Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కరప్షన్ కింగ్..

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘కరప్షన్ కింగ్’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

సుబ్బారావు ఉత్సాహంగా ఇంటికి వస్తూనే, “లక్ష్మి, లక్ష్మి, ఎక్కడున్నావే, ఈ రోజుతో నా సస్పెన్షన్ ఎత్తేసారు. నేను మళ్ళీ ఉద్యోగంలో చేరిపోవచ్చు తెలుసా” అన్నాడు మొహాన్ని మతాబులా వెలిగించేస్తూ.

వంట గదిలోంచి చెంగుతో చెమట తుడుచుకుంటూ వచ్చి, “ఎందుకలా స్వర పేటికని హెచ్చు స్థాయిలో వాడేస్తున్నారు. సరైన శృతిలో కాస్త శ్రావ్యంగా చెబితే సరిపోదూ!” అని క్షణం ఆగి, “పోనీలేండి, సస్పెన్షన్ ఎత్తేసారు, అదే హిందోళ రాగం విన్నంత ఆనందంగా ఉంది” అనేసి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళబోయింది.

‘దీని సంగీతం పిచ్చి, నా చావుకొచ్చింది’ అని మనసులో అనుకుని, “అదేవిటీ, మరీ అంత నీరసంగా, నిస్సత్తువగా చెప్పి తగలడ్డావ్” అని సుబ్బారావు నెత్తి కొట్టుకుని, “ఆనందం అని మొక్కుబడిగా అనేసి ఊరుకున్నావ్. నాకు తిరిగి ఉద్యోగం వచ్చిందంటే, ఎగిరి గంతేస్తావ్ అనుకున్నాను. కానీ నువ్వు కనీసం ఓ చిన్న అడుగు కూడా ముందుకు వేయలేదు. పైగా ఈ విషయం విన్నాక విషం తిన్నట్టు మొహం పెట్టావ్. నీకు నిజంగా సంతోషవేనా” అడిగాడు దేభ్యపు మొహంతో ఆమె మొహంలోకి గుచ్చి, గుచ్చి చూస్తూ.

సుబ్బారావు మాటలకి కాస్త తటపటాయిస్తూ, “మళ్ళీ మీకు ఉద్యోగం వచ్చిందన్న విషయం, నా చెవులకి ఏదో అపశృతి దొల్లిన రాగంలా కాస్త కటువుగా వినిపించింది. ఆందోళన కలిగించే రాగం విన్నట్టు నాకు గుండెల్లో గుబులు కూడా మొదలయింది. ఎందుకంటే, మీరు సస్పెండ్ అయ్యారు సరే, మీరు అవినీతి చేసి సస్పెండ్ అయ్యారు, దానికి ఓ అర్థం ఉంది. కానీ నేను, మన అమ్మాయి ఏ తప్పూ చేయకుండా కూడా ఎన్నో అవమానాలు పడ్డాం తెలుసా. అది తలుచుకునే నా మనసు కలచివేతకు గురవుతోంది. దాంతో ఇలా చలనం లేకుండా తీగ తెగిన వీణలా ఉండిపోయాను” చెప్పింది కొంచెం దిగాలుగా.

“కాలికి దెబ్బ తగిలితే, కడుపుకి మందు రాసుకున్నాడట నీలాంటి వాడే వెనకటికి. నేను అవినీతి చేసి లంచం తీసుకుని సస్పెండ్ అయితే, నీకు, మన అమ్మాయికి ఏవిటట నష్టం. అయినా మీరు అవినీతి చేశారా పాడా! నీకెందుకు వచ్చింది తంటా” అడిగాడు, అర్థం కానట్టు మొహం పెడుతూ.

“మీరు చెప్పింది కూడా సరైనదే. కాలికి దెబ్బ తగిలితే, కడుపులోకే కదా మందు వేసుకునేది. ఇక మాకెందుకు ఇబ్బందీ అంటున్నారా, ఎందుకంటే, పాడేవాడు తికమక పడి తడబడి పాడితే, వాయిద్యకారుల సంగీతం కూడా తడబడినట్టు తప్పుగా వినిపిస్తుంది కాబట్టి” విసుగ్గా అంది లక్ష్మమ్మ.

“మామూలు బాషలో చెబుతావా” జుట్టు పీక్కుని ప్రాధేయపడ్డాడు సుబ్బారావు.

“అయితే వినండి, మొన్న నేను మన దగ్గర బంధువుల పెళ్ళికి వెళ్ళాను చూశారా, అప్పుడు కొంచెం పెద్ద నగ ఒకటి వేసుకెళ్ళాను. అది నేను టీచర్‌గా పనిచేయగా వచ్చిన జీతంలో, కొంత, కొంతగా చిట్టు వేసి కొనుకున్న బంగారు నెక్లెస్. అది వేసుకుని వెళ్ళగానే చూసినవాళ్లు, నెక్లెస్ బాగుంది అంటూ మెచ్చుకున్నారు. సరే అని నవ్వుకున్నాను. అంతలోనే, ‘ఎందుకు బాగుండదూ, వాళ్ళ ఆయన ఎలాగూ రెండు చేతులతో అడ్డంగా, నిలువుగా సంపాదిస్తున్నాడు కదా, బంగారు నెక్లెస్ ఏమిటి? రేపు డైమండ్ నెక్లెస్ కూడా వేసుకుంటుంది చూస్తూ ఉండండి’ అంటూ నవ్వింది, నాకు అక్క వరసయ్యే ఒకావిడ. దాంతో నాకు ఏం చేయాలో పాలు పోక, బిక్క చచ్చిపోయి, ‘అలాంటిదేమీ లేదు, ఇది నా డబ్బుతో చిట్టీ వేసి కొనుక్కున్నాను’ అన్నాను ధైర్యంగా.

దానికి ఇంకో ఆవిడ, వెటకారంగా నవ్వుతూ ‘అవును అలా చెప్పకపోతే అతన్ని సస్పెండ్ కాదు, డిస్మిస్ చేసి పడేస్తారు’ అంటూ బస్సు సడన్ బ్రేకేసినట్టు కిచ కిచమంటూ నవ్వింది. దాంతో ఏం చేయాలో తోచక చెంగుతో కళ్ళు ఒత్తుకుని, చక చకా వేరే వైపుకి వచ్చేసాను. ఇక మన అమ్మాయి స్కూల్లో టూర్‌కి పేరు ఇమ్మన్నారట. సరే అని నన్ను అడిగి, ముందుగా తనే డబ్బులు కట్టేసిందట. దానికి వాళ్ళ క్లాస్ టీచర్, ‘ఎందుకు కట్టవూ మీ నాన్నగారు బాగా సంపాదిస్తున్నారు కదా’ అందట. నే వెళ్ళి అడిగితే నీళ్ళు నమిలి సారీ చెప్పింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇపుడు నన్ను మన కాలనీ వాళ్ళు, మన కాలనీ లేడీస్ మీటింగ్లకి పిలవడం కూడా మానేసారు. పైగా నేను పలకరించినా, తిరిగి పలకరిస్తే వాళ్లకేదో చిన్నతనం అయినట్టు, చూసి చూడనట్టు పోతున్నారు. అసలు మన ఇంటికి వచ్చేవాళ్ళు కూడా తగ్గిపోయారు. నేను కొత్త పట్టుచీర కొనుక్కున్నానని, మొన్న ఎదురింటావిడ ఇంటికి వెళ్ళినపుడు చెప్పాను. సరే, సరే అంది. కానీ అనుకోకుండా వచ్చేటప్పుడు సెల్ ఫోన్ మర్చిపోయి తిరిగి వెళ్లాను, అప్పుడు ఆవిడ వాళ్ళ ఆయనతో, ‘కొత్త చీరేవిటీ ఖర్మ, కొత్త చీరల షాపే కొనుక్కోవచ్చు. ఆల్రెడీ ఆవిడ మొగుడు అవినీతి సొమ్ము మింగి లక్షలు, కోట్లు సంపాదించాడు కదా, ఏమైనా కొంటుంది’ చెప్పుకుంటూ పోతోంది. కాబట్టి ఈసారి నుంచైనా ముష్టి డబ్బు తీసుకోకండి. రేపు అమ్మాయికి మంచి సంబంధాలు రావాలా వద్దా? మీరు ఇలా అని తెలిస్తే, ఉన్నతమైన కుటుంబాల సంబంధాలు వస్తాయా చెప్పండి. కాబట్టి ఇవన్నీ ఆలోచించండి, ఇప్పటికైనా నిజాయితీగా ఉద్యోగం చేసి, నికార్సైన ఉద్యోగి అని మంచి పేరు తెచ్చుకోండి. నలుగురికి మంచి చేయండి. మమ్మల్ని ఈ సమాజంలో కొంచెం తలెత్తుకొని తిరిగేలా చేయండి. లేదంటే ఉద్యోగం మాని ఏదైనా అడ్డంగా డబ్బు మిగిలే వ్యాపారం పెట్టుకోండి. అంతేకానీ ఇలా మాత్రం మరోసారి దొరికిపోతే నేను మీకు విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది” చెప్పింది.

ఇంతలో సుబ్బారావు స్నేహితుడు శేఖరం విసవిసా ఇంట్లోకి వస్తూ, “విన్నాన్రా, నీ సస్పెన్షన్ ఎత్తేశారట కదా, శుభం, అప్పుడు ఏదో నీ బ్యాడ్ లక్, పట్టుబడ్డావ్. ఈ సారి అలా జరక్కుండా కొంచెం జాగ్రత్తగా లంచాలు తీసుకో. దొరికిపోకుండా లంచాలు ఎలా తీసుకోవాలో నా దగ్గర చాలా పద్ధతులు ఉన్నాయి. కావాలంటే అడుగు, చెప్తాను” అని చెప్పి, చెప్పగానే శేఖరం చెంప చెళ్ళుమనిపించాడు సుబ్బారావు.

ఆ చెంప దెబ్బకి శేఖరం తెల్ల మొహం వేసినా, లక్ష్మమ్మకి మాత్రం ఆ శబ్దం మృదంగం వాయించినట్టు వినిపించి మురిసిపోయింది.

Exit mobile version