Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కార్పొరేట్ మనిషి..!

[డా. చలం ఆరంబాకం రచించిన ‘కార్పొరేట్ మనిషి..!’ అనే కథని అందిస్తున్నాము.]

వీధి చివరన ముసలవ్వ చేసే ఘుమఘుమలాడే, వేడి వేడి మురుకులు, పప్పు బెల్లాలు, తీపి కారంబొండాల వైపు.. చొంగ కారుస్తూ పిల్లలు..

“ప్లీజ్ డాడీ..!”

“యు.. ఇడియట్..!”

వాళ్ళ డాడీ ఆవేశం.

***

కారు వద్దకు పరిగెడుతూ వచ్చాడు వెయిటర్..

“ప్లీస్ ఆర్డర్ సర్!..” అన్నాడు అతివినయంగా వంగి నమస్కరిస్తూ.

“టు పిజ్జా..”

ఆ మాటకి పిల్లల ముఖం నల్లగా మాడింది, అచ్చం సింగరేణి బొగ్గుల్లా.

పాచిన పిజ్జా అందమైన ప్యాక్‌తో కార్లో పెట్టి,.

“చేంజ్ సర్” అంటూ మిగిలిన నోట్స్ ఇవ్వబోయాడు రెండు చేతులతో..

“నో.. కీప్ ఇట్”

నిర్లక్ష్యంగా వాళ్ళ డాడీ.

ఈ టిప్పుకే అవ్వ దగ్గర రుచికరమైన ఐటమ్స్ ఎన్నో వచ్చేవి కదా..!

చాలా రోజులు తినొచ్చు..

ఇద్దరు పిల్లల్లో అదే భావన భాదతో ..

కానీ, అవ్వ దగ్గర..

చీప్‌గా పావలా, అర్ధరూపాయో కదా!

ఈ చిల్లర వ్యాపారం ఎంత ఇన్సల్ట్ వాళ్ళ డాడీకి..

పైగా..!

కారు దిగి అవ్వ ముందు నిలబడాలి,. ఎంత అవమానం!

అందుకే.. పిజ్జా ప్రిఫర్ చేశాడు పిల్లలకు.

పిల్లల రుచి అభిరుచులకు తన ప్రిస్టేజ్ అడ్డొచ్చింది. తనంటే ఎంత రెస్పెక్ట్.. ఈ పిజ్జా సెంటర్‌కు..

సూడో ఆనందం.. డాడీది.

ముసలామెకి అందమైన డ్రెస్ కోడ్ కూడా లేదు.. పిజ్జా బాయ్‌లా!

***

స్కూల్ దగ్గర కొని తెచ్చుకొన్న తియ్యటి రేగిపళ్ళు తినబోతుంటే..

“రాస్కెల్స్” అంటూ విసిరి వీధిలో పడేసాడు డాడీ, ఈ చెత్త ఫ్రూట్స్ తినడం పక్క అపార్ట్‌మెంట్‌లో ఎవరైనా చూస్తే ఎంత నామోషీ తనకు.

ఖరీదైన లిచ్చి ఫ్రూట్స్ ఆన్‌లైన్‌లో ఆర్డర్..

***

“డాడీ..! ఆ టీషర్ట్ బాగుంది” ప్లాట్‍ఫామ్ వైపు వేలు చూపిస్తూ..

దానిపై యాభైరూపాయలు అన్న స్టికర్ వాళ్ళ డాడీని వెక్కిరించిందేమో..!

***

కార్ వేగంగా వెళ్ళి డిమార్ట్ ముందు ఆగింది.

పిల్లలు పసిగట్టేసారు..!

ప్లాట్‌ఫామ్ పై చూసిందే సేమ్ టు సేమ్..

కాకపోతే, కలర్ వేరే,..

“వి డోంట్ లైక్ దిస్ కలర్ డాడీ”

వాళ్ళ డాడీకి మాత్రం చాలా నచ్చింది!

నచ్చింది టీషర్ట్ కాదు.. దానిపై ఉన్న 1000/- రూపాయల అందమైన స్టిక్కర్.

***

“గంగిరావి చెట్టు కింద ఫ్రెండ్స్‌తో కాసేపు ఆదుకుంటాం, డాడీ..”

“షట్అప్”.. కోపంగా అని,..

“రేపు సండే.. వండర్ వరల్డ్ కు వెళదాం” చెప్పాడు.

***

మనసు, హృదయం లేని రోబోతో, ఇష్టంలేని.. ఆట, యాంత్రికంగా, టప్.. టప్.. బటన్ నొక్కుకుంటూ..

***

కాలక్రమేణ..!

ఇప్పుడు వారూ యంత్రాల్లా మారారు,

కాకపోతే..

రక్తమాంసాలతో ఉన్న బుల్లి రోబోల్లా,.

***

పిల్లల హృదయం, మెదడు కుదించుకుపోతున్నాయి వేగంగా!..

అభిరుచి, ఆనందం, సంతోషం, భావోద్రేకాలకు స్పందించడం వారెప్పుడో మరిచారు,.

నిజం చెప్పాలంటే,. సొంతంగా ఆలోచన చేయడమెలాగో కూడా.

ఇక, హృదయం, మెదడుతో అవసరమేముంటుంది,..

జీవపరిణామక్రమంలో ఇది సహజమే కదా!..

ఉపయోగం లేని అవయవాలు కుదించుకుపోయి,శాశ్వతంగా మాయమైపోతాయి,.

***

పిల్లలు పెరిగి పెద్దవారైనారు.

ఇప్పుడు వారికి పిల్లలు,.

ఎగ్జిబిషన్ స్టాల్లో రాగిసంగటి, నాటుకోడి పులుసు,..

“ప్లీజ్ డాడీ”, చొంగ కారుస్తూ..

“యు రాస్కెల్” వాళ్ళ డాడీ ఆవేశం.

***

ఎవరో కాల్ చేస్తున్నారు..!

“నేను కె.ఎఫ్.సి.లో ఫ్యామిలీతో ఉన్నా..”

ఆ మాటల్లో.. ఏదో.. ప్రౌడ్‌నెస్!

***

అంకితం: పిల్లల జీవితాలను బలితీసుకొంటున్న కార్పొరేట్ మనుషులకు, బాధతో.. – రచయిత

Exit mobile version