[జానీ క్యాష్ పాడిన ‘కమిటెడ్ టు పార్క్‌వ్యూ’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- జానీ క్యాష్ – కమిటెడ్ టు పార్క్‌వ్యూ
- ఆల్బమ్ – వన్ పీస్ ఎట్ ఏ టైం (1976)
- రచన – జానీ క్యాష్
- నిర్మాత – డాన్ డేవిస్
~
క్యాష్ పాటలలో ఎక్కువగా దుఃఖం, నైతిక సంఘర్షణ, విముక్తి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. తన గంభీమైన, ప్రశాంతమైన ‘బాస్-బారిటోన్’ స్వరానికి; రైలు కదలికను తలపించే గిటార్ లయలతో కూడిన బ్యాకింగ్ బ్యాండ్ ‘టెన్నెస్సీ త్రీ’ ప్రత్యేకమైన శైలికి, తిరుగుబాటు ధోరణితో పాటు కాలక్రమేణా పెరిగిన గంభీరమైన వినమ్రమైన వ్యక్తిత్వానికి, జైళ్లలో నిర్వహించిన ఉచిత సంగీత కచేరీలకు క్యాష్ ప్రసిద్ధి చెందారు. వేదికపై ఎప్పుడూ నల్లని దుస్తులు ధరించే ఆయనను ‘మ్యాన్ ఇన్ బ్లాక్’ అని అభిమానులు ప్రేమగా పిలుచుకునేవారు.
క్యాష్ రాసి, గానం చేసిన పాటలలో ప్రత్యేకంగా నన్ను ఆశ్చర్యపర్చిన గీతం ‘కమిటెడ్ టు పార్క్‌వ్యూ’. కంట్రీ సంగీతంలో ఎన్ని విభిన్న, విస్తృతమైన అంశాలతో గాయకులు సమాజాన్ని రికార్డ్ చేశారో చెప్పడానికి ఈ పాటను ఉదహరించుకోవచ్చు. ఇది మానసిక ఆరోగ్య చికిత్సా కేంద్రంలో ఉన్న ఒక రోగి అనుభవాన్ని ప్రత్యక్షంగా తెలియజేసే అరుదైన పాట. క్యాష్ మొదట ఈ పాటను 1976లో వచ్చిన తన ‘వన్ పీస్ ఎట్ ఏ టైం’ ఆల్బమ్ కోసం రికార్డ్ చేసి విడుదల చేశారు. ఆ తర్వాత, జానీ క్యాష్, వేలన్ జెన్నింగ్స్, విల్లీ నెల్సన్ క్రిస్ క్రిస్టోఫర్‌సన్‌లతో కలిసి కంట్రీ సంగీత బృందం ‘ది హైవే మెన్’, తమ తొలి ఆల్బమ్ కోసం దీనిని తిరిగి రికార్డ్ చేసినప్పుడు ఈ పాట మరింత ప్రాచుర్యం పొందింది.
There’s a man across the hall
Who sits starin’ at the floor
And he thinks he’s Hank Williams
Hear him singin’ through the door
(ఈ హాలుకు ఆవలి వైపు ఒకతను నేలను తేరిపార చూస్తూ కూర్చుని నాకు కనిపిస్తాడు. అతను తనను తాను హాంక్ విలియమ్స్ అనుకుంటాడు. ఆ తలుపు గుండా అతని పాట వినిపిస్తూ ఉంటుంది)
పార్క్‌వ్యూ ఒక మానసిక చికిత్సాలయం. అందులో తనను తాను హాంక్ విలియమ్స్ అని చెప్పుకునే ఓ వ్యక్తి ఉన్నాడట. హాంక్ విలియమ్స్ కంట్రీ సంగీత దిగ్గజాలలో ఒకరు. జనంలో బాగా చొచ్చుకుపోయిన గాయకుడు. ఆయన పాటలు పాడుతూ గదిలో ఉండిపోయిన ఆ రోగి, మానసికంగా ఏ కారణంగా దెబ్బతిన్నాడో కాని సంగీతంతో సాంత్వన పొందుతూ తనను తాను హాంక్‌గా ఊహించుకుంటూ రోజులు గడుపుతున్నాడట,
There’s a girl in 202
Who stops by to visit me
And she talks about her songs
And the star that she should be
(రెండు వందల రెండు రూం లో ఒక అమ్మాయి అప్పుడప్పుడు నన్ను చూడడానికి వస్తూ ఉంటుంది. తన పాటల గురించి, తాను ఎంతటి ప్రముఖ్య గాయనిగా పేరు సంపాదించుకోవాలనుకుంటుందో చెప్తూ ఉంటుంది)
మానసిక రోగులయినా వారికి కొన్ని బలమైన కోరికలు, కలలూ ఉంటాయి. ఆ కలలను అక్కడే బంధించబడి ఉండడంతో తోటి రోగులతో పంచుకుంటూ ఉంటారు. వాళ్లెలా ఖైదీలుగా జీవిస్తున్నారో చూస్తే మనసు పిండేస్తుంది. నిజానికి మానసిక రోగులు పూర్తిగా ఒంటరయిపోతారు. వారి మనసులు అర్థం కాక, అర్థం చేసుకునే తీరిక, ఓపిక లేక ప్రపంచం వారిను దూరంగా నెట్టేస్తుంది. ఈ విషాదాన్ని ఈ గీతం చాలా సహజంగా పట్టుకుంది.
There’s a lot of real fine talent
Stayin’ in or passin’ through
And for one thing or another
They’re committed to Parkview
(అద్భుతమైన ప్రతిభతో ఎంతోమంది ఇక్కడే నివసిస్తూ లేదా వస్తూ పోతూ ఉంటారు. ఏదో ఒక కారణం చేత వారు ‘పార్క్‌వ్యూ’ కి అంకితమై ఉన్నారు)
మానసిక రోగులయినంత మాత్రాన వాళ్లలో ఏ ప్రతిభ లేదన్నట్లుగా కాదు. కొందరు ఔట్‌పేషంట్లుగా కొందరు పూర్తి స్థాయి ఇన్‌పేషంట్లుగా ఆ హాస్పిటల్‌కు వస్తూ పోతూ ఉన్నా, విడిగా వాళ్లలోనూ అసమాన్య ప్రతిభ దాగుంది. దాన్ని వెలికి తీసుకోగల పరిస్థితులు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగానూ లేకపోవడం, వాళ్ల మనసుతో వాళ్ళు చేసే నిరంతర యుద్ధం నడుమ వాళ్ళను ఆ హాస్పిటల్‌కు కట్టిపడేసింది.
There’s a girl in 207
Comin’ down on thorazine
And a superstar’s ex-drummer
Tryin’ to kick Benzedrine
(రెండొందల ఏడులో ఒక అమ్మాయి థొరాజిన్ పభావం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. పెద్ద సూపర్ స్టార్ దగ్గర ఒకప్పుడు డ్రమ్మర్‌గా పని చేసిన మరొకతను, బెన్జెడ్రిన్‌ను వదిలించుకోవడానికి కష్టపడుతున్నాడు)
థొరాజిన్, బెన్జెడ్రిన్ అన్నవి మానసిక రోగులకు ఇచ్చే మందులు. థోరజైన్ స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్‌లో తీవ్రమైన మానిక్ దశల మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించే మొదటి తరం యాంటీసైకోటిక్ ఔషధం. దీన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.
1930, 1960ల మధ్య కాలంలో, మానసిక స్థితికి సంబంధించిన రుగ్మతలు, ముఖ్యంగా తీవ్రమైన అలసట, క్లినికల్ డిప్రెషన్, దీర్ఘకాలిక నాడీ సంబంధిత క్షీణత కోసం మానసిక వైద్యంలో ‘బెంజెడ్రిన్’ ఉపయోగించేవాళ్లు. ఇది వ్యసనంగా మారి కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తుంటే 1970ల ప్రారంభం నాటికి ‘బెంజెడ్రిన్’ వాడకాన్ని దశలవారీగా నిలిపివేసి, దానిని నియంత్రిత పదార్థంగా ఆ తర్వాత నిర్ణయించారు. ఈ పాట రాసేటప్పటికే ఆ మందు వాడకం క్రమంగా నిలిపివేస్తున్నారు. కాని అప్పట్లో చాలా మంది సెలబ్రటీలు దీన్ని విరివిగా వాడేవాళ్లు.
పాట రూపంలో అప్పటి మానసిక చికిత్సకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అందించిన గీతం ఇది. ఆ మానసిక చికిత్సాలయంలో సాధారణంగా వాడే మందుల పేర్లను ప్రస్తావిస్తూ, ఇద్దరు పేషంట్లు ఆ మందుల వాడకాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారని చెప్తున్నాడు గాయకుడు. ఒక పాటలో కథనం కోసం రచయితలు ఎలాంటి రీసర్చ్ చేసేవారో, కంట్రీ గీతాల ద్వారా ఎన్ని విషయాలు చర్చకు తీసుకొచ్చేవారో ఈ పాట ద్వారా అర్థం చేసుకోవచ్చు.
There’s a real fine country singer
Who has tried and tried and tried
They just brought him in this morning
An attempted suicide
(అక్కడ నిజమైన ఒక కంట్రీ గాయకుడిని కూడా తీసుకొచ్చారు. అతను ఎంతగానో ప్రయత్నించీ ప్రయత్నించీ విఫలమయ్యాడు, ఆత్మహత్యా ప్రయత్నం చేసినందుకు, ఇవాళ ప్రొద్దున్నేఈ హాస్పిటల్‌లో చేర్చారతన్ని)
నిజానికి కళాకారుల జీవితాలన్నీ ఒత్తిడి, సంఘర్షణలతో నిండి ఉంటాయి. వీరి జీవితాలను పరిశీలిస్తే ఆ పేరు ప్రతిష్ఠల వెనుక ఎంతో విషాదం దాక్కుని ఉంటుంది. దాన్ని జానీ తన గానంలో ధ్వనింపజేస్తూ ఆత్మహత్యా ప్రయత్నం చేసి ఆసుపత్రి పాలయిన ఓ గాయకుడిని గుర్తు చేసుకుంటున్నారు.
There are those who never made it
Those who did and now are through
Some came of their own good choosin’
Some committed to Parkview
(కొందరు ఎప్పటికీ ఆరోగ్యవంతులు కాలేకపోయారు. కొందరు స్వస్థత చేకూర్చుకుని వెళ్లిపోయారు. మరి కొందరు కోరి ఇక్కడకు వచ్చారు. కొందరి దీనికే అంకితమయిపోయారు.)
ఆ మానసిక చికిత్సాలయం ఎందరో రోగులను చూసింది. కొందరు అక్కడే ముగిసిపోతే, కొందరు ఆరోగ్యవంతులై వెళ్లిపోయారు. కొందరు అక్కడకు కోరి వచ్చి చేరారు. జానీ మిత్రుడు పోర్టర్ ప్రస్తావన ఇక్కడ చూచాయగా వస్తుంది. మానసిక చికిత్సాలయంలో వచ్చి చేరాలని, సిద్ధపడి వచ్చే వాళ్ల సంఖ్య తక్కువే కాని అలాంటివారినీ ఆ ఆసుపత్రి చూసింది. ఒకొక్కరిది ఒకో కథ, ఒకో ముగింపు.
There’s a girl who cries above me
Loud enough to wake the dead
They don’t know what she has taken
That has scrambled up her head
(నా పై గదిలో ఒక అమ్మాయి చచ్చినవాళ్లని లేపేటంత గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఆమె మెదడును గందరగోళపరిచేలా ఏమి తీసుకుందో ఎవరికీ తెలియదు.)
భయంకరంగా ఏడుస్తూ ఉండే ఓ పేషంట్ గురించి ప్రస్తావిస్తున్నాడు గాయకుడు.
There’s a boy just down below me
Who’s the son of some well-known
He was brought in by his mother
‘Cause his daddy’s always gone
(నా క్రింది గదులో ఓ ప్రముఖ్య వ్యక్తి కొడుకు ఉన్నాడు. అతన్ని తండ్రి ఎప్పుడూ ఉండడు కాబట్టి, తల్లే అక్కడకు తీసుకొచ్చింది)
కుటుంబ అలజడుల నడుమ చిక్కుకుని ఉన్న ఓ యువకుడూ ఆ ఆసుపత్రిలో పేషెంటే.
There’s a bum from down on broadway
And a few quite well-to-do
Who have withdrawn from the rat race
And committed to Parkview
(బ్రాడ్‌వే ప్రాంతం నుండి వచ్చిన ఒక నిరాశ్రయుడు, అలాగే బాగా సంపన్నులైన కొందరు వ్యక్తులు, అక్కడ కనిపిస్తారు. వీరంతా ఈ పోటీ ప్రపంచం నుండి తప్పుకుని, ‘పార్క్‌వ్యూ’లోకి చేరారు)
మానసిక సమస్యలు అందరినీ ఒకేలా బాధిస్తాయి. తిండి లేని నిరాశ్రయిలనుండి, సంపన్నులైన వక్తుల దాకా అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఆ ఆసుపత్రిలో ఉన్నారు. బైటి ప్రపంచంలోని పరుగుతో అలసిపోయి, దాని నుండి విరమించుకుని కొందరు అక్కడ చేరారు. నిజానికి ఇది అమెరికన్ ఆరోగ్య, సామాజిక వ్యవస్థ గురించి కూడా వివరించి చెప్పిన సందర్భం. అన్ని వర్గాల వ్యక్తులకు ఒకే ఆసుపత్రిలో చోటు దొరుకుతుందనే విషయం మనకు కాస్త ఆశ్చర్యపరుస్తుంది కూడా. అలాగే జీవితంలో పైకి ఎదగాలనే పరుగు శృతి మించితే వారి జీవితాలు ఎటువైపుకు ప్రయాణిస్తాయో కూడా సూచిస్తుంది ఈ గీతం.
They wake me about six-thirty
Just before the morning meal
While they’re takin’ my blood pressure
They ask me how I feel
And I always say “fantastic!”
(నన్ను రోజు ఆరున్నరకే నిద్ర లేపుతారు వీళ్లు, నా ప్రొద్దుటి అల్పాహారానికి ముందు, నా బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తూ నాకెలా ఉందని అడుగుతారు. నేను ఎప్పుడూ చాలా హాయిగా ఉన్నానని బదులిస్తాను)
ఆసుపత్రిలో ఇతర పేషెంట్ల గురించి వివరించాక, చివరగా తన గురించి చెప్పుకుంటున్నాడు గాయకుడు. అన్ని విషాదాల నడుమ, ఆ భయం గొలిపే వాతావరణంలో ఉంటూ కూడా ప్రతి రోజు తనకెలాగుందని వాళ్లు అడిగితే చాలా బావున్నానని చెప్పడం అతనొక అలవాటుగా మార్చుకున్నాడు. ఈ వాక్యాలను జాని పలికేటప్పుడు అతని గొంతులో అంతర్లీనంగా ఉండే విషాదం మనలని తాకుతుంది.
There ain’t nothing wrong with me
And then they give me my injection
And I go right back to sleep
And my days’re kinda foggy
And my nights’re dreamy too
For they’re taking good care of me
While committed to Parkview
(నాకేం అనారోగ్యం లేదని చెప్తాను. వాళ్ళు నాకో ఇంజెక్షన్ ఇస్తారు, వెంటనే నేను నిద్రపోతాను. నా పగలు మైకం కమ్మినట్లు, రాత్రులు కలల్లో తేలిపోతూ గడిపేస్తాను. వాళ్ళు నన్ను పార్క్‌వ్యూలో ఉన్నంత కాలం అంత బాగా చూసుకుంటున్నారు మరి)
ఇక్కడ గాయకుడి గొంతులో వ్యంగ్యం తొణికిసలాడుతుంది. ఆ ఆసుపత్రిలో అన్ని విషాదాల నడుమ ఎప్పుడూ మత్తుగా పడి ఉంటూ చాలా వరకు ఏమీ తెలియనట్లు ఉండిపోవడమే వాళ్లు తనను బాగా చూసుకుంటున్నారన్నదానికి సంకేతం అని చెప్పడంలో మానసిక చికిత్సాలయంలో రోగుల పరిస్థితిని వివరిస్తున్నాడు కవి.
మనసు చలించడం అన్నది అత్యంత విషాదమయిన స్థితి. అలాంటి రోగులు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఆసుపత్రిలో ఉండిపొవడం, సమాజంలోని విషాదాన్ని ప్రతిబింబిస్తుంది. మనిషి మనసును ఉక్కిరిబిక్కిరి చేసి నలిపేసే సామాజిక వ్యవస్థకు ప్రతిబింబం, మానసిక చికిత్సాలయం. కాని చాలా మందికి అక్కడకు చేరడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు. ఈ విషాదాన్ని నిజాయితీగా చర్చకు పెట్టిన గీతం ఇది.
జానీ గిటార్ ప్లే చేసే పద్దతి వినూత్నంగా ఉంటుంది. చలాకిగానూ, గంభీరంగానూ తన సంగీత పరికరాన్ని మ్రోగిస్తూ విషాదాన్నిపలికించడంలో దిట్ట జానీ. ఈ పాట అదే బాణీలో సాగుతుంది. అతని గంభీరమైన కంఠస్వరం దీనికి ప్రాణం పోసింది. పాటకు వస్తువు ఏదైనా కావచ్చు గాయకుని ప్రతిభ దాన్ని సజీవం చేస్తుందనిపిస్తుంది ఈ పాట వింటుంటే.
మానసిక చికిత్సాలయంలోని వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన జానీ నిజానికి ఎప్పుడూ ఏ మానసిక చికిత్సాలయంలో చేరలేదు. అతను కొన్ని రీహాబ్ సెంటర్లలో కొంత కాలం ఉన్నాడు. అక్కడా ఇలాంటి వాతావరణమే ఉంటుంది. కాని తన తోటి సంగీతకారుల మానసిక సమస్యలు, పోర్టర్ పార్క్‌వ్యూలో అడ్మిట్ అవడం ఇవన్నీ ఆయన మనసుపై ఎంతగానో పని చేశాయి. ఈ పాట కళాకారులనుభవించే ఒత్తిడిని కూడా చర్చకు పెడుతుంది.
(‘కమిటెడ్ టు పార్క్‌వ్యూ’ పాట యూట్యూబ్ లింక్:
https://www.youtube.com/watch?v=QQ617yTvA08)

