[శ్రీ పొన్నాడ సత్య ప్రకాశ రావు గారు రచించిన ‘దానకర్ణుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
“గరుడగమన తవ చరణ..” సెల్ రింగ్టోన్ పిలుస్తుంది. చూశాను. శ్రీకాంత్.. పలికాను..
“నేనేరా.. విజయవాడ వస్తున్నాను” అన్నాడు.
“వెల్కం. ఎప్పుడు?” అడిగాను.
“ఇంకో గంటలో” అన్నాడు. వాడుండేది హైదరాబాదులో. పదిహేను రోజుల క్రితమే అమ్మాయి దగ్గరకు అమెరికా వెళ్ళి వచ్చాడు. తరచూ కలుస్త్తూనే ఉంటాం. వాడే ఎక్కువగా వస్తూంటాడు. అమెరికా వెళ్ళకముందు కలిసాం. ఎనిమిది నెలలయింది. మొన్ననే అమెరికా నుంచి వచ్చాడు కాబట్టి నెల తరువాత కలవొచ్చనుకున్నాను. అదేమాట అన్నాను. “జెట్‌లాగ్ తీరిందా” అని కూడా అడిగాను.
“ఆ.. ఓసారి కలుద్దాం అనిపించింది. వందే భారత్ ఎక్కేసాను. చిన్న పని కూడా ఉందనుకో” అన్నాడు.
“సరే! స్టేషన్‌కి వస్తున్నా” అని బయలుదేరాను, వాడు వద్దంటున్నా.
***
చెయిర్ కార్లోంచి దిగాడు. వాడిని పలుకరించి ఇంకా లోనికి చూడసాగాను. వాడి శ్రీమతి కోసం.
“నేను ఒక్కడినే వచ్చానురా” అన్నాడు.
“అరె! ఏం రాజేశ్వరి రాలేదేం?” అని అడిగాను.
“వచ్చేవారం వాళ్ళ పిన్నిగారి అమ్మాయి పెళ్ళి ఉంది. బట్టలు కొనడం వంటి పనులన్నీ తనే నెత్తిన వేసుకొంది. బిజీ. తనకి రావడానికి కుదరలేదు..” అన్నాడు.
నేను నవ్వి “నీలాగే” అన్నాను. ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా వాళ్ళిద్దరూ ముందుంటారు మరి. వాళ్ళిద్దరూ వస్తున్నారనుకొని నేను స్టేషన్‌కి ఆటోలో వచ్చాను. స్కూటర్ తేలేదు. బయటకు వచ్చి ఆటోని పిలిచా. నూటయాభై అడిగాడు ఆటోవాలా.. మా ఇల్లు పెద్ద దూరం కాదు. ఎనభై తప్పితే వంద అంతకన్నా అవ్వదు. “చాలా ఎక్కువ” అని ఇంకో ఆటోకేసి చూడబోయాను. “నూట ముప్పై తీసుకో” అనేసాడు శ్రీకాంత్. వాడు పరమ సంతోషంగా ఫీలయ్యి నాకేసి అదోలా చూసి “రండి సార్” అన్నాడు. బయలుదేరేం. కాసేపు ఆగితే ఎనభైకి కాకపోయినా వంద రూపాయలకి మరొక ఆటో దొరికేదే.
***
ఇక్కడ మా కాంతుడి గురించి చెప్పాలి. వాడో దానకర్ణుడు. సాధారణంగా ఎక్కడా బేరాలు ఆడడు. ఆడితే ఇలాగే ఉంటుంది. “వాళ్ళూ బ్రతకాలి కదరా” అంటాడు. “మనమూ బ్రతకాలి కదరా బేరం ఆడేడు అంటే మధ్యతరగతి వాడనేగా. వున్నత తరగతి కాదుగా” అంటాను నేను. నేను ఆ దూరానికి ఎనభై లేదా వంద ఇస్తుంటాను. ఊబర్ ఆటో అయితే ఇంకా ఓ పది తక్కువే ఉంటుంది. “ప్రతివాడూ, రిక్షావాడయినా చిన్నచిన్న వస్తువులనమ్ముకొనే వాడయినా కొత్త మొహం ఎదురయితే చాలు పది రూపాయలు తీసుకోవలసిన చోట ఇరవై తీసుకొంటుంటారు. మళ్ళీ పీడిత తాడిత ప్రజల జాబితాలోకి చేరుకొని తమని ఇంకెవరో దోచేస్తున్నారంటూ వాపోతారు. అవకాశం వస్తే దోచేసేవారే అందరూ.. రిక్షావాళ్ళయిన సరే! బడా బిజినెస్ వాళ్ళయినా సరే! తమ చోట్లోకి క్రొత్త ముష్టివాళ్ళను కూడా రానివ్వరు సీనియర్ ముష్టివాళ్ళు. రాజకీయ నాయకుల సంగతి చెప్పనక్కరలేదు. నేను ఇలా అంటే.. “వాళ్ళవి చిన్న బ్రతుకులు కదరా. కోట్లకి పడగలెత్తిన వాళ్ళళ్ళోనే లేని దాతృత్వం, నిజాయితీ వీళ్ళళ్ళో ఎక్కడుంటుంది? ముందు బలిసిన జలగలని పట్టుకోవాలి” అనేవాడు.
“తప్పు చిన్నదయినా పెద్దదయినా తప్పు తప్పే కదరా” అంటాను నేను. నవ్వేసేవాడు.
“పెద్ద పెద్ద మాల్స్ కూడా ఉప్పు, పచ్చిమిరపకాయలు కూడా అమ్ముకొంటూ ఉంటే చిన్న కిరాణా కొట్లవాళ్ళ పరిస్థితి ఏమిటిరా.. ఆలోచించవా” అంటాడు.
ఇల్లు చేరుకొన్నాం. టిఫిన్, టీ తెచ్చింది శ్రీమతి. “ట్రైన్‍లో టిఫిన్ ఇచ్చార్రా” అంటున్న వాడి ముందుకు ప్లేట్‌ని తోసాను, “మేము తినలేదు. నీ కోసం చూస్తున్నాం” అంటూ.
ఇంతలో “బొబ్బాసకాయలు, కండెలు” అంటూ బుట్ట నెత్తిన పెట్టుకొని అమ్ముకొనే ఆడమనిషి ఇంటి ముందు నిలబడి అరిచింది. మేము గతంలో ఆమె దగ్గర తీసుకొనే వాళ్ళం. తరువాత మానేసాం. రెండుసార్లు అరచి “ఏందో.. ఈ మధ్య అమ్మగారు తీసుకోవటం లేదు” అని ఆఖరిసారి పిలిచి వెళ్ళిపోయింది.
“ఈవిడ బయలుదేరినప్పుడు బుట్టనిండుగానే ఉంటాయేమో! మా దగ్గరికి వచ్చేసరికి ఓ నాలుగయిదు కాయలు మిగులుతాయి. ఎంపుళ్ళయి పోయుండటం చేత మిగిలినవి అంతగా బాగుండేవి కావు. మేము బయటికి వెళ్ళినప్పుడు షాపుల్లో రాశిగా పోసిన కాయలలోంచి బాగున్నవి ఇంకా తక్కువ ధరకే ఎంచుకోవచ్చు. అందుకని ఈమె దగ్గర తీసుకోవడం మానేసాను. డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు నాణ్యత కూడా చూడాలిగా. ఏదో పాపం అని ఆ అమ్మాయి దగ్గరే కొనాలంటే నాణ్యత గల పండ్లు దొరకటం లేదు. ఒక విధంగా ఆమె ఓ వినియోగదారుడిని పోగొట్టుకొంది. ఆ మేరకు సంపాదన తగ్గి ఉండొచ్చు. కాని అది నా తప్పా? నాకు ఆవిడ దగ్గర ఛాయస్ లేదు. నాణ్యత లేదు. నావీ డబ్బులేగా” అని వాడగకపోయినా వివరణ ఇచ్చాను! ఏమంటాడో అనుకొన్నాను. కానీ “అవును. అన్ని షాపులు తిరిగి ఎక్కడ తక్కువ ధరకు నాణ్యత గల వస్తువు దొరుకుతుందో కంపేరు చేసుకొని కొనాలి. డబ్బులు ఎవరికీ ఊరికే రావుగా” అన్నాడు నవ్వుతూ. హమ్మయ్య అనుకొన్నాను. వాతావరణం తేలికపడింది.
భోజనాలు కానిచ్చాక “కాసేపు రెస్ట్ తీసుకో. సాయంత్రం బయటికెడదాం” అన్నాను. తెల్లవారు ఝామునే లేచి ప్రయాణం చేసి వచ్చాడేమో వాడికి వెంటనే నిద్ర పట్టేసింది. వాడి గురించి చెప్పాలంటే వాడు నా డిగ్రీలో క్లాసుమేట్. ఇద్దరం రిటైర్ అయిపోయాం. నా భార్య గృహిణి. వాడి భార్య ఉద్యోగస్తురాలే. కొంచెం ఆర్థికంగా ఒక మెట్టు నాకన్నా ఎక్కువే. ఇద్దరికి పెన్షన్లు వస్తాయి. అమ్మాయి, అల్లుడు అమెరికాలో, కొడుకు, కోడలు పూనాలోనూ ఉద్యోగాలు చేసుకొంటున్నారు. వీళ్ళు హైదరాబాద్లో ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. కారు, స్కూటరూ ఉన్నా వీడు ఎక్కువగా సైకిలే వాడుతుంటాడు. యోగ గట్రాలు చేస్తుంటాడు. పూజలు పునస్కారాలూ ఎక్కువే. దానధర్మాలు విధిగా చేస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందులు లేని మాట నిజమే. అయినా ఉన్నంతలో అడిగిన వాడికి అడగని వాడికి కూడా తృణమో ఫణమో సహాయం చేస్తుండటం అతనిలోని సుగుణం. అతడి భార్య రాజేశ్వరి కూడా అంతే. దానం చేయగల స్తోమత ఉండి కూడా పైసా విదల్చని వాళ్ళు కోకొల్లలు. వారితో పోలిస్తే వీళ్ళిద్దరూ చాలా ఉదార జీవులు.
***
నాకున్న పరిమితుల దృష్ట్యా నేను జాగృత్తగా ఖర్చుపెడుతుంటాను. “అపాత్రదానం మంచిది కాదు” అంటాను.
“మనం ఇచ్చేది ఎంతరా పదీ పరకా. దాంట్లోనే అంత చూడాలా” అంటాడు.
వాడి ఉదార గుణం గురించి చెప్పాలంటే గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తుకొస్తుంటుంది. చాలా సంవత్సరాల క్రితం ఓసారి ఇద్దరం హౌటళ్ళో భోజనం చేస్తున్నాం. సర్వర్ బిల్లు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంతలో కౌంటర్ దగ్గర చిన్న గొడవ. ఓ సర్వర్ ఓ ఇరవై ఏళ్ళలోపు కుర్రాడిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. మేనేజర్ వాడిని బూతులు తిడుతున్నాడు. విషయం కనుక్కొంటే భోజనం చేసి బిల్ కట్టలేదట. అప్పట్లో భోజనం ఇరవై రూపాయలే. “ఇదో అలవాటైపోయింది. దొంగనా కొడుకులికి, హోటల్‌కి వచ్చేముందు పర్స్ ఉందట, భోజన చేసి చూసేసరికి పోయిందట” అంటూ సర్వర్ వాడి మీద చెయ్యి చేసుకొన్నాడు కూడా. మా దానకర్ణుడు గబగబా వెళ్ళి సర్ది చెప్పి “వాడి బిల్లు నేను కడతాను వాడికి వొదిలెయ్యండి” అన్నాడు. ఆ సర్వర్ వాడిని కొట్టడం మానలేదు. “ఈవాళ మీరు కడతారు. వీడు ప్రతిరోజు ఎక్కడోచోట ఇలాగే చేస్తుంటాడు, దొంగనాయాల. మళ్ళీ కనబడితే చంపెస్తా..” అని వదిలేశాడు. “నిజంగానే పర్సు పోగొట్టుకొని వుండొచ్చుగా” అన్నాడు మావాడు. “డబ్బులున్నాయనుకొని హోటల్‌కి వచ్చి తిన్నాక లేవని గ్రహించినవాళ్ళ మొహాలు వేరేగా ఉంటాయి సారు. వీడో దొంగ నా కొడుకు” అన్నాడు మేనేజర్ కూడా. సరే వాడి బిల్లు కూడా కట్టి బయట పడ్డాం. ఇలా ఉంటాయి వాడితో అనుభవాలు. “నిజంగా వాడు సర్వర్ చెప్పినట్లుగా అబద్దమే చెప్పుంటే నాకు ఈ రోజు పోయింది ఇరవై రూపాయేలేగా. కాకపోయింటే ఓ మంచి పనికి ఇరవై రూపాయల పుణ్యం ఖాతాలో పడేదిగా” అంటాడు మా వాడు.
***
సాయంత్రం పూట బయటకు బయలుదేరాం. వాడు వచ్చినప్పుడల్లా గాంధీ నగర్ సెంటర్లో బజ్జీలు తినడం అలవాటు. యథాప్రకారం బజ్జీలు తిని షాపు ముందు నుంచి కదిలాం. ఇంతలో చంకలో పిల్ల, ప్రక్కన పెళ్ళాంతో ఒకడు ఎదురై ‘డబ్బులు పోగొట్టుకొన్నట్టు ఒంగోలు దగ్గర పల్లెటూరుకి వెళ్ళడానికి సాయం చేయమని’ అడిగాడు. నేను “ఒంగోలు వెళ్ళాలంటే పాసెంజర్ ట్రెయిన్ ఎక్కి పోవచ్చు కదా. టికెట్ లేకుండా బోలెడు మంది తిరుగుతుంటారు. ఎలాగో ఎక్కి పోవచ్చు కదా” అన్నాను. “పోనీలేరా.. నిజంగా డబ్బులు పోయాయేమో” నాతో అని.. వాడి చేతిలో యాభై రూపాయలు పెట్టాడు. వాడు కళ్ళకద్దుకొని ప్రక్కకు పోయాడు. “వాడు ఢిల్లీ వెళ్ళాలన్నా నేను ఇచ్చేది ఇంతే ఈ కేసులో. వదిలేయ్. ఎవడి పాపాన వాడే పోతాడు” అన్నాడు.
స్కూటర్ ముందుకు పోనిచ్చాను. “ఏదో పని ఉందన్నావు” అడిగాను. “రేపు చూద్దాంలే.. ఈ రోజు బద్దకంగా ఉంది” అనడంతో కాసేపు అటూ ఇటూ తిరిగి ఇంటికి పోయాం.
***
మరునాడు ఉదయం టిఫిన్ చేస్తున్నాం. మా పనిమనుషులు అంట్లుతోమే ఆమె బట్టలుతికే ఆవిడా మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల నుంచి ఎవరి ఖాతాలో ఎంత పడ్డాయో చర్చించుకొంటున్నారు. “స్కూలు ఫీజ్ కడదామనుకొన్నాను. దొంగ సచ్చినాడు తాగుడికి వాడేసుకొన్నాడు” అని తన మొగుడి మీద చెబుతోంది ఒకామె రెండో ఆవిడతో. ఆ మాటలు మా చెవిన పడుతున్నాయి. “చేతికి కాకుండా స్కూలుకి చెల్లిస్తే బాగుంటుంది కదా” అన్నాడు విషయం అర్థమై. “అది ఒక అంశం మాత్రమే. కానీ ఈ విధంగా డబ్బులు వస్తుండటంతో ఆయా అవసరాలకు సంపాదించుకోవటం మానేస్తున్నారు. ఈ పథకాలు ఆగిపోతే వాళ్ళేమవుతారో ఆలోచించటం లేదు” అన్నాను. “అవును. కానీ పధకాలు ఆగవు. ప్రభుత్వం మారినప్పుడు పథకాల పేర్లు మారుతాయంతే. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా ఇటువంటి నిత్యావసరాలకు డబ్బులొస్తుంటే ఆ మేరకు సంపాదించుకోనక్కరలేదు అనే ధోరణి అలవడే ప్రమాదం ఉన్నది. సంపాదించినా త్రాగేస్తారేమో కూడా. ఏతావాతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది” అన్నాడు.
“కష్టేఫలి. కష్టపడటానికి అందరికి సమాన అవకాశాలు, కష్టానికి తగిన ఫలితం అందేటట్లుగా పథకాలు రూపొందిస్తే బాగుంటుంది. లేదంటే ఉచిత పథకాల వలన సోమరితనం పెరిగిపోతుంది. సోమరి కష్టపడడు. కష్టపడేవాడు అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకోడు. నేర్చుకోడు. దోపిడీకి పాల్పడతాడు. అరాచకం పెరుగుతుంది” అన్నాను. తలూపాడు. హమ్మయ్య అనుకొన్నాను. “నిజానికి ఈ పథకాలన్నీ సామజిక ప్రయోజనం కన్నావ్యక్తుల రాజకీయ ప్రయాజనాల సం రూపొందించబడ్డవే. నిష్ఠూరంగా మాట్లాడాలి అంటే ఇవన్నీ ‘కష్టపడి వండుకొనే వాడికి ఒక కూర, ఆడుక్కొనే వాడికి ఆరు కూరలు’ చందాన ఉంటాయి. నిజాయితీగా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బ్రతికే సామాన్యుడికి ఏ పథకమూ రచించబడలేదు” అనేశాను.
***
టిఫిన్ చేసి వాడి పనిమీద బయలుదేరాం. తనకో ముసలి దంపతుల జంట పరిచయమైనట్లు, వారు కొడుకు దగ్గర ఉంటున్నట్లు, మందులకు కూడా డబ్బులు లేక చాలా కష్టాలు పడుతున్నట్లు చెబితే వాళ్ళకి నెలనెలా వెయ్యి రూపాయలు పంపుతున్నట్లు గతంలో చెప్పాడు. “నేను చేస్తున్నది మంచి పనేనా” అని అడిగాడు కూడా. నా సంగతి తెలిసి “సరే, పంపిస్తున్నావు కదా! పంపించు. నీకు ఎటువంటి బంధం, బాధ్యత లేకపోయినా కేవలం మానవతా దృష్టితో నెలనెలా వెయ్యి రూపాయలు పంపటం అనేది మాత్రం చాలా గొప్ప విషయం” అన్నాను. నిజమే కదా! వాళ్ళు కంకిపాడులో ఉంటున్నారని విజయవాడ వస్తే వాళ్ళింటికి రమ్మనమన్నారని అందుకని ఓసారి కలుద్దామనుకొంటున్నాను అంటే అడ్రస్ పట్టుకొని బయలుదేరాం.
దారిలో నాతో “నువ్వు ఎప్పుడూ అపాత్రదానం అంటూ ఉంటావు. నేను అలా కొన్ని చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ సాయం నాకు చాలా సంతృప్తిని ఇస్తోంది. పాపం ముసలి జంట మాత్రలకేనా సరిపోతోందో లేదో” అన్నాడు.
“మంచిదే. నేను సాయం చెయ్యకూడదు అని అనటం లేదు. నువ్వన్నట్లు మనం ఇచ్చే వందా రెండొందలకు అంత శల్య పరీక్ష చేసే అవసరం లేదు. చెయ్యలేము కూడా. కాని నాకెందుకో మనం చేసే మంచి చాలా సందర్భాలలో వారికీ ఉపయోగపడదు, మనకీ ఉపయోగపడదు అనిపిస్తుంది. పైగా సహాయం తీసుకొన్న వాళ్ళు కృతజ్ఞతా పూర్వకంగా ఉంటారా అంటే అదీ లేదు. నాకు చాలా చేదు అనుభవాలు కలిగాయి. కృతజ్ఞత చూపించడం సంగతి దేవుడెరుగు. ఈ విషయంలో సాయం పొందినవాడు.. ‘ఆ చేసావులే బోడి సహాయం’ అన్నట్లు ఆ మాత్రం వేరేవరైనా చేసి ఉండేవారే అన్నట్లు అసలు తనకి సహాయం చేసే అవకాశం అతను మనకి ఇచ్చి మనల్ని కృతార్థులని చేసినట్లు, ప్రవర్తిస్తున్నారు చాలామంది.. నా అనుభవంలో బోలెడు మంది తగిలారు. అందువలన ఇలా మాట్లాడుతుంటాను” అన్నాను.
“నన్నెందుకు తిడుతున్నావు. గతంలో నేను ఎప్పుడూ నీకు సహాయం చెయ్యలేదు అనేది నాకు ఎంతో ఇష్టమైన సూక్తి” అని చెప్పాను.
సిటీ బస్‌లో కంకిపాడు బయలుదేరాం. “..ఎక్కడకైనా వెళ్ళాలంటే క్యాబ్ లేదా ఆటో అనేవాడివి, సిటీ బస్ వైపు మళ్ళేవేమిటి” అడిగాను.
“అమెరికా వెళ్ళి రావడానికి చాలా అవుతోందిరా. ఆ మధ్య మాకు చిన్న చిన్న ఆపరేషన్లు అయ్యాయి. మెడికల్ బిల్ పెరుగుతోంది. అవకాశం ఉన్నచోట పొదుపు చెయ్యాలిగా. అందుకనే టాక్సీలు తగ్గించాను” అన్నాడు. “అవునులే దానధర్మాలు తగ్గించుకోలేవుగా” అన్నాను.
“పాతవే నడుస్తున్నాయి. కొత్తగాదేన్నీ నెత్తిన వేసుకోవటం లేదు” అన్నాడు. వాళ్ళ ఇల్లు చేరుకొన్నాం.
***
వాళ్ళు ఆశ్చర్యపోయారు. ముసలి జంట, కొడుకు కోడలు, ఇద్దరు పిల్లలు. ఏ సంబంధం లేకపోయినా వాళ్ళకి నెలనెలా వెయ్యిరూపాయలు పంపుతున్న మా దానకర్ణుడుని వాడితో బాటు నన్నూ సంతోషంగా ఆహ్వానించారు. ముసలాళ్లకి తప్ప ఎవ్వరికీ శ్రీకాంత్ తెలియదు. కోడలు కాఫీ తెచ్చి ఇచ్చింది. కొడుకు స్నానం చేస్తున్నాడట. పిల్లలు కాలేజీకి వెళ్ళారట. కుశల ప్రశ్నలయ్యాక ముసలావిడ వాళ్ళ కష్టాలు చెప్పడం మొదలుపెట్టింది. “అవన్నీ ఎందుకే” అని ముసలాయన అంటున్నా మానలేదు. లోపల గదిలో కొడుకు, కోడలు మాటలు కొద్దిగా వినబడుతున్నాయి. మామగారికి నెలనెలా డబ్బులు పంపే ఆయన వచ్చారని మొగుడితో చెబుతోంది కోడలు. కొడుకు బయటకు వచ్చి నన్ను చూసి ఖంగుతిన్నాడు. ఆ విషయం ఎవరూ పెద్దగా గమనించలేదు. మా అబ్బాయి అంటూ ముసలావిడ అతడిని పరిచయం చేసి “బాగా అభిమానవంతుడు.. ఎక్కడ మాట పడడు. ఏదో అన్నారని మొన్ననే ఉద్యోగం మానేసాడు. ఇంకోటి వెతుక్కుంటున్నాడు. బాగా ఇబ్బందిగా ఉంది.” అంటూ ఆ మాటా ఈ మాటా చెబుతూ శ్రీకాంత్ ఇంకా ఎక్కువ అంటే కనీసం మరో వెయ్యి పంపిస్తే బాగుంటుందని సూచించింది. ‘మీకయితే డి.ఏలు అవీ వస్తాయటగా అంటూ ఎక్కువగా వెయ్యి రూపాయలు ఏ విధంగా పంపగలడో’ చెప్పింది. ఈసారి శ్రీకాంత్ ఖంగుతిన్నాడు. నాకు అనేకానేక భావాలతో పాటూ నవ్వు కూడా వచ్చింది. ‘సరే చూస్తా’నన్నాడు. “బాబూ మీరు కూడా కొంచెం సర్దగలరా” అని అడిగింది. నాకు కుదరదని చెప్పేశాను. బయటకు వచ్చి ఇంటి దారి పట్టాం.
***
బయటకు వచ్చాక శ్రీకాంత్ “ఏంట్రా మనుషులు ఇలా ఉన్నారు? నాలుగేళ్ళ బట్టి డబ్బులు పంపుతున్నాను. మొదటిసారి వాళ్లింటికి వెళ్ళాను, వెంటనే ఇంకా ఎక్కువ డబ్బులు పంపమని అడిగేసెరేంటి? పైగా మనకి డి.ఏ లు వంటివి వస్తాయట వాళ్ళకి మరో వెయ్యి రూపాయలు పంపగలమట. నా బడ్జెట్ కూడా వాళ్ళే వేసేస్తున్నారేమిటి?” అన్నాడు శ్రీకాంత్. మోహంలో అసంతృప్తి కనిపిస్తోంది. నాకు నవ్వొచ్చింది.
“చూడు నువ్వేమో పాపం ఖర్చులు పెరుగుతున్నాయని టాక్సీ మానేసి సిటీ బస్‍లో తిరుగుతున్నావు. ఇలాంటి సహాయాలు కొంచెం తగ్గించుకొంటే క్యాబ్‍లలోనే తిరగగలవు. కానీ నువ్వు దానధర్మాలు తగ్గించుకోకుండా సుఖాలను త్యాగం చేస్తూ నువ్వు ఇద్దామనుకొన్న వెయ్యిరూపాయలు ఇస్తున్నావు. కానీ వాడు చూడు, ఆ ముసలాయన కొడుకుని నేను గుర్తుపట్టాను. నా ఫ్రెండ్ కంపెనీలో పని చేసేవాడు. పని సరిగ్గా చెయ్యడు సరి కదా, కొంచెం డబ్బులు కూడా తినేసాడని మా ఫ్రెండ్ వాడిని నానామాటలు అని ఉద్యోగంలోంచి తీసేసాడు. కానీ ఇంట్లో అలా చెప్పడు. వీడి పని చూసి గిట్టని వాళ్ళు యజమానికి పిర్యాదు చేస్తే తీసేశాడనే చెబుతాడు. వాడికి స్థిరమైన ఉద్యోగం లేకపోవడం కారణం వాడికి స్థిరత్వం, నిబద్దత లేకపోవడం. దానికి ఆ ముసలావిడ ‘మా అబ్బాయికి స్వాభిమానం ఎక్కువ ఎవరితోనూ మాట పడడు’ అని కలరింగ్ ఇస్తోంది. విషయం తెలిసో తెలియకో మరి” అన్నాను.
‘నిజమా’ అన్నట్లు చూసాడు. నేను తలుపుతూ “పని చేసినా బాస్ అనేవాడు ఏదో ఒకటి అంటాడు. తప్పదు ఒక్కోసారి. మనం ఈ మాటలు పడుతూనే కదా సర్వీస్ పూర్తి చేసింది.” అన్నాను. తలూపాడు.
“వాళ్ళ కుటుంబం చూడు, సరే ముసలాళ్ళని వదిలేయ్. ఆవిడ పుత్రరత్నం నమ్మకంగా పనిచేసుంటే మా ఫ్రెండ్ ఇంకా జీతం పెంచేవాడే. వీళ్ళు పని చెయ్యరు. సినిమా కష్టాలు చెబుతారు. కోడలు కూడా ఏదో ఒక షాపులో పనిచేసుకోవచ్చు. ఉదయం పూట పేపర్ బాయ్‌గా పనిచేస్తూ చదువుకొంటున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అలా వాళ్ళ పిల్లలూ పని చేయవచ్చు. వీళ్ళు చూసే సినిమాలలో హీరో రిక్షా త్రొక్కి లక్షలు సంపాదించడాన్ని సినిమాటిక్‌గా చూడకుండా అక్కడ ‘కష్టపడటం’ అనే అంశాన్ని తీసుకోరు. వాళ్ళు పరిస్థితి మెరుగుపర్చుకోవటానికి వాళ్ళు ఏమీ చెయ్యరు. పైగా నువ్వు మరో వెయ్యి అదనంగా ఎలా పంపగలవో చెబుతున్నారు. ఇంకా మీ ఇద్దరికీ పెన్షన్లు వస్తాయట.. డిఏలు వస్తాయి కదా అని కూడా ఆరాలు తీస్తోంది. మనకుంటే వాళ్ళకివ్వాలా? నీ కష్టాలకి ముందు నీ వంతు ప్రయత్నం చేస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇంకొకరి దగ్గర చేయి చూపాలనేది నా అభిమతం” అన్నాను.
“నిజం.. అసలు పంపే వెయ్యి రూపాయలు కూడా ఆపేయాలని ఉంది. కాని ముసలాయన కోసం పంపుతాను. ఎక్కువగా ఇచ్చేది లేదు” అన్నాడు మా దానకర్ణుడు.
“మంచి నిర్ణయం” అన్నాను.
పొన్నాడ సత్య ప్రకాశ రావు కథకులు, కవి. వీరివి ఇప్పటి వరకు 1 నవల, 4 ధారావాహికలు, 78 కథలు, 150 కి పైగా కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించబడినవి. వీరి నవల ‘ఊరు పొమ్మటోoది’ 2002 సంవత్సరం స్వాతి మాస పత్రిక అనిల్ అవార్డును,. మరి పది కథలు వివిధ పోటీలలో బహుమతులు ను గెలుచుకొన్నవి. వీరి నవలను సాహితీ ప్రచురణల వారు విజయవాడ, కథల సంపుటాన్ని చినుకు ప్రచురణల వారు విడుదల చేసారు .వీరికి విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్, ఎలకుర్రు వారు 2023 సంవత్సరానికి ‘విశ్వదాత’ దేశోద్దారక నాగేశ్వర రావు పురస్కారాన్ని అందచేశారు.
