Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కోడ్ నెంబర్

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన భాగవతుల భారతి గారి ‘కోడ్ నెంబర్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“అవును! నేను చెప్పేదాన్ని గురించి ఆలోచించండి!” అతను అనగానే అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.

అందరూ ముఖముఖాలు చూసుకున్నారు.

తరతరాలుగా అందరూ ఆమోదిస్తూ వస్తున్న అంత పెద్ద సిద్ధాంతం అతను ఇంత పెద్ద సభలో తప్పు అనటం అక్కడివాళ్ళంతా జీర్ణించుకోలేక పోతున్నారు.

“ఎలా నిరూపించగలరు?” అన్నారెవరో!

“గుడ్ క్వశ్చన్? మీలో ఎంతమందికి చార్మినార్ తెలుసు? హాండ్ లిఫ్ట్ చేయండి”

చాలా మంది చేతులెత్తారు.

“మీకు ఎలా తెలుసు? అక్కడికి వెళ్ళుండాలి. లేదా ఏ బొమ్మలోనైనా చూసి ఉండాలి ‌అవునా!?”

“అవును! మా మనసులు అక్కడికి వెళ్ళిపోయినాయి”

“ఓకే! ఉత్తర ధృవంలో జాదా గుడి మంట్ అనే ప్లేస్ ఉంది. మీ మనసును త్వరగా అక్కడికి పంపండి.. అక్కడ ఏమేం ఉన్నాయి?”

“అవునా? జాదా గుడి మంట్ అనే ప్రాంతం ఉందా? అసలు ఉత్తర ధృవం ఎక్కడ ఉంది? మేం ఊహించలేక పోతున్నామే!”

“అయితే! మీ మనసు ఎక్కడుంది?” మళ్ళీ ప్రశ్నించాడు అతను.

“మా మనసు అందరిదీ తలో చోటా ఉంది. జాదా గుడి మంట్ దగ్గర తప్ప!” అని పకపకా నవ్వారంతా!

“యస్ ఇట్స్ రైట్. హైదరాబాద్ అనే సిటీ మీరు చూసి ఉన్నారు కాబట్టి, మీ మనసు చార్మినార్‌ను ఊహించింది. కానీ, జాదా గుడి మంట్‌ను మీలో ఎవరూ చూడలేదు కాబట్టి, అది ఎలా ఉంటుందో అసలు కలలో కూడా ఊహించలేరు. మీ మనసు అక్కడికి వెళ్ళలేదు. అలాగే, బట్టలు తయారయ్యే మాంచెస్టర్ దగ్గరకు మనసును పంపండి. రష్యాలోకో, మావో సే టుంగ్ ఎక్కడ పుట్టాడో అక్కడికి మీ మనసును త్వరగా పంపండి.”

“న్నో” అరిచారంతా.

“కాబట్టి.. అన్నిటికన్నా వేగవంతమైనది మనసు కానే కాదు.. ఎంతో వేగంగా వెళ్ళగలిగింది మనసే అనే సిద్ధాతం తప్పు. జాదా గుడి మంట్ అనే ప్రాంతం ఉందా లేదా అనేది నాకూ తెలీదు. తెలిసిన విషయాన్నీ, వస్తువునూ, సంఘటననూ మరోసారి మననం చేస్తుంది కానీ.. తెలియని చోటికి మనసు వెళ్ళదు. అది చెప్పటానికే ఆ ప్లేస్‌ను నేనూ కల్పించాను.

అంటే! మనసు చేసే పని ఊహించటం..

తెలిసిన విషయాన్ని మననం చేసుకుంటూ ఉండటమే తప్ప, వేగంగా ప్రయాణం చేయటం కాదు” అతను ఇంకా చాలా ఉదాహరణలతో ప్రపంచంలో అత్యంత వేగమైనది మనసు కానే కాదు అని నిరూపించటానికి, ఆ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తున్నాడు.

అందరూ ఇది నిజమేనేమో అనిపించేంత ఆసక్తిగా వింటున్నారు.

కాన్ఫరెన్స్ అయిపోయింది. నిజానికి ఆ కాన్ఫరెన్స్ కేవలం కంపెనీ తరఫున టార్గెట్ ఎలా పూర్తిచేయాలనే అంశంపై మీటింగ్.

కానీ ఆ టార్గెట్స్ విషయం చెబుతూ “వాయుమయ, మనోమయ వేగంతో మన టార్గెట్ పూర్తిచేయాలి” అన్నాడు.

అక్కడ సోఫాలనిండా కూర్చుని ఉపన్యాసం వింటున్న వారు, అతను మనసు వేగం గురించి ఇచ్చిన ఉపన్యాసం ఎంతోమంది బుర్రలోకి ఎక్కిందో తెలీదు గానీ కాన్ఫరెన్స్ ఎందుకు ఏర్పాటు చేసారో ఆ టార్గెట్ పూర్తి చేసి అందరూ బై అనుకుంటూ లేచారు.

“సార్ మీరు మనసు మీద ఇచ్చిన ఉపన్యాసం ఆలోచింప చేసేదిగా ఉంది. పరిశోధన చేస్తాం” అంటూ అందరూ వెళ్ళిపోయారు.

ఆఖరున ఉపన్యాసం ఇచ్చిన అతను బయలుదేరి వచ్చి లిఫ్ట్ ఎక్కాడు.. అతను ఓ యువకుడు. పేరు విపిన్.

విపిన్ లిఫ్ట్‌లో ఉండగా కరెంట్ పోయి లిఫ్ట్ ఆగిపోయింది. టెక్నికల్ ఇస్స్యూ వల్ల ఆటోమేటెడ్ రెస్క్యూ సిస్టమ్ పనిచేయలేదు. విపిన్ చాలా సేపు అదే లిఫ్ట్‌లో ఉండిపోవలసి వచ్చింది. పిలిచాడు. అరిచాడు. ఎవరైనా ఉంటే లిఫ్ట్ ఓపెన్ చేయండి అని.. అందరితో పాటు తనూ వెళ్ళిపోతే బాగుండేదేమో! లేట్‌గా బయలుదేరటం తను చేసిన పొరపాటు. అర్ధరాత్రి అయింది. ఎవరూ లిఫ్ట్ దగ్గరకు రాలేదు. ఆకలేస్తోంది. నిద్రా వస్తోంది. అందులోనే కూలబడ్డాడు.

మాగన్నుగా నిద్రపట్టేసింది.

***

ఒక యువతి రైలు పట్టాల మీద ఎదురుగా వచ్చే ట్రైన్‌కి ఎదురు వెళ్ళుతోంది. దూరాన్నుంచి ఆమెను చూసిన ఒక యువకుడు ఆమె వైపు పరుగెత్తుకు వెళుతున్నాడు. ఆమె ఇంకా వేగంగా పరుగెత్తుతోంది. ఆమెను ఆపాలని అతని పరుగు.

“ఆగూ! ఆగూ!” అని అరుస్తూ.. వేగంగా వెళ్ళి ఆమెను పట్టాల మీంచి కిందికి తోసేయటం.. అంతే వేగంగా రైలు వెళ్ళిపోవటం కన్నుమూసి తెరిచేంతలో జరిగిపోయింది.

“ఎవరు నువ్వు ఏమిటీ అఘాయిత్యం? చచ్చిపోవాలనా?”

“అవును! నన్ను చచ్చిపోనీయండి”

“నీ పేరేమిటి? ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావ్?”

“నా పేరు కాదంబరి! నేను మా అమ్మనాన్నలకు ఒక్కదాన్నే కూతురుని..” అంటూ ఆమె చెప్పిన విషయాలు అతణ్ణి రక్తం మరిగించి నివ్వెరపరిచాయి.

“అందుకే నన్ను చనిపోనీండి.” అంది ఏడుస్తూ..

“వద్దు! నువ్వు ఎక్కడైనా తలదాచుకో నీ కష్టం నాకర్థమయింది. నిన్ను నేను రక్షిస్తాను.”

***

“నేను ఇక్కడికి ఎలా వచ్చాను?” కళ్ళు విప్పి ఆశ్చర్యంగా అడిగాడు విపిన్.

“రాత్రి మీరు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. లిఫ్ట్ బాయ్ వచ్చి చూసేసరికి మీకు గాలి ఆడక స్పృహ కోల్పోయి ఉన్నారు. అందరి సహాయంతో మిమ్మల్ని ఈ హాస్పటల్‌లో చేర్చాము.”

“ఓహో! ఇట్స్ ఓకే థాంక్స్ ఎలాట్.. ఐ యామ్ ఫైన్” అంటూ లేచి, అందరికీ వీడ్కోలు చెబుతూ, రిసెప్షన్ దగ్గరకు వచ్చాడు. అతనితో పాటు, నలుగురూ నడుస్తూ వచ్చారు. రిసెప్షనిస్ట్ విపిన్‌ను చూసి నవ్వింది. దగ్గరగా వెళ్ళాడు. ఆమెతో మాట్లాడుతూనే అక్కడి పేపర్ చేతిలోకి తీసుకుని అలవాటు ప్రకారం అటుఇటూ తిరగేస్తూ, ఓ చోట చూపు ఆపి, భృకుటి ముడివేసి, చూస్తూ, కెవ్వుమన్నాడు.

రిసెప్షనిస్ట్‌తో సహా, అందరూ ఉలిక్కిపడి ఏమిటన్నట్లు చూసారు.

“ఈమె చచ్చిపోయిందని పేపర్లో వేసారు. ఈమె చనిపోలేదు. రాత్రి నేను కాపాడాను.” అన్నాడు. ఈసారి అతనివంక అక్కడున్నవాళ్ళు పిచ్చి వాణ్ణి చూసినట్లు చూసారు.

రాత్రి లిఫ్ట్‌లో ఉన్నవాడు.. ఈ అమ్మయిని ఎలా కాపాడాడూ?

“నేను నిజమే చెబుతున్నాను. ఈ అమ్మాయి పేరు కాదంబరి!”

“ఆమె పేరు అక్కడ రాసే ఉంది!”

“వ్వాట్! ఈ అమ్మాయి రైలుపట్టాల మీద పరుగెత్తుకుంటూ వెడుతుంటే..నేను!” అర్ధోక్తితో ఆగాడు.

అందరి ముఖాల్లోనూ ఏదో భావం కదలాడుతోందని గ్రహించి, తనే ఏదో కలగన్నాడా? అని అనుమానం వచ్చి, కాదంబరి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉంది.

నిజమో, అబద్ధమో తేలాలంటే, ఆమె చెప్పిన అడ్రసుకు వెడితే? అందరి వంకా చూసి, అక్కడున్న ఫ్యూన్‌కి సైగ చేసి, తనతో పాటు తీసుకుపోయాడు. తనకి ఇది తెలిసిన ఊరేగానీ, తన ఊరు కాదు. ఇద్దరూ భక్త రామదాసు కళాక్షేత్రం దగ్గరకు పోయారు. ఆ రోజు మహిళా దినోత్సవం. అక్కడ మీటింగ్ జరుగుతోంది.

తొంగి చూస్తే అందరూ ఆడవాళ్ళే! డయాస్ మీద ఇద్దరు ఆడవాళ్ళున్నారు. కాదంబరి చెప్పిన మనిషిని పోల్చుకోవటం ఎలా? అయినా తనంత పిచ్చివాడు కాకపోతే! కలో, నిజమో తెలీని ఓ విషయం కోసం, ఛీ పని మానుకుని ఇంత దూరం? జేబులోంచి చిన్న పేపర్లు రెండు తీసి దాని మీద కాదంబరి అని రాసి, డయాస్ మీద ఉన్న ఇద్దరాళ్ళకీ ఇమ్మని, డోర్ దగ్గర నుంచున్న ఓ వ్యక్తికి ఇచ్చాడు.

అది అంచెలంచెలుగా, వెళ్ళి, స్టేజి మీదకి చేరింది. ఒక స్త్రీ గోళ్ళు గిల్లుకుంటూ ఉపన్యాసం వింటోంది. ఆమె ఆ స్లిప్ చూసి అటూ ఇటూ చూసి మౌనంగా ఊరుకుంది.

రెండో స్త్రీ మహిళా మండలి సభలో స్టేజ్ మీద ఉపన్యాసం ఇస్తోంది. ఎవరో ఆమెకి ఒక చీటీ అందించారు. అది చూసిన ఆమె ముఖం వివర్ణం అయింది. గబుక్కున అటూ ఇటూ చూసి, టైం చూసుకుంటూ,.

“నాకు మాట్లాడమని ఇచ్చిన సమయం అయిపోయింది. ఉపన్యసించవలసిందిగా యమున గారిని కోరుతున్నాను.” అంటూ ముగించి, యమున అనే ఆవిడ మైక్ అందుకోగానే మెల్లిగా డయాస్ దిగి, బయటికి వచ్చింది ఆ చీటీ చేత్తో పట్టుకుని.

బయటికి వచ్చి ఆ చీటీ వంకా అటూ ఇటూ చూస్తోంది.

అక్కడే ఉన్న విపిన్ ఆమెను చూసి అవాక్కయ్యాడు. ఆమె తను కలలో చూసిన కాదంబరి.

“మీరు కాదంబరి గారు కదూ!”

“అవును! మీరెవరూ?”

“అదీ! రాత్రీ!?”

“ఆ! రాత్రి?”

“రైలుపట్టాల మీద?”

“రైలా? ఏ రైలు? ఎక్కడి రైలూ! అసలు ఎవరండీ మీరు?”

“అదీ? మేమేదో పొరపడ్డాం” గబగబా ఫ్యూన్‌ని తీసుకుని బయటికి వచ్చేసాడు.

ఫ్యూన్ అయోమయంగా, “సార్! ఏంటిదంతా? పిచ్చితనంగా లేదూ!” అన్నాడు.

“గోవిందూ! ఇక్కడికి రాకముందు నేనూ అట్లాగే అనుకున్నా! ఒక ఊహను బట్టో కలను బట్టీ, ఇలా రావటం.. హాస్యాస్పదంగా ఉన్నదని! కానీ కాదంబరి అనే పేరు చూడగానే స్టేజీ మీది మొదటి ఆమె స్పందిందలేదు‌.. ఈమె పరుగున వచ్చింది. పైగా ఈమే నిన్నటి కాదంబరి. ఇదంతా నిజమేనని అనిపించట్లా!?”

“నిజమే అయితే మీ వెనుక సైన్యంలా నేనుండి సహాయపడుతాను సార్.”

“గోవిందూ! నీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఎవరన్నా ఉన్నారా?”

“ఉన్నారు సార్! కానీ ఆయన ఉండే బిజీలో, మీరు ఆయన్ని కలవటం,? మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పటం ఆయన నమ్మటం ఇదంతా జరిగే పనేనా సార్!? గాలిలో బాణాలేగా సార్ మనం వేసేవీ! ఏదైనా తేడా వస్తే?”

“నువ్వు చెప్పేదీ నిజమే! కానీ జరుగుతున్నది చిన్న విషయం కాదుగా, కానీ నేను కన్నది కలా? ఊహా? ఎవరన్నా పంపిన ఆదేశమా? దీనిలో చివరికి మనమే దోషులం అవుతామా? సరేలే! ఆ పోలీసు దగ్గరకు తీసుకొని వెళ్ళు.”

***

ఇద్దరూ వెళ్ళారు. పోలీస్‌ను కలిసారు.

“సార్! ఓ వాక్యం డీ కోడ్ చేయాలి.” విపిన్ అన్నాడు.

“దానికి నేనెందుకు? ఏ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరకు వెళ్ళినా, పని జరుగుతుందిగా!”

“కావచ్చు! కానీ ఇందులో లీగల్ ప్రాబ్లెమ్ ఏదైనా ఉందేమో! మీరు చర్యలు తీసుకుంటేనే బాగుంటుందనీ!”

జరిగిందంతా వివరించాడు.

“ఎందుకో మీరు చెప్పేదీ!?” నసిగాడు పోలీస్

“ప్రయత్నం చేస్తే బాగుంటుందిగా”

“ 9021 230 ik idchannikke ఇదీ కోడ్..”

“నేను ఓ నెంబర్ ఇస్తాను. మీరు వెళ్ళండి.నేను ఫోన్ చేసి చెబుతా” అన్నాడు.

వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి.. ఒక వ్యక్తి ఏకాగ్రతగా కంప్యూటర్ స్క్రీన్ వైపే చూస్తున్నాడు. అతని ముఖంలో ఆందోళన కనిపిస్తోంది.

“ఇంకా ఎంత సేపు? త్వరగా డీకోడ్ చేయి. మనకి అట్టే టైమ్ లేదు” వెనకనుంచి పోలీస్ కమీషనర్ తొందరపెడుతున్నాడు.

ఆ కంప్యూటరిస్ట్ అంత టెన్షన్ లోనూ వీళ్ళని చూసి “ఏం కావాలీ?” అన్నాడు అసహనంగా.

“మిమ్మల్ని కలవమని ఓ ఇన్‌స్పెక్టర్ పంపారు.”

“పనేంటో?”

“ఈ వాక్యం డీ కోడ్ కోసం”

“వ్వాట్?! ఈ కమీషనర్ కశ్యప్ కూడా దీని కోసమే వచ్చారే!”

కశ్యప్ ఎలర్టయ్యాడు. “ఇది మీకెక్కడిదీ?” అన్నాడు, వృత్తిపరమైన అనుమానపు చూపులతో!

విపిన్ తనకు జరిగిన అనుభవాన్ని దాచకుండా చెప్పాడు.

“ఇది నమ్మలేకపోతున్నాను. అయినా నా అనుమతి లేకుండా ఊరు దాటిపోకండి.”

“సార్! మీరు మమ్మల్ని అనుమానించకండి. మీరు అనుమతిస్తే, ఈ ఆపరేషన్‌లో మేమూ మీతో కలిసి వర్క్ చేసి, మీకు సహకరిస్తాము.”

“ఐతే మీరో పనిచేయండి విపిన్! మీరు మారువేషంలో నేను చెప్పిన చోటికి వెళ్ళండి. అక్కడి సిట్యువేషన్‌ను బట్టి, నాకు సమాచారం ఇవ్వండి. ఫోన్‌లో ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయం అనుకూలంగా లేకపోతే, మీ దాంట్లోనే 1 అనే నెంబర్ నొక్కండి. మీ ఫోన్ నుండి నాకు సీక్రెట్స్ కోడ్ ఎటాచ్ చేసాను. ఎందుకో నా పోలీసు బుర్రకి, నేను మిమ్మల్ని పంపే చోటులోనే సీక్రెట్ దాగి ఉందని అనిపిస్తోంది. త్వరగా కానీయాలి. మనం లేటు చేసిన కొద్దీ, అవతల నేరస్థులు తప్పించుకునే అవకాశం ఉంది.” హడావిడి పెట్టేసాడు కమీషనర్ కశ్యప్.

విపిన్ వేషం మార్చుకుని కశ్యప్ చెప్పిన చోటికి వెళ్ళాడు. ఇది కొత్త పని.. అలవాటు లేదు. అందుకని కాస్త నెర్వస్ ఫీలవుతూ, తడబడుతూ అక్కడికి అడుగుపెట్టాడు.

అది ఓ ఆడిటోరియానికి ఎటాచ్ చేసి ఉన్న గ్రీన్ రూమ్. అక్కడ కుర్చీ మీద కూర్చుని ఉంది ఒక స్త్రీ. మేకప్ మేన్ ఆమె ముఖానికి టచ్ అప్ చేస్తున్నాడు. ఆమె అద్దంలో తన అందం చూసుకుని మురిసిపోతూ ఉండగా వెనక నిలుచున్న మేకప్ మేన్‌ని అద్దంలో చూసి ఆమె ముఖంలో రంగులు మారాయి. విసురుగా తల తిప్పి అతని వైపు చూసింది.

ఆమె ఎవరో కాదు కాదంబరి. విపిన్ ఆశ్చర్యంతో నోటమాట రాక నిశ్చేష్టుడయ్యాడు. కానీ ఇది పోలీస్ రిస్కీ ఆపరేషన్.. కాబట్టి.. అనుమానం రాకుండా తమాయించుకున్నాడు.

ఆమె “నేను మేకప్‌కు కూర్చుని ఉన్నప్పుడు, ఉన్నది నువ్వు కాదే! ఫోన్ మాట్లాడే ఇంతలోనే నువ్వు ఎక్కడినుండి వచ్చావ్?” అంది కోపంగా.

“అదీ, అతనికి అర్జంట్ కాల్ వస్తే, అతను వెడుతూ, నన్ను ఇక్కడ నియమించాడు. నేను పక్కన వేరే ఆర్టిస్ట్‌కి మేకప్ చేయటానికి వచ్చాను” అన్నాడు.

అప్పటికే మేకప్ పూర్తయిపోవటం వలన విపిన్ ఆమెకు ఊరికే టచప్స్ ఇస్తున్నట్లు నటించాడు. ఆవతల ఆడిటోరియంలో ఏదో డాన్స్ కార్యక్రమం జరుగుతోంది.

కాదంబరికి మేకప్ అవగానే, ఆడిటోరియంలోకి వెళ్ళింది. ఆమె వెనకాలే విపిన్ వెళ్ళాడు. ఆమె అక్కడ కూర్చున్నట్లే కూర్చుని, ఫోన్‌లో ఏదో సిగ్నల్ కనబడగానే, మెల్లగా లేచి, ఆడిటోరియం వెనక్కి వెళ్ళింది.

బయట గోవింద్ కాచుకునే ఉన్నాడు.

విపిన్ కూడా, అటూ ఇటూ చూసుకుంటూ ఆమె వెనకాలే వెళ్ళి, ఓ గోడ వెనుక నిలబడి ఆమెనే చూస్తున్నాడు. ఆమె ఆడిటోరియం వెనుక ఆగి ఉన్న ఓ పెద్ద కంటైనర్ వ్యాన్ దగ్గరకు వెళ్ళింది. దానిమీద ఇంటర్నేషనల్ వ్యాన్ అన్నట్లుగా ఏదో ముద్ర, ఏదో భాషలో రాసి ఉంది. గోవింద్ సైగ చేసాడు నెంబర్ ప్లేట్ చూడమని. విపిన్ చూసి నిర్ఘాంతపోయాడు. నెంబర్ ప్లేట్ కాక పక్కన 9021 అనే కోడ్‌తో ఇంకో అంకె వేసుంది.

ఆలస్యం చేయకుండా, తన సెల్ లోని 1 ని నొక్కి.. అక్కడ జరుగుతున్నది చూస్తున్నారు.

ఆడిటోరియం పక్కనుండి, మేకప్‌లో ఉన్న నలుగురు ఆడపిల్లల్ని, మత్తుమందు ఇచ్చి తీసుకువచ్చి, నలుగురు ముసుగు వాళ్ళు అందులోకి, ఎక్కించడానికి, కంటైనర్ వెనుకభాగం తెరిచారు. విపిన్‌కి, గోవింద్‌కి మూర్ఛ వచ్చినంత పనయింది. అందులో ఇంకా చాలా మంది అమ్మాయిలు స్పృహ లేని స్థితిలో పడి ఉన్నారు. అక్కడే ఉన్న ఆమె, వ్యాన్ డ్రైవర్‌తో ఆమె మాట్లాడేది వినబడట్లేదు. ఆడిటోరియంలో ప్రోగ్రాం మోతలో.

వ్యాన్ లోకి ఆడపిల్లలను ఎక్కించగానే, డోర్ మూసేసారు. వ్యాన్ కదిలింది. విపిన్‌కి, గోవింద్‌కి టెన్షన్ పెరిగిపోతుంది. వారిని ఎదుర్కోవాలంటే తమ శక్తి చాలదు. వ్యాన్ వెళ్ళిపోయిందంటే అది విదేశాలకు వెళ్ళిపోతుంది. ఆ ఆడపిల్లలు ఇక తిరిగిరారు. ఏం చేయాలి? ఇద్దరికీ ముచ్చెమటలు పోసేస్తున్నాయ్. వెనకాలంతా నిర్మానుష్యంగా ఉంది. అరిచినా ఎవరికీ వినబడదు.

ఎలా? ఎలా? ఎలా?

ఆలోచించే స్థితి దాటేసారు ఇద్దరూ!

వ్యాన్ మూవ్ అయి రోడ్డు ఎక్కుతుండగా, పోలీస్ వ్యాన్ వచ్చి ఆగటమూ, పోలీసులు అత్యంత వేగంగా దిగి, వ్యాన్‌ను చుట్టు ముట్టేయటం, క్షణాల్లో జరిగిపోయాయి.

విపిన్ తేలిగ్గా ఊపిరి పీల్చకుంటుండగా, ఆ అమ్మాయి, పారిపోవడానికి ప్రయత్నం చేయటం చూసి, గోవింద్ సహాయంతో ఆమెను, ఒడిసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎంత వేగంగా వచ్చారో అంత వేగంగానూ, పబ్లిక్ న్యూసెన్స్ కాకుండా ఆ అమ్మాయితో సహా అందరినీ పోలీస్ జీపులోకి ఎక్కించి, రయ్యిన వెళ్ళిపోయింది జీపు. విపిన్ సెల్ మోగింది. కశ్యప్ ఫోన్ చేసాడు. “మీరు ఫలానా స్టేషన్‌కి వచ్చేయండి” అని.

ఇద్దరూ ఎంతో ఎగ్జైట్మెంట్‌తో అక్కడికి వెళ్ళారు. ఒక మంచిపని చేసామన్న సంతృప్తి ఇద్దరిలోనూ!

“సార్! ఇంత రిస్కీ ఆపరేషన్‌లో మమ్మల్ని జేర్చుకుని, మా దేశభక్తిని నిరూపించుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండీ. ఐతే ఇదంతా మీరు ఎలా?”

“ఆ రోజు నేను డ్యూటీ రైల్వేస్టేషన్ దగ్గర డ్యూటీలో ఉన్నాను. ఒకామె రైలు పట్టాలపై రైలుకు ఎదురుగా పరుగెత్తుకుంటూ వెడుతోంది. నేను ఎదురుగా వెళ్ళి, ఆమెను ఆపి, రక్షించి, పోలీస్ స్టేషన్‌కి తీసుకు వెళ్ళాను. ఆమె భయంతో వణికిపోతోంది. ఆమెను మెల్లగా ఓదార్చి, అసలు విషయం రాబట్టాను. తన పేరు కాదంబరి అనీ, ఈ ఊళ్ళో నీలాంబరి అనే ఆమె, అమ్మాయిలను దొంగతనంగా రాష్ట్రం, దేశమూ దాటిస్తోందనీ.. నెల రోజుల క్రితం.. ఓ కాలేజి వెనుక, ఓ ఇంజెక్షన్ ఇచ్చి, తనను ఎత్తుకువెళ్ళారని, ఎలాగో తప్పించుకుని, వారం క్రితం పారిపోయి అక్కడక్కడా తల దాచుకుంటూ బతికాననీ, తనకు ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదనీ, ఇంకా భయంతో బ్రతకలేక చచ్చిపోవటానికి, రైలు పట్టాల మీదికి వచ్చాననీ చెప్పింది. ఐతే! ఆమెను ఇంకాస్త బుజ్జగించాక, ఆమె ఇంకొన్ని వివరాలు చెప్పింది. వాళ్ళకి ఓ లైసెన్సుడ్ వ్యాన్ ఉంది. వాళ్ళు దానిలోనే, ఆడపిల్లల్ని పశువుల్లాగా, చేరవేస్తుంటారు. ‘వారు మాట్లాడుకుంటున్న దానిని బట్టి, నెక్స్ట్ బ్యాచ్‌ను చేరవేసే కోడ్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అది ఇది’ అని చెప్పింది.”

“9021 230 ik idchannikke. ఇదీ కోడ్..”

“మరి దీని డీ కోడ్ ఏంటి? నీకెలా తెలిసింది?”

“9021 నెంబర్ ఉన్న వ్యాన్‌లో మధ్యాహ్నం గం. 2.30ని కి ఎక్కించండి అని.”

“మరి ఆ సమయంలో అక్కడ?” విపిన్ ఆశ్చర్యంగా అడిగాడు.

“అవును తెలిసింది.. ఆ అమ్మాయే చెప్పింది.”

“ఆ అమ్మాయిని మేం చూడవచ్చునా?”

“ఇక్కడే పోలీసు కస్టడీలో ఉంది. ఈమెను రేపు కోర్టులో సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఆమెను విడుదల చేయించాలి.”

“మళ్ళీ ఇదేం ట్విస్ట్. ఆమెకూ కోర్టుకు సంబంధం ఏమిటీ?” విపిన్ విస్తుపోతూ అడిగాడు.

కశ్యప్ నవ్వి.. “మీకే తెలుస్తుంది, రండి చూపిస్తా!” అన్నాడు.

చివరి సెల్ దగ్గరకి తీసుకెళ్ళి “కాదంబరీ!” అని పిలిచాడు.

ఆమె తలతిప్పి చూసింది.

విపిన్ కళ్ళు తిరిగి పడిపోతూ నిలదొక్కుకోటానికి గోవింద్‌ను పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు.

ఇప్పటికి, నాలుగు చోట్ల వేరు వేరు చోట్ల తనకెదురైన కాదంబరి. ఇదేమిటి? విచిత్రం?

“అదే ఇందులోని మిస్టరీ! నిజానికి ఈమే కాదంబరి.. ఆ మోసగత్తె నీలాంబరి.. కాదంబరి తప్పించుకుందని.. నీలాంబరికి ఎప్పుడైతే తెలిసిందో! తీవ్రంగా గాలించింది. ఈమె దొరకలేదు. కాదంబరికి తన గురించి ఏ రహస్యాలు తెలుసో నీలాంబరికి తెలియలేదు. అందుకని తనే కాదంబరిలా, వేషం మార్చి, కాదంబరిలా మాస్క్ తయారుచేయించుకుని, తిరుగుతోంది. ఇవిగో! మాస్కులు. ఆమె చనిపోయిందని నేనే పేపర్ లో వేయించా.”

“వ్వాట్, ఎందుకలా?”

“ఇందులో అర్థం కాకపోవటానికేం ఉంది. నీలాంబరి మైండ్ డైవర్ట్ చేయటానికే ఇదంతా. కాదంబరినే దేశద్రోహిగా పరిచయం చేసి, ఏదైనా పొరపాటు జరిగితే కాదంబరినే పట్టించి తను తప్పించుకోవచ్చని! నీలాంబరి వ్యూహం భగ్నం చేయటానికే కానీ.. చేసా కానీ! నిజంగానే ఈమే దేశద్రోహి అనుకుని కాదంబరి ఫొటో పట్టుకుని, తిరుగుతున్నారు ఆల్రెడీ మా పోలీసు టీం!”

“మరి ఇప్పుడెలా?”

“అందుకే ఈమెను, ఆమెను రేపు కోర్టులో సబ్మిట్ చేసి, ఈమే, అసలైన కాదంబరి అనీ, ఆమే నీలాంబరి అని నిరూపించగలగాలి.”

“వామ్మో! చాలా శ్రమపడాలి మీ పోలీసులు”

“ఇంతసేపు మిమ్మల్ని, ఇక్కడ కూర్చోబెట్టి, మా  పోలీసు సీక్రెట్స్ అన్నీ, పని గట్టుకుని చెప్పాల్సిన అవసరం నాకేముందీ?” కశ్యప్ ప్రశ్న.

“అవును నిజమే!”

“మీరు కూడా కోర్టుకువచ్చి వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరో మీకు తెలిసినంతవరకూ చెప్పి, అపరాధికి శిక్ష పడేట్టు సహకరించాల్సి ఉంది. ఇంకో విషయం కలలూ, ఊహల సాక్ష్యాలూ, కోర్టులో ప్రవేశపెట్ట కూడదు. కోర్టు నమ్మదు. నాతో కలిసినప్పుటి నుండి, కథ చెప్పాల్సి ఉంటుంది.”

“ఇన్స్పెక్టర్ కశ్యప్ సార్! అసలు మేం మిమ్మల్ని కలవాల్సిన అవసరం, ఎక్కడ, ఎందుకు కలిసామో వివరణ కోర్టుకు కావాలిగా!? అప్పుడైనా తెలుస్తుందిగా నేను కన్నది, కలో, ఊహో. నేనెందుకు మిమ్మల్ని కలవాల్సి వచ్చిందో?!”

“నిజమే! కదా!?”

“సార్! మీరు భయపడకండి! మేం పూర్తిగా సహకరిస్తాము. నిర్దోషిని రక్షించుదాం. ఖచ్చితంగా ఈమే కాదంబరి అని నిరూపితమవుతుంది.”

“ఇలాంటి సాహసోపేతమైన కీలక ఆపరేషన్ లో మేమూ పాల్గొనే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. ఇది దేశ పౌరులుగా మా బాధ్యత. రేపు కలుద్దాం సార్!”

“కానీ!..” అర్దోక్తితో ఆగాడు కశ్యప్.

“మేం ఎవ్వరికీ చెప్పం రేపు కోర్టులో తప్ప!.. మేం జాగ్రత్తగానే ఉంటాం సార్!”

***

“గోవింద్! చట్టం చేతులు పొడవైనవీ, విశాలమైనవీ, వెడల్పయినవీ, ఇలా ఎన్ని చెప్పుకున్నా, దోషులకు శిక్ష పడుతుంది. నిర్దోషులు విడుదలవుతారు. కానీ, నాకు వచ్చింది కలా! భ్రాంతా? నాకే ఎందుకు కనబడిందామె?

కలే అనుకుంటే, ఇలలోనూ అదే జరిగిందిగా!? నిన్ను రక్షిస్తాను ఎక్కడైనా తలదాచుకో! అని తను ఆమెకు రైలు పట్టాల మీద చెప్పాను. తను తలదాచుకుంటూ కశ్యప్‌కి దొరికింది.

నేను ఆమెను రక్షించటంలో కశ్యప్‌కి సాయపడుతున్నాను. ఇదెలా సాధ్యం గోవింద్? అంతా అయోమయంగా ఉంది” అన్నాడు విపిన్.

“ఏమో! మీరు కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన ఉపన్యాసం ప్రభావం మీ మనసుపైనే పడిందేమో!?”

అవునా?! అన్నిటికన్నా వేగమైనది మనసు కాదు అని తను వాదించాడు. మరి!

ఆమె ఎవరో తనకు తెలీదు. ఆ రైలు పట్టాలు ఎక్కడివో ఎప్పుడూ తను చూళ్ళేదు. తన మనసు తనకు తెలీకుండానే అక్కడికి వెళ్ళిందా? ఊహించిందా? ఆలోచిస్తూనే ఉన్నాడు విపిన్.

***

ఎవరి ఊహలూ, ఆలోచనలూ, కలలూ ఎలా ఉన్నా, సంఘ విద్రోహ చర్యలను, అరికట్టడానికి సమాజ శాంతిభద్రతల పట్ల, దేశం పట్ల, సామాన్య పౌరులకూ బాధ్యత ఎంతో ఉన్నదని నిరూపించారు. నిజమైన దోషికి శిక్ష పడేటట్లు చేసి, ఎంతోమంది ఆడపిల్లలను కాపాడటానికి అవిశ్రాంతంగా శ్రమించారు విపిన్, గోవింద్, కమీషనర్ కశ్యప్‌కు సహకరిస్తూ.

Exit mobile version