[మనోజ్ కుమార్ నీలం గారు రచించిన ‘దాగిన స్నేహం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
ఈ భూమి మీదికి మనం పుట్టినప్పటినుంచి ఎన్నో బంధాలు మొదలవుతాయి.
అది అమ్మా నాన్న, ఇంకా చెప్పాలంటే తాతయ్య అమ్మమ్మ, పిన్ని బాబాయ్, అత్త మామ, అంకుల్ ఆంటీ, వాళ్ల పిల్లలు. వీళ్ళందరూ పరిచయం అవటానికి ఏదో ఒక బంధం మొదలవుతుంది. అందుకేనేమో వాళ్ళని బంధువులు అంటారు.
కానీ తెలియకుండానే మన అనుకునే ప్రపంచంలోకి వచ్చి మనకు బాగా సొంతమై మనకు బాగా దగ్గరవుతారు. మనకోసమే ఉంటారు వాళ్ళనే స్నేహితులంటారు.
అట్లాంటిదే ఓ ఇద్దరి స్నేహితుల కథ ఇది.
***
ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరి పేరు గణేష్, ఇంకొకరి పేరు మనీత్.
గణేష్‌కి కళ్ళు లేవు, చేతులు కూడా సరిగ్గా లేవు. అతనిని జాగ్రత్తగా చూసుకునేవాడు మనీత్.
రోజు ఉదయం గణేష్‌కి బ్రష్, స్నానం చేయించి, టిఫిన్ తినిపించి, రోజు ఏదో ఒక పని చేయడానికి వెళ్లేవాడు మనీత్.
అలా రోజులు గడుస్తుండగా రోజు లానే పని ముగించుకుని వచ్చిన మనీత్, గణేష్ కి అన్నం తినిపించి పడుకో పెడుతూ, “నాకు జ్వరంగా ఉంది గణేష్” అని చెప్పి పడుకున్నాడు.
ఉదయం అవుతుంది. రోజులానే నిద్ర లేచిన గణేష్ మనీత్‌ని పిలిచాడు
ఎంత పిలిచినా పలకడు మనీత్.
గట్టి గట్టిగా అరుస్తూ, “మనీత్ నాకు ఆకలి అవుతుంది త్వరగా రా” అని పిలిచాడు గణేష్.
ఎంత పిలిచినా మనీత్ ఉలకడు పలకడు.
కిటికీ వైపు తల తిప్పి “ఎవరైనా బయట ఉన్నారా?” అని అరిచాడు గణేష్.
ఆ అరుపులు విన్న పక్కింటి పెద్దాయన గబగబా వచ్చి “ఏంటి గణేష్, అలా అరుస్తున్నావ్?” అని అడుగుతూ అటుగా పడుకున్న మనీత్‍ని చూసి తట్టి పిలిచాడు.
ఎంత పిలిచినా లేవడు మనీత్.
మనీత్ చనిపోయాడని గణేష్‌కి చెప్పాడాయన.
బోరున గట్టి గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు గణేష్
అలా సమయం గడుస్తూ ఉండగా, కొంతమంది డాక్టర్స్ వచ్చి “మనీత్ బతికి ఉన్నప్పుడు, ‘నేను చనిపోయాక, నా కళ్ళని నా స్నేహితులైన గణేష్‌కి పెట్టండి’, అని చెప్పాడు” అని తెలియజేస్తారు.
ఆ మరుసటి రోజే ఆపరేషన్ చేసి మనీత్ కళ్ళని గణేష్‍కి పెట్టారు.
గణేష్ హాస్పిటల్‌లో ఉన్నాడు. తనని పలకరించడానికి వచ్చిన వాళ్ళందరితో, “మనీత్‌ని చూడలేదు. దయచేసి మీ దగ్గర మనీత్ ఫోటోలు ఏమైనా ఉంటే నాకు ఒకసారి చూపించండి” అని అడిగాడు.
గణేష్‌ని చూడడానికి వచ్చిన ఒక వ్యక్తి, “మీరు ఇద్దరూ నా పెళ్ళిలో కలిసి దిగిన ఫోటో ఉంది. నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వచ్చినప్పుడు నాకు చెప్పు. నేను ఆ ఫోటోని మీ ఇంటికి తీసుకొస్తా” అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంటికి వచ్చిన గణేష్ ఫోటో తీసుకువస్తా అని చెప్పిన ఆ వ్యక్తికి కబురుచేసి, ‘నేను ఇంటికి వచ్చేసాను, ఆ ఫోటో తీసుకుని రా’ అని చెప్పాడు.
ఆ ఫోటో తీసుకువస్తా అని చెప్పిన వ్యక్తి కోసం రోడ్డు వైపు చూస్తూ ఉన్నాడు గణేష్.
కాసేపటికి ఆ వ్యక్తి వస్తూ కనబడతాడు. అతనిని చూసి కొంచెం ఫాస్ట్‌గా అతని దగ్గరికి వెళ్లి ఆ ఫోటో తీసుకొని చూసి, గట్టిగా ఏడుస్తూ, మనీత్ సమాధి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళాడు గణేష్.
ఎందుకో తెలుసా..
ఎందుకంటే మనీత్ ఒక చెయ్యి, ఒక కాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ విషయం మనీత్ ఎప్పుడూ గణేష్‌కి చెప్పలేదు
***
“పరిచయం
మదిలో ఉండాలి అనుకున్నా
కానీ మధ్యలోనే ముగిసిపోయింది
కలకాలం ఉండాలి అనుకున్నా
కానీ కన్నీటితో కలిసిపోయింది
ఇట్లు
మను..”
అని మనీత్ చెప్తున్నట్టు అనిపించింది గణేష్‌కి.
