[‘అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీమ్యూజిక్’ అనే ఫీచర్‌లో భాగంగా పోర్టర్ వాగొనర్ పాడిన ‘ఏ సాటిస్ఫైడ్ మైండ్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- పోర్టర్ వాగొనర్ – ఏ సాటిస్ఫైడ్ మైండ్ (1955)
- ఆల్బమ్ – సాటిస్ఫైడ్ మైండ్
- ప్రొడ్యూసర్ – థామస్ ప్రొడక్షన్స్
- రచన – జో రెడ్ హేయ్స్, జాక్ రోడ్స్
~
పోర్టర్ ఎన్నో గొప్ప గీతాలను అందించారు. వాటిలో ఒకటి ‘ఏ సాటిస్ఫైడ్ మైండ్’. దీన్ని జో ‘రెడ్’ హేస్, జాక్ రోడ్స్ రాసారు. హేస్ ఒక ఇంటర్వ్యూలో ఈ పాట గురించి చెబుతూ వాళ్ల అమ్మ కొన్ని సంవత్సరాలుగా తనతో చెబుతూ వచ్చిన మాటలనే పాటగా కూర్చానని అన్నాడు. జీవితంలో సంతృప్తిని మించినదేదీ లేదని, ఎటువంటి స్థితిలోనయినా సంతృప్తిగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడని చెప్పే ఈ పాట నిజంగా కొన్ని సమయాలలో ఎంతో ఊరటనిస్తుంది. పోర్టర్ గానం ఎంత గంభీరంగా ఉంటుందంటే పాట వినే వాళ్ల మనసులలోకి ఎక్కుతుంది. ఆలోచనలను రేకెత్తిస్తుంది. జీవితంలో మనం పెట్టే పరుగులను మరో కోణంలో చూపిస్తూ అసలు మనకేం కావాలి అన్న ప్రశ్న వేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. ఈ పాట 1955లో బిల్‌బోర్డ్ కంట్రీ గీతాలలో మొదటి స్థానంలో నిలిచింది. దీనికి ఇప్పుడు కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. తరువాతి దశాబ్దాలలో కూడా కొత్త గాయకులు ఈ పాటను మళ్ళీ పాడి రికార్డ్ చేసారు కాని ఈ రోజుకు పోర్టర్ పాడిన గీతానికే అభిమానులు ఎక్కువ.
How many times have you heard someone say
“If I had his money, I could do things my way?”
But little they know that it’s so hard to find
One rich man in ten with a satisfied mind
జీవితంలో అవతలి వారిని చూసి వారికున్న ఆస్తి మనకూ ఉంటే ఎన్నో చేసేవాళ్లమని అనుకునేవాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు. తమకు లేనిదాని గురించి ఆలోచించి ఏడుస్తూ పక్కన ఉన్నవారిని చూసి బాధపడుతూ తన దురదృష్టానికి విచారిస్తూ అవతలి వారి అదృష్టానికి అసూయపడుతూ జీవితాలను గడిపేస్తారు చాలా మంది. వీరికి డబ్బు అన్ని సుఖాలను తీసుకొస్తుందనే అపోహ ఉంటుంది. డబ్బు లేకపోవడం జీవితంలో అతి విషాదం అనుకుంటూ ఉంటారు.
Once I was wading in fortune and fame
Everything that I dreamed for to get a start in life’s game
But suddenly it happened, I lost every dime
But I’m richer by far with a satisfied mind
(ఒకప్పుడు నేను ధనంతోనూ, పేరుతోనూ తూలతూగాను. నేను కలగన్న వాటన్నీటినీ అందుకున్నాను. జీవితం అనే ఆటలో విజేతగా నిలిచే లోపలే నా దగ్గర ఉన్నదంతా పోయింది. కాని సంతృప్తి నిండిన మనసుతో మిగిలి, నా చుట్టు ఉన్న అందరిలోనూ నేనే ధనవంతుడినని తెలుసుకున్నాను)
అందని ద్రాక్ష పుల్లన తీరుతో తాను మాట్లాడట్లేదని వివరిస్తూ గాయకుడు తన గతాన్ని కూడా మనతో పంచుకుంటున్నాడు. ఒకప్పుడు నేను డబ్బులో మునిగి జీవించాను. కోరుకున్నవన్నిటినీ అందుకున్నాను. కాని హఠాత్తుగా అది అంతా పోయింది. అయినా డబ్బున్నప్పటి జీవితాన్ని నేటి జీవితాన్ని పోల్చి చూసుకుంటే సంతృప్తిని మించిన ధనం మరొకటి ఉండదని, సంతృప్తి నిండిన హృదయం ఉన్నవారి కన్నా ఐశ్వర్యవంతుడు మరెవరుండరని నేను తెలుసుకున్నాను. ఆ విధంగా ఇప్పుడు నేను ధనవంతుడినే ఎందుకంటే నా మనసులోని సంతృప్తి నన్ను చాలా మందికన్నా ఐశ్వర్యవంతుడిగా నిలిపింది.
Money can’t buy back your youth when you’re old
Or a friend when you’re lonely, or a love that’s grown cold
The wealthiest person is a pauper at times
Compared to the man with a satisfied mind
(డబ్బు నీ ముసలితనంలో, పోయిన యవ్వనాన్ని తీసుకురాదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఓ స్నేహితుడిని సంపాదించి ఇవ్వలేదు. జీవితంలో అన్నీ కోల్పోయాక ప్రేమను అందించలేదు. చాలా సందర్భాలలో అతి గొప్ప ధనవంతుడు, తృప్తి నిండిన మనిషి ముందు దీనమైన పేదవాడుగా మిగిలిపోతాడు.)
డబ్బుతో పొందలేనివి ఎన్నో ఉన్నాయి. పోయిన యవ్వనం, గడిచిన కాలం, పోయిన ఆయుషు, నిజమైన ప్రేమ, స్నేహం, అభిమానం, ఇలాంటివేవీ డబ్బుతో కొనలేం. ఇది అర్థం అయ్యాక చాలా సందర్భాలలో డబ్బు ఉన్నవాళ్ళు ఒంటరి వాళ్ళుగాను, అన్నీ ఉన్న పేదవారిగానూ కనిపిస్తారు. అందుకే జీవితానికి కావలసింది, ఉన్నదానితో తృప్తి పడి జీవితాన్ని అర్థవంతంగా బతకగల తెలివి, ఆలోచన. ఇవి లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా అది వృథానే కదా.
When life has ended, my time has run out
My friends and my loved ones, I’ll leave, there’s no doubt
But there’s one thing for certain, when it comes my time
I’ll leave this old world with a satisfied mind
(జీవితం ముగింపుకొచ్చి, నా సమయం అయిపోయాక నా స్నేహితులను, నన్ను ప్రేమించిన వారిని నేను వదిలి వెళ్లిపోతాను. కాని ఒకటి మాత్రం నిజం నా సమయం వచ్చినప్పుడు నేను ఈ పాత ప్రపంచాన్ని తృప్తిగా వదిలి వెళ్లిపోగలను)
మరణం ఒక్కటే సత్యం, మిగతాది అంతా మిథ్య. ఎంత సంపాదించినా ఇక్కడంతా వదిలిపోవలసిందే. ఏదన్నా మనతో వస్తే అది మన మనసు మాత్రమే. అందుకే దాన్ని తృప్తితో నింపుకోవాలి. చేయవలసినవి తనివితీరా చేయాలి, జీవితాన్ని ఆనందంతో నింపుకోవాలి. అదిచ్చే తృప్తిని మదిలో దాచుకోవాలి. అదే అసలయిన ధనం, మనతో ఎప్పటికీ నిలిచి ఉండిపోయేది ఆ సంతృప్తే. అందుకే డబ్బు సంపాదనలో నిజమైన ఆనందాలను వదులుకోవడం మూర్ఖతం, జీవితంలో ఉన్న దానితో తృప్తి పడడం, వాటిని అనుభవించి అనుభూతులుగా మార్చుకోగలడం తెలిసిన వాళ్ళే నిజమైన ధనవంతులు. వీరి ధనం పెరుగుతుందే కాని తరగదు. అది మరొకరు దోచుకోలేని ధనం.
సైగల్ పాడిన హిందీ గీతాలను వింటే కలిగే నాస్టాలిజిక్ ఫీలింగ్ ఈ పాటను వింటున్నప్పుడు నాకు కలుగుతూ ఉంటుంది. ఏమైనా సంతృప్తిని మించిని ధనం మరేం ఉండదని అన్ని సంస్కృతులు, మతాలు, భౌగోళిక ఖండాలు దాటి జీవితానుభవంతోనూ, మనిషితనంతో నినదిస్తున్నా ఆగి దాన్ని వినేవాళ్లు మాత్రం క్రమంగా తక్కువయిపోతూ ఉన్నారు.
ఈ పాటని యూట్యూబ్‍లో ఈ లింక్ లో వినవచ్చు.
(మళ్ళీ కలుద్దాం)