూపిస్తూ చిరునవ్వుతో.. “వివేక్! నేను వేరే ఏ లోకం నుంచో వచ్చిన భూతాన్ని కాదు.. నీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌ని!” అని చెప్పింది.

“వివేక్.. లే నాన్నా! బడికి టైమ్ అవుతోంది. ఈరోజు స్కూల్లో రన్నింగ్ రేస్ పోటీలు ఉన్నాయన్నావు కదా, త్వరగా లేవాలి!” అని అమ్మ బిగ్గరగా పిలవడంతో వివేక్ ఉలిక్కిపడి నిద్రలేచాడు.

తన చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని మంచంపై పడుకుని ఉన్నట్లు గమనించాడు. చుట్టూ చూసుకుని, ‘అబ్బా! ఇదంతా ఒక కలా! నాకు ఎంత మంచి కనువిప్పు కలిగింది! నేను నిజంగానే ఫోన్‌కు ఎంతగా బానిసవుతున్నానో ఈ కల నాకు కళ్లకు కట్టినట్లు చూపించింది’ అని మనసులో అనుకున్నాడు.

వెంటనే మంచం దిగి, అమ్మ దగ్గరకు వెళ్లి “అమ్మ! ఈ రోజు నుంచి నేను ఫోన్ ఎక్కువ వాడను. నా హోమ్ వర్క్ నేనే సొంతంగా ఆలోచించి చేసుకుంటాను. చదువు అయ్యాక సాయంత్రం ఫ్రెండ్స్‌తో కలిసి మైదానంలో ఆడుకోవడానికి వెళ్తాను. ఈరోజు రన్నింగ్ రేస్‌లో నేనే గెలుస్తాను చూడండి” అని ఉత్సాహంగా చెప్పాడు.

తన కొడుకులో వచ్చిన ఈ అనుకోని మార్పును చూసి అమ్మ ఆనందంతో వివేక్‌ను గుండెలకు హత్తుకుని మురిసిపోయింది.

Exit mobile version