Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమెరికా జనహృదయ సంగీతం – కంట్రీమ్యూజిక్-3. డాన్ విలియమ్స్ – యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్

[‘అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీమ్యూజిక్’ అనే ఫీచర్‌లో భాగంగా డాన్ విలియమ్స్ పాడిన ‘యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

~

సంగీత ప్రపంచంలో ‘ది జెంటిల్ జైంట్’ అనే పేరుతో ప్రజలకు చేరువైన డాన్ విలియమ్స్ పాటలు నాలో పాశ్చాత్య సంగీతం పట్ల ప్రత్యేకమైన ఇష్టం కలగడానికి పెద్ద కారణం. డాన్ విలియమ్స్ గొంతులో విచిత్రమైన మాధుర్యం ఉంటుంది. ఆయన పాడిన ప్రేమ గీతాలు మధురమైన అనుభూతిని కలగజేస్తాయి. ఇతర కంట్రీ సింగర్స్ పాటల విషయంలో వాళ్ల అన్ని పాటల పట్ల నాకు ఒకే రకమైన ఇష్టం ఉండదు. ప్రత్యేకంగా ఎంచుకుని వాళ్ల పాటలు కొన్నింటిని వేరు చేసుకుని వింటాను కాని డాన్ విలియమ్స్ ప్రతి పాట నాకు నచ్చుతుంది. ఆయన గొంతు నాకు భలే ఇష్టం. ప్రఖ్యాత కంట్రీ గాయకుల లిస్ట్ లలో ఎందుకో మరి డాన్ కనిపించడు. కాని నాకు ఆయన పాటలన్నీ అమృత గుళికలే. ప్రత్యేకంగా అయన పాటలలోనించి కొన్నిటిని ఎంచుకోవడం నాకు పెద్ద పరీక్ష. డాన్ పాటలను పదే పదే వింటూ గంటలు గడిపేయగలను. ముఖ్యంగా ఆయన పాటలలోని సంగీతం, దానికనుగుణంగా భావాలను ఆయన పలికించే శైలి, ఆ గిటార్ నాదం మనసును ఆనందంతో ముంచేస్తుంది.

ముఖ్యంగా ‘యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్’ మర్చిపోలేని ఓ చక్కని గీతం. జీవితాన్ని పంచుకున్న స్త్రీ పట్ల అంతులేని అనురాగాన్ని ప్రదర్శిస్తూనే, ఆమెతో సాగిన సంపూర్ణమైన జీవితాన్ని ఒక్క మూడు నిమిషాల పాటగా అద్భుతంగా పాడాడు డాన్. ఇది కేవలం ఓ పురుష హృదయం పాడే గీతం కాదు. ఎవరైనా కాని తమ జీవిత భాగస్వామితో గడిపిన ఆనందకరమైన జీవిత సారాంశాన్ని ఈ గీతంగా ఆపాదించుకోవచ్చు. అందరూ తమ జీవిత భాగస్వామి నుండి ఏం కోరుకుంటారో, ఏం కావాలనుకుంటారో వాటన్నిటికీ క్రోడీకరిస్తుంది ఈ పాట. ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచం వివాహాన్ని తేలికగా తీసుకుంటుంది అనే అపోహ ఎవరిలోనన్నా ఉంటే దాన్ని ఈ గీతం తుడిచేస్తుంది. ఏ ప్రాంతం అయినా దేశం అయినా జీవిత భాగస్వామి పట్ల అందరి కోరికలూ ఒకేలా ఉంటాయి. మానవ అనుభూతులకు, సంతోషాలకు భాషా, ప్రాంత, దేశ, లింగ భేధాలు ఉండవు కదా..

You placed gold on my finger

You brought love, like I’ve never known

You gave life to our children

And to me, a reason to go on

(నా వేలిపై బంగారాన్ని ఉంచావు, నేనెప్పుడు ఎరుగని ప్రేమని నీతో తోసుకొచ్చావు. మన పిల్లలకు జన్మనిచ్చావు, మరి నాకో.. జీవితంలో ముందుకు సాగే కారణాన్ని ఇచ్చావు)

చేతికి ఉంగరం తొడిగి అతని జీవితంలోకి ఆమె అడుగుపెట్టింది. పాశ్చాత్య వివాహాలలో ఉంగరాలు మార్చుకోవడం ముఖ్యం కదా. ఆ వివాహ తంతుతో ఈ మొదటి వాక్యం మొదలవుతుంది. అంతకు ముందు వారు ప్రేమికులా లేదా అన్న విషయం ఇక్కడ ప్రస్తావనకు రాదు. వారి జీవితం ఆ ఉంగరాలు తొడగడంతో మొదలయింది. అంటే వివాహంతో వారి జీవిత ప్రయాణం మొదలయింది. ఆ ఉంగరంతో పాటు అతను ఎప్పుడు ఎరుగని ప్రేమని అతని జీవితంలోకి మోసుకు వచ్చింది ఆమె. వారి పిల్లలను ఈ భూమి మీదకు తీసుకువచ్చింది. అతనికి ఆమె జీవించడానికి ఓ కారణం అయింది. ఎంత అందంగా ఆర్తిగా భార్యను ఆమె ప్రేమలోని గొప్పతనాన్ని, ఆమెలోని మాతృత్వాన్ని అతను వ్యక్తీకరిస్తున్నాడో కదా. ఈ చరణంలో ఒక్కో పదం దగ్గర డాన్ పలికించే భావాలు, ఆ పదాలను ఉచ్చరించే విధానంలోనే ఓ ఆర్ద్రత ద్వనిస్తుంది. మన పిల్లలకు జన్మనిచ్చావు అనే ఆ ఒక్క వాక్యంలో ఆమె పట్ల అతనికున్న గౌరవం సున్నితంగా వ్యక్తమవుతుంది.

You’re my bread when I’m hungry

You’re my shelter from troubled winds

You’re my anchor in life’s ocean

But most of all, you’re my best friend

(నేను ఆకలితో ఉన్నప్పుడు నువ్వు నాకు బ్రెడ్ (భోజనం) గా మారావు. కష్టాల గాలుల నడుమ నువ్వే నాకు ఆశ్రయం అయ్యావు. జీవితపు కడలిలో నువ్వే నాకు లంగరువి, కాని వీటన్నిటి కంటే కూడా నువ్వు నాకు ఓ మంచి స్నేహితురాలివి)

ఈ చరణం కొన్ని వందల సార్లు విని ఉంటాను. పాడుతున్నది పురుషుడు కాబట్టి అతను తన భార్య గురించి చెప్తున్నాడని అనుకోవచ్చు. అందరికీ ఇలాంటి అదృష్టం ఉండదు. కాని స్త్రీ అయినా పురుషుడు అయినా తన భాగస్వామి ఓ మంచి స్నేహితుడిగా స్నేహితురాలిగా ఉండాలని కలలు కంటారు. ఆకలితో ఉన్న సందర్భంలో భోజనంగానూ, కష్టాల నడుమ ఆశ్రయం ఇచ్చే నెచ్చెలిగానూ, జీవితపు తుఫానులో ఎక్కడికో కొట్టుకుపోకుండా ఓ లంగరుగా అలంబనగా ఉండగల నేస్తం అన్నిటికన్నా అన్ని సందర్భాలలో మంచి స్నేహితురాలిగా ఉండగల స్త్రీ భాగస్వామి అయితే ఆ మగవాడి జీవితం, అలాంటి పురుషుడు జీవితంలోకి వస్తే స్త్రీ జీవితం స్వర్గమయం కాదా.

వేదాలలోని “కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, శయనేషు రంభా” నుండి ఘంటసాల గారు ఆలపించిన ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి’ అనే పాటతో పాటు జీవిత భాగస్వామి గురించి ప్రత్యేకంగా రాసిన మధురమైన గీతాలు మన భాషలో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి నడుమ “మనసున మనసై బ్రతుకున బ్రతుకై” అన్న శ్రీశ్రీ గారి గీతం నాకు ఎంతో ఇష్టమైన పాట. దానితో సరి సమానంగా తూగగల పాట నాకు తెలిసిన పాటలన్నిటిలోనూ డాన్ విలియయ్స్ పాడిన ఈ గీతమే. ఈ రెండు పాటలు కూడా లింగ భేధాన్ని మరచి పాడుకునే అందమైన గీతాలు. తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలని ఓ స్త్రీ కోరుకుంటుందో అదే భావం, అదే మూడ్, ఆదే ఫీల్, డాన్ విలియమ్స్ పాటలో నాకు వినిపిస్తుంది. You’re my best friend అనే వాక్యం దగ్గర ఆయన పదాలను పలికే విధానం ఎప్పుడు విన్నా గుండే ఒక్క క్షణం ఆగి కొట్టుకుంటుంది. ఇక్కడ నాకు స్త్రీవాదం గుర్తుకు రాదు. డాన్ విలియమ్స్ నా కోసం పాడుతున్నట్లు, నా మనసును నాకే వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. అంతగా ప్రపంచాన్ని వాస్తవాన్ని మరిపిస్తుంది ఈ గీతం.

When I need hope and inspiration

You’re always strong when I’m tired and weak

I could search this whole world over

You’d still be everythin’ that I need

(నాకు ఆశ, ప్రేరణ కావాలన్నప్పుడు, నేను అలసిపోయి బలహీనపడ్డప్పుడు నువ్వు ఎప్పుడూ బలమైన అండగా నిలిచావు. ఈ ప్రపంచం మొత్తం నేను వెతకగలను, కాని అప్పుడు కూడా నాకు కావల్సినదంతా నువ్వే అవుతావు)

జీవితంలో ఎంతో సంఘర్షణ ఉంటుంది. వాటి మధ్యన జీవితంపై ఆశ నిలిచి ఉండాలంటే మన పక్కన ఓ అర్థం చేసుకునే తోడు ఉండాలి. అలాంటి తోడు దొరికితే జీవితంపై ఆశ అన్ని విపరీత పరిస్థితుల నడుమ కూడా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మన పక్కన ఉన్న వ్యక్తి మన జీవితానికి ప్రేరణగా నిలిస్తే ఇక అంత కన్నా మరో అదృష్టం ఉంటుందా. పై చరణంలో ప్రతి వాక్యాన్ని డాన్ గొప్ప ఫీల్‌తో గానం చేస్తాడు. ప్రపంచం మొత్తం వెతికి ఎన్నో సాధించినా అతనికి ఎప్పటికీ కావల్సింది ఆమేనట. చాలా గొప్ప వ్యక్తీకరణ ఇది. ఇంత కన్నా గొప్పగా ప్రేమను వ్యక్తీకరించలేమేమో.

You’re my bread when I’m hungry

You’re my shelter from troubled winds

You’re my anchor in life’s ocean

But most of all, you’re my best friend

(నేను ఆకలితో ఉన్నప్పుడు నువ్వు నాకు బ్రెడ్ (భోజనం) గా మారావు. కష్టాల గాలుల నడుమ నువ్వే నాకు ఆశ్రయం అయ్యావు. జీవితపు కడలిలో నువ్వే నాకు లంగరువి, కాని వీటన్నిటి కంటే కూడా నువ్వు నాకు ఓ మంచి స్నేహితురాలివి)

ఈ పాట కేవలం రెండు చరణాలతో ఉంటుంది. అవే మరోసారి రిపీట్ అవుతాయి. కాని రెండు సందర్భాలలోనూ డాన్ వాటిని గానం చేసే విధానంలో మార్పు ఉంటుంది. అతి నెమ్మదిగా అవతలి వ్యక్తికి శ్రద్దగా మనసు లోతుల్లోంచి తనలోని ప్రేమను ఎంతో ఇష్టంగా వినిపించే ఆ గొంతులోని మాధుర్యం పాట విన్న తరువాత కూడా వెంటాడుతుంది.

You’re my bread when I’m hungry

You’re my shelter from troubled winds

You’re my anchor in life’s ocean

But most of all, you’re my best friend

కంట్రీ గీతాలన్నీ కూడా ప్రజల జీవనగతుల నుండి కథలుగా వ్యక్తీకరించబడినవే. వివాహ వ్యవస్థపై గౌరవం, వివాహంలోని బాధ్యత, ఒకరి పట్ల మరొకరికుండవలసిన నమ్మకం, కమిట్మెంట్ వీటన్నిటినీ మోసుకొచ్చే ఇలాంటి పాటలు వివాహ వ్యవ్యస్థపై సమాజం ఒకప్పుడు ఉంచిన నమ్మకానికి నిదర్శనంగా అనిపిస్తాయి. ముఖ్యంగా కంట్రీ గీతాలన్నీ కూడా మధ్యతరగతి జీవితాలను ప్రస్తావిస్తాయి. జీవితాన్ని ఉన్నంతలో ఇంకొంచెం అందంగా మెరుగ్గా తీర్చి దిద్దుకోవాలనే కోరిక ఈ పాటలలో అంతర్లీనంగా ధ్వనిస్తూ ఉంటుంది. ఆ సమాజంలోని వ్యక్తుల ఆశలు, కోరికలు, ప్రశాంతమైన జీవితం పట్ల ప్రేమ ఇవన్నీ కూడా కంట్రీ పాటలలోని అంశాలలో కలగలసి ఉంటాయి.

డాన్ విలియమ్స్ పాటలలో కథ కాక కథనం ప్రాధాన్యంగా ఉంటుంది. అంటే జానపద కథలు, ఇతివృత్తాలను కాకుండా అక్కడి ప్రజల మనోభావాలు, జీవితపు ఆశలను అవి ఎక్కువగా ప్రస్తావిస్తాయి.

జూన్ 1975లో బిల్‌బోర్డ్ హాట్ కంట్రీ సింగిల్స్ చార్ట్‌లో ఈ పాట విలియమ్స్ రెండవ నంబర్ 1 హిట్‌గా నిలిచింది. UK టాప్ 40కి కూడా ఈ పాట చేరుకుంది. డాన్ విలియమ్స్ గాయకుడు, సంగీతకారుడే కాదు పాటల రచయిత కూడా. ఈ పాటను ఆయన రాయలేదు కాని అతని మత్తైన కంఠస్వరం, సంగీతం, పాడిన విధానం ఈ పాటను గొప్ప ప్రేమ గీతంగా తీర్చిదిద్దాయి.

సాధారణంగా ప్రేమ పాటలు భార్యాభర్తలుగా మారని ప్రేమికుల సందర్భంలో వచ్చి అలరిస్తాయి. ఈ పాట మధ్యవయసుకు వచ్చిన ఓ జంట ఆకర్షణ, మోహం, అనే స్థితులను దాటుకుని జీవితపు బాటలో నిత్య సంఘర్షణల మధ్య నిలుపుకున్న వారి ప్రేమను, భార్య పట్ల ఆ భర్తకున్న నమ్మకాన్ని అనురాగాన్ని సూచిస్తుంది. అందుకే నా వరకు ఇదో అద్భుత గీతం.

ఈ పాటని యూట్యూబ్‍లో ఈ లింక్‍లో వినవచ్చు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version