[సుధా కళ్యాణి ఆచంట గారు రచించిన ‘చిత్తశుద్ధికి ఆనవాళ్ళు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఎంత కఠినం ఎంత కఠినం
కలికాలమెంతెంత కఠినం!!
ఎన్ని ఘోరాలు మదిని మెలి పెట్టేసినా
ఓ రెండు రోజులు గడిచినంతనే
ఎవరికీ పట్టని పాత గాయాలు!
ఓ పక్క అభివృద్ధి వేగం పెరుగుతుంటే
అందనంత దూర తీరాలకు ప్రాణాలు!
నిర్వహణలో నిర్లక్ష్యమంటూ
తప్పులు నెట్టేసుకునే అధికారానికి
వినిపించవా ఆ నెత్తుటి ఆర్తనాదాలు!
మానవ తప్పిదాలే మరణ శాసనమవుతున్నా
గుణపాఠాన్ని నేర్చుకునే గుణమే శూన్యం!
మన దాకా రాలేదులెమ్మనే నిర్లక్ష్యానికి
గాలికి వదిలేస్తున్న నియమాలకు
ఆ నెత్తుటి రాదారులే సాక్ష్యం!!
గమ్యం చేరేవరకు బిక్కుబిక్కుమంటూ
ఎప్పటికప్పుడు ఓ క్రొత్త వార్తగా మిగిలిపోతూ
అడుగడుగునా అలసత్వానికి ప్రతీకగా
సామాన్యుడి సగటు జీవితానికి
నిత్యం సవాలు విసురుతూ రోడ్డు ప్రయాణాలు!!
నిబద్ధత, నిజాయితీ అలవాటుగా మార్చుకుంటే
ప్రతి ప్రాణం విలువైనదే అని గుర్తుంచుకుంటే
నియమాలున్నది మన రక్షణకే అని ఒప్పుకుంటే
జోరుగా హుషారుగా అంటూ సాగిపోవా ప్రయాణాలు!
మరి చిత్తశుద్ధికి మిగిలున్నాయా ఆనవాళ్ళు??
