Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దారం తెగని గాలిపటాలు

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘దారం తెగని గాలిపటాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“నాన్నా! “

ఆర్నవ్ పిలుపుతో ఆదిత్య లాప్టాప్ నుంచి బయటికి వచ్చాడు.

ఏమిటన్నట్టు పదేళ్ల కొడుకు వైపు చూశాడు.

“మన కమ్యూనిటీలో గాలిపటాల పోటీ పెట్టిస్తానన్నావుగా! ఏమైంది?”

ఆదిత్య కొడుకు చేతిలోని గాలిపటాన్ని చూసి నవ్వాడు.

“పెడదాం.”

“నిజంగానా!?”

“అవును. కానీ గాలిపటాల పోటీ ఒక్కటే కాదు.”

“మరి?!?”

“నీకు, నీ ఫ్రెండ్స్‌కీ ప్రతి శనివారం, ఆదివారం ఒక కొత్త ప్రపంచం చూపిస్తాను.”

అలా మొదలైంది ఆ కమ్యూనిటీలో ‘ఆకాశం’ అనే చిన్న వారాంతపు అకాడమీ.

అది పెద్ద స్కూల్ కాదు. పెద్ద భవనం లేదు. ఫీజులు లేవు.

ఆదిత్యతో పాటు అతని స్నేహితులు కొంతమంది అదే మైండ్‌సెట్ ఉన్న యువకులు కలిసి పిల్లల కోసం ప్రతి వారాంతం కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

పిల్లలు చదువుల ప్రపంచంలోనే మునిగిపోకుండా.. వారాంతాల్లో ఆటవిడుపుగా..

ఆటలు.. టీమ్ గేమ్స్.. చెస్.. కథలు చెప్పడం.. ప్రకృతి పరిశీలన.. సమూహంగా సమస్యలు పరిష్కరించడం.. వృద్ధులతో మాట్లాడటం.. చిన్న సేవా కార్యక్రమాలు.. పుస్తకాలు చదవడం.. సృజనాత్మక పోటీలు.

అన్నిటికంటే ముఖ్యంగా..

ఒకరితో ఒకరు మాట్లాడటం, కలిసి నవ్వటం, కలిసి ఓడిపోవటం, కలిసి గెలవటం.

ఆదిత్య అతని ఫ్రెండ్స్ కలిసి కమ్యూనిటీ హాల్లో పిల్లలతో పేరెంట్స్‌తో చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు.

“పిల్లలకు మంచి మార్కులు రావాలి. మంచి ఉద్యోగాలు రావాలి. అది అవసరమే. కానీ వాళ్ల బాల్యం వాళ్లదే కదా! చదువుతోపాటు వాళ్ళ బాల్యాన్ని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నమే ఈ ఆకాశం అకాడమీ ముఖ్యోద్దేశం” చెప్పాడు ఆదిత్య

“ఆటల్లో ఎక్కువ సమయం గడిపితే చదువు దెబ్బతినదా?” అంది 15వ ఫ్లోర్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీవిద్య.

ఆదిత్య నవ్వుతూ.. “చదువు వాళ్ల మేధస్సును పెంచుతుంది. ఆటలు వాళ్ల వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. స్నేహం వాళ్ల మనసును వికసింప చేస్తుంది. ఈ మూడూ కలిసి నప్పుడే సంపూర్ణమైన వికాసం కలుగుతుంది. మీ పిల్లలు గెలవాలని కోరుకోండి. కానీ వాళ్లు ఓడిపోయినా వాళ్ల పక్కన నిలబడండి” అన్నాడు.

కమ్యూనిటీ క్లబ్‌హౌస్‌కి అప్పుడే వచ్చిన వినోద్ మాట్లాడుతూ.. “పిల్లలు ప్రతి శనివారం, ఆదివారం ఈ అకాడమీకి వస్తే.. వాళ్ల చదువులు ఏమవుతాయి? ఆటల్లో పడి మార్కులు తగ్గితే?” అన్నాడు.

అతని పక్కన కూర్చున్న రాకేష్ మాట్లాడుతూ.. “మేము పిల్లల చదువుల కోసం లక్షలు ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో చదివిస్తున్నాం.. అదనపు క్లాసులు. ట్యాబ్, ల్యాప్టాప్, ఆన్లైన్ లెర్నింగ్.. అన్నీ ఇస్తున్నాం. చివరికి మార్కులు తగ్గితే మనం ఇంత ఖర్చు పెట్టినదంతా వృథా కాదా?” అన్నాడు.

అక్కడున్న కొంతమంది తల్లిదండ్రులు కూడా తలలు ఊపారు..

“మీ ప్రశ్నలో తప్పు లేదు. పిల్లలు చదవాలి. మంచి మార్కులు రావాలి. వాళ్ల భవిష్యత్తు బాగుండాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. మనం పిల్లల మేధస్సును మార్కులతో కొలవడం అలవాటు చేసుకున్నాం. వాళ్ల వ్యక్తిత్వాన్ని మాత్రం కొలవడాన్ని మర్చిపోయాం.” అన్నాడు ఆదిత్య.

అక్కడ నిశ్శబ్దం..

“చదువు మేధస్సును పెంచుతుంది. విజ్ఞానాన్ని ఇస్తుంది. సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని నేర్పుతుంది. కానీ.. ఆటలు వికాసాన్ని కలిగిస్తాయి. ఒత్తిడి తగ్గిస్తాయి. స్నేహం మనసులను కలుపుతుంది. ఓటమి సహనాన్ని నేర్పుతుంది. గెలుపు బాధ్యతను నేర్పుతుంది. కలిసి ఆడటం.. ‘నేను’ నుంచి ‘మనం’ వైపు తీసుకెళ్తుంది.” అన్నాడు ఆదిత్య ఫ్రెండ్స్ సూర్య.

“ఇవన్నీ జీవితంలో ఉపయోగపడతాయని ఎలా నమ్మాలి?” అంది 20వ ఫ్లోర్లో ఉంటున్న శరణ్య.

“శరణ్య గారూ! మీరు మీ పిల్లవాడికి ల్యాప్టాప్ ఎందుకు కొనిపెట్టారు?” అన్నాడు ఆదిత్య పక్కన ఉన్న రవీంద్ర.

“చదువుకోవడానికి.”

“ట్యాబ్?”

“ఆన్లైన్ క్లాసుల కోసం.”

“మరి ఫోన్?”

“అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడానికి.”

ఆదిత్య మాట్లాడుతూ.. “అయితే మనం పిల్లలకి ప్రపంచాన్ని చూపించడానికి టెక్నాలజీని వాడుతున్నాం. కానీ వాళ్ల పసిప్రాయాన్నంతా టెక్నాలజీతో నింపేస్తున్నాం. అందుకే వాళ్లు యంత్రాలుగా తయారవుతున్నారు.” అన్నాడు.

ఆ మాట విన్న తల్లిదండ్రులు ఒకరినొకరు చూసుకున్నారు. ఆదిత్య కొనసాగించాడు.

“మన పిల్లల గదిలో అన్నీ ఉన్నాయి. ఖరీదైన పుస్తకాలు, ట్యాబ్, ల్యాప్టాప్ గేమింగ్ పరికరాలు ఉన్నాయి. ఆన్లైన్ సంగీత క్లాసులు కూడా ఉన్నాయి. కానీ ఒకసారి ఆలోచించండి. అదే గదిలో వాళ్లతో గంటసేపు కూర్చుని మాట్లాడే సమయం తల్లిదండ్రులకు ఎలాగూ లేదు. కనీసం స్నేహితుడు ఉన్నాడా? వాళ్లు గ్యాడ్జెట్స్‌లో రీల్స్, షాట్స్ చూడటానికి అలవాటు పడిపోయారు. స్నేహితులతో పనిలేదు, బంధువులతో పనిలేదు, మాటలతో పనిలేదు.. ఒక్క సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచాన్ని ఎన్ని రకాలుగా చూడొచ్చు అన్ని రకాలుగా చూసేస్తున్నారు. ఇది బాల్యానికి వికాసమా? విస్ఫోటనమా?”

ఎవరూ మాట్లాడలేదు.

“తమ ఓటమిని చూసి నవ్వకుండా.. భుజం తట్టి ‘మళ్లీ ప్రయత్నించు’ అని చెప్పే స్నేహితుడు ఉన్నాడా?.. ర్యాంకులు తగ్గితే అమ్మానాన్నలకు భయపడి.. న్యూనతతో ముడుచుకుపోతూ, అబద్ధాలు చెప్పటానికి కూడా పిల్లలు వెనుకాడట్లేదు అంటే.. మనం కట్టే లక్షలకు వాళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ మార్కులూ, ర్యాంకులేనా?”

నిశ్శబ్దం మరింత గాఢమైంది.

“పిల్లల గదులను మనం వస్తువులతో నింపుతున్నాం. కానీ వాళ్ల బాల్యాన్ని అనుభవాలతో నింపడంలో ఫెయిల్ అవుతున్నాం.” అన్నాడు ఆదిత్య.

ఆ మాటతో గదిలోని వాతావరణం మారిపోయింది.

“నేను గాడ్జెట్లకు వ్యతిరేకం కాదు. టెక్నాలజీ మన పిల్లల భవిష్యత్తులో తప్పనిసరిగా ఉంటుంది. వాళ్లు దాన్ని నేర్చుకోవాలి. ఉపయోగించాలి. సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవాలి. కానీ.. అదే జీవితం కాదు కదా ! మన బాల్యంలో మనం అనుభవించిన స్వేచ్ఛని, ఆనందాన్ని ఇప్పుడు ఎలాగూ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. కనీసం వారాంతంలో కొన్ని గంటలు వాళ్లను స్క్రీన్ల నుంచి బయటకు తీసుకువచ్చి.. మనుషుల మధ్యకి తీసుకురావడంలో తప్పేముంది?”

“అలా చేస్తే వాళ్లకు ఏం వస్తుంది ఆదిత్యా? స్కూల్లో వెనుకబడిపోతారు” అన్నాడు టెన్త్ ఫ్లోర్ ప్రవీణ్.

ఆదిత్య చిరునవ్వుతో.. “ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే.. నెక్స్ట్ టైం మంచి మార్కులు కోసం ఎలా ప్రయత్నిస్తాడో.. అలాగే ఈ రోజు ఆటలో ఓడిపోతాడు. రేపు మళ్లీ ప్రయత్నిస్తాడు. గెలుస్తాడు. ఇప్పుడు మనం ఉంటున్నది పాతకాలపు అగ్రహాల్లోనో, గూడాల్లోనో కాదు. కాలం మారింది. దానితో పాటు మన జీవనశైలి వసతులు మారాయి. భిన్నత్వంలో ఏకత్వం తెలియచెప్పే.. గేటెడ్ కమ్యూనిటీలు వచ్చాయి. ఇక్కడ రకరకాల ప్రాంతాల వారు, భాషల వారు, కలిసిమెలిసి జీవిస్తున్నాం. అదే విధంగా పిల్లల్ని కూడా ప్రాంతీయత బేధభావాలు, అసమానతలు లేకుండా వీళ్ళందర్నీ ఏకం చేసే.. ఏకైక ఆటవిడుపు.. ఆటలే. అప్పుడే ఓడిపోయిన స్నేహితుడిని ఓదార్చడం నేర్చుకుంటాడు.. అప్పుడు అతనికి గెలుపు కంటే మనిషి విలువ ఎక్కువని తెలుస్తుంది. అందుకు ఉదాహరణ మన క్రికెట్ టీం ని తీసుకుందాం.. అదే భిన్నత్వంలో ఏకత్వానికి.. మంచి ఉదాహరణ.” అని ఆదిత్య కాసేపు ఆగాడు.

“మార్కులు మంచి కాలేజీకి తీసుకెళ్లవచ్చు. కానీ ఆటలు మనుషులతో ఎలా జీవించాలో నేర్పుతాయి.” అన్నాడు సూర్య.

“మరి మీ అకాడమీలో చదువు ఉండదా?”

“ఎందుకు ఉండదు? చదువు ఉంటుంది. కానీ పుస్తకాల్లో లేని పాఠాలు ఉంటాయి.”

“ఏ పాఠాలు?”

“ఒక జట్టుగా ఎలా ఆడాలి! ఓడిపోయినప్పుడు ఎలా నిలబడాలి! గెలిచినప్పుడు ఎదుటివాడిని ఎలా గౌరవించాలి. వేరే ప్రాంతం నుంచి వచ్చిన పిల్లవాడిని ఎలా స్నేహితుడిగా చేసుకోవాలి. పెద్దల మాటను ఎలా వినాలి. అవసరంలో ఉన్నవారికి ఎలా సహాయం చేయాలి. తనకున్నదాన్ని ఎలా పంచుకోవాలి. ఇవన్నీ పాఠ్యపుస్తకాల సిలబస్లో ఉండకపోవచ్చు. కానీ జీవితానికి కావలసిన అసలైన సిలబస్.”

అక్కడున్న అరవిందన్ మాట్లాడుతూ.. “మీరు చెప్పేది బాగుంది ఆదిత్యా!. కానీ పిల్లల్లో పోటీతత్వం ఎలా వస్తుంది? అది కూడా కావాలి కదా!.” అన్నాడు.

“పోటీ లేకపోతే ఎదగాలనే తపన తగ్గుతుంది. కానీ పోటీకి సరైన అర్థం నేర్పాలి.”

“ఎలా?”

“పోటీ అంటే ఎదుటివాడిని కిందకు లాగడం కాదు. అతన్ని చూసి మన సామర్థ్యాన్ని పెంచుకోవడం.” అన్నాడు ఆదిత్య

“అంటే?”.. అది బ్యాంకులో పనిచేస్తున్న నళిని.

“నిన్న అతను నాకంటే వేగంగా పరుగెత్తాడు. ఈ రోజు నేను ఇంకా బాగా పరుగెత్తాలి. అతన్ని ద్వేషించడం కాదు. అతని ప్రతిభను ప్రశంసిస్తూ నేర్చుకోవడం.. అదే ఆరోగ్యకరమైన పోటీ. మన పిల్లలు విజేతలుగా ఎదగాలి. కానీ విజయం కోసం విలువల్ని, మనుషుల్ని కోల్పోయేది పరుగు పందెం కాదు.” చెప్పాడు ఆదిత్య.

వెంటనే శరణ్య మాట్లాడుతూ.. “ఈ శనివారం నుంచి మా పిల్లల్ని పంపిస్తాను.” అంది

“నేను కూడా పంపిస్తాను.” అన్నాడు రవి.

ఆదిత్య ముఖంలో చిన్న చిరునవ్వు.

అతనికి అకస్మాత్తుగా శేషాద్రి మాస్టారు గుర్తుకొచ్చారు.

ఎన్నో సంవత్సరాల క్రితం..

తన చేతిలో ఒంటరి గాలిపటం..

కింద ఆడుకుంటున్న పిల్లలు..

తల్లిదండ్రుల భయం..

“మనం కొత్తగా వచ్చాం. ఇక్కడి పిల్లలు మనకు తెలియదు. పరిచయం కూడా లేదు. పోయిన వారం ఆడుకోవటానికి వెళితే.. వాళ్ళు నిన్ను చేర్చుకోకుండా తిప్పి పంపారు. వాళ్లలో నీకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. వద్దు. వెళితే ఏడుస్తూ తిరిగి వస్తావు.” అని తన తల్లి చెప్పింది.

అది విన్న పక్కింటి శేషాద్రి మాస్టారు అమ్మతో..

“పిల్లలకి ఎవరిని నమ్మాలో నేర్పాలి. తప్పులేదు. కానీ.. ఎవరినీ నమ్మకూడదని నేర్పకండి.” చెప్పి.. నన్ను తీసుకుని వెళ్లి.. అక్కడున్న పిల్లలతో మాట్లాడి.. వాళ్లు నన్ను కలుపుకొని ఆడుకునేలా చేశారు. అది తాత్కాలికమే అయింది.

ఆ జ్ఞాపకం ఆదిత్య మనసులో మళ్లీ మెదిలింది. ఆకాశం వైపు చూశాడు.

తన బాల్యంలో ఎగరని గాలిపటం.

ఇప్పుడు ఎంతోమంది పిల్లల బాల్యం గాలిపటాల్లా ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది.

ఆదివారం ఉదయం ‘ఆకాశం’ అకాడమీ మొదటి కార్యక్రమం మొదలైంది.

పిల్లలందరికీ ఒకే నియమం..

ఒంటరిగా ఆడటం లేదు.

గెలిచినవాడు ఓడిపోయినవాడిని వెన్నుతట్టి ప్రోత్సహించాలి..

ఎవరైనా పడిపోతే ఆట ఆపి ముందుగా అతన్ని లేపాలి.

ఓ కుర్రాడు అడిగాడు..

“అంకుల్..! ఇవి కూడా ఆటలో భాగమేనా?”

“ఇవే అసలు ఆటలు.”

ఆ రోజు పిల్లలు పరుగెత్తారు. నవ్వారు.

ఓడిపోయారు. మళ్లీ ప్రయత్నించారు. కొత్త స్నేహితులను సంపాదించారు.

సాయంత్రం పిల్లలు ఇంటికి వెళ్లేటప్పుడు సెకండ్ ఫ్లోర్‌లో ఉండే భాస్కర్ కొడుకు అర్జున్ తండ్రితో…

“నాన్నా..! ఈరోజు నేను చాలా బాగా ఆడాను.”

“ఎన్ని మార్కులు వచ్చాయి?”

“తెలియదు నాన్నా..! కానీ ఈరోజు నాకు ముగ్గురు కొత్త ఫ్రెండ్స్ దొరికారు.”

ఆదిత్య దూరంగా నిలబడి ఆ మాట విన్నాడు. అతని కళ్లలో సంతృప్తి.

ఎందుకంటే అతను ఒక అకాడమీని ప్రారంభించలేదు. తన బాల్యంలో మూసుకుపోయిన ఒక తలుపును.. మరో తరం పిల్లల కోసం తెరిచాడు.

మరి ఆ తలుపు అవతల ఒంటరితనం లేదు.. అందరినీ తనలో కలుపుకునే ఆకాశం ఉంది.

***

ఆ సంక్రాంతికి ‘ఆకాశం’ అకాడమీ పిల్లల కోసం ఆదిత్య ఫ్రెండ్స్ తో కలిసి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాడు.

“ఈసారి సంక్రాంతి మన కమ్యూనిటీలో కాదు మా పల్లెటూరిలో జరుపుకుందాం!”

అతని మాట విన్న పిల్లల కళ్లల్లో ఆనందం మెరిసింది.

తల్లిదండ్రులు కొంతమంది మొదట సంశయించినా.., చివరకు ఒప్పుకున్నారు.

***

సంక్రాంతికి రెండు రోజుల ముందు గేటెడ్ కమ్యూనిటీ నుంచి కార్లు, బస్సులు బయలుదేరాయి.

గోదావరి పరిసరాల్లోని ఆదిత్య వాళ్ళ పల్లెటూరు వెళ్తున్నారు. పట్టణపు కాంక్రీట్ భవనాలు వెనక్కి వెళ్లిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా పచ్చని పొలాలు. కాలువల్లో పారుతున్న నీళ్ళు చెట్ల మధ్య నుంచి వినిపించే పక్షుల కిలకిలారావాలు.

పల్లెటూరి గాలి పిల్లలకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఆ ఊరికి సమీపంలో ఉన్న గ్రామాల్లో కోడిపందాలు జరుగుతున్నాయి. పల్లెటూరు అంతా ప్రశాంతంగా ఉంది.

మూడు రోజుల పాటు పిల్లలు ఫోన్లు, ట్యాబ్లు, వీడియో గేమ్స్ అన్నిటికీ దూరమే.

విశాలమైన మైదానం వాళ్ల ఆటస్థలం.

స్వచ్ఛమైన గాలే వాళ్ల స్నేహితులంతా విహంగాల్లా.. హద్దులు లేని ఆకాశం వైపు పరిగెత్తారు.

***

మొదటి రోజు ఉదయమే ఆదిత్య బృందం పిల్లలందరికీ గాలిపటాలు, దేశవాళీ దారాలు ఇచ్చాడు.

“ఈ దారం ఎందుకు ప్రత్యేకమో తెలుసా?” అని పిల్లల్ని అడిగాడు.

ఒక కుర్రాడు “ఇది హైదరాబాదులో కొనుక్కునే మాంజా కంటే చౌకగా ఉంటుంది!”

అందరూ నవ్వారు.

ఆదిత్య కూడా నవ్వుతూ.. “అది కాదు. ఇది మన నేల వాసన ఉన్న దారం. మన పెద్దలు ఎగరేసిన గాలిపటాల జ్ఞాపకం ఉన్న దారం.” అంటూ గాలిపటాన్ని గాల్లోకి వదిలాడు.

గాలిలో గాలిపటం ఎగురుతోంది.

‘ఆకాశం’ లో పైపైకి ఎగిరింది.

పిల్లలంతా ఒక్కసారిగా కేకలు వేశారు. ఆ రోజు వాళ్లు గెలవడానికి మాత్రమే ఆడలేదు. కలిసి మెలిసి జతగా ఆడారు.

ఓ కుర్రాడి గాలిపటం మరో కుర్రాడి గాలిపటానికి చిక్కుకుంది.

“అయ్యో! నా గాలిపటం పోయింది!” అని ఆ కుర్రాడు బాధపడుతూ.. దారం తెంచపోతుంటే.., పక్కనే ఉన్న మరో కుర్రాడు పరుగెత్తుకొచ్చాడు.

“ఆగు.. దారం తెంచకు. ఇద్దరం కలిసి నెమ్మదిగా చిక్కు విప్పుదాం.” అన్నాడు.

కొద్దిసేపటికి రెండు గాలిపటాలు మళ్లీ ఆకాశంలోకి స్వేచ్ఛగా ఎగిరాయి.

“చూశావా!” అన్నాడు ఆ కుర్రాడు.

“అవును.. దారం తెగక పోవటం వల్ల.. మళ్లీ గాలిపటం ఎగురుతోంది.”

ఆ మాట ఆదిత్య చెవుల్లో ఆగిపోయింది.

అతను కొద్దిసేపు ఆకాశం వైపు చూస్తూ నిలబడ్డాడు.

రెండో రోజు:

గాలిపటాల పోటీ జరిగింది.

ఎవరో గెలిచారు.

ఎవరో ఓడిపోయారు.

ఎవరిలోనూ అసూయ లేదు.

ఓడిపోయిన పిల్లల మొహంలో కన్నీళ్లు లేవు. ఎందుకంటే అతని పక్కన నిలబడే స్నేహితులు ఉన్నారు.

“మళ్లీ ఎగరేద్దాం!” అని ఓడిన వాళ్ళ చేతుల్లో కొత్త గాలిపటం పెట్టారు.

మూడో రోజు:

పోటీ లేదు.

పిల్లలందరూ కలిసి గాలిపటాలు ఎగరేశారు.

ఎవరు ఎన్ని గాలిపటాలు ఎగరేశారు అన్న లెక్క లేదు. ఎవరి గాలిపటం ఎంత ఎత్తుకు వెళ్లిందన్న పోటీ లేదు.

ఒకరి దారం మరొకరి దానికి చిక్కితే..

“మనిద్దరం కలిసి చిక్కు విప్పుదాం.” అంటూ నవ్వుకుంటూ చిక్కులు విప్పుకున్నారు.

తల్లిదండ్రులు దూరంగా నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. పిల్లలు మైదానంలో పరుగెడుతున్నారు.

ఎండలో చెమటలు పడుతున్నాయి.

మట్టిలో కాళ్లు పరిగెత్తుతున్నాయి.

కానీ.. వాళ్ల మొహాల్లో కనిపిస్తున్న ఆనందానికి ఎలాంటి ధర లేదు.

సాయంత్రం సూర్యుడు గోదావరి వైపు వాలుతున్నప్పుడు పిల్లలందరూ ఆదిత్య చుట్టూ చేరారు.

అరవింద్ మాట్లాడుతూ.. “ఆదిత్యా..! ఇంత కాలం మేము పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాం. వాళ్ల మార్కులు.. వాళ్ల ర్యాంకులు.. వాళ్ల కెరీర్.. కానీ వాళ్ల బంగారు బాల్యం గురించి ఆలోచించడం మర్చిపోయాం. అది ఇవ్వాళ చూస్తున్నాం.”

మరో తల్లి సౌజన్య.. “దారం తెగిన గాలిపటాన్ని మళ్లీ ఎగరేయొచ్చు. కానీ బాల్యంలో తెగిపోయిన అనుబంధాన్ని.. కోల్పోయిన ఆనందాన్ని.. తిరిగి తీసుకురావడం అంత సులభం కాదు.”

అక్కడున్న వారంతా నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఆమె ఆదిత్య వైపు చూస్తూ..

“దారం తెగిన గాలిపటాలంటే.. మన పిల్లల జీవితాలే. వాళ్లు దారం తెగకుండా ఎగరాలి. చాలా ఎత్తుకు ఎగరాలి. కానీ వాళ్ల దారం మన చేతుల్లో ఉండాలి. బంధించడానికి కాదు. అవసరమైనప్పుడు ఆసరా అందించటానికి” అంది.

ఆదిత్య కళ్లలో తడి. శేషాద్రి మాస్టారు గుర్తొచ్చారు. ఎన్నో సంవత్సరాల క్రితం.. తన చేతిలోని గాలిపటం ఆకాశం వైపు చూడటానికి కూడా అనుమతి లేని బాల్యం తనది.

“అక్కడి పిల్లలు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు.” అన్న మాటలు తనని ఆటలకు దూరం చేశాయి.

ఆదిత్య మళ్లీ ఆకాశం వైపు చూశాడు. విశాలమైన ఆకాశంలో గాలిపటాలు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి.

ఏ గాలిపటం ఒంటరిగా లేదు.

ఏ గాలిపటం మరొకదాన్ని కిందికి లాగడం లేదు.

ఒకటి మరొకదానికి చిక్కుకున్నా..

దారం తెంచుకోవడం కాదు.

చిక్కు విప్పుకోవడం.

మళ్లీ కలిసి ఎగరడం.

ఆదిత్య చిరునవ్వు నవ్వాడు.

తన బాల్యంలో ఒంటరిగా ఎగరలేకపోయిన గాలిపటం.. ఇప్పుడు ఎంతోమంది పిల్లల కలలుగా ఆకాశంలో ఎగురుతున్నాయి..

‘పిల్లలకు మనం ఇవ్వాల్సింది పెద్ద భవనాలు, ఆస్తులు కాదు.. పెద్ద కలలు. ఖరీదైన వస్తువులు కాదు అందమైన అనుభవాలతో కూడిన అమూల్యమైన బాల్యాన్ని.,’ అనుకున్నాడు ఆదిత్య.

పిల్లలకు గెలుపు మాత్రమే కాదు. ఓటమిని తట్టుకునే ధైర్యం ఇవ్వాలి . వాళ్లను భయంతో ప్రపంచం నుంచి దాచడం కాదు.. ప్రపంచంలో స్వేచ్ఛగా నిలబడేటట్టు పెంచాలి.

ఆకాశంలో ఒక గాలిపటం మరింత పైకి ఎగిరింది. దాని దారం గట్టిగా ఉంది.

అది తెగలేదు.ఎందుకంటే ఆ దారం ఒక గాలిపటాన్ని మాత్రమే కాదు.. ఒక తరం బాల్యాన్ని పట్టుకుని ఉంది.

గోదావరి గాలి వీచింది.

గాలిపటాలు మరింత ఎత్తుకు ఎగిరాయి.

ఆదిత్య పక్కన నిలబడ్డ ఆర్నవ్ తండ్రి చేతిని పట్టుకున్నాడు.

“అంకుల్.. వచ్చే సంక్రాంతికి కూడా ఇక్కడికే వస్తామా?”

ఆదిత్య పిల్లల వైపు ఆప్యాయంగా చూస్తూ.. “తప్పకుండా వద్దాం!” అన్నాడు

పిల్లలంతా “ హే..” అని అరిచారు.

ఆకాశం వైపు చూస్తూ మనసులో అనుకున్నాడు.. ‘బాల్యం ఎగరాలి.. కలలు ఎగరాలి.. కానీ దారం మాత్రం తెగకూడదు.’

ఆకాశం నిండా గాలిపటాలు.

మైదానం నిండా పిల్లలు. వాళ్ల మనసుల నిండా కల్మషం లేని సంతోషం.

అదే.. దారం తెగని గాలిపటాల ఆకాశం.

Exit mobile version