Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సమకాలీన భారతీయ ఆంగ్ల కాల్పనిక రచనలకి శక్తివంతమైన చేర్పు ‘కోర్టెసెన్స్ డోంట్ రీడ్ న్యూస్‌పేపర్స్’

[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా ‘కోర్టెసెన్స్ డోంట్ రీడ్ న్యూస్‌పేపర్స్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]

నిల్ యాదవ్ హిందీలో రాసిన కథలకి వైభవ్ శర్మ ఆంగ్లంలో చేసిన అనువాదం ‘కోర్టెసెన్స్ డోంట్ రీడ్ న్యూస్‌పేపర్స్’. ఇదొక ఉత్తేజకరమైన, ప్రతిష్ఠాత్మకమైన సంపుటి. ఇది సమాజంలోని బడుగు వర్గాల ప్రజల జీవితాలలోని వెతలను, వారి తీవ్ర పోరాటాలను లోతుగా పరిశీలిస్తుంది. ప్రతి కథ – గౌరవం ముసుగులను తొలగించి, వంచన కారణాలు తెలిపి, అట్టడుగు వర్గాలకు సంబంధించి గోప్యత, జులుం, మనుగడల సంక్లిష్టమైన అల్లికలను బహిర్గతం చేస్తుంది.

పుస్తకానికి శీర్షికగా అమరిన కథ – ఒక విలేఖరి నైతిక సందిగ్ధత చుట్టూ తిరుగుతుంది, ఎన్నో లోతైన నైతిక ప్రశ్నలతో సంపుటికి తలమానికంగా నిలుస్తుంది. వేశ్యల కాలనీ ఉనికికే ప్రమాదంగా మారుతుందో కుట్ర, అయితే యాదవ్ వచనం – సులభమైన సమాధానాలను నిరాకరించి, ప్రత్యేక హక్కులున్నవారు, దుర్బలురు – ఒకరితో ఒకరు ఢీకొనే ప్రపంచాన్ని ప్రదర్శిస్తుంది. ప్రతి ఎంపికా సమాజం ద్వారా తక్కువ రక్షణ పొందిన వారి జీవితాలలో ప్రతిధ్వనిస్తుంది.

యాదవ్ కథ చెప్పే విధానం సానుభూతి, స్థిరమైన వాస్తవికతతో నిండి ఉండి, పాత్రల ప్రత్యక్ష వాస్తవిక పరిస్థితిని అత్యంత సమీపంగా పాఠకులకు ప్రదర్శిస్తుంది. వారణాసి చేనేత కార్మికుల కాలనీలో ఏటా వచ్చే వరదలను వివరించినా లేదా సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్లలోని సూక్ష్మ ఉద్రిక్తతలను వివరించినా, ప్రతి కథ హాస్యంతో, హృదయ విదారకమైన సమస్యని ప్రస్తావించే స్పష్టమైన దృశ్య-నేపథ్యంతో, ప్రామాణికమైన సంభాషణలతో పొందుపరచబడింది.

అల్లర్లు, గందరగోళం అత్యంత బలహీనులని ఎలా నాశనం చేస్తాయో, ఎలా విముక్తి కల్పిస్తాయో ‘లార్డ్ ఆల్మైటీ..’ అనే కథలో ముఖ్యాంశం. అద్భుతమైన సూక్ష్మ నైపుణ్యాలతో అల్లిన పాత్రలు మత రాజకీయాలను, వ్యక్తిగత బాధను వ్యక్తం చేస్తాయి. యాదవ్ దృష్టి ఎల్లప్పుడూ ఏకాగ్రతతో ఉంటుంది, అసంబద్ధత లేదా ఆనందపు క్షణాలు కూడా పెద్ద సామాజిక ప్రశ్నలకు ముడిపడి ఉండేలా చూస్తుంది.

పుస్తకం అంతటా, సంగీతం, స్మృతులు, తరాల మధ్య జ్ఞాపకాల దారాలు ఊహించని సున్నితత్వంతో, నిస్తేజమైన వాతావరణాన్ని నింపుతాయి. ఉదాహరణకు, ‘ఆర్జే సాహెబ్స్ రేడియో’ కథ పాత హిందీ పాటలను ఉపయోగించుకుంటూ – కాలం, పేదరికం ఆత్మీయతల పట్ల తీపి చేదు ఆలోచనలను రేకెత్తిస్తుంది. అలాగే ‘ది ఫోక్ సింగర్స్ స్వాన్ సాంగ్’ కథ కళాత్మక అభిరుచికీ అధికార కుతంత్రాలకూ ముడిపెడుతుంది.

యాదవ్ భాష లోని సారళ్యం అద్భుతమైనది, కరుణ కోసం, నిష్కపటమైన ఋజుత్వం కోసం మెలోడ్రామాను వదిలేస్తుంది. కథల లోని కవితాత్మక లయని,  సాంస్కృతిక విశిష్టతను తన చక్కని నైపుణ్యంతో నిలిపి ఉంచారు అనువాదకుడు వైభవ్ శర్మ. దీని వలన ఈ సంపుటి దాని భావోద్వేగ సమగ్రతను కాపాడుకుంటూ విస్తృత ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.

‘కోర్టెసెన్స్ డోంట్ రీడ్ న్యూస్‌పేపర్స్’ అనేది తరచుగా విస్మరించబడిన వారి పట్టుదలకీ, మానవత్వానికీ ఒక నిదర్శనం. ఉత్తేజకరమైన కథన శైలితోనూ; పదునైన మేధతో, ఈ పుస్తకం – బాధను చూడటమే కాకుండా, వాటిని సృష్టించి, కొనసాగించే వ్యవస్థలను ఎదుర్కోవాలని మనల్ని అడుగుతుంది. సమకాలీన భారతీయ ఆంగ్ల కాల్పనిక రచనలకి శక్తివంతమైన చేర్పు ఈ పుస్తకం.

***

Book Title: Courtesans Don’t Read Newspapers

Author: Anil Yadav

Published by: Penguin

No. of pages: 224

Price: Paperback ₹ 299/-

Link to buy:

https://amzn.to/47GoW9h

Exit mobile version