[డా. సవేర (డా. ఎస్. వి. రమేష్ కుమార్) గారు రచించిన ‘కళాశాల గోడలపై విచిత్రమైన పురుగు’ అనే కవితని అందిస్తున్నాము.]
1.
మన కళాశాల గోడలపై
ఓ విచిత్రమైన పురుగు
పాకుతూ వుంటుంది
దాంతో జాగ్రత్తగా ఉండాలి!
2.
అది ఆ తరగతి గది మూలల్లోగాని
ప్రయోగశాల మెట్ల మీద గానీ
మన కోసం ఎదురుచూస్తూవుంటుంది
దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి!
3.
అది అందంగా ఉంటుంది
ఆకర్షణీయంగా ఉంటుంది
నిన్ను నన్ను వెంబడిస్తుంది
దాంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి!
4.
అది కన్నులతో మాట్లాడుతుంది
తియ్యటి మాటల్తో కాటేస్తుంది
తర్వాత మన మనసు పిచ్చిదవుతుంది
అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి!
5.
ఆ పురుగుకాటుకు గురైనోళ్ళు
భ్రమల్లో బ్రతుకుతుంటారు
లక్ష్యాల్ని మరిచిపోతుంటారు
అందుకే మనకు మనమే కాపలా ఉండాలి!
6.
ఆ పురుగుకాటు నుంచి తప్పించుకున్నోళ్ళు
విజేతలుగా విజయగర్వంతో నిలబడ్డారు
నవ్వుతూ సగౌరవంగా జీవించారు
అందుకే ఆ పురుగుతో జాగ్రత్తగా ఉండాలి!
(కళాశాల దశలో ప్రేమలో పడి, లక్ష్యాల్ని మధ్యలో వదిలి, ఎటూకాకుండా పోతున్న కొంతమంది విద్యార్థుల్ని చూసి బాధతో..)
డా. సవేర (డాక్టర్ ఎస్.వి.రమేష్ కుమార్) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా లోని పాకాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరు రచించిన కవితలు ఈనాడు, నేటి నిజం, సాహితీ ప్రస్థానం, సంచిక, తిరసం వంటి పత్రికలు మరియు మేగజైన్లలో ప్రచురింపబడ్డాయి. వీరు రచించిన ‘వెలుగు పూల కోసం’ అనే కవితా సంపుటి సెప్టెంబర్ 2024 లో ప్రచురింపబడింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్యంలో పలు సంస్థల నుండి బహుమతులు, పురస్కారాలు పొందారు.
