Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హృదయాలలో వెలుగులు నింపే ‘చిరుదివ్వె’

[శ్రీమతి దాసరి శివకుమారి గారి ‘చిరుదివ్వె’ కథా సంకలనానికి కొల్లూరి సోమ శంకర్ రాసిన ముందుమాటని అందిస్తున్నాము.]

విశ్రాంత హిందీ ఉపాధ్యాయిని శ్రీమతి దాసరి శివకుమారి గారి తాజా కథా సంపుటి ఇది. కథలు, నవలలు, బాల సాహిత్యం, నాటికలు, వ్యాసాలు, అనువాదాలలో విశేష కృషి చేశారు శివకుమారి. అనువాద కథలు కాకుండా, సొంత కథలు దాదాపు 125 రాశారు.

సహజ స్వభావం వల్లో, టీచరు ఉద్యోగం నేపథ్యం వల్లో – శివకుమారి గారికి విస్తృత అధ్యయనం అలవాటయినట్టు ఆవిడ రచనలు చదివితే తెలుస్తుంది. నవలలకి, కథలకి ఆవిడ ఎంచుకునే ఇతివృత్తాలు ఆధునికమైనవీ, సమకాలీనమైనవీ అయ్యుంటాయి. సమాజంలోని వ్యక్తుల లానే ఆమె కథలలోని పాత్రల ఆలోచనలో వైవిధ్యం ఉంటుంది. కొందరు చెరువు నీటిలా ఒకేచోట నిలిచిపోతే, మరికొందరు, నదీ ప్రవాహంలా ముందుకు సాగిపోతారు. కొందరు ఆడంబరాలలో ఆధునికంగా ఉంటే, కొందరు ఆలోచనల్లో, చేతల్లో అభ్యుదయాన్ని కనబరుస్తారు.

వర్తమాన సమాజంలోని మనుషుల భిన్న పోకడలను ప్రదర్శిస్తూ.. చదువుతున్నప్పుడు ఇలాంటి వ్యక్తి మాకు తెలుసు అనిపించేలా ఉంటాయి ఈ కథల్లోని చాలా పాత్రలు. మానవ స్వభావంలోని ఊగిసలాటలూ, స్థిరనిర్ణయాలూ ఈ కథల్లో తారసపడతాయి. స్వార్థంతో తమ బాగు మాత్రమే కోరే మనుషులున్నట్టే, అందరూ బాగుండాలి, అందరితో పాటూ తామూ బాగుండాలని అనుకునే వ్యక్తులూ ఈ కథల్లో తారసపడతారు.

ఓ కథలో ఊరుమ్మడి మేలు కోసం పిత్రార్జితంగా వచ్చిన కొంత భూమిని ఓ కూతురు స్వచ్ఛందంగా వదులుకుంటే, మరో కథలో అనుకోకుండా భారీ మొత్తంలో దొరికిన డబ్బుని ఓ మంచిపని కోసం వినియోగిస్తాడో వ్యక్తి. ఈ కథ చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి నిబద్ధత మీద కొన్ని సందేహాలు తలెత్తవచ్చు పాఠకులకి, కానీ అతని ఆంతర్యం గ్రహించాకా, ఆ పరిస్థితుల్లో అతను చేసినదే సరైనదని భావిస్తారు.

ఆస్తి ఉందని అహంకరించి, సన్నిహితులను దూరం చేసుకున్న ఓ జంటలో వాళ్ళ కొడుకు ఎలా మార్పు తెచ్చాడో మరో కథ చెబుతుంది. కరోనా నేపథ్యంగా సాగిన ఈ కథ మనుషుల స్వభావాలను, వారి సహజ ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది.

పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన కూతురి జీవితంలో తల్లి అనవసరమైన జోక్యం చేసుకుంటే కూతురి సంసారం ఎంతలా ప్రభావితమవుతుందో, కూతురు ఏం కోల్పోతుందో ఓ కథ చెబుతుంది. తల్లీ, అత్తగార్ల మధ్య నలిగిన రమ్య చివరికి ఓ గట్టి నిర్ణయం తీసుకుంటుంది. అత్యాచారానికి గురైన బాలిక, ఓ న్యాయవాది సహాయంతో – ఆ నేరస్థుల గుట్టు రట్టు చేసి, ధైర్యంతో ముందుకు సాగిన వైనం స్ఫూర్తిదాయకం.

డబ్బున్న వాళ్ళ పిల్లలని చూసి తామూ అలాగే బ్రతకాలని ఆశపడ్డ ఓ కాలేజీ బస్సు డ్రైవర్ కూతురు, కొడుకులు – అబద్ధపు జీవితాలలోని ఆత్మవంచన, అనుకరణ బతుకులో అగాధాలలోకి జారిపోయిన వైనం పాఠకులను హెచ్చరిస్తాయి.

వర్చువల్ రియాలిటీని ఉపయోగించి ఇంట్లో ఉండే ప్రపంచాన్ని చుట్టిరావచ్చనుకున్న వ్యక్తి – ఆ ప్రయత్నంలో గతంలోకి వెళ్ళి కృష్ణదేవరాయల ఆస్థానంలో వెళ్తాడు ఓ కథలో. తెనాలి రామకృష్ణుడి కథగా ప్రచారంలో ఉన్న ఓ కథని ఈ కథలో రచయిత్రి సందర్భోచితంగా ఉపయోగించారు. ఈ కథ మన దేశపు ఔన్నత్యాన్ని చాటుతుంది.

పిల్లల మీద అవసరమైన ఒత్తిడి పెట్టడం, వారి మనసులను గ్రహించకుండా ఒక స్థాయికి మించి వారిని బలవంతంగా చదివించాలని ప్రయత్నించడం, ఉన్న ఆస్తులతో సంతృప్తి చెందకుండా ఇంకా ఇంకా పోగేసుకోవాలనుకోవడం ఓ కుటుంబంపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఓ కథ చక్కగా చెబుతుంది.

కరోనా నేపథ్యంలో – ఒకరికొకరు సాయంగా ఉండడం ఎంత అవసరమో మరో కథ చెబుతుంది. వేసవి శెలవలలో వేరే ఊర్లు వెళ్ళి అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చూసి తిరిగిరావాలన్న తమ్ముడి కోరికను అన్న తీర్చిన విధానం ఆకట్టుకుంటుంది.

దగ్గరి బంధువులు చేసిన మోసం, కరోనా వల్ల కోల్పోయిన ఆర్థిక భద్రత – ఓ కుటుంబాన్ని అవమానం పాలు చేస్తాయి, రోడ్డుకీడుస్తాయి. మరో రకంగా జీవించాలనుకునే ప్రయత్నంలో మళ్ళీ మోసాలకి గురవుతుందా కుటుంబం. కఠిన పరిస్థితులలో – కొద్దిగా నిలదొక్కునే ప్రయత్నంలో కుటుంబంలోని చిన్నకొడుకు ప్రలోభాలకి గురవుతాడు. తల్లీ, అన్నా హెచ్చరికలతో మళ్ళీ ఆలోచనలో పడతాడు ఓ కథలో.

సాంప్రదాయాలను పాటించటం కోసం, ఆధునిక విజ్ఞానాన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదని చెప్పే కథలో గతంలో రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట దుర్ఘటనని పాఠకుల ముందుకు తెస్తారు రచయిత్రి.

చావుబతుకుల మీద ఉన్న ఓ పేషంటు భార్యని ఒప్పించి, ఆసుపత్రి యాజమాన్యాన్ని అంగీకరింపజేసి ఓ ప్రయోగాన్ని చేసి ఆ పేషంటుని సజీవుని చేసి వైద్యరంగంలో కొత్త చరిత్ర సృష్టిస్తాడో వైద్యుడు ఓ కథలో.

మంచి మనసుతో ఓ కుటుంబానికి ఆసరాగా నిలిచిన యశోధరకు కష్టకాలం ఎదురైనప్పుడు, ఆమె దగ్గరే జీవితపు విలువలు నేర్చుకున్న – ఓ కుర్రాడు జీవితంలో ఎదిగి – ఆమె కష్టకాలంలో ఆదుకున్న వైనం హృద్యంగా ఉంటుంది ఓ కథలో.

ఓ కథలో అంతర్జాతీయ జలాలలో ప్రయాణించే వ్యాపార నౌకలు, ఆయిల్ డ్రిల్లింగ్, పైప్ లేయింగ్ నౌకలలో సిబ్బంది సాధకబాధకాలు, కరోనా కాలంలో వారెదుర్కున్న కష్టాలు, నైజీరియా జలాలలో సముద్రపు దొంగలు.. వాళ్ళ డిమాండ్లు.. ఇలాంటివి వార్తల్లో చదివిన/చూసిన ఇవన్నీ పాఠకులకు కథలోని సన్నివేశాల్లా కళ్ళ ముందు నిలవడం ఆసక్తికరంగా ఉంటుంది.

***

వస్తు వైవిధ్యం కలిగి ఉండి, నేల విడిచి సాము చేయకుండా, సమాజానికి హితవు చేసేవిగా ఉండాలన్న తపనతో రచించినవీ కథలు.

అత్యాశలు, తమ జీవన విధానం పట్ల అస్పష్టతల చీకట్లు నిండిన హృదయాలలో కాంతిని నింపుతుంది ఈ ‘చిరుదివ్వె’ అనే కథాసంపుటి. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది తాత్కాలికం, ఏది శాశ్వతం అన్న ఎరుకని కలిగిస్తుందీ కథా సంపుటి. శ్రీమతి దాసరి శివకుమారి గారికి అభినందనలు.

***

చిరుదివ్వె (కథలు)
రచన: దాసరి శివకుమారి
ప్రచురణ: వి.జి.కె. అండ్ వి.వి.ఎల్. ఫౌండేషన్
పేజీలు: 147
వెల: అమూల్యం
ప్రతులకు:
శ్రీమతి దాసరి శివకుమారి
301, సాకృత స్పెక్ట్రమ్,
రణవీర్ మార్గ్, సరళానగర్,
జె.ఎం.జె. కాలేజ్ దగ్గర
తెనాలి 522202
ఫోన్: 9866067664

 

~

శ్రీమతి దాసరి శివకుమారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-dasari-sivakumari/

Exit mobile version