[‘కల్చరల్ మార్క్సిజం – మేధో విచక్షణపై యుద్ధం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ బి.ఎస్. శర్మ.]
గత దశాబ్దంగా ‘కల్చరల్ మార్క్సిజం’ పేరు వింటున్నాం. మొదటి సారి ఈ పదం విన్నప్పుడు నాకు కొన్ని సామెతలు గుర్తొచ్చాయి, ‘నేతి బీరకాయ, గగనకుసుమం, వంధ్యా పుత్రుడు, కుందేంటి కొమ్ము’ వంటివి.
ఎందుకంటే ‘కల్చర్’ పై ఏ మాత్రం గౌరవం లేని నాస్తికులైన కమ్యూనిస్టులకు ఈ కల్చరల్ మార్క్సిజం ఏమిటి చెప్మా అనేది నాకున్న ప్రశ్న.
అబ్రహమిక్ మతాలకు ఈ ‘మార్క్సిస్ట్’లకు చాలా దగ్గర పోలికలే ఉన్నాయి. ఒక ప్రవక్త, ఒక పుస్తకం ఉంటాయి అబ్రహమిక్ మతాలకు. ఈ ఎఱ్ఱ మతానికి ఆ మతం వలె ఓ ప్రవక్త ఉన్నాడు – కార్ల్ మార్క్స్. ఓ పుస్తకం ఉంది.. దాస్ కాపిటల్.
వారు ప్రపంచాన్ని రెండుగా విభజిస్తారు. ఉన్నవాళ్లు – లేని వాళ్లు. వాళ్లు స్వర్గం అన్నట్లే – ఎర్రవాళ్లకు ‘మరో ప్రపంచపు ఆశల గగనకుసుమం’ ఉంది.
ఈ మూడు సిద్ధాంతాలు – భూమ్మీద తామే ఉండాలి ఉవ్విళ్ళూరుతూ ఉంటాయి. నమ్మనివారు – నరకానికి పోతారు. నమ్మని వారిని మార్చాలి – కాదంటే ఏమార్చాలి. అలా ఏమారిస్తే 72 మంది కన్యలతో స్వర్గ సుఖాలని వారి సిద్ధాంతం!
‘కల్చర్’ వారి డిక్షనరీలో ఉందా? సంస్కృతిలో మహోన్నత స్థానంలో ఉన్న మన దేశంపై దండెత్తిన ఈ అబ్రహమిక్ మతాలు యుద్ధభూమికే పరిమితం కాలేదు. సాంస్కృతిక కేంద్రాలపై దాడి చేసారు. మన విద్యాకేంద్రాలను తగులబెట్టారు. స్త్రీలను ఎత్తుకుపోయారు. కత్తి చూపి మతాలను మార్చారు. ఈ దాడులు మన ప్రజల మానసిక స్థితి పై కూడా తీవ్ర విషప్రభావం చూపాయి.
భారతీయుల ఆలోచనల్ని అనాగరికలైనవని ప్రచారం చేసిన వారిలో ఈ ‘మూడో మతం’ పాత్ర ఎంతో ఉంది. వారి సిద్ధాంత విస్తరణకి కమ్యూనిస్టు సిద్ధాంత కర్తైన కార్ల్ మార్క్స్‌కి భారతీయ సంస్కృతి అడ్డుగా కనిపించింది. అంచేత దీన్ని నాశనం చేయడానికి కత్తి కొడవలి పట్టారు ఆ దుర్మార్గులు. సనాతన ధర్మంపై ఎనలేని అక్కసు వీరికి.
మార్క్స్ భారతదేశాన్ని నిందిస్తూ – “ఇది ఎదుగు బొదుగూ లేని దేశం. ఓ మెరట ఆటవిక దేశం (barbaric country)” అని అంటాడు.
అంతే కాదు “భారతదేశంలో కమ్యూనిజం ఎదగాలంటే, సిద్దాంతం అభివృద్ధి పథంలో పరుగిడాలంటే, ఇక్కడ సంస్కృతిని, ఆర్థిక స్థితిని సమూలంగా నాశనం చేయాలి” అంటాడు.
కమ్యూనిజం అనే ఈ తేనె పూసిన కత్తికి ఆకర్షితులైన యువత దేశ సంస్కృతికి వ్యతిరేకులై – గన్ను పట్టుకోని, అడవుల్లో దాక్కునే హింసావాదులవుతున్నారు. వర్గశత్రు నిర్మూలమనే జీహాద్/క్రూసేడ్‍లను ఆచరిస్తున్నారు. ఎందరో జాతీయవాదులను వీరు పొట్టన పెట్టుకొన్నారు. నక్సలిజం వల్ల భారత్ ఎంతో నష్టపోయింది. దేశ వ్యతిరేక పోరాటంలో యువత బలి అయ్యింది. వేల కోట్లు విలువ చేసే రాజ్యసంపద నాశనం అయ్యింది.
ఎమర్జెన్సీ తర్వాత మన పై రుద్దబడిన మార్క్సిస్టు సోషలిస్టు భావాల నాయకత్వం వీరికి మరింత ఊతం ఇచ్చింది. 12 అధ్యాయల పుస్తకం ‘కల్చరల్ మార్క్సిజం – మేధో విచక్షణ పై యుద్ధం’ తయారీలో నిరంజన్ గారు ఎంతో పరిశోధన చేసారు. కమ్యూనిజం మూలాలు, దాని విస్తరణను పేర్కొన్నారు క్లుప్తంగా తొలి రెండు అధ్యాయాలలో.
ఈ మారీచ మాయల వల్ల భారతీయులు ఎలా నష్టపోతోన్నదీ గ్రహిస్తాం. అసలు కమ్యూనిజం సిద్ధాంతంలో ఉన్న లోపాలను, వైపల్యాలను మరో నాలుగు పేజీలలో విశ్లేషించారు. “కమ్యూనిజం ప్రధాన వైఫల్యానికి కారణం మానవ స్వభావాన్ని అంచనా వేయటంలో తప్పిదమే.” అంటారు. “వారి రాజకీయ దమనకాండ కారణంగా లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు” అంటూ వాటి వివరాలను 1930 దశకం నుంచి నేటి వరకూ జరిగిన మారణకాండను గణాంకాలలో ఇచ్చారు రచయిత శ్రీ నిరంజన్.
“కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడిన దేశాలలో ఇటవంటి దమనకాండ సర్వసాధారణమయిపోయింది” అంటూ.. దేశాల మధ్య ఉద్రిక్తతలు, సైద్ధాంతిక విభేదాల వల్ల జరుగుతోన్న యుద్ధాలను ఉల్లేఖించారు.
8వ అధ్యాయం ఓ ప్రత్యేకతను సంతరించుకొంది. ఇందులో రచయిత సామాజిక పరివర్తన పేరిట మతం, సంస్కృతి, వారసత్వాల్ని ఎలా హేళన చేయాలో శిక్షణ ఇచ్చే ప్రక్రియని ‘మార్క్సిస్టులు’ ఎలా అమలు పరుస్తున్నారో, విద్యా వ్యవస్థను పతనం చేయటానికి ఎలాంటి కుతంత్రాలు జరుపుతున్నారో, విశ్వవిద్యాలయాల్లో విదేశీ ఏజంట్ల ప్రభావాలు ఎలా ఉంటాయో వివరించారు. అవి చదువుతుంటే ఒకింత ఆశ్చర్యం, భీతి కూడా కలగకపోదు.
వీటిని సూచన ప్రాయంగా బులెట్ పాయింట్లుగా రచయిత ఇవ్వటం వల్ల పాఠకులచే చదివిస్తాయి.
ప్రజాభిప్రాయాన్ని మలచటంలో మీడియా అమలు పరచే దుష్టవ్యూహాలు – ఓ పది వ్యూహాలని ఈ అధ్యాయంలో ఇచ్చారు. ‘అమ్మో..’! ‘వినినంతనె వేగపడక వివరింప దగున్’ పద్యం స్మరణకు వస్తుంది.
పంచ పరివర్తనలో భాగంగా మనం కుటుంబాలను ఒకటి చేయటానికి ఎంతో ప్రయత్నిస్తుంటే – ఈ ధర్మద్రోహాలు.
వివాహ ప్రక్రియ వ్యతిరేకించటం, హిందూ జనాభా తగ్గేలా పిల్లను కనటం (DINK) మానుకునేలా యువతను ప్రేరేపించటం, కుటుంబ వ్యవస్థను అపహాస్యం చేసే ‘రీల్స్’ చేయటం, సహజీవనం, అక్రమసంబంధాలను ప్రచారం చేయటం – చదువుతోంటే జుగుప్స కలుగుతుంది. కమ్యూనిస్టు నియంత్రణలోని మీడియా ‘ఫ్రీ సెక్స్’ను ప్రోత్సహించిన ఉదాహరణలు – సామాజిక కట్టుబాట్లపై దుష్ప్రచారం – స్త్రీ పురుషుల మధ్య ద్వేషం పెంచేలా, విడాకులను ప్రోత్సహించేలా సకల ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో విపులంగా వివరించారు. దీనికి ఆధారంగా ఎన్నో గ్రంథాలను, వ్యాఖ్యాలను సాక్షిగా చూపారు.
భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థను ఓ బూచిగా చూపి – వారి మధ్య వైషమ్యాలను పెంచేలా కుట్రలు పన్నటం – రిజర్వేషన్ల పేరిట – నియో దళిత్ పేరిట ఈ కల్చరల్ మార్క్సిజం చేస్తొన్న కుట్రలన్నీ ఈ అధ్యాయంలో ఇచ్చారు.
విలువలలో మార్పు, రాజకీయ సంఘర్షణలు – సాహిత్యంపై ప్రబావాలు – 9వ అధ్యాయంలో విపులంగా ఇచ్చారు.
ఇక్కడే CAA వ్యతిరేక నిరసనలు, రైతుల ఆందోళనలు, లింగాయత్, పటేల్, జాట్ – రిజర్వేషన్ల డిమాండ్లు – భాషాపరమైన కోట్లాటలు ఈశాన్య రాష్ట్రాలలో (‘మర్కటమదిరాపానాదిన్యాయం’) వేర్పాటు ఉద్యమం- ఉత్తర దక్షిణ
చర్చగోష్ఠులు – ఇవన్నీ వామపక్ష ప్రేరితాలే. జాగ్రత్తగా గమనించాలి! ఫేజ్ I, II, III గా తమ ఎజెండాను ఎలా అమలు పరుస్తారో, ఇంకా ముందు ముందు ఏ విపత్తులు రానున్నాయో తెలియజేసారు.
వోకిజం అనే వికృతి – క్వీర్ థియరీ ద్వారా, క్రెన్ ఫా ఆలోచనలు, సిద్ధాంతాలు – ఎంత ప్రమాదాన్ని తెచ్చి పెడతాయో!
జాతి వివక్ష, లింగ వివక్ష, స్వలింగ సంపర్కుల హక్కులు – విద్యరంగంలో విభజన సిద్ధాంతాలు – నగరాలలో ప్రవేశించాయి. ఒకే Toilet – నేను ఏ gender అనేది నేను decide చేసుకొంటాననే వికృతులు – కల్చరల్ మార్క్కిజం విషవృక్షానికి పుట్టిన విషఫలాలు!
***
వేలాది సంవత్సరాలుగా విజయవంతంగా ఉన్న భారతీయ సంస్కృతి మూలాలను సవాలు చేసి, విచ్ఛిన్నం చేసే దిశలో ఈ కుట్రలు ఉన్నాయి.
హిందూ జీవన మూల్యాలను భూస్థాపితం చేయాలని వీరి ప్రయత్నం.
10వ అధ్యాయంలో వోకిజంపై విస్త్రృతం సమాచారం అందించారు. విష సంస్కృతిలో సృష్టించబడ్డ కొత్త పదాలను (82) రచయిత పరిచయం చేసారు.
చివరి అధ్యాయంలో మనం ఏం చేయాలో వివరించారు. అది ఒకటికి రెండుసార్లు చదవాలి!
శత్రుబోధ ముఖ్యం – మార్క్సిస్టు సిద్ధాంతంపై అవగాహాన – ఇలాంటి మారీచ మాయలుంటాయని పెద్దలు తెలుసుకొని, వారి సంతతికి తెలియజేయాలి.
సమాజ హితైషులు తమ సమయాన్ని కేటాయించి పాఠశాలలు, కళాశాలలను పర్యటించి భారతీయ జీవన మూల్యాలను గురించిన ఎరుక కల్పించాలి. కుటుంబ వ్యవస్థను పరిరక్షించే ప్రక్రియలు చేయాలి.
డిజిటల్ వేదికల ద్వారా వాస్తవ సమాచారం ప్రజలకు చేరువ చేయాలి.
ఈ 98 పేజీల చిన్న పుస్తకం ప్రతీ అక్షరం చదవాలి. చదివించాలి. చర్చించాలి. యువతకు ఈ సిద్ధాంతాల మాయాజాలం బ్రెయిన్ వాషింగ్ కావించబడే ప్రమాదాన్ని చెప్పాలి!
సాంస్కృతిక పునాదాలపై ప్రగతి సౌధం నిర్మించటం తద్వారా భావితరాలకు మార్గదర్శనం చేయటం ప్రధానం అంటూ శ్రీ నిరంజన్ బి. పూజార్ ఈ పుస్తకాన్ని ముగించారు. ఆంగ్లంలో వెలువడిన ఈ పుస్తకాన్ని సరళమైన సులభమైన శైలిలో ప్రఖ్యాత సీనియర్ జర్నలిస్టు తెలుగులోకి అనువదించారు.
పుస్తకంలో ముందుమాట అందిచిన అఖిల భారతీయ సంయోజిక్, ప్రజ్ఞాప్రవాహ్ – జె. నందకుమార్ గారు చెప్పినట్లు ఈ పుస్తకం ద్వారా స్టాలిన్ ప్రవచించిన ‘క్లాసికల్ మార్క్సిజం’ బాహ్యరూపం నుంచి ‘కల్చరల్ మార్క్సిజం’ అనేది ఎలా రూపాంతరం చెందిదో, దాని వల్ల సాంస్కృతిక నాగరిక సామాజిక విలువలు ఎలా నాశనం అవుతున్నాయో అవగాహన చేసుకోవచ్చు.
***
ఆంగ్లం: డా. నిరంజన్ బి. పూజార్, తెలుగు: వేదుల నరసింహం
ప్రచురణ: సంవిత్ ప్రకాశన్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, సికిందరాబాద్.
పేజీలు: 96
వెల: ₹ 130/-
ప్రతులకు:
అజేయమ్ స్ట్రాటజీ అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్.
ఫోన్: 8520999582
~
ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/Cultural-Marxism-Telugu/dp/8199156791
