Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినీగేయ కవి ప్రస్తుతి దేవిస్తుతి

[2026 అక్టోబర్ 20 న విజయదశమి సందర్భంగా శ్రీధర్ వాడవల్లి గారు రచించిన ‘సినీగేయ కవి ప్రస్తుతి దేవిస్తుతి’ అనే రచన అందిస్తున్నాము.]

సినీ సంగీతం బహు ప్రాచుర్యం పొందిన నవ్యమైన సాహిత్య ప్రక్రియ అని చెప్పవచ్చు. పండితులను పామరులను అలరిస్తూ నియమిత పరిధికి లోబడి విషయ సారాంశాన్ని క్లుప్తంగా చెప్పడం అశిధారావత్రమే.

శుకశౌనకాది.. వ్యాస వాల్మీకి.. మునిజన పూజిత శుభచరణే శారదే దేవీ. సరస సాహిత్య.. స్వరస సంగీతాలు అమె నయనాలు. అక్షరరూపిణి శారదా దేవీని తమ సినీగేయ సాహిత్యంతో ఎందరో కవులు శ్రీ విద్యా మంత్ర రహస్యాలని సామాన్యునికి చేరవేసి చరితార్థులయ్యారు. జగన్మాతను, పరాశక్తియైన శ్రీమాతయే సకల సృష్టి స్థితి లయకారిణియైన పరబ్రహ్మస్వరూపిణి అని దేవీ భాగవతంలో చెప్పబడింది. శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. తల్లిని దేవతగా పూజించడం శక్తాభావ వికాసంలోని పద్ధతి. నీవే సరస్వతి, నీవే మహాలక్ష్మి, నీవే శాకంభరి, నీవే పార్వతివి అని త్రిశక్తుల ఏకీకరణ సమన్వయాన్ని సాధించే దిశలో ఆదిశంకరాచార్యులు మహాలక్ష్మిని కనకధారా స్తోత్రంలో కీర్తించారు. వైదిక సంప్రదాయంలో దేవి త్రిమూర్తుల శక్తిగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిలుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రు నిర్మూలనకు, మహాలక్ష్మీని ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు, సరస్వతిని విద్య విజ్ఞానానికి అధిష్టాన దేవతలుగా భావిస్తారు. సకల చరాచర సృష్టికి శక్తినిచ్చి కాపాడే శక్తిస్వరూపిణి శ్రీ చక్రరాజిణి బీజాక్షర మంత్రాలతో దేవి ఉపాసకులకు మాత్రమే సాధన చేసి ఆకళింపు చేసుకోగల మంత్ర రహస్యాలను పామరులు సైతం పఠించి తరించేవిధంగా బీజాక్షరాలు గల శాక్తేయ ప్రణవ మంత్రాల మహత్తును తమ కవితా పాండిత్యంతో సినీగీతాలలో చొప్పించి మన కవివరేణ్యులు శార్వాణికి తమ వాణిగా వినిపించారు, మనల్ని పునీతం చేశారు. సినీగీతాలలో దాగున్న రహస్యాలని విజయదశమి సందర్భంగా ఒక్కసారి స్మరించుకుందాం.

రహస్యం:

“లలిత భావ నిలయ నవ రసానంద హృదయ; విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ; మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ; మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ.”

“సుమరదన విధువదన..” అన్న పదాలు చంద్రబింబం లాంటి వదనంతో తెల్లని పువ్వుల వంటి దంతాలు గల శారదా దేవిని సూచిస్తాయి. తల్లి మందస్మితాన్ని మల్లాది రామకృష్ణశాస్త్రి గారు దేవతా విషయ పరిజ్ఞానంతో దర్శించి మనకు అందించారు. అదే చిత్రంలో “శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీ గిరినిలయా గిరామయా సర్వ మంగళా” అన్న మంగళ హారతి పాట సర్వమంగళికి సమర్పించిన అక్షర నీరాజనం. ఈ పాట ప్రతి ఇంట శుభ కార్యములలో వినిపిస్తూ నిత్య మంగళాన్ని ప్రసాదిస్తోంది.

ఆగ్నిపరీక్ష (1970):

“కొండపై నిండుగా కొలువున్న మాతల్లి”

జానపదాల పోహళింపుతో కొసరి కొసరి పదాలను సమకూర్చే కొసరాజు గారు ‘అగ్నిపరీక్ష’ చిత్రం కోసం వ్రాసిన “కొండపై నిండుగా కొలువున్న మాతల్లి కనకదుర్గా నీకు దండాలు” అన్న పాట ఘంటసాలవారి గళంలో జాలువారింది. ప్రకృతి స్వరూపిణికి గల రెండు రూపాలు శాంతం రౌద్రం. సౌమ్యరూపంతో ధర్మరక్షణ, ఉగ్రరూపంతో దుష్టశిక్షణ చేసి లోకాన్ని కాపాడే దుర్గా స్వరూపాన్ని ఆవిష్కరించిన కొసరాజు కవిరాజే.

నర్తనశాల (1963):

“జననీ శివకామిని జయ శుభకారిణి”

“జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్న అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మ శరణము కోరితి అమ్మా భవాని నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచీ నిరతము మాకు నీడగ నిలచీ జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మా భవాని.”

“శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మత్సింహాసనేశ్వరి చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత” అంటూ మొదలవుతుంది శ్రీ లలితా సహస్రనామం. సర్వలోకాలకు అమ్మ అయిన ఆ జగన్మాత, అన్ని లోకాలకు అధికారిణి అయిన లలిత అమ్మవారి అవతారం కనిపిస్తుంది. బీజాక్షరాలతో కూడిన శ్రీ లలితా సహస్రనామం నియమాలతో పారాయణం చేస్తే వచ్చే ఫలితం సరళతరమైన పదలతో కూర్చి సామాన్యుని సాధకునిగా మార్చి నవవిధ భక్తిలోని శ్రవణం, కీర్తనం, స్మరణం వంటి ప్రక్రియలతో స్మరించుట వల్ల నిత్యం ధ్యానం చేసే కోట్లాది భక్తులు అంబికని అర్చిచడం వల్ల సమకూర్చిన సముద్రాల యీ రచన సాహితీ హేల.

సప్తపది (1981):

“అఖిలాండేశ్వరి.. చాముండేశ్వరి”

ఓంకార పంజర శుకీమ్.. ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్.. ఆగమ విపిన మయూరీ.. ఆర్యాం.. అంతర్విభావ యేత్ గౌరీమ్!! మౌనసుహాసిని.. గానవినోదిని.. భగవతి.

పార్వతిదేవీకి ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడిన శక్తి మంత్రాన్ని ఉపదేశంగా పొందాడేమో శక్తివంతమైన మాటలను మంత్రపుష్పాలుగా చేసి సమర్పించిన పాటల పూజారి వేటూరి.

చరణంలో, శ్రీహరి ప్రణయాంబురాశి.. శ్రీపాద విచలిత క్షీరాంబురాశి అని లక్ష్మీదేవి అవిర్బావాన్ని అష్టలక్ష్మీ వైశిష్యాన్ని వర్ణించిన తీరు అయన పాండితీ ప్రకర్ష పాటకు ఆకర్షణ.

ఇందువదనే.. కుందరదనే.. వీణాపుస్తకధారిణే శుకశౌనకాది.. వ్యాసవాల్మీకి.. మునిజన పూజిత శుభచరణే సరస సాహిత్య.. స్వరస సంగీత.. స్తనయుగళే వరదే అక్షరరూపిణే.. శారదే

దేవీని పద ప్రఫ్పుల్లాలతో పూజించిన పాటల పూజారి వేటూరి.

వింధ్యాతటీవాసినే.. యోగసంధ్యాసముద్భాసినే సింహాసనస్తాయినే.. దుష్టహరరంహక్రియాశాలినే విష్ణుప్రియే.. సర్వలోకప్రియే .. సర్వనామప్రియే .. ధర్మసమరప్రియే.. హే.. బ్రహ్మచారిణే.. దుష్కర్మవారిణే.. హే.. విలంబితకేశపాశినే.. మహిషమర్దనశీల.. మహితగర్జనలోల.. భయతనర్తనకేళికే.. కాళికే.. దుర్గమాగమదుర్గ పాహినే.. దుర్గే దేవీ..

అపర కాళికా దేవి స్వరూపాన్ని పాళీతో ఆవిష్కరించాడు సుందరంగా వేటూరి సుందరరామూర్తి.

దేవుళ్ళు:

“మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా”

ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గాదేవి సనాతని కృతయుగంలో అర్జునునికి పాశుపతాస్త్రం ఇచ్చిన పవిత్రప్రదేశం విజయవాటిక. అమ్మలగన్న అమ్మ కొలువైన విజయవాటికలో కనకదుర్గ అలంకార వర్ణన చేసిన జొన్నవిత్తుల అక్షరాలు జ్ఞానాన్ని ప్రచోదయం చేసే జ్యోతులు.

భైరవద్వీపం:

“అంబా శాంభవి భద్రరాజ గమనా”

శాపగ్రస్తుడైన కుమారునికి శాపవిమోచనం చేయమని అమ్మ వేదన. శాంభవికి శరణాగతిగా వడ్డేపల్లి కృష్ణ కూర్చిన ఈ శరణాగతి ప్రస్తుత పరిస్థితులలో అందరికీ ఉపశమనం ఇచ్చే మంత్రకవచం.

లెజండ్:

“ఓం శార్వణీ ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం”

టిక్‌టాక్‌లు ట్విటర్ ట్వీట్లు ఇస్టాగ్రాం నట్టింట్లో హల్‌చల్ చేస్తూ గూగుల్ తల్లికి దగ్గరగా గుళ్ళో తల్లికి దూరంగా వున్న ప్రస్తుత సమాజంలో కమర్షియల్ చిత్రంలో సందర్బోచితంగా బోయపాటి శ్రీనివాస్, ‘లెజండ్’ సినిమా కోసం వ్రాయించుకొన్న ‘ఓం శార్వణీ ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కల్యాణి ఓం గీర్వాణీ ఓం బ్రహ్మాణి వందనం పావనీ జీవతరణి పాపసంతాప హరణీ నీ కృపా చైత్ర సుధని మాపైన వర్షించనీ’ అన్న గీతం పొందికగా పొదిగిన సంస్కృత పద పరిమళం. నిజంగానే రామజోగయ్య శాస్త్రి గారు బీజాక్షరాలని పేర్చి మేస్త్రిగా మారి రూపొందించిన పదదేవళం.

స్వాతికిరణం (1992):

“శివాని.. భవాని.. శర్వాణి..”

“శివాని.. భవాని.. శర్వాణి.. గిరినందిని శివరంజని భవభంజని జననీ గిరినందిని శివరంజని భవభంజని జననీ శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని.. నీ సుతుడనే శివాని శివాని.. భవాని.. శర్వాణి.. శృంగారం తరంగించు.. సౌందర్యలహరివని.. శాంతం మూర్తీభవించు.. శివానందలహరివని.. కరుణ జిలుగు సిరినగవుల కనకధారవీవని.. నీ దరహాసమే దాసుల దరి చేర్చే దారియని.. శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని.. నీ సుతుడనే శివాని రౌద్రవీర.. రసోద్రిక్త.. భద్రకాళి నీవని భీతావహ భక్తాళికి.. అభయపాళి నీవని భీభత్సానల కీలవు.. భీషణాస్త్ర కేళివని అద్భుతమౌ.. అతులితమౌ.. లీల జూపినావని గిరినందిని శివరంజని భవభంజని జననీ శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని.. నీ సుతుడనే శివాని” అంటూ స్తుతులు తెలియజేసిన సిరివెన్నెల గీతం సదా స్మరణీయం.

ఆదిశంకరుల కనకధార స్రోతఫలాన్ని శివానందలహరిలో దాగున్న దివ్యమంత్ర రహస్యాలని సాధారణ ప్రజలకు అర్థం అయ్యే రీతిలో వ్రాసిన విధానం గీర్వాణి అయనకు ఇచ్చిన వరం.

“సంగీత సాహిత్య సమలంకృతమై స్వర రాగ పదయోగ సమభూషితమై ఆంగిక వాచక సాత్వికాభినయ లలిత కళాత్మక లాస్య విశేషాలతో సంగీలత లతాంగతరంగితమై ఈ పదము నిత్య కైవల్యపదము నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు.”

కఠోర నియమాలతో ఉపసాకులు సాధన చేసే దివ్య బీజాక్షర మంత్రాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో.. ఇందులో ఉదహరించిన పాటలను పాడినా విన్నా దేవి కృపకు పాత్రులౌతారు.

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

Exit mobile version