[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘చూపులు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
లిపి లేకుంటేనేమి
లిప్త కాలంలో
భావాలను అర్థవంతంగా
బయల్పరచే ప్రావీణ్యం
చూపుల సొంతం!
ధ్వని కాలుష్యం లేకుండా,
మాటల మాయ లేకుండా
తిన్నగా, మిన్నగా
అభిప్రాయాన్ని ఆవిష్కరించే
అరుదైన నైపుణ్యం
చూపుల సొంతం!
ఇష్టాన్ని, అయిష్టాన్నీ
ప్రకటించే మౌన భాష
ప్రవచించే మర్మ భాష
చూపులకే ప్రాప్తం!,
చూపులు
స్నేహాన్ని చిగిరింపజేయగలవు
వైరాన్ని ఇగిరింపజేయగలవు!
చూపులు
కలతను వర్ణించగలవు
కారుణ్య మేఘాలై వర్షించగలవు!
చూపులు
కృపను అర్థించగలవు
కృపకై ప్రార్థించగలవు!
చూపులు
గర్వంతో ఫూత్కరించగలవు
చిన్నబుచ్చేలా చీత్కరించగలవు!
చూపులకు
అక్షర విజ్ఞానము లేకున్నా,
స్వర విన్యాసము తెలియకున్నా
అనుగ్రహంతో అవి
వరాలు కాగలవు
ఆగ్రహంతో
శాప శరాలు కాగలవు!
చూపులు
కొరకొరలాడగలవు
మెరమెరలాడగలవు!
కవ్వించగలవు
నవ్వుతూ నవ్వించగలవు!
మొగ్గ తొడిగేలా ఒక పరిచయాన్ని
పురస్కరించగలవు
మొక్కపడేలా దానిని
తిరస్కరించగలవు!
చూపులు
సిగ్గుతో అందంగా వాలిపోగలవు
పరమానందంతో
హాయిగా తేలిపోగలవు!
మరపురాని విధంగా
ఎదుటి ఎదలో నాటుకోగలవు
మరల మరలా తమ ఉనికిని
చాటుకోగలవు!
అంధుని అంతరంగానికే తెలుస్తుంది
దేహ దీపాల ప్రకృష్ట గరిమ!,
ప్రపంచాన్ని చూపే
వీక్షణముల శ్రేష్ఠ మహిమ!
చర్మ చక్షువులతో
చరాచర జగత్తును చూడగలిగినా
ఆత్మ శోధన కోసం
ఆత్మ ప్రక్షాళన కోసం
జ్ఞాన నేత్రాలను ఆశ్రయించవలసిందే!
జ్ఞాన దృష్టి ధ్యాన ముద్రలో
అఖిల లోకాన్ని,
అంతర్యామినీ దర్శించగలదు!
కడదేరే మనిషితో పాటు
కాంతిల్లే నయన బింబాలూ
మట్టి పాలు కాకుండా
పరుల గ్రుడ్డి చీకటికి
తమ వెలుగులనందించాలనే
ముందు జాగ్రత్త నిర్ణయానిది
మహా పూజ్య ఔదార్యం!
మహా పుణ్య కార్యం!
తప్పించుకోలేని రీతిలో
రహస్యంగా
అందరిపై, అన్నింటిపై
దైవ దివ్య దృష్టి
నిఘా నిబంధనముంటుంది!
కాలం దృక్కుల
పర్యవేక్షణ నియమనం ఉంటుంది!
