Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా టికెట్

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘సినిమా టికెట్’. రచన కూని అంకబాబు.]

“ట్రింగ్ ట్రింగ్.. ట్రింగ్ ట్రింగ్..” ఫోను మోగుతుండడంతో “ఏయ్ 102! ఆ ఫోను సంగతేంటో చూడు” అన్నాడు ఎస్ఐ భుజంగరావు.

“అలాగే సార్!” అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి “హలో! ఎవరు? సరే, మేం కాసేపట్లో వస్తాం, ఎవరినీ లోపలికి పోనివ్వకండి. సరే వస్తున్నాం, ఇప్పుడే వస్తున్నాం” అని ఫోన్ కట్ చేసి “సార్! మారుతి నగర్ రెండో వీధిలో మర్డర్ జరిగిందంట సార్” అని చెప్పాడు కానిస్టేబుల్ వీరభద్రం కళ్ళు పెద్దవి చేసి ఎస్ఐతో.

“ఏంటయ్యా ఇది? పొద్దున్నే.. ఇట్టా పొద్దు పొడిచిందో లేదో, అప్పుడే మర్డర్ కేసు. ఛీ! దీనమ్మ జీవితం. మన కాపురాలు పెళ్ళాలతో కంటే ఈ శవాలతోనే చేస్తున్నట్టుంది, ఛీ!” అంటూ చిరాకు పడిపోయాడు ఎస్ఐ భుజంగరావు.

కానిస్టేబుల్‌కి ఏం మాట్లాడాలో తెలియక ఎస్ఐ వైపే చూస్తుండిపోయాడు. అప్పటిదాకా తల పట్టుకుని కూర్చొని ఉన్న ఎస్ఐ చివాలున లేచి “సరే! పద అదేంటో చూద్దాం, కట్టుకున్నాక పెళ్ళాం గుడ్డిదైనా భరించాలి, కుంటిదైనా భరించాలి, చివరికి నడ్డిదైనా తప్పదు కదా!” అంటూ టోపీ నెత్తిన పెట్టుకొని, లాఠీ తీసుకొని, పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాడు. వెంటనే కానిస్టేబుల్ వీరభద్రం, హెడ్ కానిస్టేబుల్ రమణ, మరొక కానిస్టేబుల్ శ్రీకర్ కూడా అతని వెనకాలే వచ్చి జీప్ ఎక్కారు. ఎస్సై పదమన్నట్టు సైగ చేయడంతో డ్రైవర్ జీపుని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు.

***

“ఎవరయ్యా ముందిక్కడ బాడీని చూసింది?” అడిగాడు హెడ్ కానిస్టేబుల్ రమణ.

“సార్! నేనే సార్” చెప్పాడు లావుపాటి శరీరంతో, మెడలో లావు పాటి బంగారపు గొలుసుతో ముందుకు వచ్చి ఒకతను.

“ఎప్పుడు చూశావ్? అసలు నువ్వు ఇక్కడెందుకున్నావు? ఆ బాడీతో నీకు సంబంధం ఏంటి? ఇంతకీ నీ పేరేంటి?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు కానిస్టేబుల్ వీరభద్రం.

“ఏయ్! ఆగవయ్య. నేను అడుగుతున్నాను కదా!” అంటూ హెడ్ కానిస్టేబుల్ రమణ అడ్డు తగలడంతో “సారీ సార్!” అనేసి పక్కకి జరుగుతాడు వీరభద్రం.

“సరే! అవే ప్రశ్నలు నేనూ అడుగుతున్నాను, చెప్పు” అన్నాడు హెడ్ కానిస్టేబుల్ రమణ.

జీపు దగ్గర సిగరెట్ వెలిగించుకొని రింగు రింగులుగా గాల్లోకి పొగ వదులుతున్న ఎస్ఐ వైపు ఓరగా చూసి మరలా చూపు తిప్పి హెడ్ కానిస్టేబుల్ రమణవైపు చూసి “సార్! నా పేరు బలరామయ్య సార్, నేను వడ్డీ వ్యాపారం చేస్తుంటాను సార్. లోపల హత్య చేయబడిన వాడి పేరు రామానందం సార్. నా ఫ్రెండ్ కూడాను. మా ఇద్దరిదీ పది సంవత్సరాల స్నేహం సార్. మేము ఏం చేసినా కలిసే చేస్తాం సార్” అంటూ చెప్పకుపోతున్నాడు బలరామయ్య.

“అంటే!?” అనుమానంగా అడిగాడు హెడ్ కానిస్టేబుల్ రమణ.

“అంటే.. వాకింగ్‌కి పోవడం, సినిమాలకు పోవడం, ఊర్లకి, షికార్లకి, అంతెందుకు గుడికి పోవాలన్నా పెళ్ళాలతో కాకుండా మేమిద్దరమే వెళ్తాం సార్. బార్లో బీరు కూడా 50 – 50 చేసుకునే తాగుతాం సార్.”

“ఓ..! అలాగా! అయితే ఈ బాడీని నువ్వెప్పుడు చూసావ్?”

“పొద్దున్నే సార్. వాకింగుకి పోవాలని వచ్చి డోర్ తట్టి పిలిచాను. కాని లోపల నుండి ఎటువంటి శబ్దం రాలేదు సార్.”

“ఇంట్లో ఎవరూ లేరా అప్పుడు?”

“లేరు సార్. ఎందుకంటే.. వాళ్లంతా తిరుమల వెళ్లారు. అంటే వాడి భార్య, వాడి ఇద్దరి కొడుకులు, కోడళ్లు, వారి పిల్లలు.”

“ఇతనెందుకెళ్ళలేదు తిరుమలకి?”

“వీడికి ఈ మధ్య మోకాలు నొప్పులు ఎక్కువయి ఎక్కడికీ వెళ్లడం లేదు సార్. వాకింగుకి కూడా ఏదో వస్తాడంటే వస్తాడు నా కోసం. నా మాట కాదనలేక.”

“ఏంటయ్యా అక్కడ? ఏం జరుగుతుందక్కడ? ఎవరతను? ఏంటంట అతను చెప్పేది?” అడిగాడు ఎస్సై నోట్లో నుంచి సిగరెట్ తీసి మళ్ళీ నోట్లో పెట్టుకుంటూ.

“ఇతను ఆ బాడీకి ఫ్రెండంట సార్. ఇతనే ఈ బాడీని ఫస్ట్ చూసింది. అందుకే ఎంక్వయిరీ చేస్తున్నాం సార్” చెప్పాడు రమణ.

“సరేగాని, ముందు లోపలికెళ్లి బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి క్లూస్ ఏవైనా దొరుకుతాయేమో చూడండి” చెప్పాడు ఎస్ఐ.

“ఓకే సార్!” అంటూ కానిస్టేబుల్స్ హతుడి ఇంట్లోకి వెళ్ళగా ఎస్సై అక్కడే నిలబడి అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమోనని చూస్తూ గుమిగూడిన జనాన్ని, వారి మాటలను గమనించసాగాడు. అంతలోనే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మార్చురీ వాన్ రావడంతో బాడీని పోలీసులు అక్కడి వారి సాయంతో లోపలకి ఎక్కించారు.

 “ఏయ్ హెడ్డు! ఇదే వ్యాన్లో హాస్పిటల్ కి వెళ్లి, అక్కడి స్టేటస్ ఎప్పటికప్పుడు నాకు అప్‌డేట్ చేస్తూ ఉండు. మిగతా వాళ్ళు నాతో రండి” అని ఎస్ఐ అంటుండగా జనాలు గుసగుసలాడుకుంటూ వెళ్ళారు. ఎస్సై ఒక క్షణం వెనక్కి తిరిగి బలరామయ్య వైపు చూసి దగ్గరకు రమ్మని సైగ చేశాడు. బలరామయ్య దగ్గరికి రావడంతో “ఏయ్ హెడ్డు! ఇతని ఫోన్ నెంబర్ తీసుకో” అన్నాడు.

“ఎందుకు సార్?” భయపడుతూ అడిగాడు బలరామయ్య ఎస్సైని.

“ఊరికే జస్ట్ మాకు హెల్ప్‌గా ఉంటుందని, అంతే. సరేగాని.. మీరు చనిపోయినతనికి ఫ్రెండేగా! భయమెందుకు? మా వాళ్లకి అవసరమైనప్పుడు కాస్త సపోర్ట్ చెయ్యండి” అంటూ ఎస్ఐ జీపులో కూర్చొని మిగతా పోలీసుల్ని జీప్ ఎక్కమని సైగ చేశాడు. వాళ్లు కూడా ఎక్కడంతో అక్కడి నుంచి జీపు బయలుదేరింది.

***

“ఏమయ్యా హెడ్డూ! ఎవడో తెలివిగా మర్డర్ చేశాడయ్యా, ఈ మర్డర్ ప్లాన్ చేసేవాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయయ్యా ఇలాంటి ఐడియాలు?” కనుబొమ్మలెగరేస్తూ అన్నాడు ఎస్సై.

“ఏమో సార్! నాకూ అదే డౌట్ సార్” చెప్పాడు రమణ.

“అసలు ఏందయ్యా ఇది? మనమేమో డిగ్రీలు చేసి నేరస్థుల్ని పట్టుకుందామని పోలీసులమైతే.. ఈ కిల్లర్స్ మాస్టర్ డిగ్రీ చేసినట్టు ఈజీగా మర్డర్లు చేసుకుంటూ పోతున్నారు”

“అవును సార్.”

“ఏంటవును..?”

“మీరు ఏదంటే అదే సార్” అంటూ బిత్తర చూపులు చూశాడు రమణ.

“నువ్వు ఒకటి గమనించావా హెడ్డూ? కిల్లర్ స్పాట్‌లో మన పోలీస్ కుక్కలకు పని ఉండకూడదని తెలివిగా డ్రైనేజీ కాలువలో కాళ్లు ముంచి ఆ మురికి కాళ్లతోనే లోపలికెళ్ళాడు. పైగా ఫింగర్ ప్రింట్స్ పడకుండా చాలా జాగ్రత్తపడ్డాడు.”

“అవును సార్!” ఆశ్చర్యపోతూ అన్నాడు రమణ.

“ఏంటవును? ప్రతిదానికి అవును అవును అంటావు. ఏదైనా ఐడియా ఉంటే చెప్పవయ్యా కిల్లర్‌ని పట్టుకోడానికి.”

“ఆ.. సార్! గుర్తొచ్చింది. స్పాట్‌లో వెతికినప్పుడు నాకు ఒక స్లిప్పు దొరికింది సార్. మనకేమైన ఉపయోగపడుతుందేమోనని తెచ్చాను సార్.”

“స్లిప్పా!? ఏంటది?” ఆత్రుతగా అడిగాడు ఎస్ఐ.

“ఇదిగోండి సార్.” అంటూ బ్యాక్ ప్యాకెట్‌లో పెట్టుకున్న స్లిప్పును తీసి ఎస్సైకిచ్చాడు రమణ.

“ఏంటయ్యా ఇది? ఏదో సినిమా టికెట్టులాగా ఉందే?”

“సార్!” అరిచినట్టు పిలుస్తాడు రమణ.

“ఏంటయ్యా? ఎందుకలా అరుస్తున్నావ్?”

“ఆ టికెట్ వెనకాల ఏదో నెంబరుంది సార్” ఉత్సాహంగా చెప్పాడు రమణ.

“ఆ..” అంటూ పరీక్షగా చూస్తూ “250708AM230-203DONALD” అని చదివి, “ఇదేంటి.. ఏమీ అర్థం కావడంలేదే.. ఒకసారి మన పోలీసులందరిని పిలువ్, వాళ్లకేమైనా తెలుస్తుందేమో” అన్నాడు ఎస్ఐ.

హెడ్ కానిస్టేబుల్ రమణ పిలవడంతో అందరూ ఆ టికెట్టుని చేతుల్లోకి మార్చి మార్చి చూసి అందరూ పెదవి విరిచి తెలియదంటారు. ఉన్నట్టుండి కానిస్టేబుల్ శ్రీకర్ “సార్!” అని అన్నాడు.

దాంతో “ఏంటి?” ఎస్ఐ గద్దించినట్లు అడగడంతో మెల్లగా “అది ఒక క్లూలా అనిపించింది సార్” అన్నాడు శ్రీకర్ తలగోక్కుంటూ.

“క్లూనా!? ఏంటది?” ఉత్సాహం కొద్దీ అడిగాడు ఎస్ఐ.

“సార్! 203DONALD అంటే మన సిటీలో DONALD అనే హోటల్ ఉంది సార్. అందులో 203 రూమ్ నెంబర్ అయి ఉండవచ్చని అనుకుంటున్నాను సార్” అంటూ నీళ్లు నమిలాడు శ్రీకర్.

“వెరీ గుడ్ శ్రీకర్! అందుకే అందరి చూపులు ఒకేలా ఉండవంటారు. పదండి, అక్కడికెళ్లి చూస్తే విషయం తేలిపోద్ది” అన్నాడు ఎస్ఐ.

“ఎస్సార్” అన్నారు మిగతా పోలీసులు.

***

“మా ఎస్ఐ సారు ఓ కేసు పని మీద వచ్చారు. అర్జంటుగా మాకు 203 రూమ్ కీస్ కావాలి” అన్నాడు కానిస్టేబుల్ రమణ.

“సారీ సార్! ఆ రూమ్ మొన్నటి నుంచి క్లోజ్ చేసి ఉంది. దానిలోకి వచ్చినతను బయటికెళ్లి ఇంకా రాలేదు సార్” చెప్పింది రిసెప్షనిస్టు.

“డూప్లికేట్ కీ లేదా?” అడిగాడు రమణ.

“అంటే.. మా మేనేజర్ పర్మిషన్ లేకుండా ఇవ్వడం కుదరదు సార్” బదులిచ్చింది రిసెప్షనిస్టు.

“ఏం పర్వాలేదు. మీ సారు, నేను మాట్లాడుకుంటాం. ముందు కీ ఇవ్వు” అన్నాడు ఎస్ఐ.

“అంటే..” అని అనుమానంగా రిసెప్షనిస్ట్ చూడడంతో “నీకేం ప్రాబ్లం రాదు. అంతా నేను చూసుకుంటాను. ముందు కీ ఇవ్వు” అని ఎస్ఐ గట్టిగా అడగడంతో ఇక ఎదురు చెప్పలేక కీ ఇచ్చింది.

ఎస్సై తన పోలీసులను తీసుకొని 203 రూమ్‌కి వెళ్లి “అంతా వెతకండి” అని ఆర్డర్ వేశాడు.

పోలీసులు అంతా వెతికి “సారీ సార్, ఏం క్లూ దొరకలేదు” అని చెప్పారు. ఎస్ఐ కాసేపు ఆలోచించి “ఎస్ కిల్లర్, ఇదే రూమ్‌లో స్టే చేశాడు. ప్లాన్ ప్రకారం సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. తర్వాత మర్డర్ చేసి తిరిగి హోటల్‌కి రాకుండా వెళ్లిపోయాడు. అవునూ.. వాడు ఏదో ఒక ప్రూఫుతో ఈ హోటల్లో దిగి ఉంటాడు కదా! పదండి వాడిచ్చిన ప్రూఫ్ గురించి తెలుసుకుందాం” అనేసి రిసెప్షన్ దగ్గరకు వచ్చి ప్రూఫ్ గురించి అడుగాడు.

రిసెప్షనిష్టు ఇచ్చిన ప్రూఫ్ చూసి ఎస్ఐ “ఇది ఫేక్ ప్రూఫ్” అన్నాడు. అందరూ ఆశ్చర్యపడి “ఎలా సార్? చూడంగానే ఎలా చెప్పారు” అని అడగడంతో ఎస్ఐ “చూడండి, ఇది ఆధార్ కార్డు. ఫోటో క్లారిటీ లేదు. పైగా 15 డిజిట్సే ఉన్నాయి.”

ఎస్సై తెలివితేటలకు అందరూ ఆశ్చర్యపోతూ “అవును సార్! నిజమే సార్!” అని ముక్తకంఠంతో అన్నారు.

“సరే సరే! ఇకనైనా కేసుని రైట్ వే లో ఎంక్వయిరీ చేయాలి పదండి. ఆ సినిమా టికెట్ ప్రకారం ఆ సినిమా థియేటర్‌కి వెళ్లి విచారిద్దాం”అని ఎస్సై అక్కడి నుంచి బయలుదేరడంతో మిగతా పోలీసులు అతన్ని అనుసరించారు.

***

“ఎవరయ్యా ఇక్కడ టికెట్లిచ్చేది?”

“నేనే సార్”

“నీ పేరేంటి?”

“నా పేరు నాగరాజు సార్.”

“మొన్న ఈ టికెట్టు మీ హాల్లో కొన్నది ఎవరో చెప్పగలవా?”

“అదెలా కుదురుతుంది సార్? వందల మంది టికెట్లు కొంటుంటారు. నేనెలా గుర్తుపెట్టుకుంటాను సార్?”

“టికెట్ కౌంటర్ దగ్గర సీసీ కెమెరా ఉందా?” అని అడుగుతున్న ఎస్ఐ వైపు భయంగా చూస్తున్న నాగరాజు “లేదు సార్, లాస్ట్ వీకే చెడిపోయింది” అని చెప్పాడు.

ఎస్సై కాసేపు ఆలోచించి “సరే! ఈ టికెట్‌కి మనీ బై హ్యాండ్ ఇచ్చాడా? లేదంటే ఆన్‌లైన్ పేమెంట్ చేశాడా? తెలుసుకోవచ్చా?” అడిగాడు ఎస్సై.

“తెలుసుకోవచ్చు సార్” అని నాగరాజు అనడంతో “సరే పదా చూద్దాం” అంటూ నాగరాజుతో పాటు కౌంటర్ లోకి వెళ్ళాడు ఎస్సై. నాగరాజు చెక్ చేసి “ఈ టికెట్‌కి అతను ఫోన్ పే చేశాడు సార్” అనడంతో “ఆ ఫోన్ నెంబరు ఏంటో చెప్పగలవా?” అడిగాడు ఎస్ఐ.

“అలాగే సార్! రాసుకోండి” అని ఫోన్ నెంబర్ చెప్పాడు నాగరాజు.

ఫోన్ నెంబర్ తీసుకొని “ఓకే థాంక్యూ నాగరాజు!” అని చెప్పేసి ఎస్ఐ తన సిబ్బందితో హాల్ నుండి బయటకు వచ్చాడు. “ఈ ఫోన్ నెంబర్ ఎవరిదో కనుక్కోండి” అన్నాడు పోలీసులతో. వెంటనే కానిస్టేబుల్ రమణ ఉత్సాహంగా “సార్! నా ఫోన్లో ఒక యాప్ ఉంది సార్. దాని ద్వారా ఈ ఫోన్ నెంబర్ ఎవరిదో వెంటనే తెలుసుకోవచ్చు సార్” అన్నాడు.

“సరే తొందరగా కనుక్కో” అని పురమాయించి ఎస్ఐ టోపీని సరి చేసుకుంటూ జీపు వైపు నడిచాడు. రమణ తన ఫోన్లో చెక్ చేసి “సార్ ఇదిగోండి సార్ డీటెయిల్స్. పేరు బిలాల్, వీడిది బీహార్ సార్” అని చెప్పి, “ఇప్పుడు మనం బీహార్ వెళ్ళాలా సార్?” అని అడిగాడు.

“ఏం తలకాయయ్యా నీది? అక్కడికెందుకు? ఏం అవసరం లేదు. లోకల్ వాడెవడో కిల్లర్‌కి సుపారీ ఇచ్చి ఈ పని చేయించుకుంటాడు కదా! వాడి కాల్ లిస్ట్ చెక్ చేస్తే ఈ లోకల్ గాడెవడో తెలుస్తుంది కదా? చూడు” అని ఎస్ఐ అనడంతో, “తెలుసుకుంటాను సార్” అని వెళ్తాడు. కొంత సేపటి తర్వాత స్టేషన్‌కి వచ్చి “దొరికింది సార్. మర్డర్ జరిగిన రోజు ఈ నంబర్ నుంచి చాలా కాల్స్ ఒక నెంబర్‍కి వెళ్లాయి సార్. ఆ ఫోన్ నెంబరు.. సార్..!” అని గట్టిగా అరిచాడు ఆశ్చర్యంగా రమణ.

“ఏంటయ్యా అరుపు? ఏదైనా క్లూ దొరికిందా?”

“ఎస్సార్!”

“ఏంటది?” కుతూహలంతో అడిగాడు ఎస్సై.

రమణ చెప్పిన సమాధానం విని “వాట్!?” అని ఆశ్చర్యపోయాడు ఎస్ఐ.

“అవును సార్” రమణ సమాధానం.

“సరే పదండి వాడి సంగతి చూద్దాం” అన్నాడు ఎస్సై.

“ఎస్సార్” అని పోలీసులు ముక్తకంఠంతో పలికి ఎస్ఐని అనుసరించారు.

***

“ఏంటి సార్? నన్నెందుకు పిలిపించారు?”

“ఊరికే.. టైం పాస్ కోసం” అన్నాడు ఎస్‍ఐ వెటకారంగా.

“ఆ! ఊరికేనా? టైంపాసుకా? అసలు నేనెంత బిజియో తెలుసా?”

“తెలుసు.. నువ్వెంత బిజియో తెలిసే నిన్నిక్కడికి పిలిపించాను. అవును.. నీ ఫ్రెండ్‌ని ఎందుకు చంపించావు?”

“సార్! ఏం మాట్లాడుతున్నారు? నేనేంటి? నా ఫ్రెండుని చంపించడం ఏంటి?”

“ఓసోస్! అరవడం ఆపు. అంతా తెలుసుకున్నాకే నిన్నిక్కడికి పిలిపించింది.”

“నాకేం తెలియదు సార్. మీరేదో పొరపడుతున్నట్టున్నారు.”

“అవునవును పొరపాట్లు మేము చేస్తుంటాం, మర్డర్లు మీరు చేసుకుబోతుంటారు.”

“సార్! సొసైటీలో నేను ఎంత పెద్ద మనిషినో మీకు తెలియదు. నేను తలుచుకుంటే..”

“అ! తలుచుకుంటే.. తలుచుకుంటే ఏం చేస్తావ్? చెప్పు. నాకంతా తెలుసు. నాకు బిలాల్ గురించి తెలుసు, నీ గురించి తెలుసు. చెప్పు అసలు రామానందం గారిని ఎందుకు మర్డర్ చేయించావు చెప్పు” అని సూటిగా అడిగాడు ఎస్ఐ.

“సార్! బిలాల్ ఎవరు? ఈ మర్డరేంటి? నాకేం తెలీదు సార్?”

“చూడు బలరామ్! సారీ, బలరామయ్య గారు దయచేసి రామానందం గారిని మర్డర్ చేయించిన విషయం ఒప్పుకున్నావో ట్రీట్మెంట్ లైట్‌గా ఉంటుంది లేదంటే.. హహహ..” అంటూ వికటాట్టహాసం చేశాడు ఎస్ఐ.

“చూడండి బలరామయ్య గారు! మా ఎస్ఐ గారు అసలే ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. ఈ మధ్యనే పక్క రాష్ట్రంలో, ఎమ్మెల్యే కొడుకునే ఎన్‌కౌంటర్ చేశాడు. అందుకే ట్రాన్స్‌ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. మర్యాదగా నిజం ఒప్పుకోండి. లేదంటే మీరు కూడా సార్ ఎన్‌కౌంటర్‌కి బలైపోతారు. జాగ్రత్త! ఇక మీ ఇష్టం” అంటూ హెచ్చరించాడు హెడ్ కానిస్టేబుల్ రమణ.

రమణ మాటలకి భయపడిన బలరామయ్య “సారీ సార్! నన్ను క్షమించండి సార్! ఆ మర్డర్ నేనే చేయించాను సార్. మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను సార్. నన్ను వదిలేయండి సార్”అంటూ వణుకుతున్న స్వరంతో చేతులు జోడించి బతిమిలాడాడు.

“సరే వదిలేస్తాం కానీ.. అడిగినదానికి సరిగా సమాధానం చెప్పు. ఎందుకు చేయించావు మర్డర్?” అడిగాడు ఎస్ఐ.

“చెప్పేస్తాను సార్! అంతా చెప్పేస్తాను సార్. నేను, రామానందం రహస్యంగా డ్రగ్స్ వ్యాపారం చేసేవాళ్లం సార్. ప్రాఫిట్స్ దగ్గర చిన్న గొడవలు వచ్చాయి. రామానందం తనకు ఎక్కువ షేర్ కావాలని అడిగాడు, కాదంటే నన్ను చంపేస్తానన్నాడు. అందుకే నేనే బీహార్ గ్యాంగుకి సుపారీ ఇచ్చి మర్డర్ చేయించాను సార్” అని బలరామయ్య చెప్తూ ఉంటే ఎస్ఐ ఆశ్చర్యపోతూ “వాట్!? డ్రగ్స్ బిజినెస్సా? ఓర్నీ వైట్ కాలర్స్ అందరూ మంచివాళ్ళు కాదని మరోసారి నిరూపించావురా. సరే..! మాకు ఎంత బుర్ర గోకున్నా అర్థం కావడం లేదు. ఆ టికెట్ వెనుక ఆ నంబరేంది?” అని అడిగాడు.

“అది.. అది.. మర్డర్ చేయాల్సిన డేటు, టైం సార్. ఎవరికీ అర్థం కాకూడదని అలా చెప్పాను సార్. అదే అతను టికెట్ మీద రాసుకున్నాడు. మిగతా అంతా మీకు తెలిసిందే, హోటలు, హోటల్ రూమ్ నెంబరు సార్.”

“అసలే దేశం సంక నాకి పోతుంటే.. డ్రగ్స్ బిజినెస్ చేస్తారా? మీలాంటోళ్ళని అసలు బతకనివ్వకూడదు. ఎలాగూ వాడు పోయాడు. నిన్ను కూడా ఏసేస్తే ఓ పనయిపోద్ది. అడవిలోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి పడేస్తా” అని ఎస్ఐ ఆవేశంతో అనడంతో హఠాత్తుగా గుండెపోటు వచ్చి తన రెండు చేతులతో గుండెను అదిమి పట్టుకుంటూ బలరామయ్య నేలకొరిగిపోయాడు.

Exit mobile version