[శ్రీ రమణ బంధకవి గారి ‘దానం అంటే ఇచ్చేయడమేనా?’ అనే ఆధ్యాత్మిక వ్యాసాన్ని అందిస్తున్నాము.]
మన దగ్గర ఉన్నదాన్ని మరొకరికి ఇచ్చినప్పుడు దానమైపోతుందా? ఇంట్లో వాడని వస్తువు ఇచ్చాం, కొంత డబ్బు ఇచ్చాం, అవసరంలో ఉన్నవారికి సాయం చేశాం, ఇవన్నీ దానమే. కానీ దానం గొప్పతనం, ఇచ్చిన వస్తువులో ఉందా? లేక ఇవ్వడానికి మనం వదులుకున్న దానిలో ఉందా? పురాణాల్లో దానానికి రెండు అసాధారణమైన ఉదాహరణలు కనిపిస్తాయి.
శిబి చక్రవర్తి దగ్గరకు ఒక పావురం వచ్చి శరణు కోరింది. దాని వెంట వచ్చిన డేగ, తన ఆహారాన్ని తనకు ఇవ్వాలని అడిగింది. ఒకవైపు శరణు కోరిన జీవిని కాపాడాలి, మరోవైపు డేగకు ఆహారం కావాలి. శిబి తన శరీరంలోని మాంసాన్ని పావురం బరువుకు సమానంగా కోసి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. చివరకు తన శరీరాన్నే తూకంలో ఉంచాడు.
మరో కథ దధీచిది. దేవతలకు వృత్రాసురుడిని ఎదుర్కోవడానికి ఒక శక్తివంతమైన ఆయుధం అవసరమైంది. అది దధీచి మహర్షి ఎముకలతోనే తయారవుతుందని తెలిసింది. తన శరీరం లోకరక్షణకు ఉపయోగపడుతుందని తెలిసి, ఆయన తన ప్రాణాలనే త్యాగం చేశాడని పురాణగాథ చెబుతుంది. ఇక్కడ దానం ఒక కొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది. మనకు మిగిలినదాన్ని ఇవ్వడం ఒక స్థాయి అయితే, మనకు విలువైనదాన్ని ఇవ్వడం మరో స్థాయి. ఇక మన సౌకర్యాన్ని కూడా వదిలి పరులకు ఉపయోగపడడం త్యాగానికి దగ్గరైన స్థాయి.
మన జీవితంలో శిబిలా శరీరాన్ని, దధీచిలా ప్రాణాలను ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ చిన్న చిన్న త్యాగాలతో చేసే దానాలు మన చుట్టూ ఎన్నో కనిపిస్తాయి. రిటైర్ అయిన ఒక వైద్యుడు వారానికి ఒకరోజు తన విశ్రాంతి సమయాన్ని వదులుకుని ఏదైనా స్వచ్ఛంద సంస్థలో పేదలకు ఉచితంగా వైద్యం చేస్తుంటాడు. అతను వైద్యంతో పాటు తన సమయాన్ని దానం చేస్తున్నాడు. రిటైర్ అయిన ఒక ఉపాధ్యాయుడు టీవీ చూస్తూ, స్నేహితులతో సరదాగా గడిపే సాయంత్రం సమయంలో పేద పిల్లలకు ఉచితంగా పాఠాలు చెబుతుంటాడు. తనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకరి భవిష్యత్తు కోసం పంచుతాడు. మరో వ్యక్తి ప్రతి నెలా ఒక రోజు ఆసుపత్రిలో ఒంటరిగా ఉన్న రోగులకు తోడుగా ఉంటాడు. అతను డబ్బు ఇవ్వకపోవచ్చు. కానీ ఆ రోజు తన వ్యక్తిగత పనులను పక్కన పెడతాడు. ఇవన్నీ పెద్ద త్యాగాలుగా కనిపించకపోవచ్చు. కానీ వీటిలో ఒక గమనించవలసిన విషయం ఉంది;
తమకోసం ఉపయోగించుకోగలిగిన సమయం, జ్ఞానం, శక్తి, సౌకర్యంలో కొంత భాగాన్ని ఇతరుల కోసం విడిచిపెట్టడం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు:
“దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే।
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్॥”
“ఇవ్వాలి” అనే భావంతో, ప్రతిఫలం ఆశించకుండా, తగిన సమయంలో, తగిన చోట, తగిన వ్యక్తికి ఇచ్చే దానాన్ని సాత్త్విక దానం అని దీని అర్ధం.
అయితే దానానికి మరో పరీక్ష ఉంది. ఇచ్చిన తర్వాత కూడా “నేను ఇచ్చాను” అని గుర్తుచేసుకుంటూ ఉంటామా? లేక ఇచ్చిన క్షణంతోనే దాన్ని మనసులోంచి కూడా విడిచిపెట్టగలమా? శిబి తన శరీరాన్ని ఇచ్చాడు. దధీచి తన ప్రాణాలను ఇచ్చాడు. మనకు శిబి, దధీచి లాంటి త్యాగం అవసరం లేదు. కానీ మన సమయాన్ని ఇవ్వగలం, మన జ్ఞానాన్ని పంచగలం, మన అనుభవాన్ని మరొకరి జీవితానికి ఉపయోగపడేలా చేయగలం, మన సౌకర్యంలో కొంత భాగాన్ని మరొకరి అవసరానికి కేటాయించగలం. దానం అంటే మన దగ్గర ఉన్నది తగ్గిపోవడం కాదు. మనలోని “నాది” కొద్దిగా తగ్గిపోవడం. చేతి నుంచి ఇచ్చినది దానం. మనసు నుంచి వదిలినది త్యాగం.
ఇచ్చిన తర్వాత “నేను ఇచ్చాను” అన్న భావన కూడా మిగలకుండా పోయినప్పుడు, ఆ దానం మరొకరి జీవితాన్ని మాత్రమే కాదు, మన జీవితాన్ని కూడా కొద్దిగా ఉన్నతం చేస్తుంది.
రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీవిరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కధలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు ప్రచురింపబడ్డాయి.
