Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చూడటం నేర్పిన మనిషి!

[శ్రీ బొల్లిముంత వెంకట రమణారావు రచించిన ‘చూడటం నేర్పిన మనిషి!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ళ్లున్నా దారి కనిపించదు ఎప్పుడూ.
చూపు కళ్లలో పుట్టదు.
మన కళ్లలో తొలి వెలుగు
కొన్నిసార్లు ఇంకొక మనిషిదే.
అతడు దారిని చూపించడు ఎప్పుడూ.
దారిని చూసే చూపునే మేల్కొలుపుతాడు.
అతడిని కలిసిన ఆ తర్వాత
ప్రపంచమే మరోలా కనిపించింది.
చెట్టు చెట్టుగా కనిపించలేదు ఇక.
ఎండను మోసే నీడగా కనిపించింది.
నది ప్రవాహ నడక కనిపించలేదు ఇక.
ముందుకు సాగే ధైర్యంగా కనిపించింది.
కిటికీ గోడలో రంధ్రం కాదు ఇక.
చీకటి నిండిన గదిలోపల
ఒక చిరుదీపం వెలుగు రేఖగా కనిపించింది.
ఊపిరి పోస్తుంది.
నిశ్శబ్దం కూడా అనిపించని ఖాళీగా కాదు ఇక.
మనసు మథనపడుతున్న సమయం.
ఏదో తెలియని సందేహంలో మసకబారిన చూపు.
ప్రపంచం అసలు మారలేదు ఎప్పుడూ.
మారింది దాన్ని చూసే చూపు.
కొంతమంది మనుషులు మన కంటిపాపలా
మన కళ్లపై ఉన్న తెరను తొలగిస్తారు.
అప్పటివరకు మనకు తెలియనిది చూస్తూనే ఉంటాం.
ఆ తర్వాత నిజంగా చూడడం మొదలవుతుంది.

Exit mobile version