Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

క్రియేటర్ ఆఫ్ డెస్టినీ

[డా. మానస్ కృష్ణకాంత్ రచించిన ‘క్రియేటర్ ఆఫ్ డెస్టినీ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

దీర్ఘంగా ఆలోచించి కళ్ళు మూసుకున్నాను. కింద నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది. చాలా లోతుగా ఉండడం వల్లనే అలలు లేవు. గంభీరంగా ప్రవహిస్తోంది. కిందకి చూశాను. చుట్టూ ఉన్న లైట్ లవెల్ తోటిలో అక్కడక్కడ కెరటాలు, చిన్న చిన్న కెరటాలు. చిన్న చిన్న అలలు వచ్చే చోట మెరుస్తుంది. అక్కడికే అనుకున్నాను, దాంట్లో కూడా మెరిసే హోప్, ఆశ కొంచెమైనా ఉందే అని. తర్వాత చుట్టూ చూశాను. కనుచూపు మేరలో ఒకరో ఇద్దరో తప్ప పెద్దగా జనం లేరు. వాళ్లు కూడా వాళ్ల వాళ్ల పనిలో ఉన్నట్టు అనిపించింది. అయినా కంటికి ఏం కనిపించట్లేదు. కళ్ళల్లో నీటి పొర అనుకుంటా, అంత మసగ్గా ఉంది. భవిష్యత్తు అయితే పూర్తిగా అంధకారంగా అనిపిస్తుంది. గాఢంగా. ఒక శ్వాస తీసుకుందాం. నేను నిల్చున్న బ్రిడ్జ్ పై గోడకి ఆనుకుని ముందుకు ఉండాలి. ఒక కాలు ఆ రైలింగ్ పై పెట్టి, కళ్ళు మూసుకుని. ఉన్నాను. ఆ రైలింగ్ పై పెట్టి దూకేద్దాం అనుకున్నాను. అంతలో. ఎక్కడి నుంచి వచ్చిందో. అనేక కథల్లో చెప్పినట్టు అది దేవతా హస్తమేనో నా భుజంపై పడింది. ఆశ్చర్యపోలేదు నేను. నా ఆశ భంగం అయిపోయినందుకు బాధపడ్డాను. ఇంకా వెనుదిరిగి చూడకుండానే ఏ పెట్రోలింగ్ పోలీసో చూసి ఆపాడు, ఆపి నన్ను పోలీస్ స్టేషన్‌కి పట్టుకెళ్తాడేమో. ఎందుకంటే ఆత్మహత్య కూడా శిక్షించబడే నేరం కాబట్టి. ఇవన్నీ కూడా మైక్రో సెకండ్స్ వ్యవధిలోనే జరిగిపోయాయి. ఆలోచన రావడం, ఆశ భంగం అవ్వడం, వెనక్కి తిరిగి చూడడం. వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా ఒక స్త్రీమూర్తి. వయసు 20 నుంచి 25 మధ్య ఉండొచ్చు. చాలా చక్కని రూపం, అందమైన ముఖం, జాలి ఉట్టిపడేలాంటి కళ్ళు. ఆమె కళ్ళు నన్ను సూటిగా చూస్తున్నాయి. అవి నా మనసులోకి తొంగి చూసినట్టు, నా భావాలన్నీ చదివేసేటట్టు ఉన్నాయి. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె చూపు నన్ను కూడా ఏం మాట్లాడనివ్వలేదు. అక్కడి నుంచి నన్ను కొంచెం దూరం నడిపించుకుంటూ తీసుకెళ్లింది. ఇంకా మాటలు లేవు. అసలు ఆ సమయానికి ఆమె అక్కడ ఎందుకు ఉందో నాకు తెలీదు. చిన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది, మనల్ని రక్షించడానికి గార్డియన్ ఏంజెల్స్, దేవదూతలు ఉంటారని చెప్పి. వాళ్లు అప్పటివరకు కనిపించరు గానీ, అవసరమైనప్పుడు వివిధ రూపాలను సంతరించుకొని మనల్ని ఆదుకుంటారని చెప్పేది. మే బీ ఆ దేవదూత ఈమెనేమో. అసలు చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితిలో నేను లేను. ఎక్కడికి వెళ్తున్నానో, ఆమె నన్ను ఎటు తీసుకెళ్తుందో తెలుసుకునే పరిస్థితిలో కాదు కదా, తెలుసుకోవాలన్న ఉత్సాహం కూడా లేదు. ఇప్పటికే చాలా రోజులు డిప్రెషన్‌లో గడపడం వలన కాబోలు. అసలు తెలియట్లేదు. దీన్నే ఎపాథీ అంటారని ఎక్కడో చదివాను. దేని మీద ఉత్సుకత గాని ఉత్సాహం గాని లేకపోవడం. అలా ఎంత దూరం నడిచామో తెలియదు. ఒక ఇంట్లోకి ప్రవేశించినట్టు గుర్తు. ఆమెతో పాటు అలా మెట్లెక్కుతూ ఆమె గదిలోకి వెళ్లాను. ఆమె నన్ను గట్టిగా హత్తుకుంది. గుండెలకు దగ్గరగా. అంతవరకు ఎన్నో సంవత్సరాల నుంచి లోలోపల పొరల్లో దాగిపోయిన బాధ, భయం ఏడుపు రూపంలో బయటకు వచ్చాయి. నా ఎపాథీ తొలగిపోయిందేమో. అప్పుడు ఇంకా స్పష్టంగా చూశాను ఆమె వైపు. చదువుకున్న దానిలా ఉంది. మంచి కట్టుబొట్టు ఉన్నాయి. చూడగానే ఒక మధ్య తరగతి యువతిలా కనిపించింది. కానీ ముఖం మాత్రం ఎన్నో ఏళ్ల అనుభవాల్ని దాచి ఉంచినట్టు కనిపిస్తున్నాయి. ఆమె కళ్ళు దైవికంగా ఉన్నాయి. చూడగానే ఆకర్షించే విధంగా ఉన్నది ఆమె ప్రతిరూపం. ఇన్నాళ్ళు నేను డిప్రెషన్‌లో ఎందుకు ఉన్నానో క్రమక్రమంగా ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి. కొన్ని క్షణాల్లోనే గత కొన్ని సంవత్సరాల జీవితం నా కళ్ళ ముందు కదలాడింది.

అలా నేను అనుభవించిన కష్టాలు, నా జీవితంలో ఉన్న కన్నీళ్లు, అన్నీ క్రమం క్రమంగా గుర్తుకు రాసాగాయి. నేను వద్దనుకున్న ఉద్యోగాలు, తర్వాత నన్ను వద్దనుకున్న ఉద్యోగాలు, ఆఖరికి నేను ఇలా నిరుద్యోగిగా మిగిలిపోవాల్సి వచ్చింది. అంతేకాకుండా, ఉద్యోగం పురుష లక్షణం అన్నది నిజమేనేమో, ఎందుకంటే అప్పటివరకు నన్ను ప్రేమించానని చెప్పిన అమ్మాయి కూడా ఉద్యోగాలు రాకపోయేసరికి వేచి చూసి వెళ్లిపోయింది. అంతేకాకుండా, నా అనుకున్న వాళ్లు కూడా నన్ను దగ్గరకు చేర్చుకోబోయేసరికి బాధ అనిపించింది. జీవితానికి ఒక అర్థం లేదనిపించింది. ఏదైనా అర్థం క్రియేట్ చేసుకోవాలన్నా సరే కూడా అసంభవం అనిపించింది. అందుకే ఇక్కడికి వచ్చి నిలబడ్డాను. ఒకసారి, రెండు సార్లు రిజెక్షన్స్‌కి గురైతే పర్వాలేదు. నేను అనుకున్నట్టుగా లోకం లేనప్పుడు, లోకానికి తగినట్టుగా నేను ఉండాలనుకున్నప్పుడు, ఇద్దరికీ ఒకరితో ఒకరికి పని లేదనిపించింది. కానీ ఇలా హటాత్తుగా జరిగిన పరిణామానికి ఏమనాలో, ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. బహుశా చాలా సంవత్సరాలు డిప్రెషన్‌లో ఉండడం వల్లేమో, లేదంటే డిప్రెషన్‌లో ఉన్నానని తెలుసుకోలేకపోవడం వల్ల, క్రానిక్ ఎపాథీకి గురవడం వల్ల, జీవితంలో ఉన్న రుచుల్ని ఆస్వాదించలేకపోతున్నాను. ఇలా అనుకుంటూ అనుకుంటూ ఉండగా, ఆమె గది వచ్చింది. ఇప్పటివరకు ఆలోచనల వల్ల, నా కళ్లల్లో తిరుగుతున్న నీటి వల్ల, ఏ దారిలో వెళ్లానో, ఎక్కడికి చేరుకున్నానో తెలియలేదు. కానీ ఆమె ఆగడం వల్ల నా ఆలోచనలు ఆగాయి, నేను ఆగాను.

ఆ చిన్న రంగులు వెలిసిపోయి ఉన్న గది ముందు, గది తలుపులు తీసి తను లోపలికి రమ్మంది. వెళ్లాను. అక్కడ ఒక మూలగా ఒక మంచం. చుట్టూ అనేక రకాల పోస్టర్స్ ఉన్నాయి, అందమైన పెయింటింగ్స్ ఉన్నాయి. పైన ఒక ఫ్యాన్ తిరుగుతుంది, కిర్రు చప్పుడుతో. బహుశా ఆ ఫ్యాన్‌ని వేసే అలవాటు, ఆపే అలవాటు లేదనుకుంటా, లేదంటే అసలు స్విచ్చే లేదనుకుంటా ఆ గదిలో. అలా ఉంది. చూడ్డానికి చాలా చిన్న గది. రకరకాల వాసనలు వస్తున్నాయి. నేను వాటిని పట్టించుకునే స్థితిలో లేను. బాగా అలసటగా ఉండడం మూలానో, లేదంటే బాధ అంతా కరిగిపోయి కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేసినందుకో, ప్రశాంతంగా అనిపించి నిద్రపోయానేమో. మళ్లీ తెల్లవారే మెలుకువ వచ్చింది. ఆమె ఆ గదిలోనే ఒక మూలగా కూర్చొని కునికిపాట్లు పడుతుంది. నేను లేవడం వల్ల జరిగిన అలికిడికి ఆమె కూడా లేచి దగ్గరికి వచ్చింది. నా పక్కనే మంచం మీద కూర్చుంది. కళ్లలోకి సూటిగా చూస్తూ, “కొన్నేళ్ల క్రితం అదే స్పాట్‌లో నేను నిలబడి ఉన్నాను. కానీ ఇప్పుడు నీ భుజం మీద చెయ్యి పడినట్టు, అప్పుడు కూడా నా భుజం మీద చెయ్యి పడింది. అప్పుడే నేను ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడికి చేరుకున్నాను. నన్ను ప్రేమించాను అన్నవాడు, నేను నిజంగానే ప్రేమించానేమో అని భ్రమపడినవాడు, నన్ను ఈ మహానగరంలో వదిలేసి వెళ్లిపోయాడు. చదువుకున్నాను కూడా నేను. కానీ నా సర్టిఫికెట్లని నాతో పాటు తీసుకురాలేదు. ఎందుకంటే నేను నమ్మినవాడు నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని, నాకింకా ఈ ప్రపంచంలో దేనితోనూ సంబంధం లేదని అన్నిటినీ విడిచిపెట్టి వచ్చేశాను. తీరా చూస్తే నన్ను మోసం చేశాడు. ఎన్ని కథల్లో చూపించినా, ఎన్ని సినిమాల్లో చూపించినా సరే కూడా, మోసపోవడం అనేది, లేదంటే మోసగించడం అనేది మనిషి సహజాతం కావచ్చు. అందుకనే ఎంతమంది చెప్తున్నా, ఎవరేం చెప్తున్నా వినిపించుకోకుండా మోసగించబడుతూనే ఉంటాం. అందుకని ఇక జీవితంలో చేసేదేమీ లేదని నేను కూడా అక్కడే నిలబడ్డా. నా భుజం మీద పడిన చెయ్యి నిన్ను నేను తీసుకొచ్చినట్టుగానే నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చింది. ఆమె నన్ను ఒక కొత్త ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ప్రపంచం చీకటి పడ్డ తర్వాత మాత్రమే జీవం పోసుకుంటుంది. వెలుగుతో పాటు అది కూడా మాయమవుతుంది. చనిపోదాం అనుకున్న నాకు ఇది తప్పనిపించలేదు. నేను నా వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. ఇది ఒక వృత్తిగా మాత్రమే ఫీల్ అవుతున్నాను. అలానే నేను మంచిదాన్నో, నేను చేస్తున్న వృత్తి పవిత్రమైనదో అని చెప్పట్లేదు. కూటి కోసం ఏదో ఒకటి చేయాల్సిందే. నేను చేసేందుకు నా వయసులో ఇది తప్పు కాదేమో అనిపించింది. చిన్నప్పటి నుంచి అనేకమందిని చూస్తూనే ఉన్నాను. మగాళ్లని. వాటన్నిటి నుంచి తప్పించుకుని బతకడం ఒక ఒంటరి మహిళగా కష్టం అనిపించింది. రిసెప్షనిస్ట్‌గా చేద్దాం అనుకున్నా. రెండు రోజులకే నాకు అర్థమైంది, అందరికీ అందరి కళ్లలో ఆకలితో చూసావే తప్ప, ఆదరణతో చూసావు కాదని. ఇంట్లో పాచిపనికి కూడా వెళ్దాం అనుకున్నా. అక్కడ అవే చూపులు, అవే మాటలు, అవే చేతులు. అక్కడ చేసేదేదో ఇలాంటి చోటే చేస్తే సరిపోతుంది కదా అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నా ఆధీనంలో నేను ఉంటాను. ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతికి ఉండాల్సిన అవసరం లేదు. ఇది నా సమర్ధన కాదు. నేను నీకెందుకు చెప్తున్నానంటే, జీవించడం, జీవించి ఉండడం ఒక అవకాశం. దాంతో ఏం చేయాలనేది మన చేతిలో ఉంటుంది. నువ్వు తీసుకోవాలనుకున్న నిర్ణయం తప్పు. దాని ద్వారా నీకు వచ్చేదేమి ఉండదు. ఈ ప్రపంచానికి నువ్వేమీ కావు. నిన్ను గుర్తుపెట్టుకోదు. ఒకవేళ గుర్తుపెట్టుకున్నా, కొన్ని రోజులు మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. దిస్ ఇస్ యువర్ లైఫ్. అండ్ యు హావ్ టు క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ.” అని చెప్పి గది బయటికి దారి చూపించింది.

గదిలో నిశ్శబ్దం అలుముకుంది. బయట ఎక్కడో తెల్లవారిన నగరం మెల్లగా మేల్కొంటోంది. రాత్రంతా కిర్రు చప్పుడుతో తిరిగిన ఫ్యాన్ ఇంకా తిరుగుతూనే ఉంది.

నేను నెమ్మదిగా లేచాను. గది బయటికి అడుగు పెట్టే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను.

ఆమె తన మంచాన్ని సర్దుకుంటోంది.

Exit mobile version