బొమ్మలు, బొమ్మలు, బొమ్మలు
ముద్దులొలికే బొమ్మలు
అందం కోసం, ఆనందం కోసం ఈ బొమ్మలు
ఆత్మీయతకూ, అనురాగానికి ఈ బొమ్మలు ॥బొమ్మలు॥
రంగు రంగుల బొమ్మలు
రకరకాల బొమ్మలు
కొయ్య బొమ్మలూ, మట్టి బొమ్మలు
కదిలే బొమ్మలు, కదలనీ బొమ్మలు
మాట్లాడే బొమ్మలూ, మనసైన బొమ్మలు
నిర్మలమైన బొమ్మలూ, నిఖిలమైన బొమ్మలు
బొమ్మలు… బొమ్మలు ॥బొమ్మలు॥
ఏనుగు అంబారీలపై ఊరేగే బొమ్మలు
గుర్రాలై పరుగులు దీసే పసందైన బొమ్మలు
నర్తకిలై నర్తించే నాజూకు బొమ్మలు
బొమ్మలు… బొమ్మలు ॥బొమ్మలు॥
కొబ్బరాకుల అల్లికతో కొత్త కొత్త బొమ్మలు
పిచ్చుక గూళ్ళలో నిలిచే ఇసుక బొమ్మలు
చిత్ర చిత్రాల చిత్తరువులై చిత్తాన్ని దోచే బొమ్మలు
బొమ్మలు… బొమ్మలు ॥బొమ్మలు॥
దసరా పండుగ వచ్చిందంటే
కొలువు దీరే బొమ్మలు
పండగ సందడి చేసే బొమ్మలు
కన్నులు… బొమ్మలు… బొమ్మలూ
బొమ్మలు… బొమ్మలు… బొమ్మలు
మురిపించె బొమ్మలు, మైమరిపించే బొమ్మలు ॥బొమ్మలు॥
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.

