Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా స్వాతంత్ర్య గీతం

[స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీధర్ వాడవల్లి గారు రచించిన ‘సినిమా స్వాతంత్ర్య గీతం’ అనే రచన అందిస్తున్నాము.]

భారతీయులందరికీ పర్వదినం స్వతంత్ర దినోత్సవం. దేశవ్యాప్తంగా సాగే ఆనందోత్సవం. ప్రతి భారతీయుని ఎదలో దేశభక్తిని పెంపొందిస్తూ ఉంటుంది. ఆ రోజున అందరూ భారతమాతకు జేజేలు పలుకుతూ పులకించిపోతారు. పరతంత్రపు నిశీధిని చీలుస్తూ మెరిసిన స్వతంత్రపు వెలుగు బావుటా ఎర్రకోటపై ఎగిరిన మువ్వన్నెల జెండా. ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగఫలం, మన నేటి స్వేచ్ఛకు మూలధనం. స్వరాజ్యంలో మనం ఈ రోజున స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాం. ఆనాటి త్యాగమూర్తుల లాగే మన కోసం అహర్నిశలూ సరిహద్దుల్లో నిలిచి రక్షించే సైనికులు సైతం పూజ్యనీయులే. వారి మదిలో దేశభక్తి మరింతగా ఉరకలేస్తూ ఉంటుంది. “నా జన్మభూమి ఎంతో అందమైన దేశము/నా ఇల్లు అందులో కమ్మని ప్రదేశము” అంటూ కంటికి రెప్పలా దేశసరిహద్దులను పహారా కాస్తున్నారు. వారి స్ఫూర్తితోనే మనం దేశభక్తిని నింపుకొని సాగుతున్నాం. త్రివేణి సంగమ పవిత్రభూమి, వేదభూమి, వీరభూమి, కర్మభూమి, బుద్దుడు జన్మించిన భూమి, శాంతిని పంచే భూమి, పంచశీల బోధించిన భూమి, పుణ్యభూమికి నమస్సులు అర్పించడం మన అందరి విధి.

సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు. ఒక తరానికి సంబంధించిన కథలు, కథనాలు, వాస్తవాలను దృశ్యరూపంలో తర్వాతి తరాలకు అందించే ఒక మాధ్యమం కూడా. అందుకే కొందరు దర్శక, నిర్మాతలు, గాయకులు స్వాతంత్ర్యోద్యమం గురించి, అందులో పాల్గొన్న దేశ నాయకుల గురించి భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో దేశభక్తిని ప్రధానాంశంగా చేసుకొని వారి వంతు ప్రాతను పోషించారు. వాటిలో చాలావరకు సినిమాలు ప్రేక్షకుల మెప్పును కూడా పొందాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనలో దేశభక్తిని పెంపొందించే అలాంటి కొన్ని సినిమాల గురించి, సినీ గేయాల గురించి తెలుసుకుందాం.

సినీగేయ సాహిత్యంలో కూడా దేశభక్తి గీతాలకు, స్వాతంత్ర్యకాంక్షతో రాసిన గీతాలకు ప్రముఖ స్థానం ఉంది. తెలుగు సినిమా పాటల్లో వచ్చిన దేశభక్తి గీతాలను ప్రధానంగా రెండు విభాగాలుగా పేర్కొనవచ్చు. స్వాతంత్య్రానికి పూర్వం వచ్చినవి, స్వాతంత్య్రం తర్వాత వచ్చినవిగా పేర్కొనవచ్చు. స్వాతంత్య్రం ముందు గీతాల విషయానికొస్తే బంకించంద్ర ఛటోపాధ్యాయ రాసిన వందేమాతరం భాగం ‘శ్రీకృష్ణలీలలు’లో ఉపయోగించారు. ఇందులో దేశమాతకూ, దేవికీ కలిపి అన్వయించే భాగాన్ని తీసుకుని చిత్రీకరించారు. బసవరాజు అప్పారావు రాసిన “కొల్లాయి గట్టితేనేమి” అనే గేయాన్ని కొద్దిమార్పులతో 1938లో విడుదలైన ‘మాలపల్లి’ సినిమా కోసం గూడవల్లి రామబ్రహ్మం చిత్రీకరించారు. అలాగే 1940లో విడుదలైన ‘కాలచక్రం’ చిత్రంలో రాయప్రోలు వారు రచించిన “ఏ దేశమేగినా ఎందుకాలిడినా” అనే పాటను ఉపయోగించుకున్నారు. 1937లో విడుదలైన ‘బాలయోగిని’ సినిమాలో “వందే వందే భారతమాతా”, 1939లో వచ్చిన ‘జయప్రద’ అనే సినిమాలో “స్వేచ్ఛాపథము చూపుము మా భారతమాతా”, 1946లో విడుదలైన ‘ముగ్గురు మరాఠీలు’ చిత్రంలో “వడుకుమా రాట్నమూ, భారతనారీ కవచము” అనే గీతాలు పేర్కొనదగినవి.

ఆ రోజుల్లో వచ్చిన పౌరాణిక, జానపద, సాంఘిక సినిమా అనే తేడా లేకుండా ఏదో ఒక సందర్భంలో ఈ దేశభక్తి ప్రబోధగీతాలు పెట్టడం ఓ విశేషం. దేశభక్తి గీతాలలో మకుటాయమానంగా ‘వెలుగునీడలు’ చిత్రం కోసం “పాడవోయి భారతీయుడా” అనే గీతాన్ని శ్రీశ్రీ రాశారు. ఇది గాకుండానే దాదాపు 20కి పైగా అభ్యుదయగీతాలు వివిధ సినిమాల్లో శ్రీశ్రీ రాసినవి ఉన్నాయి. ‘పాడవోయి భారతీయుడా’ అన్న పాట పౌరుని బాధ్యతను పెంపొందించేదిగా వుంటుంది. “స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదని/సాధించిన దానికి సంతృప్తిని పొంది/అదే విజయమనుకుంటే పొరపాటని/ సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం/సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం/ఏకదీక్షతో గమ్యం చేరిన నాడే/లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం” అని ఆ గీత సారాంశం. తెలుగువారి గుండెల్లో పౌరుషాగ్నిని రగిలించిన మన్యం వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా కోసం శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా’ అన్న గీతం స్వరాజ్య పోరాటస్ఫూర్తిని కలిగింపజేస్తుంది. జాతీయస్థాయిలో ఉత్తమ గేయంగా ఎంపికైన తొలితెలుగు సినీ గేయం. తెల్లవాడి గుండెల్లో నిదురించినది అల్లూరి సీతారామరాజు, మన గుండెల్లో స్వరాజ్యపౌరుష స్పూర్తిని నింపిన కవిరాజు శ్రీశ్రీ.

తెలుగు సినిమాల్లో స్వేచ్ఛాపిపాసతో నిండిన పలు గీతాలు రూపొందాయి. స్వేచ్ఛాభారతంలో కూడా అనేక చిత్రాలలో దేశభక్తిని ప్రబోధించే గీతాలు చోటుచేసుకున్నాయి. ఆ పాటలన్నీ ప్రతి స్వాతంత్ర్య దినోత్సవాన మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. “భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు/ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు” అంటూ ‘బడిపంతులు’ చిత్రం కోసం ఆత్రేయ రాసిన గీతం ఘంటసాల గళంలో వీనులకు విందుచేస్తుంది.  దేశభక్తిని ప్రభోదించే స్ఫూర్తిదాయకమైన ఆ పాటలను ఎప్పుడు కన్నా, విన్నా ప్రతీ భారతీయుడి రోమాలను నిక్కబొడుచుకునేలా చేస్తుంటాయి. వేటూరి రాసిన ‘ఎగరాలి జాతీయపతాకం (మోసగాడు)’, చంద్రబోస్ రాసిన ‘జగతి సిగలో జాబిలమ్మకు వందనం (పరదేశి)’ లాంటి సినిమాలు భరతమాత ఖ్యాతిని కీర్తించే అపూర్వగీతాలు. ‘బొబ్బిలిపులి’ సినిమాకు దాసరి రాసిన ‘జననీ జన్మభూమిశ్ఛ స్వర్గాదపిగరీయసి’ అనే పాట పుట్టిన నేలపై మమకారాన్ని పెంచేది. జాలాది గీతాల్లో అద్భుతమైంది ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాకు రాసిన ‘పుణ్యభూమి నా దేశంనమోనమామి’ అనే గీతం. ఈ పాట విన్న ప్రేక్షకుడి ఒళ్ళు దేశభక్తితో పులకిస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన ‘జయ జయ జయ ప్రియభారత జనయిత్రి’ అన్న గేయం చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలో సందర్బోచితంగా ఉపయోగించుకోవడం జరిగింది. పిడికెడు ఉప్పుతో తెల్లవాడిపై చండ్రనిప్పులు కురిపించి దండియాత్ర చేపట్టిన బాపూజీ స్పూర్తితో దండి సత్యాగ్రహం ప్రాముఖ్యతను వివరిస్తూ ‘ఆంధ్రకేసరి’ చిత్రంలో ‘పందండి దండుగా దండియాత్రకు’ అన్న పాట ఆనాటి ప్రజల ఉద్యమస్పూర్తిని ప్రకాశంపతులు గారి చురుకైన పాత్రను కన్నులకట్టినట్లు చిత్రీకరించడం జరిగింది .

దేశభక్తి చిత్రాల పేరు చెబితే అందులో ‘రోజా’ పేరు తప్పకుండా వినిపిస్తుంది. అందులోని “వినరా వినరా దేశం మనదేరా” పాట మన దేశం ఘనతను చాటిచెబుతూ సాగుతుంది. నీ ఇల్లు ఏ ప్రాంతానికి చెందినా నీ నామం ఇండియన్ అంటూ అఖండ భారతదేశం మనదే అని మణిరత్నం దృశ్యం, రెహమాన్ సంగీతం మనో గానం వెరసి ఈ పాటలో దేశంపట్ల ఆభిమానాన్ని మరింత పెంచాయి. ఈ పాట వింటే చాలు మనల్ని మనమే మర్చిపోతాం అనిపిస్తుంది.  “దేశం మనదే తేజం మనదే/ఎగురుతున్న జెండా మనదే” అంటూ సాగే ఈ పాట ‘జై’ సినిమాలోనిది. భిన్నత్వంలో ఏకత్వం సంతరించుకున్న భారత జాతీయసమైక్యతకు ప్రతీకై దేశం కోసం ఒక్కటవ్వడమే భారతీయుల ప్రత్యేకత అంటూ సాగే దేశభక్తి పాట ప్రతి జెండా పండక్కి ఎక్కువగా వినిపించే పాటల్లో ఒకటి.  “ఓ సైనిక..” అని సాగే గీతం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలోనిది. సైనికుడి విలువను, సైనికుల కష్టాలను ఒకవైపు చెబుతూనే దేశభక్తిని పెంపొందించే విధంగా పౌరులందరూ భావితరానికి దిశానిర్దేశం చేయాలని చెబుతుంది ఈ పాట. “ఈ జెండా పసిబోసి చిరునవ్వురా/దాస్య సంకెళ్లు తెంచిందిరా” అంటూ సాగే గీతాన్ని శక్తి రాయగా, శంకర్ మహదేవన్ గాత్రాన్ని అందించారు. త్రివర్ణపతాకం మూడు రంగుల వస్ర్తం కాదు సమయోధుల చేతిలో పాశుపతాస్త్రం.

పింగళివెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకం విశిష్టతను చాటిచెపుతూ ‘మా ఆవిడ కలెక్టర్’ సినిమాకోసం రూపొందించిన సినీగీతం “సతతం స్మరణీయం/జలియన్ వాలాబాగ్‌లో ప్రవహించిన రక్తంలో పుష్పించిన మందారం”. ‘ఖడ్గం’ చిత్రంలో “మేమే ఇండియన్స్..” అంటూ సాగే గీతం భారతీయుల తత్వాలను, వారి ఆలోచన విధానాన్ని ఒకవైపు చెబుతూనే యువత కార్యోన్ముఖులై దేశానికి సేవ చేయాలని, దేశాన్ని ప్రేమించాలని సందేశాన్నిస్తుంది. “భరతమాత తలరాతను మార్చిన విధాత గాంధీ/తరతరాల యమ యాతన తీర్చిన వరదాతరా గాంధీ” అని ‘మహాత్మ’ చిత్రంకోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి పాళి జాతిపితకు సమర్పించిన అక్షరనివాళి. “తెల్లరాబందు మనదేశమందు వుండద్దని/దోపిడీలు దొరతనం మాకు వద్దని” శుద్ధమైన తెలుగుపదాలతో సినీగేయాలు రాయగల సిద్దహస్తుడు అశోక్ తేజ కలం నుంచి జాలువారిన గీతాన్ని విన్న భారతీయుడు జైహింద్ అని నినదించక మానడు. ఈ అవనిని అమ్మ అని ఎన్నసార్లు పిలిచినా తనివితీరదు. సాగర ఘోషల శృతిలో, హిమ జలపాతాల లయలో శాంతినికేతనగీతం, సబర్మతి సంగీతం జనగళంలో వందేమాతరమని పలుకుతుంది. సినిమా గీతం ద్వారా త్రివర్ణ సందేశం ప్రతి భారతీయుని ఎదలో సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా అని ప్రతిధ్వనిస్తూనే వుంటుంది.

Exit mobile version