[‘క్రికెటు’ అనే శీర్షికతో 11 పద్య కవితలను అందిస్తున్నారు శ్రీ చిరువోలు విజయ నరసింహారావు.]
1.
బిళ్ళ కర్ర ఆటగ నుండె ఊళ్ల లోన
బ్యాటు,బంతి ఆటగ మారె ప్రస్తుతమున
‘క్రికెటు’ క్రీడగ పేరొంది ‘క్రెడిటు’ బడసె
జగము నందెల్ల వీక్షించు జనులు దీని
2.
దేశ దేశాల ప్రతినిధుల్ తీవ్ర కృషిని
సలిపి, జయము బడయ గోరి నిలుచు వారు
విశ్వ విఖ్యాతి గాంచె నీ ప్రియతమంపు
క్రీడ ,యాసక్తి గాంచు నీ ‘క్రికెటు’ నేడు
ప్రేక్షకుల మది నుత్కంఠ పెరుగుచుండె
3.
బంతి నొక వైపు విసరగా ప్రతిభ తోడ
‘బ్యాటు’తో దాని కొట్టగా పరుగు లిడరె
బంతి పట్టగా యత్నించు కొంత మంది
ఆట ఈ గతి సాగుచు నధిక పరుగు
లందు జట్టు తా గెలుపొందు నమిత ప్రతిభ
4.
బంతి ఎటు వచ్చునో యని పార జూచి
నిపుణుడై కొట్టగా వలె నియమ గతిని
అట్టి బంతిని పట్టగా నతడు ఓడు
ఒక వికెటు పడి, తొలగగా ప్రకటన యగు
5.
కొట్టు నట్టి బంతి బరిని ముట్టె ననగ
నాల్గు పరుగులు లభియించి నడచు లెక్క
బంతి బయట కేగిన నారు పరుగు లబ్బు
పరుగు లెక్కువ యగు జట్టు పడయు గెలుపు
6.
ఇందు కొట్టుట ప్రతిభయో యేమొ, కాక
బంతి పట్టుట ప్రతిభయో, పరగఁగనుడు
నేర్పు, కృషి ఎంత యున్నను, ఓర్పు తోడ
కలసి వచ్చిన కాలమే గెలుపు నిడుట
అనుభవైక వేద్యము గాగ నరయ దగును
7.
కలవు సాంకేతికపు సూత్రములు మరెన్నొ
వాని కనుగుణముగ తీర్పు వచ్చు చుండు
అవును, కాదన లేరు యీ ‘ఎంపయిరుల’
తీర్పు, గౌరవించ వలెను తిరుగు లేక
8.
ఆటగాళ్లకు ధన మెంతొ అందు చుండు
నధిక మొత్తముల విశిష్ట పథకములను
గెలిచినను, ఓడినను కూడ పిలిచి ఇచ్చు
పారితోషికములు గొప్ప పతకములను
హెచ్చు, తగ్గుల ధనముండు నిచ్చు వేళ
9.
ఆటగాళ్లకు లేనట్టి యాత్ర మెంతొ
ప్రేక్షకుల మదిని కలఁచు వీక్ష వేళ
అరుపులను, పలు చప్పట్లు చరచు వారు
గంతు లేయుచు, నెగురుచు, గర్జనలను
చేయుచుందురు ‘స్టేడియం’ చేరినంత
10.
అంతు లేని ఆందోళన నందు చుండి
గెలుచు వారిపై ‘బెట్టింగు’ నిలుపు వారు
సంఘ మందు కల్లోలముల్ సంఘటిల్లు
నేమి జరుగునో యను భీతి నెగురు వారు
11.
ఆట వలన ధన మధిక మందు చుండి
వివిధ శాఖల వారికి వేడ్క గూర్చు
ప్రజలకీ క్రీడ ప్రియమగు పండుగ యగు
అమిత ముదమును, నుత్సాహ మాదరమును
గూర్చు నీ క్రీడ జనులకు కూర్మి బెంచి
21 అక్టోబర్ 1939 న జన్మించిన శ్రీ చిరువోలు విజయ నరసింహారావు ప్రవృత్తి రీత్యా కవి. దుర్గా మహాలక్ష్మి, దుర్గా ప్రసాదరావు గార్లు తల్లిదండ్రులు. ఎం.ఎ. విద్యార్హత. రైల్వే మెయిల్ గార్డుగా ఉద్యోగ విరమణ చేశారు. భార్య సత్యప్రసూన. ముగ్గురు కుమారులు.
15 శతకములు ముద్రితములు. రెండు జీవితచరిత్ర గ్రంథాలు వెలువరించారు. అనువాదాలు చేశారు. నీతి శతకములు, సాయి శతకములు తదితర రచనలన్నీ కలిపి 73.
