Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చుక్కాని

[శ్రీ మళ్ళ కారుణ్య కుమార్ గారు రచించిన ‘చుక్కాని’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

అప్పుడే మెలకువ రావడంతో, పక్కనే ఉన్న భర్త వైపు చూస్తూ, “ఇప్పుడు మీకు ఎలా వుంది?” భర్త నుదుట చేయి వేస్తూ అడిగింది వనజ.

“బాగానే వుంది. డాక్టర్ మందులు ఇచ్చారు కదా. అదే నయమౌతుంది. రాత్రంతా నా గురించి ఆలోచిస్తూ మేల్కొనే ఉన్నావు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమి కాను?” భార్య కష్టం గుర్తు చేసుకుంటూ అన్నాడు.

“మీరు జ్వరంతో బాధపడుతుంటే నేను చూస్తూ ఉండగలనా? ఇలాంటి ప్రత్యామ్నాయాలు కూడా చేస్తే జ్వరం వేగంగా తగ్గిపోతుంది. చూశారా ఇప్పుడు మీకు జ్వరం తగ్గిపోయింది.”

“ఏంటో వనజా. రోజురోజుకు నా పరిస్థితి గందరగోళంగా తయారవుతుంది! అనారోగ్య సమస్యలు నన్ను సతమతం చేస్తున్నాయి. మనస్సులో తెలియని బాధ, ఈ వృద్ధాప్యం భారమై శాపంగా మారిందేమో అనిపిస్తుంది?” విరక్తితో పలికాడు పరమేశం.

“మానవ జీవితమన్నాక ఇలాంటి ఆరోగ్య సమస్యలు తప్పవు కదా. మీరు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పారు.” ధైర్యం చెప్తూ అంది వనజ.

“వయస్సు అయిపోతుంది కదా. పిల్లలు పట్టించుకోవడం మానేశారు. మనవళ్లు నన్ను గుర్తించుకుంటారో లేదో?” తన బాధను వెళ్లగక్కాడు

“వాళ్ళు రోజూ మీతో మాట్లాడుతుంటారు. వాళ్ళు మన దగ్గరే వుండాలంటే ఎలా? మీరే కదా పట్టుబట్టి మరీ వాళ్లను విదేశాలకు పంపించారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ అర్థమ లేని మాటలు.” సుతిమెత్తగా పలికింది వనజ.

ఆమె మోము ప్రశాంతంగా వుంది. ఆమె ఆవేశంతో కాకుండా ఎంతో ఆలోచించి ఆమె ఈ మాట అందని గ్రహించాడు.

ఏమి మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు.

“సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నేను టీ తీసుకు వస్తాను.” అని చెప్పి అక్కడ నుండి కదిలింది వనజ.

వారం రోజులుగా జ్వరం కారణంగా ఎటూ వెళ్ళలేని పరిస్థితి. ఈ రోజు కాస్త లేవగలిగే శక్తి వచ్చింది. మంచం పై నుండి లేచి తన పనులు ముగించుకున్న తర్వాత మెల్లగా వెళ్ళి వీధి అరుగున కూర్చున్నాడు.

ఇంతలో రెండు కప్పుల టీ తో వచ్చి పరమేశం పక్కన కూర్చుంటూ టీ అందించింది వనజ. దాన్ని తీసుకొని తాగుతూ ఏవో ఆలోచిస్తున్నాడు.

రెండు నెలల నుండి పరమేశంలో మార్పులు రావడం గమనిస్తూనే వుంది వనజ. ఎందరికో పాఠాలు చెప్పి, వీలైనంత సహాయం చేసి తీర్చిదిద్దిన తెలుగు మాష్టారు అతను. పదవి విరమణ పొంది చాలా ఏళ్ళు గడిచిపోయాయి. ఎంతో ఉత్సాహంతో ఉండే మనిషి ఇలా నిస్తేజంగా మారిపోయాడు. భర్తను అలా చూడటం వనజకు దుఃఖాన్ని కలిగిస్తుంది. అతన్ని ఆ బాధ నుండి బయటకు తీసుకు రావడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది.

“పిల్లలు మీ ఆరోగ్యం గురించి అడిగారు. మీరు ఒకసారి వాళ్లతో మాట్లాడండి.”

“నేను పాఠ్య పుస్తకంలో పాఠాలే అందరికీ బోధించాను. మానవత్వం, ప్రేమానురాగాలు గురించి చెప్పడం మరిచిపోయానేమో. మన పిల్లలకు కూడా నేను బంధాలు గురించీ చెప్పలేదోమో!”

“ఏమిటి ఈ ప్రశ్న? ఏ ఉపాధ్యాయుడైనా పుస్తకంలో ఉన్న పాఠాలు మాత్రమే బోధిస్తారు కదా. మీరు తీర్చిదిద్దబట్టే కదా మన పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉన్నారు!”

“అయితే వాళ్ళు ఎందుకు నా దగ్గరకు రావడం లేదు?”

“ఎందుకు మీరు ఇలా మదన పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్లు వీలు చూసుకొని వస్తారు లేండి.”

ఆమె మాటలకు చిన్నగా నవ్వి, టీ తాగడం పూర్తి చేసి ఆమె చేతిలో ఖాళీ గ్లాస్ పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

రోజులు ఇట్టే గడిచి పోతున్నాయి. పరమేశం పుట్టిన రోజు కూడా రానే వచ్చింది.

“ఏంటి మీరు ఇంకా బయలుదేరలేదా? ఈరోజు మీ పుట్టిన రోజు మరిచిపోయారా?” హడావుడి చేస్తూ అంది వనజ.

“ఏమిటి వనజా! ఆలయానికి వెళ్లడానికి ఇంత హడావుడి ఎందుకు? ఎలాగూ క్యాబ్ బుక్ చేస్తావు కదా” అని అన్నాడు పరమేశం.

“మీరు కాసేపు మౌనంగా ఉండండి. ఈ రోజు మీ పుట్టినరోజు కదా, మీరు ఎక్కువగా మాట్లాడకూడదు.” పరమేశం మాటలకు తాళం వేస్తూ అంది.

“సరే సరే” అంటూ వేగంగా సిద్దం అయ్యి బయలుదేరాడు పరమేశం.

ఇద్దరూ కలిసి క్యాబ్ ఎక్కారు. కొంత సమయానికి క్యాబ్ పరమేశం అనుకున్నట్టుగానే ఎప్పుడూ వెళ్ళే ఆలయం దగ్గర ఆగింది.

దిగిన తర్వాత చుట్టూ చూస్తూ, “ఎప్పుడూ వచ్చే దేవాలయంకే వచ్చాం కదా. మరి ఎందుకు ఇంత హడావుడి చేసావు.” నిరాశ పడుతూ అన్నాడు పరమేశం.

భర్త మాటలకి సమాధానం చెప్పకుండా అక్కడ నుండి ముందుకు కదిలింది వనజ.

“అడుగుతుంటే ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతావు ఎందుకు?” అంటూ ఆమెను అనుసరించాడు.

ఆమె ఆలయం ముందున్న ధ్వజస్తంభం దగ్గరకు చేరుకుంది. ధ్వజస్తంభంకు నమస్కారం పెడుతూ నిలబడింది. పరమేశం కూడా వెళ్ళి ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేసి అక్కడ నుండి వెళ్ళి ఆలయ మండపం మీద కూర్చున్నాడు. ఏదో తెలియని ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ నెలకుంది.

అప్పుడే కొందరు వ్యక్తులు ఆలయం లోపలికి రావడంతో, తన కళ్ళజోడు సరిచేసుకొని వాళ్లును చూస్తూ ఆశ్చర్యంతో ఉండి పోయాడు పరమేశం.

నేరుగా పరమేశం దగ్గరకు వాళ్ళు చేరుకొని, “జన్మదిన శుభాకాంక్షలు నాన్నగారు.” అని ఇద్దరు కొడుకులు వాళ్ళ భార్యలతో, పిల్లల్తో సహా పరమేశం ముందు నిల్చొని శుభాకాంక్షలు తెలియజేశారు.

“రేయ్.. మీరు, మీరు ఎప్పుడు వచ్చా ర్రా, వస్తున్నట్టు ఏ సమాచారం కూడా ఇవ్వలేదు?” ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు పరమేశం.

“మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని”

“భలేగా వుంది రా.” సంతోషంతో పొంగిపోయాడు.

“మీకు ఇంకో సర్ప్రైజ్ కూడా వుంది నాన్నా.” అన్నాడు పెద్ద కొడుకు విరాట్.

“ఏమిటో అది?” విస్మయంతో చూస్తూ అడిగాడు.

“అది ముందుగానే చెప్పేస్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది. ముందు మనం దేవుని దర్శనం చేసుకొని వద్దాం. పదండి.” అని అంది వనజ మధ్యలో కల్పించుకుంటూ.

అందరూ కలిసి వెళ్ళి స్వామిని దర్శించి వచ్చారు.

అప్పుడే వీళ్ళ ముందుకు వచ్చి చిరునవ్వులు చిందిస్తూ నిలబడ్డాడు ఒక వ్యక్తి.

“ఈ వ్యక్తి మీకు పరిచితమైన వాడే?” ఆ వ్యక్తి వైపు చూపిస్తూ పరమేశంకు చెప్పింది వనజ.

అయోమయంగా చూస్తున్నాడు పరమేశం.

“మీరు ఎప్పుడూ చెప్తుండేవారు కదా శేఖరం గురించి. చాలా కష్టపడి ఇతని చిరునామా తెలుసుకున్నాను.” అంది వనజ.

వనజ మాటలకు పరమేశంకు ఒక్కసారిగా తన జ్ఞాపకాలు తెర తెరలుగా గుర్తుకు రాసాగాయి..

పరమేశం రఘుపతి కోట గ్రామంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు. ఆ పాఠశాలలో విద్యార్థి శేఖరం. అల్లరివాడు, చదువంటే ధ్యాస ఉండేది కాదు. కానీ మనుషులంటే అమితమైన అభిమానం చూపేవాడు. ఆ అభిమానమే శేఖరంను పరమేశంకు దగ్గర చేసింది. దాంతో శేఖరం తల్లి తండ్రులతో కూడా పరిచయం ఏర్పడింది. శేఖరం తండ్రి దర్జీ. తల్లి వ్యవసాయ కూలీ. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. పరమేశం ప్రత్యేకంగా శేఖరంకు పాఠాలు చెప్పేవాడు. కానీ శేఖరం వినేవాడు కాదు. తనకు తెలిసిన పద్దతులన్నీ ఉపయోగించి శేఖరంకి చదువు మీద ఇష్టం కలిగేలా చేయడానికి చూసాడు. కానీ శేఖరం ఏకాగ్రత చూపించేవాడు కాదు. అయినా కూడా శేఖరం మీద పరమేశంకు ఎప్పుడూ కోపం వచ్చేది కాదు. తర్వాత కొన్ని నెలలకే పరమేశంకి ట్రాన్స్ఫర్ అయ్యింది. వాళ్ళతో స్నేహం కూడా దూరమయ్యింది. కానీ వాళ్ళ అభిమానం, ప్రేమ మాత్రం పరమేశం గుండెల్లో నాటుకు పోయింది.

కొంత సమయం తర్వాత మెల్లగా తన జ్ఞాపకాలు నుండి బయటకు వచ్చాడు పరమేశం. తన కళ్ళు చెమర్చాయి, శేఖరం దగ్గరకు చేరుకొని, “శేఖరం ఎలా ఉన్నావు. ఇప్పుడు ఏమి చేస్తున్నావు?” నవ్వుతూ శేఖరం భుజం మీద చేయు వేస్తూ అడిగాడు.

“మాష్టారు ఆర్థిక సమస్యలు కారణంగా చదువు మధ్యలోనే ఆపేసాను. మీరు చెప్పిన మాటలు నన్ను చిన్నప్పటి నుండి ప్రభావితం చేశాయి. నా బ్రతుకు తెరువుకు మార్గం చూపించాయి. మీరే నాకు ప్రేరణ. తర్వాత దూర విద్యలో డిగ్రీ పూర్తి చేశాను. నేను ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ నడిపిస్తున్నాను.” ఆనందంతో చెప్పాడు శేఖరం.

“చాలా సంతోషం, నా మాటలు గుర్తుంచుకొని వ్యాపార రంగంలో నిలదొక్కుకున్నావు.” నవ్వుతూ శేఖరంను హత్తుకున్నాడు పరమేశం.

“చూశారా! మీలో వున్న శక్తి మీరు మరిచిపోయారు. మీ కథల ద్వారా, మాటలు ద్వారా స్ఫూర్తి పొంది శేఖరం ఇంతటి వాడయ్యాడు. మీ శక్తిని మరిచి వృద్ధాప్యం శాపం అనే భ్రమలో పడిపోయి ఏదో కోల్పోయినట్టుగా అయిపోయారు. ఇప్పటికైనా అర్థమయ్యిందా మీ నీతి పాఠాలు, అలాగే అనుబంధాల పాఠాలు వృథాగా పోలేదని.” అంది వనజ.

“వనజా! నీ కారణంగా ఈ రోజు నేను నిజం తెలుసుకున్నాను. ప్రతి నిత్యం నా వెంటే ఉండి నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. పిల్లలు నన్ను పట్టించుకో లేదని నేను బాధపడితే వాళ్లను రప్పించావు! ఏళ్ళ కిందట నా జ్ఞాపకాన్ని ఈ రోజు నా ముందు ఉంచి మంచి బహుమతి ఇచ్చావు. నాకు దేవుడు ఇచ్చిన నిజమైన వరం నువ్వు కానీ నేను అది గుర్తించ లేకపోయాను. వృద్ధాప్యంను శాపంగా అనుకొని మరింత కృంగిపోయాను. కానీ జీవితంలో ఇదొక దశ అని తెలియజేసావు. నాలో సగభాగంగా, అర్ధాంగిగా నా కోసమే ప్రతిక్షణం ఆలోచించావు, నా ఈ బ్రతుకు నావకు చుక్కానిలా నిలిచి కల్లోల ఆలోచనల సంద్రం నుండి బయటపడేసావు. కానీ నీ గురించి నేను ఆలోచించలేదు. ఇప్పుడు నాకు తెలిసింది అర్ధాంగి విలువేమిటో. ఇప్పుడు నా కర్తవ్యం నాకు బోధపడింది. ఇప్పటి నుండి నా చివరి శ్వాస వరకు నాకు తెలిసిన విద్యను నలుగురు పిల్లలకు బోధించి వాళ్ల ప్రగతికి పాటు పడతాను.” అని నవ్వుతూ అన్నాడు పరమేశం.

***సమాప్తం***

Exit mobile version