[‘అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీమ్యూజిక్’ అనే ఫీచర్‌లో భాగంగా కెన్నీ రోగర్స్ పాడిన ‘ఇఫ్ యు వాంట్ టు ఫైండ్ లవ్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
ఇంగ్లీషు పాటల్లో కంట్రీ మ్యూజిక్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వివిధ దేశాల నుండి ఇమిగ్రెంట్లుగా అమెరికా చేరిన వాళ్లు తమ జానపద వాద్యాలను, సాహిత్యాన్నికలగలిపి తయారు చేసుకున్న సంగీతం ఇది. అంటే వీటిలో సామాన్య ప్రజల గాథలుంటాయి. వారి జీవన శైలి కనిపిస్తుంది. ఇంగ్లీషు పాటల పట్ల గొప్ప పరిజ్ఞానం నాకుంది అని చెప్పడం అతిశయోక్తే. కాని నేను ప్రత్యేకంగా ఇష్టపడి వినే పాటలు కంట్రీ మ్యూజిక్ క్రిందకు వస్తాయని గ్రహించిన తరువాత ఆ పాటల పై కొంత శ్రద్ధతో అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. భారతీయ జన జీవితానికి ఆలోచనలకు ఈ పాటలు దగ్గరగా ఉంటూనే సామాన్య జనుల వెతలను, ఆలోచనలను బహిర్గతపరుస్తూ మానవ మూలాలను విలువలను విస్మరించకుండా పాశ్చాత్య ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాయి. ముఖ్యంగా ఏ భాషలోనయినా పాటలలో సాహిత్యానికి ప్రాముఖ్యతను ఇచ్చే నాకు కంట్రీ మ్యూజిక్ పట్ల గౌరవం ఉంది. దాన్ని మీతో పంచుకోవాలని నాకు తెలిసిన కంట్రీ సింగర్స్‌ని పరిచయం చేస్తూ వారి పాటల్లో కొన్నిటిని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
అసలు కంట్రీ మ్యూజిక్ పట్ల నాకు ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం కెన్నీ రోజర్స్. నాకు ఈయన గొంతు అన్నా ఆయన పాడిన పాటల్లో వినిపించే ఆ జన జీవనమన్నా చాలా ఇష్టం. కెన్నీ రోజర్స్ నేను ఇష్టపడే పాశ్చాత్య గాయకుడు. అందుకే ముందుగా ఆయనతోనే కంట్రీ పాటల ప్రస్థానం మొదలెడతాను.
- కెన్నీ రోజర్స్ – ఇఫ్ యు వాంట్ టు ఫైండ్ లవ్.
- ఆల్బమ్ – బాక్ హోమ్ అగేన్ (1991)
- బాకింగ్ వోకల్స్ – లిండా డేవిస్, బ్రాన్సన్ బ్రదర్స్
- రచన – కెన్నీ రోజర్స్, స్కిప్ ఎవింగ్, మాక్స్ డి బార్న్స్
ఇలాంటి సంబంధాలను ప్రోత్సహిస్తుందని మనం నమ్మే ఆ పాశ్చాత్య ప్రపంచం నుండి వచ్చిన ఈ పాటను మొదటి సారి విని నాకు కలిగిన ఆశ్చర్యానికి అంతే లేదు. ఇది విన్న తరువాత నాకు బలంగా అనిపించింది ఏంటంటే, దేశ కాల మాన పరిస్థితులకు అతీతంగా మనుషుల ఆలోచనలన్నీ ప్రాధమికంగా ఒకేలా ఉంటాయి. సమాజం మారుతూ తమకనుకూలంగా విలువలను కుదించుకుంటూ ప్రస్తుత స్థాయికి చేరింది. కాని ప్రపంచంలో నీతి నియమాల పట్ల మానవజాతి దృష్టికోణం చాలా సందర్భాలలో ఒకేలా ఉంటుంది. దీనికి ఉదాహరణగా ఈ పాటను వినండి. ఇది బార్‌లో కలిసిన ఒక యువతీ యువకుడి కథ, వారి మధ్యలో నడిచే సంభాషణ.
He was sitting on a bar stool
A picture from a cheating song
She’d been standing by the jukebox
Dropping quarters all night long
(అతను బార్‌లో ఓ స్టూల్ పై కూర్చోని ఉన్నాడు. ఒక చీటింగ్ పాట చిత్రంలా ఉంది ఆ దృశ్యం. ఆమె జూక్ బాక్స్ పక్కన కూర్చుని రాత్రంతా అందులో చిల్లర వేస్తూ ఉంది)
జూక్ బాక్స్ అన్నది డబ్బులు (నాణాలు) వేసి కావలసిన పాటలు వినే ఓ పరికరం. అమెరికాలో ఇళ్లలో పర్సనల్ మ్యూజిక్ సిస్టమ్ లేని కాలంలో ఇలా పాటలు వినే వాళ్లు సంగీత ప్రియులు. బార్లలో ఇవి తప్పకుండా ఉండేవి. అలాంటి ఓ బార్‌లో ఓ యువకుడు స్టూల్ పై కూర్చుని ఉంటాడు. పక్కనే జూక్ బాక్స్‌లో నాణాలు వేస్తూ రాత్రంతా పాటలు వింటున్న ఓ స్త్రీని చూసాడు. ఆమెతో చాటు మాటు సంబంధం కలుపుకోవచ్చనే ఆలోచన అతనికి ఆమెను అలా ఒంటరిగా ఆ జూక్ బాక్స్ పక్కన చూసినప్పుడు కలుగుతుంది.
He said, tell me: are you lonely?
Is there some place we can go?
She said: cowboy, you know I’m lonely
But there’s something you should know
(అతను నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, చెప్పు ఎక్కడికన్నా మనం వెళ్దామా? అని అడిగాడు దానికి ఆమె – కౌబాయ్, నీకు తెలుసు నేను ఒంటరిగా ఉన్నానని, కాని నీవు తెలుసుకోవల్సింది ఇంకొకటి కూడా ఉంది అంటుంది)
If you wanna find gold go looking in the mountains
If you wanna find silver go digging in stones
If you wanna find heaven go reading in the Bible
If you wanna find love go looking at home
(నీకు బంగారం కావాలంటే కొండలలోకి వెళ్ళి వెతుకు, వెండి కావాలంటే రాళ్లను తవ్వడానికి వెళ్లు. స్వర్గం కావాలంటే బైబిల్ చదువుకో, ప్రేమ కావాలంటే ఇంటికి వెళ్లి వెతుక్కో)
ఈ చరణాన్ని మొదటి సారి విన్నప్పుడు ఈ వాక్యాలు నాకిచ్చిన అనుభూతిని మాటలలో చెప్పలేను. నేను ఎక్కువగా వినే ఇంగ్లీషు పాటల్లో ఇది ఒకటి. ప్రేమ అంటూ రోడ్లు పట్టుకు తిరుగుతున్న అన్ని వయసుల స్త్రీ పురుషులు, ప్రేమ కోసం జరిగే వెతుకులాటలో ఎదురుదెబ్బలతో జీవితాన్నిఅతలాకుతలం చేసుకుని అశాంతితో రగిలిపోయేవారికి ఈ పాటను వినిపించాలని ప్రతి సారి అనిపిస్తుంది.
ఇక్కడ ఆ యువకుడు క్షణికమైన సంబంధం కోసం ఎదురు చూస్తున్నాడు. అది ఎప్పటికీ ప్రేమ అవదని, దానికి ప్రేమ పేరు పెట్టడం సబబు కాదని ఆమె సూటిగా చెపుతూ, బంగారం కావాలంటే కొండలలోకి వెళ్లి వెతుక్కో (అమెరికా ప్రాంతంలో కొన్ని కొండ ప్రాంతాలలో బంగారు గనులుంటాయని అంటారు) వెండి కావాలంటే రాళ్లను తవ్వి వెతుకు, స్వర్గం పై కోరిక ఉంటే బైబిల్ చదువుకో, ప్రేమ కావాలంటే ఇలాంటి చోట పరాయి వారి మధ్య కాదు ఇంటికి వెళ్ళు అంటుంది. ఈ ప్రేమ అన్నది స్త్రీ పురుష సంబంధాల వరకే పరిమితం కాదు. అన్ని రకాల సంబంధాలకు, బంధాలకు వర్తించే భావన. ఇంటికి వెళ్లండి అక్కడి నుండి ప్రేమ కోసం వెతుకులాట మొదలెట్టండి కాని వీధిలో కాదు అని చెప్పడంలో ఎంత అర్థం ఉందో.
ఇంట్లో తల్లి తండ్రులు అర్థం చేసుకోవట్లేదని, వాళ్ళు తమను ప్రేమించట్లేదని అర్ధరాత్రిళ్ళ దాకా వీధులు పట్టుకు తిరిగే యువత, భార్యల వద్ద ప్రేమ లేదని పక్క దారులు తొక్కే మధ్యవయసు వ్యక్తులు వీరందరూ చేసే తప్పు ఒకటే. ఆ ప్రేమ తమకు లభించాలనుకుంటారు తప్ప దాన్ని సాధించుకోవాలని, దానికి ప్రయత్నించాలని, దానికి అర్హులుగా మారాలని, ముందుగా నిజాయితీతో మెలగాలని అనుకోరు. వీళ్లందరికీ If you wanna find love go looking at home ఎంత గొప్ప సందేశాన్ని మోసుకు వస్తుందో. ప్రేమ కొరకు వెతుకులాటను ఇంటి నుండే ప్రారంభించాలి, అక్కడే దాని కోసం ప్రయత్నించాలి. కాని దొరికిన బంధాల విలువను అర్థం చేసుకోలేక, దూరంగా ఉండే ఎండమావులను కోరుకుని జీవించే వ్యక్తులకు బహుశా వాళ్లు చేసే తప్పు అర్థం కాదేమో.
She touched the gold ring on his finger
And held it to the jukebox light
And she said. Stranger, think what you’re losing
If you leave here with me tonight
(ఆమె అతని వేలి కున్న బంగారు ఉంగరాన్ని తాకి దాన్ని జూక్ బాక్స్ లైట్ క్రింద పరిశీలంగా చూస్తుంది. అతనితో అప్పుడు ఓ అపరిచితుడా నాతో ఇప్పుడు నువ్వు వచ్చేస్తే ఏం పోగొట్టుకుంటావో నీకు తెలియట్లేదు అంటుంది)
అతని వేలి కున్న బంగారు ఉంగరం అతను వివాహితుడని తెలుపుతుంది. దాన్ని పరిశీలించి చూసి అతనికో భార్య ఇంట్లో ఉందన్న సంగతి ఆమెకు స్పష్టం అవడంతో అతనివైపు జాలిగా చూస్తూ, నాతో ఇప్పుడు ఇక్కడి నుండి వచ్చేస్తే నువ్వు ఆ తరువాత ఏం కోల్పోతావో నీకు అర్థం కావట్లేదు అని ఆమె నిట్టూర్చడం వెనుక భార్యల మాటున చీకటి వ్యవహారాలను నడుపుతూ అది తమ గొప్ప అని అనుకునే మగవారి అహానికి ఓ ప్రశ్న ఉంది. వివాహ బంధంలోని నమ్మకాన్ని బీటలు వార్చే పని చేసే ఆ మగవారికి తమ చాటు మాటు వ్యవహారాలతో వాళ్లు పోగొట్టుకునే వ్యక్తిత్వం దాని వల్ల దిగజారే వారి ఆత్మాభిమానాన్ని ఆమె గుర్తు చేస్తుంది. ఇవి చాలా మంది మగవాళ్లు పట్టించుకోని విషయాలు. కాని నైతికంగా బలహీనపడినవారు పోందే దాని కన్నా కోల్పోయే జీవితమే ఎక్కువ.
So he hold her body closer
She felt feelings she’d never known
And he said: thank you, for the lesson
And if you need me I’ll be at home
(అతను ఆమెను దగ్గరకు తీసుకున్నాడు ఆమెలో ఎప్పుడూ తాను ఎరుగని అనుభూతులు కలిగాయి. అలా దగ్గరకు తీసుకున్న ఆమెతో నీవు నేర్పిన పాఠానికి కృతజ్ఞుడను. నా అవసరం నీకు కలిగితే నేను ఇంట్లో ఉంటాను అని చెప్తాడు)
ఈ ఆఖరి వాక్యంతో వినే శ్రోతలకు ఓ అనుమానం ఏర్పడుతుంది. అతను ఆమెకు నిజంగా అపరిచితుడా లేక ఆమెకు కావలసిన వ్యక్తా? ఆమెతో జీవితాన్ని పంచుకోవాలనుకే ప్రియుడా అన్నది అర్థం కాదు. ఈ సందేహాన్ని ఇక్కడ కలగజేయడం కవి చేసే చమత్కారం. చివరి వాక్యం, ఆమె అతని భార్య అనీ, అతను ఆమెని పట్టించుకోకపోవటంతో ఆమె ఒంటరి తనన్ని జయించటం కోసం అక్కడికి వచ్చిందనీ, అతనికి జ్ఞాన బోధ చేసిందనీ, అది అతను అర్ధం చేసుకుని ప్రేమను పొందేందుకు తాను ఇంటికి వెళ్తున్నాననీ, ఆమెను కూడా ఇంటికి వచ్చేయమనీ అంటున్నాడని అర్ధం అవుతుంది.
కాని ఈ మూడు సందర్భాలకు కూడా అతికినట్లు సరిపోయే వాక్యం అది. అతను అపరిచితుడయితే ఒక అపరిచిత మహిళ ఇక్కడ అతనికి బుద్ది చెబుతుంది, వాళ్లిద్దరు భార్యా భర్తలయి అది సరదాగా వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అయితే ఓ భార్య భర్తకు పక్కదారుల్లో ప్రేమ వెతుక్కోవద్దనే సందేశాన్ని ఇస్తుంది. నా అవసరం ఉంటే నేను ఇంటి వద్ద ఉంటాను అని చెబుతూ ఆమెను కుడా ఇంటికి ఆహ్వనిస్తూ తన జీవితంలోకి ఆమెను అహ్వానిస్తున్న ప్రియుడిలా కూడా ఆతను కొన్ని సందర్భాలలో అనిపిస్తాడు. ఆ ఇద్దరి ఒకరికొకరు ఏమవుతారో అన్న అనుమానాన్ని చివర్లో మనకు కలిగించడం, రచయిత చమత్కార శైలి అయినా ప్రేమ కోసం అయితే ఇళ్ల నుండే అన్వేషణ మొదలెట్టండి అనే సందేశాన్ని ఈ ఒక్క వాక్యం ద్వారా భర్తలకు, ప్రియులకు, స్నేహితులకు, అపరిచిత మగవారికి అందరికీ ఒకే విధంగా అందించే ఈ పాటను కెన్నీ రోజ- ర్స్ తన గొంతుతో పలికించిన విధానం విని ఆనందించాలి.
If you wanna find gold go looking in the mountains
If you wanna find silver go digging in stones
If you wanna find heaven go reading in the Bible
If you wanna find love go looking at home..
(నీకు బంగారం కావాలంటే కొండలలోకి వెళ్ళి వెతుకు, వెండి కావాలంటే రాళ్లను తవ్వడానికి వెళ్లు. స్వర్గం కావాలంటే బైబిల్ చదువుకో, ప్రేమ కావాలంటే ఇంటికి వెళ్లి వెతుక్కో)
ఈ వాక్యాలను తమ జీవితానికి ఆపాదించుకుంటే ఎన్ని సమస్యలకు దూరం కావచ్చో మానవ సమాజం. ప్రేమ తత్వాన్ని ప్రచారం చేసిన డి. హెచ్. లారెన్స్, చలం లాంటి రచయితల ఆలోచనలకు ఇదేమి విరుద్ధం కాదు. ఏ ప్రేమ తత్వం అయినా ఇంటి నుండే మొదలవ్వాలి, ఇంటిని మరచి వీధిలో వెతుక్కోవడం మూర్ఖత్వమే. ఇంట ప్రేమ దొరకనప్పుడు దానికి ప్రయత్నించాలి తప్ప అడ్డదారుల్లో షార్ట్‌కట్ సంబంధాలలో వన్ నైట్ స్టాండ్ లలో ప్రేమ దొరకదు. ఈ అనుభవాలు మనిషి వ్యక్తిత్వాన్ని సంకుచితం చేస్తాయి అంతే..
ఈ పాట పాడుతున్నప్పుడు ఆ పై వాక్యాల దగ్గర ముఖ్యంగా కెన్నీ రోజర్స్ గొంతు భలే బావుంటుంది. కంట్రీ సింగర్స్ అందరివీ మంచి గంభీరమైన కంఠస్వరాలు. అందులో నాకు ప్రత్యేకంగా ఇష్టమైన కెన్ని పాటలలోని ఆ గాంభీర్యాన్ని ఆస్వాదించడం నావరకు నాకు అదో అందమైన అనుభవం.
~
ఇఫ్ యు వాంట్ టు ఫైండ్ లవ్ పాటని యూట్యూబ్‍లో ఈ లింక్ ద్వారా చూడవచ్చు.
Images: Internet