[శ్రీ వేంకట చండీశ్వర్ రచించిన ‘చిత్తు కాగితం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
తదుపరి మీ చేతికి ఏదైనా
చిత్తు కాగితం చిక్కితే
దాన్ని చులకనగా ఉండచుట్టి
ఓ మూలకు విసిరేయకండి
అందులో ఏ అజ్ఞాత వ్యక్తో, శక్తో
మీరు ఎన్నో ఏళ్లుగా
శోధిస్తున్న విషయాన్నో, జీవన సత్యాన్నో
సంక్షిప్తం చేసుండొచ్చు
మీకో – మీ బంధు మిత్రులకు
ఉపయుక్తమైన సమాచారాన్ని
నిక్షిప్తం చేసి పంపబడిందేమో
ఏ తాత్వికవేత్తో జీవన సారాన్ని
మథించి మీ కోసం
నిగూఢంగా పంపారేమో
కవనమే తపనగా మెలిగి వెలిగిన
ఓ కవి జీవన విజయ రహస్యాన్ని
సంకేత భాషలో మీ కోసం విరచించారేమో
మన జీవన యానంలో సంభవిచే పలు
యాదృచ్ఛికాల్లో ఇదీ ఒకటేమో
అందుకే చిత్తు కాగితమే అని చులకనగా చూడకు
పూర్వం అది ఎందరికో నీడనిచ్చి
ఆకలి-దాహాల్ని తీర్చిన అరణ్యపు వృక్ష రాజమో
లేక ఏ కీకారణ్యంలో తపో నిష్ఠలో ఉన్న ముని లాంటిదేమో
మట్టి నుండి పుట్టి మట్టిలో కలుస్తూ కూడా
మన లాంటి మనుషులకు ఇంకేదో చేయాలని
మన చేతుల్లో చేరిందేమో
అందుకే పరికించు మరోసారి దీక్షగా
మన చరిత్రను మలుపు తిప్పే
అంశమేదైనా అందులో ఉందా అని |
PS : చిత్తు కాగితం గురించైనా ఉదాత్తంగా రాయటం నికార్సైన కవికి ఉండాల్సిన ప్రథమ లక్షణం.
